PV: ఓర్పు.. నేర్పు.. మౌన ముని పీవీ చెప్పే పాఠం | Analysis Of Father Of Economic Reforms Pv Narasimha Rao Life | Sakshi
Sakshi News home page

PV: ఓర్పు.. నేర్పు.. మౌన ముని పీవీ చెప్పే పాఠం

Published Fri, Feb 9 2024 5:12 PM | Last Updated on Fri, Feb 9 2024 6:31 PM

Analysis Of Father Of Economic Reforms Pv Narasimha Rao Life - Sakshi

అనేక భాషల్లో పీవీ పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పీవీ గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే.

సినిమా తారల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పీవీ, వాజపేయి లాంటివారిని బుద్ధితో చూడాలి. జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. వారి సందర్భాల్లోకి వెళ్లి అవగాహన చేసుకోవాలి. మెదడుతో చూడాలి. మనసుతో తాకాలి. అప్పుడే పీవీ నుండి ఎంతో తెలుసుకోగలం. నేర్చుకోగలం.

ఓర్పు
పీవీది ఎంత సుదీర్ఘ ప్రయాణం? ఎన్ని మజిలీలు? ఎన్ని సత్కారాలు? ఎన్ని ఛీత్కారాలు? ఎన్ని పొగడ్తలు? ఎన్ని తిట్లు? ఒక దశలో సర్వసంగ పరిత్యాగిలా సన్యాసం స్వీకరించడానికి పెట్టే బేడా సర్దుకున్న వైరాగ్యం. అయినా బయటపడలేదు. కీర్తికి పొంగిపోలేదు. అవమానాలకు కుంగిపోలేదు. ఓపికగా, మౌనంగా, సాక్షిగా చూస్తూ ఉన్నాడు. ఆయన రోజు రానే వచ్చింది. అప్పుడు కూడా యోగిలా ఆ మౌనంతోనే అన్ని అవమానాలకు సమాధానం ఇచ్చాడు. తన ప్రత్యర్థుల ఊహకందనంత ఎత్తుకు ఎదిగాడు. కంచు మోగునట్లు కనకంబు మోగునా?

నేర్పు
ఎక్కడి తెలంగాణా పల్లె? ఎక్కడి ఢిల్లీ గద్దె? రాజకీయ పరమపద సోపాన పటంలో, అందునా అడుగడునా మింగి పడేసే పెద్ద పెద్ద పాములమధ్య పాములపర్తి పి వి ప్రధాని అయ్యాడంటే ఎంత నేర్పు ఉండాలి? ఎన్ని విద్యలు నేర్చుకుని ఉండాలి? ఎన్ని భాషలు నేర్చుకుని ఉండాలి? ఎన్నెన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉండాలి? ఎంత ఉత్సాహం ఉరకలు వేసి ఉండాలి? ముసలితనంలో, ఢిల్లీ తెలి మంచు ఉదయాల్లో స్వెటర్ వేసుకుని కంప్యూటర్ కీ బోర్డు ముందు ప్రోగ్రామింగ్ రాయగలిగాడంటే ఎంత జిజ్ఞాస లోపల దీపమై వెలుగుతూ ఉండాలి? పది భాషలు అవలీలగా మాట్లాడాలంటే మెదడు ఎంత చురుకుగా ఉండి ఉండాలి? రాజకీయంగా ఊపిరి సలపని పనుల్లో ఉంటూ లోపల భాషా సాహిత్యాలకు సంబంధించిన ఒక మూర్తిని తనకు తాను పెంచి పోషించుకోవాలంటే ఎంత సాహితీ పిపాస ఉండి ఉండాలి? విశ్వనాథ పెద్ద నవల వేయి పడగలను సహస్రఫణ్ పేరిట హిందీలోకి అనువదించాలంటే తెలుగు ఠీవిని దేశానికి రుచి చూపించాలని ఎంత తపన ఉండి ఉండాలి?

మార్పు
సంప్రదాయ చట్రాల్లో ఇరుక్కుపోకుండా నిత్యం కాలానుగుణంగా మారడంలో పీవీ వేగాన్ని చాలామంది ఆయన సమకాలీనులు అందుకోలేకపోయారు. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తన కొలువులో పెట్టుకోవడం అప్పట్లో ఒక సాహసం. కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేసిన మార్పులే ఇప్పటికీ దారి దీపాలు. రెవిన్యూ సంస్కరణలు, పేదవారికి హాస్టల్ చదువులు, వినూత్న నవోదయ చదువులు… రాస్తూ పొతే రాయలేనన్ని మార్పులు.

చేర్పు
ఎవరిని చేర్చుకోవాలో? ఏది చేర్చుకోవాలో? ఎప్పుడు చేర్చుకోవాలో? తెలిసి ఉండాలి. మన్మోహన్ ను ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. అంతర్జాతీయ యవనిక మీద భారత వాణిని వినిపించడానికి ప్రతిపక్ష నాయకుడు వాజపేయిని కోరి ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. లోకానికి తెలియనివి, తెలియాల్సిన అవసరం లేనివి ఎన్నో చేర్చుకున్నాడు.

కూర్పు
ఎన్నిటిని ఓపికగా కూర్చుకుంటే పీవీని ఇప్పుడిలా మనం స్మరించుకుంటాం? సహనాన్ని కూర్చుకున్నాడు. తెలివితేటలను కూర్చుకున్నాడు. తెగువను కూర్చుకున్నాడు. కార్యదక్షులను కూర్చుకున్నాడు. చివరికి కాలాన్ని కూడా తనకు అనుకూలంగా కూర్చుకున్నాడు.

తీర్పు
ఏ నిర్ణయం తీసుకోకాకపోవడం కూడా ఒక నిర్ణయమే- అంటూ పి వి ని విమర్శించేవారు తరచు అనే మాట. టీ వీ తెరల ప్రత్యక్ష ప్రసారాల్లోకి వచ్చి చిటికెల పందిళ్లు వేస్తూ…జనం మీద సర్జికల్ స్ట్రైక్ నిర్ణయాల హిరోషిమా నాగసాకి సమాన విస్ఫోటనాలు విసిరి వినోదం చూసే నాయకులతో పోలిస్తే పి వి ఏ నిర్ణయం ఎందుకు తీసుకోలేదో? ఏ సయోధ్య కుదరని విషయాలను ఎందుకు కాలానికి వదిలేశాడో? అర్థమవుతుంది.

ఇప్పుడు మన సర్టిఫికెట్లు ఆయనకు అవసరం లేదు. ఏ తప్పు లేని వాడు దేవుడే. మనిషిగా పుట్టినవాడికి గుణదోషాలు సహజం. నేర్చుకోగలిగితే పి వి నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగి, ఒదిగిన పి వి మన ఠీవి అనుకుని విగ్రహాలు పెడితే కూడళ్లలో మౌన సాక్షిగా ఉండిపోతాడు. మనం తెలుసుకుని నడవదగ్గ అడుగుజాడ పీవీ అనుకుంటే నిజంగా మన మనసుల్లో పి వీ ఠీవి అవుతాడు.

:::పమిడికాల్వ మధుసూదన్
9989090018
 

ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement