economic reforms
-
మీ గెలుపోటములు సరే, మా మాటేమిటి?
భారత్‌లో 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలు కావడంతో కొత్త శకం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి తెలుగునాట– ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’ల తీరును చూసిన ప్పుడు... వాళ్ళల్లోనూ, వారిని ఎంపిక చేసుకునే మన వైఖరిలోనూ కాలంతో పాటుగా సహజంగా జరగ వలసిన మార్పు పెద్దగా కనిపించదు. ఆర్థిక సంస్కరణల కంటే ముందు ‘మండల్’ కమిషన్ నివేదిక చట్టమై, దేశమంతా అది అమలులోకి వచ్చింది. ఈ రెండు మార్పులతో మన – ‘పొలిటికల్ ఫిలాసఫీ’ నవీనీ కరణ చెందాల్సి ఉండింది. ‘సరళీకరణ’ పరిణామక్రమం గురించి ఈ ‘సోషల్ మీడియాa’ కాలంలో కూడా ఒక ‘నెరేటివ్’గా కూడా మన విశ్లేషకులు ప్రస్తావన చేయడం ఎక్కడా కనిపించడం లేదు. అలా జరిగినప్పుడు, వర్ధమాన సమాజాలు (ఎమర్జింగ్ కమ్యూనిటీస్) తమ అస్తిత్వ ఘర్షణకు ఒక చారిత్రక క్రమం ఉందనీ, ఆ ప్రాతిపదికగా తాము ఎదగాలనీ, తమదొక ‘లీగల్ క్లెయిమ్’ అనీ అవి నమ్ముతాయి. కానీ ఉద్దేశ్య పూర్వకంగానే అలా జరగకపోవడం వల్ల, ఇప్పటికీ ఆ శ్రేణులను మనం ఏమిటో, మనకు ఏమి కావాలో మనకే అర్థం కాని స్థితికి పనిమాలా చేర్చినట్టుగా అయింది. ఆ విషయం 2024 ఎన్నికలు స్పష్టం చేశాయి. పర్యవసానంగా తెలుగునాట ఇప్పటికి ముప్పై ఏళ్ల క్రితం 1994 నవంబర్ ఎన్నికల్లో ఎన్టీఆర్ చేతిలో కోట్ల విజయభాస్కర రెడ్డి ఓడి పోయాక, కొద్ది నెలలకు తానే ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’గా మారిన చంద్రబాబు నాయుడు(సీబీఎన్) పలు విరామాల మధ్య గెలుస్తూ ఓడుతూ... అదే పదవిలో ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంటారు. మారుతున్న కాలంతో పాటు చేరే కొత్త తరాల కోసం– ‘చేంజ్ మేనేజ్మెంట్’ వైపు కొత్తదారులు చూపాలనే సోయి మనకు ఉన్నట్టుగా అనిపించదు. స్వతహాగా మనకది లేక పోవడం వల్ల, మన స్థాయి – ‘మిడియోకర్’ కావడం వల్ల మనం ఆ పని చేయలేకపోయి ఉండొచ్చు కూడా. అందుకే తరాలు ఎన్ని మారినా ఒకే మూస రాజకీయ నాయకత్వం ఏదో ఒక పద్ధతిలో ఇక్కడ కొనసాగుతున్నది. దాంతో మన గమనం లేకుండానే, అభిప్రాయ నిర్మాతలుగా మనమూ ఏదో ఒక వైపుకు లాగబడి, అదే ప్రభావంలో శాశ్వతంగా ‘సెటిల్’ అవుతున్నాం. అదేంటి, పరిపాలన అన్నప్పుడు ఒక ‘బుక్’ ఉంటుంది కదా, చట్టాలకు లోబడి కదా ప్రభుత్వాలు పనిచేయవలసింది అంటే, అది నిజమే. కానీ సూత్రం మేరకు ‘బుక్’ అనేది ఈ ముప్పై ఏళ్ళలో ‘ఎగ్జిక్యూటివ్’కు మాత్రమే పరిమితమైన అంశంగా మారింది. తెలుగువారికి 1956లో ఒక రాష్ట్రం ఏర్పడిన నలభై ఏళ్ల తర్వాత– ‘కోట్ల’కు కొనసాగింపుగా వచ్చిన సీబీఎన్ 2024 తర్వాత కూడా ఇక్కడ చలామణిలో ఉండగా, 2000 తర్వాత ఏర్పడిన రాజకీయ ఖాళీలో పుట్టినవి– టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలు. ఈ మూడు ప్రాంతీయ పార్టీల్లో సీబీఎన్ ఆర్థిక సంస్కరణల ఆరంభ కాలంలో ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’ అయిన వాడు కావడంతో ‘కోట్ల’ వరకు వున్న జాబితా నుంచి ఆయన్ని వేరుచేసి చూడాలి. మధ్యలో కాంగ్రెస్ సీఎంగా వైఎస్ లేరా? అంటే ఉన్నారు, అయితే మళ్ళీ ఆ ‘స్కూల్’ వేరు. ప్రధానిగా పీవీ ఉన్న కాలంలో ఆర్థిక మంత్రిగా సంస్కరణల అమలు బాధ్యతలు చూసిన డా‘‘ మన్మోహన్ సింగ్ సంస్కరణలు మొదలైన పదేళ్ళకే ప్రధానమంత్రిగా– ‘రిఫామ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అనాల్సి వచ్చింది. పదేళ్ళకే విషయం అర్థమైంది. దాంతో సంస్కరణల అమలుకు మానవీయ కోణం తప్పలేదు. అందుకే వైఎస్ కాలాన్ని– ‘ఏపీ మోడల్’ అంటూ సింగ్ ప్రశంసించేవారు. సీబీఎన్‌ను ఓడించి 2004లో సీఎమ్‌గా వైఎస్ ‘ఎంట్రీ’కి కొద్ది నెలల ముందు ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు క్లౌస్ శ్వాబ్ హైదరాబాదులో మాట్లాడుతూ – ‘ప్రపంచం ముందున్న ప్రధానమైన సవాలు పేదరిక నిర్మూలన. ఇది ఈ సమా జాన్ని నిరంతరం విభజిస్తూనే ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికీ వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప మనకు ఎంత మాత్రం భద్రత ఉండదు’ అన్నారు. అయితే శ్వాబ్ ఏపీలో ఈ మాట అనిన కొన్ని వారాలకు 2004 వేసవిలో సీఎంగా బాబుకు తొలి ఓటమి ఎదురైనా, రాజకీయంగా అయితే ఆయన ఎప్పుడూ ఖాళీగా లేరు. వైఎస్ మరణం తర్వాత ఆయన మరీ ‘బిజీ’ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ పని రెట్టింపు అయింది. అలాగని ఎందులో... ఎందుకు? వంటి ప్రశ్నలకు మళ్ళీ ప్రజా హితమైన జవాబులు మనకు దొరకవు. రాష్ట్ర విభజన తర్వాత జరగాల్సింది ఏమిటి? ఏ ఒక్క ఓటమి తర్వాతా... గెలిచినప్పుడూ ఒక కొత్త ఆరంభం లేదంటే, దానర్థం మారు తున్న కాలాన్ని దానితోపాటుగా పెరుగుతున్న ఆశావహ శ్రేణుల్ని పట్టించుకోకపోవడమే కదా? ‘ఉచితాలు’ ఎందుకు అన్నవాళ్ళను, ప్రతి ఎన్నికల ముందు ‘మాకేంటి?’ అనే వాళ్ళను ఇద్దరినీ పక్కన పెట్టినా, మిగతావారి మాటేంటి? వేలిమీద ఓటు ‘ఇంకు’ ఉండగానే, గెలిచాక వారికి మా జవాబుదారీతనం ఏముంది అన్నట్టుగా ప్రవర్తిస్తే ఎలా? ఐదేళ్ళ క్రితం మా ప్రణాళిక ఇది అని మొదటిసారి అధి కారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ వికేంద్రీకరణ సూత్రంగా మూడు రాజధానులు అంటూ తమ– ‘పొలిటికల్ ఫిలాసఫీ’ చెబుతూ, తమ రాజకీయాలు రాష్ట్రానికి పరిమితమని స్పష్టం చేసింది. మరి నలభై ఏళ్ల పార్టీ, సీనియర్ సీఎం అయినప్పుడు, విభజన జరిగిన పదేళ్ళ తర్వాత అయినా ఈ రాష్ట్రం విషయంలో తమ ‘ప్రోగ్రాం’ ఏమిటో వెల్లడించాలి కదా. ఆ పని అది ఎందుకు చేయలేకపోతున్నది? పదేళ్ళ క్రితం విభజన జరిగాక, శ్రద్ధ రాష్ట్రం మీద కాకుండా తెలంగాణ రాజకీయాల్లోకి తెరవెనుక జోక్యం చేసుకుని విఫలమయింది. మళ్ళీ ఇప్పుడు గెలిచిన నెలలోనే తెలంగాణలో పార్టీ బలోపేతం అంటే, ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’లు ప్రజలు–ప్రాంతము అనే దృష్టి నుంచి దూరమై వాళ్ళు తమ రాజకీయాలు చూసుకుంటే, ఇక ఈ రాష్ట్ర ప్రయోజనాల మాటేమిటి? ‘రాజ్యం’ అంటే– ‘లెజిస్లేచర్’ ఒక్కటే కాదు కదా, కొత్త రాష్ట్రంలో ఈ పదేళ్ళలో ఇప్పుడిప్పుడే ఒక రూపు తీసుకుంటున్న వ్యవస్థల్ని మీ రాజకీయాలతో ఇలా చేష్టలుడిగేలా చేస్తే చివరికి ఓడేది ఎవరు? జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
PV: ఓర్పు.. నేర్పు.. మౌన ముని పీవీ చెప్పే పాఠం
అనేక భాషల్లో పీవీ పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పీవీ గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సినిమా తారల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పీవీ, వాజపేయి లాంటివారిని బుద్ధితో చూడాలి. జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. వారి సందర్భాల్లోకి వెళ్లి అవగాహన చేసుకోవాలి. మెదడుతో చూడాలి. మనసుతో తాకాలి. అప్పుడే పీవీ నుండి ఎంతో తెలుసుకోగలం. నేర్చుకోగలం. ఓర్పు పీవీది ఎంత సుదీర్ఘ ప్రయాణం? ఎన్ని మజిలీలు? ఎన్ని సత్కారాలు? ఎన్ని ఛీత్కారాలు? ఎన్ని పొగడ్తలు? ఎన్ని తిట్లు? ఒక దశలో సర్వసంగ పరిత్యాగిలా సన్యాసం స్వీకరించడానికి పెట్టే బేడా సర్దుకున్న వైరాగ్యం. అయినా బయటపడలేదు. కీర్తికి పొంగిపోలేదు. అవమానాలకు కుంగిపోలేదు. ఓపికగా, మౌనంగా, సాక్షిగా చూస్తూ ఉన్నాడు. ఆయన రోజు రానే వచ్చింది. అప్పుడు కూడా యోగిలా ఆ మౌనంతోనే అన్ని అవమానాలకు సమాధానం ఇచ్చాడు. తన ప్రత్యర్థుల ఊహకందనంత ఎత్తుకు ఎదిగాడు. కంచు మోగునట్లు కనకంబు మోగునా? నేర్పు ఎక్కడి తెలంగాణా పల్లె? ఎక్కడి ఢిల్లీ గద్దె? రాజకీయ పరమపద సోపాన పటంలో, అందునా అడుగడునా మింగి పడేసే పెద్ద పెద్ద పాములమధ్య పాములపర్తి పి వి ప్రధాని అయ్యాడంటే ఎంత నేర్పు ఉండాలి? ఎన్ని విద్యలు నేర్చుకుని ఉండాలి? ఎన్ని భాషలు నేర్చుకుని ఉండాలి? ఎన్నెన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉండాలి? ఎంత ఉత్సాహం ఉరకలు వేసి ఉండాలి? ముసలితనంలో, ఢిల్లీ తెలి మంచు ఉదయాల్లో స్వెటర్ వేసుకుని కంప్యూటర్ కీ బోర్డు ముందు ప్రోగ్రామింగ్ రాయగలిగాడంటే ఎంత జిజ్ఞాస లోపల దీపమై వెలుగుతూ ఉండాలి? పది భాషలు అవలీలగా మాట్లాడాలంటే మెదడు ఎంత చురుకుగా ఉండి ఉండాలి? రాజకీయంగా ఊపిరి సలపని పనుల్లో ఉంటూ లోపల భాషా సాహిత్యాలకు సంబంధించిన ఒక మూర్తిని తనకు తాను పెంచి పోషించుకోవాలంటే ఎంత సాహితీ పిపాస ఉండి ఉండాలి? విశ్వనాథ పెద్ద నవల వేయి పడగలను సహస్రఫణ్ పేరిట హిందీలోకి అనువదించాలంటే తెలుగు ఠీవిని దేశానికి రుచి చూపించాలని ఎంత తపన ఉండి ఉండాలి? మార్పు సంప్రదాయ చట్రాల్లో ఇరుక్కుపోకుండా నిత్యం కాలానుగుణంగా మారడంలో పీవీ వేగాన్ని చాలామంది ఆయన సమకాలీనులు అందుకోలేకపోయారు. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తన కొలువులో పెట్టుకోవడం అప్పట్లో ఒక సాహసం. కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేసిన మార్పులే ఇప్పటికీ దారి దీపాలు. రెవిన్యూ సంస్కరణలు, పేదవారికి హాస్టల్ చదువులు, వినూత్న నవోదయ చదువులు… రాస్తూ పొతే రాయలేనన్ని మార్పులు. చేర్పు ఎవరిని చేర్చుకోవాలో? ఏది చేర్చుకోవాలో? ఎప్పుడు చేర్చుకోవాలో? తెలిసి ఉండాలి. మన్మోహన్ ను ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. అంతర్జాతీయ యవనిక మీద భారత వాణిని వినిపించడానికి ప్రతిపక్ష నాయకుడు వాజపేయిని కోరి ఎందుకు చేర్చుకున్నాడో లోకానికి తెలుసు. లోకానికి తెలియనివి, తెలియాల్సిన అవసరం లేనివి ఎన్నో చేర్చుకున్నాడు. కూర్పు ఎన్నిటిని ఓపికగా కూర్చుకుంటే పీవీని ఇప్పుడిలా మనం స్మరించుకుంటాం? సహనాన్ని కూర్చుకున్నాడు. తెలివితేటలను కూర్చుకున్నాడు. తెగువను కూర్చుకున్నాడు. కార్యదక్షులను కూర్చుకున్నాడు. చివరికి కాలాన్ని కూడా తనకు అనుకూలంగా కూర్చుకున్నాడు. తీర్పు ఏ నిర్ణయం తీసుకోకాకపోవడం కూడా ఒక నిర్ణయమే- అంటూ పి వి ని విమర్శించేవారు తరచు అనే మాట. టీ వీ తెరల ప్రత్యక్ష ప్రసారాల్లోకి వచ్చి చిటికెల పందిళ్లు వేస్తూ…జనం మీద సర్జికల్ స్ట్రైక్ నిర్ణయాల హిరోషిమా నాగసాకి సమాన విస్ఫోటనాలు విసిరి వినోదం చూసే నాయకులతో పోలిస్తే పి వి ఏ నిర్ణయం ఎందుకు తీసుకోలేదో? ఏ సయోధ్య కుదరని విషయాలను ఎందుకు కాలానికి వదిలేశాడో? అర్థమవుతుంది. ఇప్పుడు మన సర్టిఫికెట్లు ఆయనకు అవసరం లేదు. ఏ తప్పు లేని వాడు దేవుడే. మనిషిగా పుట్టినవాడికి గుణదోషాలు సహజం. నేర్చుకోగలిగితే పి వి నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగి, ఒదిగిన పి వి మన ఠీవి అనుకుని విగ్రహాలు పెడితే కూడళ్లలో మౌన సాక్షిగా ఉండిపోతాడు. మనం తెలుసుకుని నడవదగ్గ అడుగుజాడ పీవీ అనుకుంటే నిజంగా మన మనసుల్లో పి వీ ఠీవి అవుతాడు. :::పమిడికాల్వ మధుసూదన్ 9989090018 ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న -
President Droupadi Murmu: బలమైన దేశంగా ఎదిగాం!
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే శతాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితో బలమైన దేశంగా ఎదిగామని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట నిర్వహించుకున్నామని, మరోవైపు ఆర్థిక సంస్కరణల్లో కీర్తిప్రతిష్టలు సాధించామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నూతన భవనంలో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము దాదాపు 75 నిమిషాలపాటు ప్రసంగించారు. పార్లమెంట్ కొత్త భవనంలో ఆమె ప్రసంగించడం ఇదే మొదటిసారి. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తావించారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన సైనిక దళాలు తగిన సమాధానం చెబుతున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో మన దేశం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని గుర్తుచేశారు. భారత్ బలమైన దేశంగా మారిందన్నారు. ప్రతిష్టాత్మక జి–20 సదస్సును కేంద్రం విజయవంతంగా నిర్వహించిందని, తద్వారా ప్రపంచంలో ఇండియా స్థానం మరింత బలోపేతమైందని వివరించారు. జమ్మూకశీ్మర్తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ మొదటిసారి అంతర్జాతీయ సమావేశాలు జరిగినట్లు తెలియజేశారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. జనవరి 22 చిరస్మరణీయమైన రోజు ‘‘రాబోయే శతాబ్దాలకు సంబంధించి దేశ భవిష్యత్తు స్క్రిప్‌్టను రాసుకోవాల్సిన సమయం వచ్చింది. మన పూరీ్వకులు వేలాది సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని మనకు వరంగా అందించారు. ప్రాచీన భారతదేశంలో అప్పటి మనుషులు సాధించిన విజయాలను ఇప్పటికీ సగర్వంగా గుర్తుచేసుకుంటున్నాం. రాబోయే కొన్ని శతాబ్దాలపాటు గుర్తుంచుకొనే ఘనమైన వారసత్వాన్ని ఇప్పటి తరం మనుషులు నిర్మించాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించింది. దశాబ్దాల, శతాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రజలు శతాబ్దాలపాటు ఎదురుచూశారు. అది ఇప్పుడు నెరవేరింది. ఆలయం ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు రోజుల్లో 13 లక్షల మంది దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22వ తేదీ నిజంగా చిరస్మరణీయమైన రోజు. నక్సల్స్ హింసాకాండ తగ్గుముఖం ఆర్టికల్ 370 రద్దుపై గతంలో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది చరిత్రలో కలిసిపోయింది. ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచి్చంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ భవిష్యత్తు నిర్మాణం కోసం మన శక్తిని గరిష్ట స్థాయిలో ఖర్చు చేసినప్పుడే దేశం ప్రగతి పథంలో వేగంగా ముందంజ వేస్తుంది. ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కలి్పస్తోంది. సైనిక దళాలను బలోపేతం చేస్తోంది. అంతర్గత భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జమ్మూకశీ్మర్‌లో మార్కెట్లు, వీధులు గతంలో నిర్మానుష్యంగా కనిపించేవి. ఇప్పుడు జనంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య కూడా తగ్గిపోయింది. నక్సలైట్ల హింసాకాండ భారీగా తగ్గింది. అదుపులోనే ద్రవ్యోల్బణం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మహాసౌధం నాలుగు మూల స్తంభాలపై స్థిరంగా ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. అవి యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు. ఈ నాలుగు వర్గాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మనమంతా చిన్నప్పటి నుంచి వింటున్నాం. పేదరికాన్ని పారదోలడాన్ని మన జీవితాల్లో మొదటిసారి చూస్తున్నాం. ఇండియాలో గత పదేళ్లలో ఏకంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ ప్రకటించింది. దేశంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటడం హర్షణీయం. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు మన దేశ అభివృద్ధి ప్రయాణానికి బలాలుగా మారుతు న్నాయి. ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచింది. ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తవహించింది’’. మహిళలకు 15 వేల డ్రోన్లు ‘2014 తర్వాత గత పదేళ్లుగా ద్రవ్యోల్బణ రేటు సగటున కేవలం 5 శాతం ఉంది. ప్రభుత్వ చర్యలతో ప్రజల చేతుల్లో డబ్బు ఆడుతోంది. సామాన్య ప్రజలు కూడా పొదుపు చేయగలగుతున్నారు. మహిళలకు చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బ్యాంకు రుణాలను అందుబాటులోకి తీసుకొచి్చంది. సైనిక దళాల్లో శాశ్వత మహిళా కమిషన్‌ను మంజూరు చేసింది. సైనిక స్కూళ్లతోపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తోంది. ఎయిర్‌ఫోర్స్, నావికాదళంలోనూ మహిళలను ఆఫీసర్లుగా నియమిస్తోంది. అలాగే 2 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద మహిళలకు 15 వేల డ్రోన్లు అందజేయాలని నిర్ణయించింది’. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి ‘మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత నారీశక్తి వందన్ అధినియం(మహిళా రిజర్వేషన్ చట్టం) పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఈ చట్టంతో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సారథ్యంలో దేశాభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆశయం. ఈ చట్టాన్ని తీసుకొచి్చనందుకు పార్లమెంట్ సభ్యులకు నా అభినందనలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతి తోడ్పాడునందిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. రెండు వరుస త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7.5 శాతానికిపైగానే నమోదైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది’. 25 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు ‘రైల్వేశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. నమో భారత్, అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. కొత్తగా 25 వేల కిలోమీటర్లకుపైగా రైల్వే లైన్లు వేసింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మొత్తం రైల్వేట్రాక్ పొడవు కంటే ఇదే ఎక్కువ. రైల్వేశాఖలో 100 శాతం విద్యుదీకరణకు చాలా దగ్గరలో ఉన్నాం. దేశంలో తొలిసారిగా సెమీ–హైస్పీడ్ రైళ్లు ప్రారంభమయ్యాయి. 39 మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వేస్టేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రతి ప్రయాణికుడికి రైల్వేశాఖ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రతి ఏటా రూ.60 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతోంది’. -
2050 కల్లా రెండో పెద్ద ఎకానమీ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ 2050 కల్లా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ధీమా వ్యక్తం చేశారు. ‘తొలిసారి 1 లక్ష కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు భారత్‌కి 58 ఏళ్లు పట్టగా, రెండో ట్రిలియన్కు చేరేందుకు 12 సంవత్సరాలు పట్టింది. మూడో దానికి చేరేందుకు అయిదేళ్లు మాత్రమే పట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణల వేగం ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్ద కాలంలో దేశ జీడీపీ ప్రతి 12–18 నెలలకు 1 ట్రిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందుతుంది. తద్వారా 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారగలదు. స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 45 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరవచ్చు‘ అని ఆయన చెప్పారు. 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ కార్యక్రమంలో ప్రసంగించిన సందర్భంగా అదానీ ఈ విషయాలు తెలిపారు. భారత్ ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఎకానమీగా ఉంది. అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎకానమీ 23 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 45–50 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. సూపర్‌పవర్‌లపై తొలగిన అపోహలు.. ఇటీవలి సంక్షోభాలతో అంతర్జాతీయంగా నెలకొన్న అనేక అపోహలు తొలగిపోయాయని అదానీ చెప్పారు. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామిక సూత్రాలను చైనా పాటించక తప్పదు, ప్రపంచవ్యాప్తంగా సెక్యులరిజం సూత్రాలు ఒకే రకంగా ఉంటాయి, యూరోపియన్ యూనియన్ ఎప్పటికీ కలిసే ఉంటుంది, అంతర్జాతీయంగా రష్యా పాత్ర తగ్గిపోతుంది వంటి అనేక అపోహలను ఇటీవలి సంక్షోభాలు తుడిచిపెట్టేశాయని అదానీ చెప్పారు. అలాగే ఏక ధృవ, ద్వి ధృవాల కాలంలో ప్రపంచానికి కష్టం వస్తే సూపర్ పవర్లు రంగంలోకి దిగి చక్కబెట్టేయగలవన్న అపోహలు కూడా పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిది రోజులకో యూనికార్న్ .. భారత్ సామర్థ్యాలను వివరిస్తూ .. 2021లో దేశీయంగా ప్రతి 9 రోజులకి ఒక స్టార్టప్ సంస్థ యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) హోదా దక్కించుకుందని అదానీ చెప్పారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ అన్నింటినీ కలిపినా ఆరు రెట్లు అధికంగా భారత్ రియల్ టైమ్‌లో 48 బిలియన్ల ఆర్థిక లావాదేవీలు నమోదు చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు 50 బిలియన్ డాలర్లు దాటగలవని అదానీ తెలిపారు. -
ఇది భారత శతాబ్దం
న్యూఢిల్లీ: మూలాలను మర్చిపోరాదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ యువతను కోరారు. ప్రకృతి మాత తీవ్ర వేదన చెందుతోందని, వాతావరణ సంక్షోభంతో పుడమి భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయనున్న కోవింద్ ఆదివారం జాతి నుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. 21వ శతాబ్దాన్ని ‘భారత శతాబ్దం’గా మార్చడానికి దేశం సన్నద్ధమవుతోందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్యతోపాటు ఆర్థిక సంస్కరణలు పౌరులు తమ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు, ఆనందంగా ఉండేందుకు సాయపడతాయన్నారు. ‘కోవిడ్ మహమ్మారి దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక వనరులను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించింది. ప్రభుత్వం కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరం. అదేవిధంగా, యువజనులు తమ ఘనమైన వారసత్వాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి జాతీయ విద్యా విధానం దోహదపడుతుంది. యువ త మూలాలను మరువరాదు’ అని కోరారు. ‘మన పిల్లల కోసం దైనందిన జీవితంలో అవకాశమున్నంత మేర చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు, ఇతర జీవరాశుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రథమ పౌరుడిగా, నా తోటి పౌరులకు ఒక సలహా ఇవ్వవలసి వస్తే అది ఇదే అయి ఉంటుంది’ అని కోవింద్ అన్నారు. ‘ఒక పూరింట్లో నివసించే ఒక చిన్న పిల్లాడికి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి గురించి ఎలాంటి అవగాహన ఉండదు. కానీ, మన ఉమ్మడి విధి రూపకల్పనలో ప్రతి పౌరుడు పాలుపంచుకునేలా మార్గాలను సృష్టించడమే దేశ ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం’ అని చెప్పారు. పరూంఖ్ గ్రామానికి చెందిన కోవింద్ ఈ రోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం ప్రజాస్వామ్య వ్యవస్థల శక్తికి నిదర్శనమన్నారు. విధి నిర్వహణలో తనకు సమాజంలోని అన్ని వర్గాల సహకారం, మద్దతు, ఆశీస్సులు లభించాయని చెప్పారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్, డాక్టర్ అబ్దుల్ కలాం వంటి మహామహుల వారసుడిననే స్పృహతో శాయశక్తులా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను’ అని తెలిపారు. రాష్ట్రపతి కోవింద్ కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం విందు ఇచ్చారు. విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, పలువరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. -
ఆర్థిక సంస్కరణలు ... పన్ను దన్ను
భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే ఆర్థిక వనరుల్లో ప్రజలు, సంస్థలు చెల్లించే పన్నులు కీలకమైనవి. పన్నుల విధానాల్లో మార్పుల కోసం అప్పట్లో రాజా చెల్లయ్య కమిటి కొన్ని సిఫారసులు చేసింది. ముఖ్యంగా అవి పన్ను కట్టేవారిని వర్గీకరించిన సిఫారసులు. సంపన్నులు ఇంత పన్ను కట్టాలి, ఆదాయ పరంగా పైనున్న వారు ఇంత కట్టాలి అని శాతాలు నిర్ణయించారు. ఏమైనా దేశానికి చేవనిచ్చే పన్నులు, వ్యక్తిగతంగా పన్ను కట్టవలసిన వాళ్ల వెన్ను విరుస్తున్నాయన్న అసంతృప్తి దశాబ్దాల నుంచి ఉన్నదే. అదే సమయంలో కంపెనీలపై ఉన్న కార్పోరేట్ పన్ను భారాన్ని ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ, వ్యక్తిగత పన్నును పెంచుతూ వస్తోంది. కంపెనీలకు పన్నులు తగ్గిస్తే అవి ఉద్యోగాల కల్పనకు ముందుకు వస్తాయని ప్రభుత్వం ఆశించినా, ఆ ఆశ ఫలించలేదు. పైగా బ్యాంకు లకు కట్టాల్సిన రుణ బకాయిల నుంచి కంపెనీలు ఊపిరి పీల్చుకు నేందుకు ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తూ వస్తోంది. ప్రతిఫలంగా కంపెనీల నుంచి ప్రభుత్వానికి చేకూరున్న ఆర్థిక దన్నేమీ గణనీయంగా కనిపించకపోవడమే కాకుండా.. ఆ లోటు సామాన్య పౌరులు పరోక్షంగా చెల్లించే పన్నులతోనే పూడ్చు కోవలసిన పరిస్థితి ఏర్పడు తోంది. అందుకే రానున్న సంవత్సరాలలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వస్తుసేవల వినిమయానికి గిరాకీ తెచ్చేందుకు మన ఆర్థికవేత్తలు.. వ్యూహాలు రూపొందిస్తున్నారు. ప్రత్యక్ష పన్నుల్ని, జీఎస్టీలను సరళీకరించి ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేసే మార్గాలను అన్వేషిస్తున్నారు. (చదవండి: కోటప్పకొండ దొమ్మీ) -
Nirmala Sitharaman: నవభారత్‌కు నవీకృత సంస్కరణలు
పాత భారతదేశం ‘పరిరక్షణ లేదా నిర్లక్ష్యం’ మాటున వెనుకబడిపోయింది. దశాబ్దాలుగా లైసెన్సులు, కోటాల పాలనతో సాంఘిక సమానత్వం తీవ్రంగా దెబ్బతింది. ఇది భారత పెట్టుబడిదారులకు సంకెళ్లు తగిలించడమేగాక సంపదను, వనరులను కోల్పోయిన ఆర్థిక వ్యవస్థలో నిరాశ–నిస్పృహలను జొప్పించింది. ఈ నేపథ్యంలో 2014లో ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన మోదీ, ‘నవభారతం’ నిర్మించేందుకు కంకణబద్ధులయ్యారు. నవభారతానికి అప్పుడే పునాదులు పడ్డాయి. ప్రభుత్వం ఏదైనా చేయగలదన్న అతి నమ్మకాన్ని తొలగించి ప్రైవేట్ రంగం సామర్థ్యాలను వెలుగులోకి తీసుకురావడం కీలక లక్ష్యమైంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థలో... ప్రత్యేకించి గడచిన ఏడేళ్లుగా పరివర్తనాత్మక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో... ప్రత్యేకించి గడచిన ఏడేళ్లుగా పరివర్తనాత్మక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా లైసెన్సులు, కోటాల పాలనతో తీవ్రంగా దెబ్బతిన్న సాంఘిక సమానత్వం భారత పెట్టు బడిదారులకు సంకెళ్లు తగిలించడమేగాక సంపదను, వనరులను కోల్పోయిన ఆర్థిక వ్యవస్థలో నిరాశ–నిస్పృహలను చొప్పించింది. ఈ నేపథ్యంలో 1991లో ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరుచుకోవడం మొద లైనప్పటికీ దానికి తగినట్లు తదుపరి అత్యవసర చర్యలు తీసుకోలేదు. దాంతో ‘ద్వారాలు తెరుచుకున్న’ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఆశించినంత మేర ప్రతిఫలించ లేదు. ఓ దశాబ్దం తర్వాత కొంత కృషి ప్రారం భమైనప్పటికీ, అంతలోనే పరిపాలన చేతులు మారింది. అది కొద్ది కాలం మాత్రమే కొనసాగినా, ఓ దశాబ్దకాలం దారుణ వెనుకబాటుకు దారితీసి, ప్రపంచంలోని ఐదు దుర్బల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కూడా చేరిపోయింది. ఆ తర్వాత 2014లో ప్రభుత్వం మారినపుడు ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన మోదీ, ‘నవభారతం’ నిర్మించేందుకు కంకణబద్ధుల య్యారు. అంతకుముందు కొన్ని దశాబ్దాల నుంచీ హక్కుల సూత్రావళి ప్రాతిపదికన విధానాలను అనుసరిస్తున్నప్పటికీ పేదరికం, నిరు ద్యోగం, సదుపాయాల లేమి అనే విషవలయం నుంచి జనం బయట పడలేని దుస్థితి నెలకొంది. నైపుణ్యాలు, హస్త కళాకారులు, స్థానిక ఉత్పత్తులు, పాడి–జౌళి సహకార సంఘాలు, అన్నిటికీ పునరుజ్జీవనం, పునరుత్తేజం అవసరమైంది. పాలిపోయి, రంగు వెలిసిన పాత భారతా నికి కొంగ్రొత్త రంగులద్ది, కొత్తరూపం ఇవ్వడంద్వారా నవభారతానికి పునాదులు వేయాల్సిన అవసరం ఏర్పడింది. పాత భారతదేశం ‘పరిరక్షణ లేదా నిర్లక్ష్యం’ మాటున వెనుకబడి పోయింది. సమసమాజ భారతంలో ప్రభుత్వం పూర్తి సామర్థ్యం చూపగలదు... ఏదైనా చేయగలదన్న అతి నమ్మకాన్ని ప్రజల్లో కలిగిం చారు. ఆ మేరకు స్టీల్, సిమెంట్, గడియారాలు, టెలిఫోన్లు, టైర్లు, దుస్తులు, ఔషధాలు, కండోమ్‌లు, స్కూటర్లు, కార్లు, ఓడలు, చివరకు బ్రెడ్ కూడా ప్రభుత్వ సంస్థలే తయారుచేశాయి. అదేవిధంగా బ్యాంకింగ్, బీమా, చమురుశుద్ధి, గనుల తవ్వకం, హోటళ్లు, ఆతిథ్యం, పర్యాటక రంగాల కార్యకలాపాలు సహా విమానయానం, దూరవాణి సేవల్లోనూ ప్రభుత్వమే ప్రధాన పాత్ర పోషించింది. అయితే, వీటన్నిటినుంచీ వైదొలగి ప్రైవేట్ రంగం సామర్థ్యాలను వెలుగులోకి తీసుకురావడం ముఖ్యం. చట్టబద్ధమైన లాభార్జనకు గుర్తింపుతోపాటు ఉపాధి–సంపద సృష్టి వనరుగా గౌరవించే విధానపరమైన మద్దతు పరిశ్రమలకు అవసరం. ఈ మేరకు నేడు భారత్ సరికొత్తగా రూపు దిద్దుకుంటోంది. హద్దులెరుగని వాణిజ్యం లేదా నిర్దాక్షిణ్య పెట్టుబడి దారీ విధానం తరహాలో కాకుండా భారతీయ విలువలు మేళవించిన మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా సుస్పష్టమైన రీతిలో ముందడుగు వేస్తోంది. దీనికి ‘అందరి సహకారం–అందరి కృషి–అందరి ప్రగతి–అందరి విశ్వాసం’ అనే తారకమంత్రం మార్గనిర్దేశం చేస్తోంది. మోదీ తొలిదఫా ప్రభుత్వం పునరుజ్జీవం, పునరుత్తేజంపై సంపూర్ణంగా దృష్టి సారించి, సంస్కరణల ద్వారాలు పూర్తిగా తెరిచింది. పేదలకు ప్రయోజనాల కల్పన దిశగా తొలి మార్గంకింద ‘జన్‌ధన్ యోజన, ఆధార్బలోపేతం, మొబైల్‌ఫోన్ వినియోగం’ (జామ్ త్రయం) అమలులోకి వచ్చాయి. అటుపైన త్వరలోనే– ‘పెన్షన్లు, రేషన్, ఇంధనం, అర్హులైన వారికి సమ్మాన్నిధి’ వంటి లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లోనే జమచేయడానికి వీలు కల్పించే ‘ప్రత్యక్ష లబ్ధి బదిలీ’ (డీబీటీ) అమలులోకి వచ్చింది. ఈ కసరత్తుతో పన్ను చెల్లింపు దారు లైన ప్రజలకు అనుబంధ ప్రయోజనాలు అందివచ్చాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రకరకాల పన్నులున్న నేపథ్యంలో ‘వస్తు సేవల పన్ను’ (జీఎస్టీ) వ్యవస్థ వాటన్నిటినీ ఏకం చేసింది. అలాగే కాల పరిమితితో కూడిన దివాలా వివిదాల పరిష్కారం దిశగా ‘ఆర్థిక అశ క్తత–దివాలా స్మృతి’కి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అంతే కాకుండా ‘రికగ్నిషన్ (గుర్తింపు), రిజల్యూషన్ (పరిష్కారం), రీ– క్యాపిటలైజేషన్ (పునః మూలధనీకరణ), రిఫార్మ్ (సంస్కరణ)’ పేరిట నాలుగు ‘ఆర్’ల సూత్రంతో ద్రవ్యరంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇక మోదీ రెండోదఫా అధికారంలోకి వచ్చాక ప్రపంచ మహమ్మారి పరిస్థితుల్లోనూ ఆర్థిక దిద్దుబాటు వేగం కొనసాగింది. మహ మ్మారి సమయంలో ఏ ఒక్కరూ ఆకలిదప్పులతో అల్లాడకుండా చూడా లన్న సంకల్పం సత్ఫలితాలిచ్చింది. ఆ మేరకు దేశంలో దాదాపు 80 కోట్ల మందికి పూర్తిగా 8 నెలలపాటు ఆహారధాన్యాలు ఉచితంగా సరఫరా చేశాము. అలాగే మూడు వంటగ్యాస్ సిలిండర్లు, అత్యవస రాల కోసం కాస్త నగదు సాయం కూడా అందించాము. దివ్యాంగులు, నిర్మాణరంగ కార్మికులు, పేదలైన వృద్ధులకూ కొంత ఉపశమనం సాయం కల్పించాము. నాలుగుసార్లు ప్రకటించిన ‘స్వయం సమృద్ధ భారతం’ ప్యాకేజీలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు వర్తకులు, చిరుద్యోగులకు సకాలంలో చేయూత ఇవ్వడమైంది. ఇదే సమయంలో అనేక వ్యవస్థీకృత సంస్కరణలు కూడా చేపట్టడం విశేషం. రెండోదఫా మోదీ ప్రభుత్వం సాధారణ బడ్జెట్ అనంతరం కార్పొరేట్పన్నును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ సంస్కరణల్లో ఒకటి. కొత్త కంపెనీలకు ఈ పన్నును 15 శాతంగా నిర్ణయిస్తే, ప్రస్తుత సంస్థలకు 22 శాతానికి తగ్గించింది. అలాగే కంపెనీలకు కనీస ప్రత్యా మ్నాయ పన్ను (మ్యాట్) మినహాయించింది. రైతులకు సాధికారత కల్పన లక్ష్యంగా మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలు చేసింది. ఇక మహమ్మారి సమయంలోనూ దేశవ్యాప్తంగా బ్యాంకుల విలీన ప్రక్రియ నిరాఘాటంగా సాగిపోయింది. ఆ మేరకు 2017లో 27గా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య ఇవాళ 12కు దిగివచ్చింది. దీంతోపాటు జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ, భారత రుణ వసూళ్ల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు కంపెనీలూ వాణిజ్య బ్యాంకుల నిరర్ధక ఆస్తుల లెక్కలు తేల్చి, వాటి వసూలుకు కృషి చేస్తాయి. ఈ బకాయిల విలువ పరిపూర్ణతకు భరోసాగా ప్రభుత్వం తదనంతర వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. దేశంలోకి మరిన్ని పెట్టుబడులు రప్పించేందుకు, భారతదేశాన్ని తయారీ కూడలిగా మార్చడానికి వీలుగా 13 కీలక రంగాల కోసం ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ (పీఎల్ఐ) ప్రారంభించడ మైంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ పునర్నవీకరణ నేపథ్యంలో ఈ పథకం కింద మొబైల్, వైద్య పరికరాలు, ఔషధ రంగంలో ఏపీఐ/ కేఎస్ఎం’ తయారీ, ఆహార తయారీ, జౌళి తదితరాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన టెలికాం, విద్యుత్ రంగాల్లో దీర్ఘకాలం నుంచీ ఎదురుచూస్తున్న సంస్కరణలు ప్రారంభ మయ్యాయి. ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి కేంద్ర బడ్జెట్– 2021 ఒక విధానం ప్రతిపాదించింది. తదనుగుణంగా కనీస సంఖ్యలో మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలను అనుమతించే వ్యూహాత్మక రంగాలను గుర్తించింది. అదే సమయంలో ఈ రంగాలు మొత్తం ప్రైవేట్సంస్థలన్నిటికీ అవకాశం కల్పిస్తాయి. బ్యాంకులలో చిన్న డిపాజిట్‌దారులకు ఊరటగా రూ. 5 లక్షల దాకా డిపాజిట్లకు బీమా సదుపాయాన్ని విస్తరిస్తూ ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ చట్టం’ సవరించడమైంది. ఈ చర్యతో బ్యాంకు లపై ఏవైనా ఆంక్షలు విధించినప్పుడు మొత్తం డిపాజిట్లలో 98.3 శాతానికి బీమా రక్షణ లభిస్తుంది. దీంతోపాటు చిన్న సంస్థలకు హామీ రహిత రుణాల లభ్యత దిశగా ‘స్వనిధి, ముద్ర, స్టాండప్’ పథకాలు ఇప్పటికే విజయవంతంగా అమలవుతూ పేదలు ఆత్మ గౌరవంతో జీవించడంలో అన్నివిధాలా తోడ్పడుతున్నాయి. ఇంతేకాదు... ప్రజ లతో మమేకమైన నాయకత్వం, ‘సబ్ కా సాథ్....’ తారకమంత్రం ఇంకా ఎంతో చేయగలవనడంలో అతిశయోక్తి లేదు. వ్యాసకర్త కేంద్ర ఆర్థిక–కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి -
టెలికం రంగంలో సంస్కరణలు తేవాలి
న్యూఢిల్లీ: సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం రంగాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రానికి టెల్కోలు విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే సుంకాలు తగ్గించాలని, వేలం వేసిన స్పెక్ట్రం హోల్డింగ్ కాలావధిని రెట్టింపు చేయాలని, స్పెక్ట్రం చెల్లింపులపై 7–10 ఏళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని కోరాయి. టెల్కోల సమాఖ్య సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఈ మేరకు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌కు లేఖ రాసింది. అత్యధిక పన్నుల భారం పడే రంగాల్లో టెలికం పరిశ్రమ కూడా ఒకటని అందులో పేర్కొంది. ఆదాయాల్లో 32 శాతం భాగం పన్నులు, సుంకాల రూపంలో కట్టాల్సిన ప్రస్తుత విధానంతో కంపెనీలు మనుగడ సాగించడం కష్టంగా మారిందని వివరించింది. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల దగ్గర నిరంతరం మిగులు నిధులు ఉండే పరిస్థితి లేనందున ఇంతటి భారీ స్థాయి పన్నులనేవి పరిశ్రమ వృద్ధికి ప్రతికూలమని సీవోఏఐ తెలిపింది. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో తదితర సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లేఖ కాపీలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కూడా సీవోఏఐ పంపింది. పలు ప్రతిపాదనలు.. టెలికం రంగాన్ని తిరిగి పటిష్టమైన, నిలకడైన వృద్ధి బాట పట్టించడానికి ప్రాథమిక ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని సీవోఏఐ పేర్కొంది. ఇందులో భాగంగా తీసుకోతగిన విధానపరమైన చర్యలకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. పన్నులు, సుంకాలు తగ్గించడం, స్పెక్ట్రంనకు సంబంధించి ధరను సహేతుకంగా నిర్ణయించడం, చెల్లింపులకు సులభతరమైన నిబంధనలు విధించడం, హోల్డింగ్ వ్యవధిని పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే, సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్) నిర్వచనాన్ని పునఃసమీక్షించడం, కనీస ధరను నిర్ణయించడం, ఆర్థిక..పనితీరుపరమైన బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహాయింపునివ్వడం వంటి ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి. రుణాలు, నష్టాల భారంతో వొడాఫోన్ ఐడియా అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో సీవోఏఐ ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియాను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అది గానీ మూతబడితే పరిశ్రమలో రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆఖరు నాటికి వొడాఫోన్ ఐడియా మొత్తం రుణభారం రూ. 1,91,590 కోట్లుగా ఉంది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపు బకాయి రూ. 1,06,010 కోట్లు, ఏజీఆర్ బాకీ రూ. 62,180 కోట్లుగా ఉంది. -
ఆర్థిక సంస్కరణలతో ప్రజలకు మేలు: ముఖేష్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలతో పౌరులు అసమానమైన ప్రయోజనలు పొందుతున్నారని ఇప్పుడు ‘ఇండియన్ మోడల్’ దిశలో సంపద సృష్టించడంపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. 2047 నాటికి అమెరికా, చైనా దేశాలతో సమానంగా ఇండియా ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల ఆర్థిక సరళీకరణ సందర్భంగా ఆయన అరుదైన కాలమ్ రాస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లుగా సంపద సృష్టి మీద మాత్రమే దృష్టి సారించామని.. అందరికీ విద్య, అందరకీ ఆరోగ్యం, అందరికీ ఉపాధి, అందరికీ హౌసింగ్ సాధించడంలోనే నిజమైన సంపద దాగుందనే సత్యాన్ని విస్మరించామని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో కంపెనీల విస్తరణ సమయంలో ప్రజల శ్రేయస్సు, సంరక్షణ అంశాలను పట్టించుకోవటం లేదని ఈ అంశాల్లో భారత్ ప్రారంభ దశలో ఉందన్నారు. -
విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానమంత్రిగా రెండవ సారి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సర్కార్ విజయాలపై సోషల్ మీడియాలో ప్రస్తావించారు. 130 కోట్ల మంది ప్రజానీకానికి సబ్ కా సాథ్, సబ్ కా వికాశ్, సబ్ కా విశ్వాస్ అనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. తన ప్రభుత్వ విజయాలపై, లక్ష్యాలను ట్విటర్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుపై పలు అంశాలను తన వరుస ట్వీట్లలో ప్రస్తావించారు. ముఖ్యంగా కశ్మీర్ స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆర్థిక సంస్కరణలు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, కార్పొరేట్ పన్ను రేట్లను 22శాతానికి తగ్గించామని అన్నారు. కొత్తగా స్థాపించబోయే స్థానిక తయారీ కంపెనీలకు 15శాతం పన్ను రాయితీలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు. దేశానికి కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు బ్యాంక్‌ల విలీన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. రైతుల గురించి మోదీ స్పందిస్తూ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా 14 కోట్ల మంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా అన్ని రంగాల్లో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. -
యూఏఈలో ఆర్థిక సంస్కరణలు
వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల :గల్ఫ్ దేశాల్లో ప్రముఖమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఆర్థిక సంస్కరణలు అమలవుతు న్నాయి. ఆ దేశంలోని 1500 రకాల ప్రభుత్వ సేవలపై ప్రస్తుతం విధిస్తున్న పన్నులను తగ్గించాలని, కొన్నింటిని రద్దుచేయాలని దుబాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కేబినెట్ నిర్ణయాన్ని వెల్లడించింది. అక్కడ అన్ని పన్నులు వసూలు.. యునైటెడ్ అరబ్ దేశాల్లో ప్రభుత్వం విధించే అన్ని పన్నులు కచ్చితంగా వసూలవుతాయి. అయితే, యూఏఈ ప్రభుత్వంలోని అంతర్గత వ్యవహారాల శాఖ 1500 రకాల సేవలపై పన్నుల్లో కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటిని తగ్గించేందుకు నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల శాఖ 80 రకాల సేవల పన్నులను, మానవ వనరులు, ఉపాధి కల్పన శాఖ 200 రకాల అంశాలపై విధిస్తున్న సేవల పన్నులు ఇందులో ఉన్నాయి. ఈ నెల నుంచే అమలు.. దేశంలో కొత్త పన్నుల విధానాన్ని జూలై 1 నుంచి అమలు చేస్తోంది. అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర పన్నుల విధానాన్ని, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి యూనిస్ హేజీ అల్ ఖూరీ తెలిపారు. ఈ చర్యల ఫలితాలను విశ్లేషించుకుని భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపడతామని ఆయన వెల్లడించారు. ప్రవాసులపై సానుకూల ప్రభావం.. యూఏఈలో కొత్తగా అమలుకానున్న ఆర్థిక సంస్కరణలతో అక్కడ ఉపాధి పొందుతున్న వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. యూఏఈలో మన రాష్ట్రానికి చెందిన కార్మికులు సుమారు 4లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు మరో 4లక్షల మంది ఉన్నారు. వీరంతా ఆ దేశ నిబంధనల మేరకు పన్నులు చెల్లిస్తున్నారు. అలాంటి వారికి ఆ దేశం అమలు చేయనున్న ఆర్థిక సంస్కరణలతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవలే నైపుణ్యం కలిగిన కార్మికులకు మెరుగైన వేతనాలు ఇవ్వాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. యూఏఈలో అమలులో ఉన్న 1500 రకాల సేవల పన్నులను సంస్కరించడం ఆ దేశ చరిత్రలో ఇదే ప్రథమమని ప్రవాసులు పేర్కొంటున్నారు. -
పాలనాదక్షుడు...
స్వేచ్ఛా వాణిజ్యానికీ, సరళతర ఆర్థిక విధానాలకు దన్ను ఇచ్చిన వాజ్‌పేయి ఆర్థిక సంస్కరణల్లో తనదైన ముద్రవేశారు. 1991లో పీవీ నరసింహరావు ప్రవేశపెట్టిన సరళీకరణ ఆర్థిక విధానాల స్ఫూర్తిని వాజ్‌పేయి కొనసాగించారు. వాజ్‌పేయి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే తరువాతి ప్రధానులు కొనసాగించారు. దేశాన్ని నూతన శకంవైపు నడిపించడానికి రాజమార్గాలు వేశారు. ప్రధానంగా ‘పెట్టుబడుల ఉపసంహరణ’‘ఆర్థిక దుబారా’లాంటి ఆర్థిక సంస్కరణలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. వాజ్‌పేయి హయాంలో ఆర్థిక సంస్కరణలు.. మౌలిక సదుపాయాల కల్పన: మౌలిక సదుపాయాల కల్పనకు వాజ్‌పేయి ప్రభుత్వం పెట్టింది పేరు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా విడివడి ఉన్న గ్రామాలన్నింటినీ కలిపే గొప్పకార్యాన్ని చేపట్టారు. దీంతో గ్రామాల నుంచి వ్యవసాయ ఉత్పాదనలు దేశ వ్యాప్తంగా రవాణా చేసేందుకు వీలు అయ్యింది. అలాగే చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలను కలుపుతూ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే నిర్మించడంలో కృత కృత్యులయ్యారు. ఆర్థిక దుబారా నియంత్రణకు చట్టం... ఆర్థిక దుబారాని నియంత్రించేందుకు వాజ్‌పేయి ప్రభుత్వం కృషి చేసింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఆర్థిక దుబారా నియంత్రణకు వాజ్‌పేయి ప్రభుత్వం పూనుకుంది. 2000 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 0.8 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ పొదుపుని 2005 కల్లా 2.3 శాతానికి వృద్ధి చేసిన ఘనత వాజ్‌పేయిదే. జీడీపీ సైతం రెండంకెల స్థాయికి చేరువయ్యింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ప్రైవేటైజేషన్... వ్యాపార రంగంలో ప్రభుత్వ పాత్రను వాజ్‌పేయి వ్యతిరేకించేవారు. అందులో భాగంగానే పెట్టుబడుల ఉపసంహరణను ప్రోత్సహించారు. దానికి ప్రత్యేకించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు. ప్రస్తుత ఆర్థికశాఖా మంత్రి అరున్జైట్లీయే ఆ శాఖకు తొలి మంత్రి. భారత్ అల్యూమినియం కంపెనీ, హిందూస్థాన్ జింక్, ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే వీఎస్ఎన్ఎల్లు నాటి ప్రధాన పెట్టుబడుల ఉపసంహరణల్లోనివి. టెలికం విప్లవం... దేశంలో మొబైల్ ఫోన్ విప్లవానికి ఆద్యుడు వాజ్‌పేయి. కాల్‌రేట్లను తగ్గించి, టెలికాం కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దారులువేస్తూ సరికొత్త టెలికాం విధానానికి శ్రీకారం చుట్టారు. నిర్ణీత లైసెన్స్ ఫీజు, ఆదాయం పంచుకునే పద్ధతి స్థానంలో సరికొత్త టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యారు వాజ్‌పేయి. టెలికాం రంగంలో వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ని ఏర్పాటుచేసి, ప్రభుత్వ నియంత్రణ, వివాదాల పరిష్కారాల పాత్రను వేరుచేసారు. ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ ఎంతగా ఎదిగిందంటే ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి మంత్రం అయిన జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం–జామ్)లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఢిల్లీ మెట్రో రైలుకి అంకురార్పణ... ఢిల్లీలో మెట్రో రైలు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది వాజ్‌పేయి హయాంలోనే. మెట్రో రాకతో పట్టణ ప్రజల రవాణా సమస్య పరిష్కార మైంది. టెలికం విధానం ప్రవేశపెట్టడం ద్వారా టెలికాం రంగంలో విప్లవాన్ని సృష్టించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టుల్లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కి నిధులు ... భారతదేశంలోనే తొలి ఆధునిక మెట్రోరైలు ప్రాజెక్టుకి అంకురార్పణ. విద్యా హక్కును ప్రాథమిక హక్కుల్లో భాగం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో ప్రభుత్వ రంగ కంపెనీల వాటాలు విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం పెంచారు. ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యాన్ని గర్తించి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం ఢిల్లీ లాహోర్ బస్సు ప్రారంభంతో పాకిస్తాన్‌తో స్నేహానికి దారులు వేసారు... -
మనది సహజ సంబంధం
సింగపూర్: భారత్, సింగపూర్ మధ్య సుహృద్భావ, సన్నిహిత సంబంధాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సింగపూర్‌తో భారత్‌కు సహజ భాగస్వామ్యం ఉందని, ఇరు దేశాల మైత్రిలో ఎలాంటి బేషజాలు, అనుమానాలు లేవన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరగా గురువారం మోదీ సింగపూర్ చేరుకున్నారు. ‘బిజినెస్, ఇన్నోవేషన్, కమ్యూనిటీ ఈవెంట్’ అనే కార్యక్రమంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలుచేస్తున్నామని, నవ భారత్ తయారవుతోందని ప్రవాసులకు తెలిపారు. సింగపూర్ చిన్న దేశమైనా ఎన్నో విజయాలు సాధించిందని కితాబిచ్చారు. రెండు దేశాల మధ్య ఏటా జరిగే భద్రతా కార్యక్రమం షాంగ్రి–లా డైలాగ్‌లో మోదీ నేడు మాట్లాడనున్నారు. కాలానికి అనుగుణంగా భారత్, సింగపూర్ తమ సంబంధాలను నిర్మించుకుంటున్నాయని మోదీ తెలిపారు. ఈ ఏడాది ఆసియాన్‌కు సింగపూర్ నేతృత్వం వహిస్తున్నందున భారత్–ఆసియాన్ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు. సింగపూర్‌లోనూ రూపే, భీమ్ యాప్‌లు.. భారత్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల యాప్‌ల అంతర్జాతీయీకరణలో ముందడుగు పడింది. భీమ్, రూపే, ఎస్బీఐ యాప్‌లను ప్రధాని మోదీ సింగపూర్‌లో ఆవిష్కరించారు. దీనిలో భాగంగా రూపే యాప్‌ను సింగపూర్‌కు చెందిన నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్(నెట్స్)తో అనుసంధానించారు. ఫలితంగా రూపే వినియోగదారులు సింగపూర్ వ్యాప్తంగా నెట్స్ కేంద్రాల వద్ద చెల్లింపులు చేయొచ్చు. అలాగే, సింగపూర్ నెట్స్ వినియోగదారులు భారత్‌లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ–కామర్స్ వెబ్సైట్లో కొనుగోళ్లు చేయొచ్చు. ఇక్కడి మెరీనా బే సాండ్స్ కన్వెన్షన్ సెంటర్లో భారత్–సింగపూర్ దేశాల స్టార్టప్‌ల ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. ఆయన వెంట సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఉన్నారు. రెండు దేశాలకు చెందిన 30 స్టార్టప్ కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయి. మలేసియాలో మజిలీ.. గురువారం ఉదయం ఇండోనేసియా పర్యటన ముగించుకుని సింగపూర్ బయల్దేరిన మోదీ మార్గమధ్యలో మలేసియాలో కొద్దిసేపు ఆగారు. ఇటీవలే మలేసియా ప్రధానిగా ఎన్నికైన మహాథిర్ మొహమ్మద్‌ను కలుసుకుని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. మహాథిర్తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని మోదీ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఉన్న మార్గాలపై మోదీ, మహాథిర్ పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. మలేసియా ఉపప్రధాని డా.వాన్ అజీజా వాన్ ఇస్మాయిల్‌ను కూడా మోదీ కలుసుకున్నారు. -
మా వ్యూహాల్ని భారత్ అమలు చేసింది: పాక్ మంత్రి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆర్థికవేత్త, మాజీ మంత్రి సత్రాజ్ అజీజ్ వ్యూహాల్ని చక్కగా అమలు చేయడం వల్లే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని పాక్ మంత్రి అసన్ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు తమ వ్యూహాల్ని అమలు చేయడం ద్వారా ప్రస్తుతం తమ కంటే ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉన్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు. 90వ దశకంలో భారత్‌లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని.. ఆ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ సత్రాజ్ అజీజ్ సలహా కోరారని వ్యాఖ్యానించారు. సత్రాజ్ అజీజ్ వ్యూహాల్ని చక్కగా అమలు చేసిన మన్మోహన్.. భారత్‌లో పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. యుద్ధట్యాంకులు, క్షిపణులు మాత్రమే సరిపోవు.. పాకిస్తాన్ నేషనల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీని ప్రారంభించిన అసన్ ఇక్బాల్.. 2013లో 2జీ వైర్లెస్ టెక్నాలజీని వినియోగించిన పాక్ ప్రస్తుతం 5జీ టెక్నాలజీని వినియోగిస్తున్న దేశాల్లో ముందుందని ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి దేశంలో తలెత్తిన రాజకీయ అస్థిరతే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధట్యాంకులు, క్షిపణులు మాత్రమే దేశాన్ని కాపాడలేవని, ఆర్థికంగా బలోపేతమైనపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే శాంతి స్థిరీకరణ, కొనసాగింపు అవసరమని ఆయన పేర్కొన్నారు. -
భారత్ సంస్కరణల జోరు పెంచాలి
న్యూఢిల్లీ: భారత్ తనకున్న సామర్థ్యం మేరకు 8–9 శాతం వృద్ధి రేటును సాధించాలంటే మరిన్ని ఆర్థిక సంస్కరణలు అవసరమని ప్రఖ్యాత ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత నోరీల్ రూబిని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కె ట్లో చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, ద్రవ్యలోటు సమస్యలను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘భారత్‌కు దీర్ఘకాలంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. అలాగే, స్థూల ఆర్థిక అంశాల స్థిరీకరణ అవసరం. దీంతో ఏడు శాతానికి పైనే 8–9 శాతం స్థాయిలో వృద్ధి రేటును సాధించగలదు’’అని రూబిని చెప్పారు. గురువారం ఢిల్లీలో భారత ఆర్థిక వ్యవస్థపై జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో బ్యాంకింగ్ రంగ నిర్వహణ విధానాన్ని మార్చాల్సి ఉందని రూబిని అభిప్రాయపడ్డారు. బ్యాంకులు ఎన్పీఏలకు తగినంత నిధులు కేటాయిం చాలని లేదా దీనికోసం ప్రత్యేకంగా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలని సూచించారు. -
సంస్కరణలతోనే పెట్టుబడులు
గువాహటి: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక ఆర్థిక సంస్కరణల కారణంగానే ప్రపంచ పెట్టుబడుల స్వర్గధామంగా భారత్ నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 60 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.8 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. అస్సాంలోని గువాహటిలో రెండ్రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ను మోదీ శనివారం ప్రారంభించారు. లకి‡్ష్యత కార్యక్రమాలన్నీ అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తిచేసేలా ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ఎన్డీయే ప్రభుత్వం మార్చిందని తెలిపారు. దీని ద్వారా పనితీరు వేగం పుంజుకుందన్నారు. ఈశాన్య భారతం, ఇక్కడి ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరిగినపుడే దేశ ప్రగతి మరింత వేగం అందుకుంటుందని ప్రధాని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ (తూర్పుదేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల పెంపునకు ఉద్దేశించింది)కి ఈశాన్యరాష్ట్రాలే పట్టుగొమ్మని వెల్లడించారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమైన ‘అడ్వాంటేజ్ అస్సాం: ఆసియాన్‌కు భారత్ వేగవంతమైన మార్గం’ అనేది కేవలం ప్రకటనే కాదని.. భారత సమగ్ర దృష్టి అని పేర్కొన్నారు. భారత్ వైపు ప్రపంచం చూపు! ‘కేంద్ర ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల వ్యాపారానుకూల విధానాలు సరళతరమయ్యాయి. ప్రపంచ ఆర్థిక ప్రగతికి కేంద్ర స్థానంగా దేశాలన్నీ భారత్‌వైపే చూస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ద్వారా 45–50 కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఆసుపత్రులు మరీ ముఖ్యంగా చైన్ ఆసుపత్రులు పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉజ్వల పథకానికి కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకున్నామని.. 8 కోట్ల మంది పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని ప్రధాని తెలిపారు. వ్యాపారానుకూల నివేదికలోనూ భారత్ 100వ స్థానంలో నిలిచిందని.. ప్రపంచబ్యాంకు జాబితా, అంతర్జాతీయ పోటీ సూచీలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే భారత్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, పలువురు కేంద్రమంత్రులు, అస్సాం సీఎం శర్బానంద్ సోనోవాల్, 16 దేశాల రాయబారులు తదితరులు పాల్గొన్నారు. తొలిసారి అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్న అస్సాం.. తమ రాష్ట్రంలో విదేశీ, దేశీయ పెట్టుబడుదారులకు అవసరమైన వాతావరణం, వ్యూహాత్మక అనుకూలతలను సదస్సులో వివరించింది. -
సంస్కరణల జోరులో సమిధలు
సంస్కరణలను ఆశించిన స్థాయిలో వేగిరపర్చనందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి తెగడ్తలు, వాటిని నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్నందుకు ప్రధాని మోదీకి ప్రశంసలూ.. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలూ, రేటింగ్ ఏజెన్సీల కథ ఇదే మరి. ఈ మధ్యనే ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలకు ఇచ్చే, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగులు ప్రకటించారు. ఈ ర్యాంకింగులలో మన దేశానికి 100వ ర్యాంకు వచ్చింది. 3 సం‘‘ల క్రితం మోదీ అధికారంలోకి వచ్చేనాటికి ఈ సూచికపై మన ర్యాంకింగ్ మొత్తం 189 దేశాలలో 130కి పైబడే ఉంది. అంటే మూడేళ్ల కాలంలో ఈ ర్యాంకింగ్ బాగా వృద్ధి చెందింది. అందుకే మోదీ ఈ ర్యాంకింగ్‌ను తానూ, తన ప్రభుత్వం అమలు జరిపిన సంస్కరణల తాలూకు ఘనతగా చెప్పుకొంటున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా భిన్నమైన, ప్రతికూలమైన ఆర్థిక ముఖచిత్రాన్ని మన కళ్ళముందుంచుతున్నాయి. 2017–18 ఆర్థిక సం‘‘ తాలూకు తొలి త్రైమాశికం (ఏప్రిల్–జూన్)లో దేశ స్థూల జాతీయ వృద్ధి రేటు అంతకుముందరి కాలం కంటే భారీగా దిగజారి 5.7%గా నమోదు అయ్యింది. గత ఆర్థిక సం‘‘ (2016–17) ప్రథమ త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు సుమారుగా 7.9%గా ఉంది. అంటే ఈ సం‘‘ కాల వ్యవధిలో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 2.2% మేరన దిగజారింది. దీనికి ప్రస్తుతం కళ్ళముందు కనబడే కారణాలు పెద్ద నోట్ల రద్దు, హడావుడి జి.ఎస్.టి అమలుదలలు. అయితే నిజానికి ఈ రెండు అస్తవ్యస్త ఆర్థిక నిర్ణయాలు మాత్రమే నేటి జి.డి.పి దిగజారుడుకు కారణాలు కావు. 2014 మే నెలలో నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికి ఆయనపైన ప్రజలు ఏర్పరచుకొన్న సానుకూల భావన తాలూకు సెంటిమెంటూ, నాటి అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఆయనకు బాగా అనుకూలించాయి. వీటిల్లో ప్రధానమైనవి ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో కమోడిటీల ధరలు కూడా తగ్గుతుండటం. ముఖ్యంగా అంతకు ముందటి కాలంలో బ్యారల్‌కు సుమారుగా 130 డాలర్ల వరకూ చేరిన ముడిచమురు ధరలు మోదీ పాలన ఆరంభం నుంచీ వేగంగా తగ్గుతూ ఒకానొక దశలో బ్యారల్‌కు 30 డాలర్లకు కూడా చేరాయి. దీని ఫలితంగా ముడిచమురును భారీగా దిగుమతి చేసుకొనే మన దేశానికి, పెద్ద స్థాయిలో విదేశీమారక ద్రవ్యం పొదుపు అయ్యింది. ఫలితంగా మోదీ ప్రభుత్వానికి ఎంతో కొంత ప్రజలకు ఆకర్షణీయంగా కని పించే అవకాశం లభించింది. కానీ గత సం‘‘ కాలంపై నుంచీ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమేణా పెరుగుతూ నేడు సుమారుగా బ్యారల్‌కు 60 డాలర్ల పైకి చేరుకున్నాయి. ఈ పరిస్థితికి తోడుగా మూలిగే నక్కపై తాటికాయలా నోట్ల రద్దు, హడావుడి జి.ఎస్.టి అమలు తోడయ్యాయి. తాను అమలు జరిపిన సంస్కరణల వలన దేశంలో వ్యాపారం చేసేందుకూ, పెట్టుబడులు పెట్టేందుకు పరిస్థితులు మెరుగు కావటంతో గత 3 సం‘‘లో దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 67% దాకా పెరిగాయని మోదీ చెప్పుకుంటున్నారు. కానీ, పారిశ్రామిక పెట్టుబడులు పెరిగినా నిరుద్యోగం మాత్రం మరింత వేగంగా ఎందుకు పెరుగుతోందో జవాబు చెప్పే బాధ్యత ఆయన పైనే ఉంది. 1991లో దేశంలో సంస్కరణల ఆరంభం అనంతరం ఆర్థిక అసమానతలు, నిజవేతనాల పతనం, పెరిగిన అవినీతి వంటివన్నీ మనం చూసినవే. కాగా నేడు మోదీ ఈ దుష్పరిణామాల సంస్కరణలనే, తాను వేగంగా అమలుజరిపాననీ, ఇక ముందు మరింత వేగంగా అమలు జరుపుతాననీ చెబుతున్నారు. నేడు వేగవంతమవుతోన్న ఆర్థిక సంస్కరణలు ముందుముందు ఖచ్చితంగా సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను మరింత దిగజారుస్తాయి. ఉపాధి హామీ పథకం పట్ల కేంద్రప్రభుత్వం ఆలోచనలూ, ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలూ, ఎరువులవంటి వాటిపై సబ్సిడీల ఎత్తివేత ద్వారా రైతాంగంపై మరింత పెరుగుతోన్న భారాలు, గ్యాస్ సబ్సిడీ వంటి వాటిని మెల్లమెల్లగా తొలగించి వేస్తుండటంతో మధ్యతరగతీ, పేదవర్గాలపై పడుతోన్న అదనపు ఆర్థిక భారాలు తది తరం రానున్న రోజులలో ప్రజల కడగండ్లను మరింత పెంచుతాయి. కాగా, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకు అనుకూలమైన తీరులో సంస్కరణలను వేగిరపరచ లేకపోయినందుకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అంతర్జాతీయ మీడియా నిష్క్రియాపరుడని స్టాంపులు వేసింది. సంస్కరణలను వ్యతిరేకిస్తున్నందుకు వామపక్షాలను ప్రగతి విఘాతమైనవిగా చిత్రీకరిస్తున్నారు. దీనికి భిన్నంగా అదే సంస్కరణలను నిర్ధాక్షిణ్యంగా, వేగంగా అమలు జరుపుతున్నందుకు అదే అంతర్జాతీయ సంస్థలు, మీడియా మోదీని ఉక్కుమనిషిగా, క్రియాశీలుడిగా అభినందిస్తున్నాయి. ఇంత జరిగి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజి నెస్’ ర్యాంకింగ్ భారీగా మెరుగుపడినా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు మాత్రం, ఇంకా తృప్తిపడలేదు. 10 ఏండ్ల క్రితం తామిచ్చిన బి.బి.బి. రేటింగును పెంచాలంటే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తో పాటుగా ద్రవ్యలోటు, స్థూల జాతీయ ఉత్పత్తిలో ఋణ శాతం అంశాలలో కూడా మెరుగుదల తేవాలని ఆ సంస్థలంటున్నాయి. మొత్తం దేశాన్నే తమ ఆర్థిక ఆకలికి అర్పించుకొన్న తీరని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలూ, రేటింగ్ ఏజెన్సీల కథ ఇదే మరి. - డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు ‘ 98661 79615 -
ఆర్థిక సంస్కరణల్ని కొనసాగిస్తాం
వడోదర, దహేజ్: నోట్ల రద్దు, జీఎస్టీపై ప్రతిపక్షాల విమర్శల్ని తోసిపుచ్చుతూ కఠిన నిర్ణయాల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక సంస్కరణల దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కఠిన నిర్ణయాల అమలుతోనే దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కిందన్నారు. వర్తకులు జీఎస్టీ కింద నమోదు చేసుకుంటే వారి పాత లావాదేవీల జోలికి పోమని ఆయన హామీనిచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాని మోదీ ఆదివారం సుడిగాలి పర్యటన జరిపారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లను జలమార్గంలో అనుసంధానించే ‘రోరో’ ఫెర్రీ సర్వీసులను(రోల్ ఆన్–రోల్ ఆఫ్) ప్రారంభించారు. అలాగే, భావ్‌నగర్, వడోదర జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా.. గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడంపై ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈసీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. ఈ నెలలో మోదీ గుజరాత్లో పర్యటించడం ఇది మూడోసారి. ఉదయం గుజరాత్‌లోని సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ల్ని సముద్ర మార్గం ద్వారా అనుసంధానించే రోల్–ఆన్ రోల్–ఆఫ్ (రోరో) ఫెర్రీ సేవల్ని భరూచ్ జిల్లా ఘోఘా– భావ్‌నగర్ జిల్లా దహేజ్ మధ్య ప్రధాని ప్రారంభించారు. 100 మంది అంధ విద్యార్థులతో కలిసి ఘోఘా నుంచి దహేజ్ వరకూ ఫెర్రీలో ప్రధాని ప్రయాణించారు. మొదటి దశ ఫెర్రీ సేవల్ని కేవలం ప్రయాణికుల కోసమే ప్రారంభించారు. రెండు నెలల అనంతరం ప్రారంభమయ్యే రెండో దశలో కార్లు వంటి తేలికపాటి వాహనాల్ని కూడా తరలించవచ్చు. ఈ ఫెర్రీ సేవలతో ఘోఘా–భరూచ్‌ల మధ్య రోడ్డు మార్గం ద్వారా ఉన్న దూరం 330 కి.మీ. కాగా, జలమార్గంలో అది కేవలం 30 కి.మీ. మాత్రమే. అనంతరం దహేజ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఆర్థిక సంస్కరణల అమలు కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. అదే సమయంలో ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండేలా చర్యలు కొనసాగిస్తాం. సంస్కరణలు, కఠిన నిర్ణయాల అనంతరం.. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. ఇప్పుడు దేశం సరైన మార్గంలో ముందుకు పోతుంది’ అని మోదీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయన్న విషయాన్ని అనేకమంది ఆర్థిక వేత్తలు ఏకగ్రీవంగా అంగీకరించారని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధి దిగజారుతుందన్న ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ.. ‘ఇటీవల లెక్కల్ని పరిశీలిస్తే.. బొగ్గు, విద్యుత్, సహజ వాయువు, ఇతర వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు రూ. 30 వేల కోట్ల డాలర్ల నుంచి 40 వేల కోట్ల డాలర్లకు పెరిగాయి’ అని ప్రధాని వెల్లడించారు. జీఎస్టీలో నమోదు చేసుకుంటున్న వర్తకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని చెప్పారు. ‘గత కొద్ది నెలల్లో 27 లక్షల మంది అదనంగా జీఎస్టీలో నమోదు చేయించుకున్నారు. పన్ను ఎగవేయాలని ఏ వ్యాపారవేత్తా కోరుకోవడం లేదు. పన్ను నిబంధనలు, వ్యవస్థ, పన్ను అధికారులతో పాటు రాజకీయ నాయకులు వారిని ఆ విధంగా పురికొల్పుతున్నారు’ అని చెప్పారు. జీఎస్టీలో చేరితే వారి గత ఖాతాల్ని వెలికితీస్తారనే ఆందోళన అవసరం లేదని హామీనిచ్చారు. నన్నేమీ అనలేక.. ఈసీపై విమర్శలు ‘దీపావళి త్వరాత మోదీ గుజరాత్‌కు ఎందుకు వస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనగా ఉన్నాయి. నన్ను ఏమీ అనలేక ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. నేను వడోదర రాకూడదా?’ అని వడోదరలో జరిగిన సభలో మోదీ అన్నారు. కాంగ్రెస్ తీరును తప్పుపడుతూ.. ఇటీవల గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ గెలుపును ప్రస్తావించారు. ‘అప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాల కారణంగా జరిగిన రీకౌంటింగ్‌లో గెలుపొందినవారే.. ఇప్పుడు ఈసీని విమర్శిస్తున్నారు’ అన్నారు. వడోదరలో అభివృద్ధి పనుల్ని ప్రస్తావిస్తూ.. ‘వారు ఇంతకముందెప్పుడూ ఇలాంటి అభివృద్ధి పనుల్ని చూడలేదు. ఈ అభివృద్ధిని జీర్ణించుకోవడం వారికి కష్టంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఓడరేవులు కీలకం కేంద్ర ప్రభుత్వం పీ ఫర్ పీ(పోరŠస్ట్ ఫర్ ప్రాస్పరిటీ) నినాదాన్ని చేపట్టిందని చెప్పారు. దేశాభివృద్ధికి అత్యాధునిక ఓడరేవులు ఎంతో అవసరం. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో నౌకాశ్రయాలు, ఓడరేవులు నిరాదరణకు గురయ్యాయి. వాటిని ఆధునీకరించేందుకు సాగరమాల పథకాన్ని ప్రారంభించాం’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలోని జలరవాణా మార్గాల ద్వారా సరకు రవాణా చేస్తే టన్నుకు 20 పైసలే పడుతుందని, అదే రైల్వేకు రూ.1, రోడ్డు మార్గంలో రూ. 1.50లు ఖర్చవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు అంతర్గత జల రవాణాకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చేముందు దేశంలో కేవలం ఆరు జల రవాణా మార్గాలు ఉండేవని, ఇప్పుడు 100 మార్గాల్ని గుర్తించామన్నారు. -
సంస్కరణలు వేగం పుంజుకుంటాయి: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల వేగం రానున్న సంవత్సరాల్లో మరింత వేగం పుంజుకుంటుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఇది వృద్ధి వేగం పెరగడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా దోహదపడుతుందన్నారు. ప్రత్యేకించి మౌలిక రంగంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకురావడం కేంద్రం లక్ష్యమని వివరించారు. దేశం ఇప్పుడు ఒక ప్రత్యేక సానుకూల దశలో ఉందని అన్నారు. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ శాశ్వత కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించిన ఆర్థికమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం ప్రపంచంలో మనం రక్షణాత్మక విధానాల గురించి వింటున్నాం. అయితే ఇందుకు భిన్నంగా భారత్ వ్యవహరిస్తోంది. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మన ఆర్థిక వ్యవస్థ తలుపులను విదేశీ పెట్టుబడులకు తెరచి ఉంచాం’’ అని అన్నారు. -
అమెరికా మాదిరి సౌదీ కూడా...
దుబాయ్ : అమెరికా మాదిరి సౌదీ అరేబియా కూడా నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలకు, విదేశీ వర్కర్లకు నిబంధనలను కఠినతరం చేసి, నిరుద్యోగితను తగ్గించుకోవాలని సౌదీ ప్లాన్ చేస్తోంది. ఎక్కువమంది సౌదీ వాసులనే ఉద్యోగులుగా నియమించుకునేందుకు కంపెనీలకు త్వరలోనే కఠినతరమైన ఆదేశాలు జారీచేయాలని నిర్ణయించినట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త పాలసీ, సౌదీ గతేడాది లాంచ్ చేసిన ఆర్థిక సంస్కరణలకు ఎంతో సహకరించనున్నాయి. ఈ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా సౌదీ తమ దేశంలో నిరుద్యోగితను 2020 నాటికి 12.1 శాతం నుంచి 9 శాతానికి తగ్గించుకోవాలని నిర్దేశించుకుంది. కానీ కంపెనీలు మాత్రం తక్కువ జీతాలు చెల్లించే విదేశీ వర్కర్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చి కంపెనీలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ రూల్స్ తో సౌదీలో పనిచేసే చాలామంది విదేశీ వర్కర్లపైన ప్రభావం పడనుంది. మరోవైపు ఆ దేశంలోని కంపెనీలపై కూడా ఈ పాలసీ ప్రతికూల ప్రభావం చూపనుంది. సౌదీ అరేబియాలో 12 మిలియన్ల విదేశీలు పనిచేస్తున్నారు. కొత్త పాలసీ కింద 500 నంఉచి 2999 వరకు వర్కర్లు పనిచేసే నిర్మాణ సంస్థలో 100 శాతం సౌదీలుంటే ప్లాటినం కేటగిరీని కంపెనీకి అందిస్తారు. రిటైల్ సెక్టార్లో 35 శాతం సౌదీలుంటే ప్రస్తుతం ప్లాటినంగా గుర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ శాతాన్ని 100కు పెంచనున్నారని అధికారులు చెబుతున్నారు. ఇలా 60కి పైగా ఇండస్ట్రీల్లో ఈ కఠినతరమైన నిబంధలు అమలవుతాయని పేర్కొంటున్నారు. -
అలాంటి శక్తిమంతులెక్కడ?
జాతిహితం ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తరువాత ఈ పాతిక సంవత్సరాల కాలంలో టెలికాం, బీమా, పెట్రోలియం, పర్యావరణం వంటి అంశాలకు సంబంధించి చాలా బలమైన వ్యవస్థలు ఆవిర్భవించడం మనం చూస్తున్నాం. ఈ సంస్థలన్నీ ప్రధానంగా క్రమబద్ధీకరణకు సంబంధించినవే. ఇవి సమర్థంగా పనిచేస్తున్నట్టు చెప్పగలిగినప్పటికీ, జస్టిస్ వర్మ చెప్పిన ఒకే శక్తిమంతుడైన వ్యక్తి చేయూత కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాయి. ఇటీవలకాలంలో చూస్తే యూకే సిన్హా ఆధిపత్యంలో ఉన్న సెబీ మాత్రమే కాస్త ధైర్యసాహసాలతో పనిచేయడం కనిపిస్తుంది. ‘జాతి ప్రయోజనం’ శీర్షికలో ఈ వారం రాస్తున్న వ్యాసాన్ని గ్రంథచౌర్య అన్వేషకులు పరిశోధిస్తే వారి కళ్లు విప్పారతాయి. కానీ వారి ఆనందం క్షణి కమే. కొంత పోలిక ఉన్నా గ్రంథచౌర్యం కాదని మీరే సమాధానపడతారు. ఆరేళ్లక్రితం రాసిన ఆ వ్యాసానికి ప్రేరణ–జస్టిస్ జేఎస్ వర్మ ప్రసంగంలోని ఒక వాక్యం. ‘కోబ్రా డ్యాన్సర్’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘంలో అరవీరభయంకర సభ్యుడు కేజే రావు తన జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసిన పుస్తకమది. కేజే రావు పదవీ విరమణ చేసిన తరువాత కూడా రూ. 12,000 వేతనానికి తిరిగి ఎన్నికల సంఘం సలహాదా రుగా పనిచేశారు. బిహార్ వంటి రాష్ట్రంలో పారదర్శకమైన ఎన్నికలను నిర్వ హించినవారాయన. ఆ ఎన్నికలలోనే లాలూ ప్రసాద్ కుటుంబ పాలన అంత మైంది. ఆ పుస్తకం మీద చర్చ కోసం ఏర్పాటు చేసిన బృందంలో జస్టిస్ వర్మ, అప్పటి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎస్‌వై ఖురేషీలతో పాటు నేను కూడా సభ్యుడిని. ఆ సందర్భంలోనే జస్టిస్ వర్మను నేనొక ప్రశ్న అడిగాను: ఒక వ్యవస్థకు సరికొత్త రూపు ఇవ్వడం ఒకే ఒక వ్యక్తికి సాధ్యమయ్యేదేనా? దీర్ఘకాలంలో లేదా అనతికాలంలో ఒక్క వ్యక్తి ఆ పని చేయగలరా? అందుకు జస్టిస్ వర్మ చెప్పిన సమాధానం: చాలా కష్టం, అలాగే పూర్తిగా సాధ్యమే కూడా. ఆ వ్యక్తికి రెండు అర్హతలు ఉంటే, మన మన రాజ్యాంగ సృష్టికర్తలు ఆశించిన స్థాయికి వ్యవస్థల రూపురేఖలను మార్చవచ్చు. ఆ వ్యక్తి గతంలో పెద్ద ప్రముఖుడై ఉండకూడదు. అలాగే భవిష్యత్తు మీద ఆశలు లేనివాడై ఉండాలి. అయితే మన వ్యవస్థ మొత్తం కాగడా వేసి వెతికినా అలాంటి అర్హతలు కలిగిన వ్యక్తిని కనిపెట్టడం సాధ్యం కాదు. నిజానికి జస్టిస్ వర్మ ముందుకు తెచ్చిన ఆ సిద్ధాంతానికి ఆయనే ఒక ప్రతిరూపం. పురాతన చరిత్ర కలిగిన భారత అత్యున్నత న్యాయస్థానం రూపునే కాదు, అప్పుడే ఆకృతి దాలుస్తున్న జాతీయ మానవ హక్కుల సంస్థ రూపును మార్చిన వ్యక్తి ఆయన. మూడు దశాబ్దాల క్రితం ఇదేవిధంగా భారత పౌరులమైన మనందరి హక్కులను సుప్రీంకోర్టు సాధ్యమైనంత మేర రక్షిస్తుందని ఇందిర నియం తృత్వ పోకడలు రాజ్యమేలుతున్న సమయంలోనే, అత్యున్నత న్యాయస్థానా నికే చెందిన మరో న్యాయమూర్తి దృఢంగా చెప్పారు. ఆయనే హెచ్.ఆర్. ఖన్నా. మనం ఇంకొందరి గురించి కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు: టీఎన్ శేషన్నే తీసుకోండి. రెండు దశాబ్దాల రాజకీయ విన్యాసాల బారి నుంచి కాపాడి, ఎన్నికల కమిషన్‌ను కాగితం పులి స్థాయి నుంచి నిజమైన పులి స్థాయికి పెంచారు. ఎన్నికల కమిషన్ ముగ్గురు సభ్యుల సంస్థగా మారింది. అయితే వారు తరువాత ఆయన పక్షమైపోయారు. బలీయ వ్యవస్థగా ఆవిర్భవించిన తరువాత కూడా దానిని విచ్ఛిన్నం చేయడానికి జరిగిన యత్నం అలా విఫలమైంది. ఇలాంటి వ్యక్తి సీబీఐ లేదా చీఫ్ విజిలెన్స్ కమిషన్‌లో తయారైతే ఎలా ఉంటుందని మనం తరువాత ఆలోచించాం. అవినీతి వ్యతిరేక ఉద్యమం విస్తృతంగా నిర్మితమైన 2010 సంవత్సరం మధ్యభాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పుడు జరిగిన చాలా కుంభకోణాలు ప్రజలను ఆగ్రహా వేశాలకు గురి చేశాయి. ఏదో ఒకటి చేయాలన్న తపన కనిపించింది. అదే సమయంలో ఉత్తర కొరియా బాటలో జన్‌లోక్‌పాల్ బిల్లు వంటి ఇబ్బందికర ఆలోచనలు కూడా వచ్చాయి. సరే, దాచడానికి వీల్లేని గతమేదీ లేని, భవి ష్యత్తులో దేని కోసమూ ఆశ పడని ఓ పోలీసు అధికారి, లేదా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ తన శక్తి మేరకు ఈ వ్యవస్థల రూపురేఖలు మారిస్తే ఏమవుతుంది? మరీ రాక్షసంగా మీ ఇంటి పక్కనే గూఢచారి అవసరం, అవినీతి నిరోధక చట్టం, వేయి కొత్త కారాగారాల నిర్మాణం మాత్రం అవసరం ఉండవని చెప్ప వచ్చు. వాటి దుర్వినియోగమైనా చాలావరకు తగ్గుతుంది. అయితే ఇందులో ఏవీ కార్యరూపం దాల్చవు. నిజానికి సీబీఐకి కొత్త డైరెక్టర్ వచ్చిన ప్రతిసారి నైతికంగా, నైపుణ్య పరంగా ఆ సంస్థ తిరోగమనంలోకే దిగజారడం కనిపి స్తుంది. ఈ అవినీతి వ్యతిరేక పోరాట సంస్థకు అధిపతులుగా నియమించడా నికి యోగ్యులు అనదగ్గ రెండు పేర్లు ఎవరైనా ప్రస్తావించగలరా అని నేను సవాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఆ సంస్థ అధిపతిగా ఉన్న వ్యక్తి పేరును కాంగ్రెస్ మినహా ఎవరం ప్రస్తావించబోమని కూడా పందెం కాసి మరీ చెబు తాను. అయితే దీని ఉద్దేశం ఎవరినీ వ్యక్తిగత హోదాలో అవమానించడం కాదు. మన సంస్థల పరిస్థితి అదే. జస్టిస్ వర్మ తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కీర్తిప్రతిష్టలను ఆర్జించినవారు జస్టిస్ ఆర్ఎం లో«థా. పదవీ విరమణ తరువాత బీసీసీఐని సంస్కరించడానికి ఆయన నేతృత్వంలో నియ మించిన చేవగల ఆ కమిటీ చేసిన సేవలకు జాతి రుణపడి ఉంటుంది. ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తరువాత ఈ పాతిక సంవత్సరాల కాలంలో టెలికాం, బీమా, పెట్రోలియం, పర్యావరణం వంటి అంశాలకు సంబంధించి చాలా బలమైన వ్యవస్థలు ఆవిర్భవించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రధానంగా క్రమబద్ధీకరణకు సంబంధించినవే. ఇవన్నీ సమర్థంగా పనిచేస్తున్నట్టు చెప్పగలిగినప్పటికీ, జస్టిస్ వర్మ చెప్పిన ఒకే శక్తిమంతుడైన వ్యక్తి చేయూత కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నాయి. ఇటీవలకాలంలో చూస్తే యూకే సిన్హా ఆధిపత్యంలో ఉన్న సెబీ మాత్రమే కాస్త ధైర్య సాహసా లతో పనిచేయడం కనిపిస్తుంది. అయితే సహారా వ్యవహారాలను వెలికి తీసి, ఆ సంస్థ అధిపతిని జైలుకు పంపిన ఆ సిన్హా పదవీకాలం త్వరలోనే పూర్తి కాబోతున్నది. అంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించడం చిన్న విషయం కాదు. సహారా అధిపతి ఎంత పలుకుబడి కలిగినవారో ఆయన రాసిన పుస్తకం ఆవిష్కరణోత్సవం తిహార్ జైలులో జరిగినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ (గులాం నబీ) నేతలు అక్కడకు రావడం ద్వారా వెల్లడవుతోంది కూడా. ప్రధానికి ముడుపులు ముట్టాయని ఆదాయపన్ను శాఖ దాడుల సంద ర్భంగా దొరికిన డైరీల ఆధారంగా రాహుల్‌గాంధీ ఆరోపణలు చేస్తూ మాట్లా డిన రోజునే తిహార్ జైలులో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మన ఆర్థిక వ్యవస్థలలో ఎంతో ప్రతిష్ట కలిగిన, కీలకమైన, పురాతన సంస్థ రిజర్వు బ్యాంక్. ముంబైలో ఉన్న ఆ సంస్థ కార్యాలయంలో సంస్థ అధిపతి గదికి ముందు ఉండే గదిలో చాలా ఫొటోలు కనిపిస్తాయి. అవన్నీ ఆ సంస్థకు పూర్వం ఆధిపత్యం వహించినవారివి. అవి భారత ఆర్థిక చరిత్ర మీద విహంగ వీక్షణం చేయిస్తాయి. అయితే న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘాల మాదిరిగా, లేదా చీఫ్ విజిలెన్స్ కమిషన్, ఆఖరికి కమ్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ వలె రిజర్వు బ్యాంక్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడానికి ఎలాంటి చట్టం చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖకీ, దాని ద్వారా పార్ల మెంటుకు రిజర్వు బ్యాంక్ జవాబుదారు. వైవీ రెడ్డి ఆయన వారసుడు డీవీ సుబ్బారావులు గవర్నర్లుగా ఉన్న కాలంలో రిజర్వుబ్యాంక్ కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నది. యూపీఏ హయాంలో పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రులుగా ఉన్నప్పుడు ఆ ఇద్దరు గవర్నర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రఘురామ్‌రాజన్ పదవీకాలాన్ని పొడిగించకుండా ఆ ఇబ్బందుల నుంచి తప్పించారు. తరువాత ఉర్జిత్ పటేల్ గవర్నర్ అయ్యారు. ఆయన పదవిలోకి వచ్చి మూడు మాసాలు గడిచింది. అయితే ఆయన హయాంలోనే రిజర్వు బ్యాంక్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ పెద్ద నోట్ల విషయంలో రిజర్వు బ్యాంక్ నిర్వహించిన వాస్తవ పాత్ర ఏమిటన్నది చర్చనీయాంశం. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ (కేంద్ర ఆర్థికమంత్రి కార్యాలయం) దగ్గర, లేదా ముంబైలోని టంకసాల వీధిలో వినిపించే గుస గుసలను బట్టి నోట్ల రద్దు గురించిన సత్యం లేదా కల్పన మీ దృష్టికి వస్తుంది. రిజర్వు బ్యాంక్ బోర్డు సిఫార్సు ప్రాతిపదికగానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్న మాట అందులో ఒకటి. నల్లధన కుబేరులకు అవకాశం కల్పిం చకుండా ఉండేందుకు ఆ మాత్రం గోప్యత అవసరమే. ఆరు వారాలు గడిచి పోయాయి. ఆ గోప్యత ఇక అవసరం లేదు. అయినా నోట్ల రద్దుకు సంబం ధించిన సమావేశం, ఇతర చర్చనీయాంశాలను రిజర్వు బ్యాంక్ ఎందుకు వెల్లడించదు? నిజానికి వీటిని ఆర్టీఐ ద్వారా పొందవచ్చు. కానీ ప్రశ్న ఏమి టంటే రిజర్వు బ్యాంక్ తనకు తానుగా ఎందుకు పారదర్శకంగా ఉండదు? రిజర్వు బ్యాంక్ వెబ్సైట్ చూడండి: ‘బ్యాంకుల ద్వారా విడుదలయ్యే నోట్లను క్రమబద్ధీకరించడం, భారత్‌లో ద్రవ్య స్థిరత్వం కోసం నిల్వల నిర్వహణ’ తన విధిగా ప్రకటించుకోవడం కనిపిస్తుంది. అంటే కరెన్సీ ప్రధాన బాధ్యత ఆ బ్యాంక్‌దే. కాబట్టి నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులు, ఇతర బాధ్యతల నుంచి అది తప్పించుకోలేదు. నవంబర్ 8 తరువాత ఆ సంస్థ పాటిస్తున్న మౌనం, గోప్యత (తాజాగా రూ. 5,000 నగదు మదుపుపై ఆంక్షలు) వరకు ఏవీ రిజర్వు బ్యాంక్ ప్రతిష్టను, దాని గవర్నర్ పరపతిని పెంచేవి కావు. మదుపు వివరాలను వెల్లడిస్తూ ఇచ్చే వారాంతపు నివేదికను నిలిపివేయడం గానీ, ఎలాంటి వివరణ ఇవ్వకుండా డిసెంబర్ 10 వరకు మొత్తం డిపాజిట్ల వివరాలను వెబ్ సైట్‌ను తొలగించడం ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న సంస్థకు న్యాయం కాదు. ఉర్జిత్ అంటే గతంలో ఎవరికీ తెలీదు. ఆయన భవిష్యత్ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఔన్నత్యాన్ని కాపాడ్డానికి నడుం కట్టవచ్చు. (వ్యాసకర్త : శేఖర్ గుప్తా twitter@shekargupta) -
నోట్ల రద్దును టాటా ఎలా అభివర్ణించారో తెలుసా?
న్యూఢిల్లీ : దేశ కార్పొరేట్ చరిత్రలో కనివినీ రీతిలో చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన వివాదంలో తలమునకలై ఉన్న రతన్ టాటా, ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. మూడు అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటని రతన్ టాటా అభివర్ణించారు. బ్లాక్‌మనీని నిర్మూలించడానికి ఇది ఎంతో సహకరిస్తుందంటూ డీమానిటైజేషన్‌ను కొనియాడారు. అయితే అమలు సరిగా లేదని వ్యాఖ్యానించారు. లోపాలను యుద్ధప్రాతిపదికన సరిదిద్దాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న బోల్డ్ డిమానిటైజేషన్ నిర్ణయానికి దేశమంతా మద్దతివ్వాలని టాటా పిలుపునిచ్చారు. భారతీయ చరిత్రలో డిలైసెన్సింగ్, జీఎస్టీతో పాటు బ్లాక్ మనీపై పోరాటం చేస్తూ పెద్దనోట్ల రద్దు చేయడం కూడా మూడు అత్యంత ముఖ్యమైన ఆర్థికసంస్కరణల్లో ఒకటని కొనియాడారు. నగదు రహిత ఎకానమీ కోసం ప్రధాని మోడీ ఇటీవల మొబైల్, డిజిటల్ పేమెంట్లపై ఎక్కువగా దృష్టిసారించారని, దీనివల్ల దీర్ఘకాలికంగా పేద ప్రజలకు ఎంతో లబ్ది చేకూరుతుందని రతన్ టాటా అన్నారు. బ్లాక్‌మనీని నిర్మూలించడానికి ప్రభుత్వం ఈ యుద్ధం చేస్తుందని, రేపటి తరానికి దేశ వనరులను సమృద్ధిగా అందించాలనుకునే మధ్యతరగతి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని పేర్కొన్నారు. గత నెల టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా సైరస్ మిస్త్రీని తొలగించడంపై తీవ్ర వివాదమైన సంగతి తెలిసిందే. ఒకరిపై మరొకరు ఆరోపణలపై కార్పొరేట్ చరిత్రలో మంచి పేరున్న టాటాగ్రూప్ పరువు వీధినపడింది. ఇప్పటికీ వీరి వివాదం సర్దుమణగలేదు. -
పీవీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు దేశం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో ఎటుచూసినా నిరాశ, నిస్పృహలు నిండిన తరుణంలో ఆయన చూపిన దార్శనికత ఇప్పటికీ ఫలాలు అందిస్తూనే ఉంది. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశ దిశను, దశను మార్చి.. భారతీయ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన ఆయనే పీవీ నరసింహారావు. ప్రధానమంత్రిగా దేశానికి కొత్త పునరుజ్జీవానాన్ని అందించిన పీవీ 95వ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన పది ఆసక్తికర విషయాలివి.. పీవీని ఆధునిక చాణుక్యుడిగా అభివర్ణిస్తారు. దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సమయంలో ఆయన చూపిన చాణుక్యం, దార్శనికత ఆధునిక భారతానికి పునాదాలు వేశాయి. అత్యంత కఠినమైనవిగా భావించిన ఆర్థిక, రాజకీయ సంస్కరణలకు పీవీ ఆద్యుడిగా నిలిచారు. పీవీ బాహుముఖ ప్రజ్ఞాశాలి. బాహుభాషా కోవిదుడు. ఆయన తొమ్మిది భారతీయ భాషలు (తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సంస్కృతం, తమిళ్, ఉర్దూ), ఎనిమిది విదేశీ భాషలు (ఇంగ్లిష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, లాటిన్, పర్షియన్) మాట్లాడగలరు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రధానమంత్రి పీవీ. పీవీ ప్రభుత్వ హయాంలోనే రూపాయి విలువను తగ్గించి అంతర్జాతీయ వాణిజ్యానికి వీలుగా మార్చారు. దేశంలో అణ్వాయుధ పరీక్షలు నిర్వహించాలని మొదట భావించిన ప్రధాని పీవీనే. ఈ ఆలోచననే తదుపరి ప్రధాని వాజపేయి అమలుచేశారు. హైదరాబాద్ సంస్థానంలో 1940లో నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ పీవీ కీలక పాత్ర పోషించారు. 1948 నుంచి 1955 మధ్యకాలంలో ఆయన, ఆయన బంధువు కలిసి ‘కాకతీయ పత్రిక’ ను నడిపారు. పీవీకి ‘భారత రత్న’ ఇవ్వాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యం సహా ఎన్నో పార్టీల నాయకులు, మంత్రులు గతంలో డిమాండ్ చేశారు. ‘లుక్ ఈస్ట్’ పాలసీని మొదటి చేపట్టిన ప్రధాని పీవీనే. వ్యూహాత్మకంగా కీలకమైన దక్షిణాసియా దేశాలతో సంబంధాలు నెరపాల్సిన ఆవశ్యకతను గుర్తించిన మొదటి ప్రధాని పీవీనే. లోక్‌సభలో మైనారిటీలో ఉన్నప్పటికీ పూర్తిగా ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన మొదటి ప్రధాని పీవీ నరసింహారావు. పీవీ సాహిత్య సేవ..! సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలుకు పీవీ చేసిన హిందీ అనువాదం ఇది. ఈ పుస్తకానికి పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. ఇన్సైడర్: ఆయన రచించిన ఆత్మకథాత్మక నవల. తాను ముఖ్యమంత్రి పదవి అధిష్టించి.. దిగిపోయేంతవరకూ ఆయన జీవితఘట్టాలకు ఈ నవలలోని చిత్రణకు చాలా దగ్గర పోలిక వుంది. నవలలోని కథానాయకుడు ఆనంద్.. పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలకు నిజమైన పేర్లు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు మాత్రం పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో పీవీ రాసిన "గొల్ల రామవ్వ" కథ కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. -
భారత్ కు మరో 2% వృద్ధి సాధన సత్తా: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలు, సానుకూల అంతర్జాతీయ పరిణామాలు మొదలైన అంశాల కారణంగా అదనంగా మరో 1-2 శాతం వృద్ధి రేటును సాధించగలిగే సత్తా భారత్‌కు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆర్థికాంశాలపరంగా భారత్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని 8వ వార్షిక ఎన్సీఎం ఉవన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. -
సంస్కరణలు తేవాలి
ఐఎంఎఫ్ కోటా వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేదిగా ఉండాలి: మోదీ ► వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం పెరగాలి ► భారత్, ఐఎంఎఫ్ సంయుక్త సదస్సు ‘అడ్వాన్సింగ్ ఏషియా’లో ప్రసంగం ► 2017 అక్టోబర్‌లో మరిన్ని సంస్కరణలు తెస్తాం: ఐఎంఎఫ్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని వాస్తవంగా ప్రతిబింబించేలా అంతర్జాతీయ ద్రవ్య నిధిలో (ఐఎంఎఫ్) కోటాపరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. బహుళ పక్ష సంస్థల్లో భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ‘‘కోటా సంస్కరణలు 2010 నుంచీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తీరా ఇన్నాళ్లకు అమల్లోకి వచ్చినా... అవి వాస్తవ స్థితిని ప్రతిబింబించేలా లేవు. కోటా సంస్కరణలతో ఆయా దేశాలకు చట్టబద్ధంగా, సముచితంగా దక్కాల్సిన ప్రాతినిధ్యం దక్కాలి. దాన్ని కల్పించేవిగానే ఈ సంస్కరణల్ని చూడాలి తప్ప మరిన్ని అధికారాలిచ్చేస్తున్నట్టుగా పరిగణించకూడదు. పేద దేశాల ఆశయాలు, ఆకాంక్షలకు తోడ్పాటు అందించగలిగితేనే ఇలాంటి బహుళపక్ష సంస్థల్ని అవి గౌరవిస్తాయి’’ అని మోదీ చెప్పారు. ‘అడ్వాన్సింగ్ ఏషియా’ అంశంపై భారత్, ఐఎంఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 అక్టోబర్‌లో కోటా పరంగా మరో విడత మార్పులు చేపడతామన్న ఐఎంఎఫ్ నిర్ణయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో అమల్లోకి వచ్చిన సంస్కరణలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వర్ధమాన దేశాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారాయన. ఆర్థిక స్థిరత్వానికి స్వర్గధామం భారత్... ఇటీవలి సంస్కరణల ఫలితంగా... ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.44 శాతం నుంచి 2.7 శాతానికి, ఓటింగ్ వాటాలు 2.34 శాతం నుంచి 2.6 శాతానికి పెరిగాయి. అలాగే భారత్ సహా వర్ధమాన దేశాలు బ్రెజిల్, రష్యా, చైనా కూటమిగా ఉన్న ‘బ్రిక్’... తొలిసారి ఐఎంఎఫ్‌లోని పది అతిపెద్ద సభ్య దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే అడ్వాన్సింగ్ ఏషియా సదస్సు, మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా స్థూల ఆర్థిక స్థిరత్వం కోరుకునేవారికి భారత్ స్వర్గధామమని మోదీ చెప్పారు. అధిక వృద్ధికి, అందరికీ ఆర్థిక సేవల కల్పనకు ఉద్దేశించిన.. ‘మార్పు కోసం సంస్కరణల’ ప్రక్రియ ఇక ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘పొరుగు దేశాల ప్రయోజనాలు దెబ్బతీసి.. దానిద్వారా లాభపడాలని మేం ఎన్నడూ ప్రయత్నించలేదు. మేమెప్పుడూ మా కరెన్సీ విలువను కూడా ఉండాల్సిన స్థాయికన్నా తగ్గించలేదు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అధిక ఆర్థిక వృద్ధి సాధ్యం కాదన్నది అపోహేనని మేం రుజువు చేశాం. స్థూల ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకున్నాం. ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా కట్టడి చేయగలిగాం. ఆర్థిక స్థిరీకరణను సాధిస్తున్నాం. అటు విదేశీ మారక నిల్వలను కూడా పెంచుకోగలుగుతున్నాం’’ అని మోదీ వివరించారు. మెరిసే తార భారత్: ఐఎంఎఫ్ చీఫ్ లగార్డ్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ మెరిసే తారగా వెలుగుతోందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ వ్యాఖ్యానించారు. భారత్‌లో కొనసాగుతున్న సంస్కరణల ప్రక్రియను ఆమె ప్రశంసించారు. వేగం కాస్త మందగించినా.. వచ్చే నాలుగేళ్లలో ప్రపంచ ఎకానమీ వృద్ధిలో మూడింట రెండొంతుల భాగం భారత్ నుంచే రాగలదని లగార్డ్ పేర్కొన్నారు. భారత్ సహా ఇతర ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకుంటూ, వృద్ధి అనుకూల ద్రవ్య విధానాలు పాటిస్తూ... అంతర్జాతీయ ఆర్థిక సవాళ్ల ప్రభావాలను ఎదుర్కొనాలని ఆమె సూచించారు. యువత అత్యధికంగా గల మానవ వనరులతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారీ ఎకానమీగా కూడా భారత్‌ను లగార్డ్ అభివర్ణించారు. మరికొన్ని రోజుల్లో రాబోయే హోలీ పండుగను ప్రస్తావిస్తూ.. భారత్, ఆసియా సాధించిన ఘనతలను వేడుకగా జరుపుకోవాల్సి ఉందని చెప్పారు. సెంట్రల్ బ్యాంకులకు నిబంధనావళి: రాజన్ పారిశ్రామిక దేశాలు పాటించే అసాధారణ ద్రవ్య పరపతి విధానాలు యావత్ ప్రపంచంపై ప్రభావం చూపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు అమలు చేసే ద్రవ్యపరపతి విధానాల ప్రభావాలను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆయా ప్రభావాలను బట్టి వాటికి రేటింగ్ ఇవ్వాలని, ఇందుకోసం ట్రాఫిక్ లైట్లలాగా కలర్ కోడ్లు ఉపయోగించవచ్చని రాజన్ సూచించారు. తక్కువ ప్రతికూల ప్రభావాలు చూపే విధానాలకు ఆకుపచ్చ, తాత్కాలికమైన వాటికి నారింజ, వాంఛనీయం కాని విధానాలకు ఎరుపు రంగులతో రేటింగ్ ఇవ్వొచ్చని చెప్పారాయన. సంక్షేమ కోణంలో పాలసీ ప్రభావాలను అధ్యయనం చేయడం సరైన విధానంగా ఉండగలదని ఆయన చెప్పారు. హెచ్1బీ వీసాలపై ఆందోళన: సీఈఏ హెచ్1బీ వీసాలను ఎత్తివేయాలంటూ అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగించేవిగా ఉంటున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ చెప్పారు. ఎగుమతి ఆధారిత వృద్ధికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. సేవల ఎగుమతులతో భారత్ 8-10 శాతం వృద్ధి సాధించగలదని, కానీ హెచ్ 1బీ వీసాల రద్దుపై చర్చలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. అమెరికా కంపెనీలు కొన్ని విభాగాల్లో నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ వీసాలు ఉపయోగపడతాయి. ప్రాంతీయ శిక్షణా కేంద్ర ఏర్పాటుకు ఒప్పందం.. స్థూల ఆర్థిక అంశాలపై అధికారులకు శిక్షణనిచ్చే దిశగా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్, ఐఎంఎఫ్ నిర్ణయించాయి. దక్షిణాసియా ప్రాంతీయ శిక్షణ, సాంకేతిక సహకార కేంద్రం (ఎస్ఏఆర్టీటీఏసీ) ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ సంతకాలు చేశారు.