అభిప్రాయం
భారత్‌లో 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలు కావడంతో కొత్త శకం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి తెలుగునాట– ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’ల తీరును చూసిన ప్పుడు... వాళ్ళల్లోనూ, వారిని ఎంపిక చేసుకునే మన వైఖరిలోనూ కాలంతో పాటుగా సహజంగా జరగ వలసిన మార్పు పెద్దగా కనిపించదు. ఆర్థిక సంస్కరణల కంటే ముందు ‘మండల్’ కమిషన్ నివేదిక చట్టమై, దేశమంతా అది అమలులోకి వచ్చింది. ఈ రెండు మార్పులతో మన – ‘పొలిటికల్ ఫిలాసఫీ’ నవీనీ కరణ చెందాల్సి ఉండింది.
‘సరళీకరణ’ పరిణామక్రమం గురించి ఈ ‘సోషల్ మీడియాa’ కాలంలో కూడా ఒక ‘నెరేటివ్’గా కూడా మన విశ్లేషకులు ప్రస్తావన చేయడం ఎక్కడా కనిపించడం లేదు. అలా జరిగినప్పుడు, వర్ధమాన సమాజాలు (ఎమర్జింగ్ కమ్యూనిటీస్) తమ అస్తిత్వ ఘర్షణకు ఒక చారిత్రక క్రమం ఉందనీ, ఆ ప్రాతిపదికగా తాము ఎదగాలనీ, తమదొక ‘లీగల్ క్లెయిమ్’ అనీ అవి నమ్ముతాయి.
కానీ ఉద్దేశ్య పూర్వకంగానే అలా జరగకపోవడం వల్ల, ఇప్పటికీ ఆ శ్రేణులను మనం ఏమిటో, మనకు ఏమి కావాలో మనకే అర్థం కాని స్థితికి పనిమాలా చేర్చినట్టుగా అయింది. ఆ విషయం 2024 ఎన్నికలు స్పష్టం చేశాయి. పర్యవసానంగా తెలుగునాట ఇప్పటికి ముప్పై ఏళ్ల క్రితం 1994 నవంబర్ ఎన్నికల్లో ఎన్టీఆర్ చేతిలో కోట్ల విజయభాస్కర రెడ్డి ఓడి పోయాక, కొద్ది నెలలకు తానే ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’గా మారిన చంద్రబాబు నాయుడు(సీబీఎన్) పలు విరామాల మధ్య గెలుస్తూ ఓడుతూ... అదే పదవిలో ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంటారు.
మారుతున్న కాలంతో పాటు చేరే కొత్త తరాల కోసం– ‘చేంజ్ మేనేజ్మెంట్’ వైపు కొత్తదారులు చూపాలనే సోయి మనకు ఉన్నట్టుగా అనిపించదు. స్వతహాగా మనకది లేక పోవడం వల్ల, మన స్థాయి – ‘మిడియోకర్’ కావడం వల్ల మనం ఆ పని చేయలేకపోయి ఉండొచ్చు కూడా. అందుకే తరాలు ఎన్ని మారినా ఒకే మూస రాజకీయ నాయకత్వం ఏదో ఒక పద్ధతిలో ఇక్కడ కొనసాగుతున్నది. దాంతో మన గమనం లేకుండానే, అభిప్రాయ నిర్మాతలుగా మనమూ ఏదో ఒక వైపుకు లాగబడి, అదే ప్రభావంలో శాశ్వతంగా ‘సెటిల్’ అవుతున్నాం.
అదేంటి, పరిపాలన అన్నప్పుడు ఒక ‘బుక్’ ఉంటుంది కదా, చట్టాలకు లోబడి కదా ప్రభుత్వాలు పనిచేయవలసింది అంటే, అది నిజమే. కానీ సూత్రం మేరకు ‘బుక్’ అనేది ఈ ముప్పై ఏళ్ళలో ‘ఎగ్జిక్యూటివ్’కు మాత్రమే పరిమితమైన అంశంగా మారింది. తెలుగువారికి 1956లో ఒక రాష్ట్రం ఏర్పడిన నలభై ఏళ్ల తర్వాత– ‘కోట్ల’కు కొనసాగింపుగా వచ్చిన సీబీఎన్ 2024 తర్వాత కూడా ఇక్కడ చలామణిలో ఉండగా, 2000 తర్వాత ఏర్పడిన రాజకీయ ఖాళీలో పుట్టినవి– టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలు.
ఈ మూడు ప్రాంతీయ పార్టీల్లో సీబీఎన్ ఆర్థిక సంస్కరణల ఆరంభ కాలంలో ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’ అయిన వాడు కావడంతో ‘కోట్ల’ వరకు వున్న జాబితా నుంచి ఆయన్ని వేరుచేసి చూడాలి. మధ్యలో కాంగ్రెస్ సీఎంగా వైఎస్ లేరా? అంటే ఉన్నారు, అయితే మళ్ళీ ఆ ‘స్కూల్’ వేరు. ప్రధానిగా పీవీ ఉన్న కాలంలో ఆర్థిక మంత్రిగా సంస్కరణల అమలు బాధ్యతలు చూసిన డా‘‘ మన్మోహన్ సింగ్ సంస్కరణలు మొదలైన పదేళ్ళకే ప్రధానమంత్రిగా– ‘రిఫామ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అనాల్సి వచ్చింది.
పదేళ్ళకే విషయం అర్థమైంది. దాంతో సంస్కరణల అమలుకు మానవీయ కోణం తప్పలేదు. అందుకే వైఎస్ కాలాన్ని– ‘ఏపీ మోడల్’ అంటూ సింగ్ ప్రశంసించేవారు. సీబీఎన్‌ను ఓడించి 2004లో సీఎమ్‌గా వైఎస్ ‘ఎంట్రీ’కి కొద్ది నెలల ముందు ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు క్లౌస్ శ్వాబ్ హైదరాబాదులో మాట్లాడుతూ – ‘ప్రపంచం ముందున్న ప్రధానమైన సవాలు పేదరిక నిర్మూలన. ఇది ఈ సమా జాన్ని నిరంతరం విభజిస్తూనే ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికీ వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప మనకు ఎంత మాత్రం భద్రత ఉండదు’ అన్నారు.
అయితే శ్వాబ్ ఏపీలో ఈ మాట అనిన కొన్ని వారాలకు 2004 వేసవిలో సీఎంగా బాబుకు తొలి ఓటమి ఎదురైనా, రాజకీయంగా అయితే ఆయన ఎప్పుడూ ఖాళీగా లేరు. వైఎస్ మరణం తర్వాత ఆయన మరీ ‘బిజీ’ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ పని రెట్టింపు అయింది. అలాగని ఎందులో... ఎందుకు? వంటి ప్రశ్నలకు మళ్ళీ ప్రజా హితమైన జవాబులు మనకు దొరకవు.
రాష్ట్ర విభజన తర్వాత జరగాల్సింది ఏమిటి? ఏ ఒక్క ఓటమి తర్వాతా... గెలిచినప్పుడూ ఒక కొత్త ఆరంభం లేదంటే, దానర్థం మారు తున్న కాలాన్ని దానితోపాటుగా పెరుగుతున్న ఆశావహ శ్రేణుల్ని పట్టించుకోకపోవడమే కదా? ‘ఉచితాలు’ ఎందుకు అన్నవాళ్ళను, ప్రతి ఎన్నికల ముందు ‘మాకేంటి?’ అనే వాళ్ళను ఇద్దరినీ పక్కన పెట్టినా, మిగతావారి మాటేంటి? వేలిమీద ఓటు ‘ఇంకు’ ఉండగానే, గెలిచాక వారికి మా జవాబుదారీతనం ఏముంది అన్నట్టుగా ప్రవర్తిస్తే ఎలా?
ఐదేళ్ళ క్రితం మా ప్రణాళిక ఇది అని మొదటిసారి అధి కారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ వికేంద్రీకరణ సూత్రంగా మూడు రాజధానులు అంటూ తమ– ‘పొలిటికల్ ఫిలాసఫీ’ చెబుతూ, తమ రాజకీయాలు రాష్ట్రానికి పరిమితమని స్పష్టం చేసింది. మరి నలభై ఏళ్ల పార్టీ, సీనియర్ సీఎం అయినప్పుడు, విభజన జరిగిన పదేళ్ళ తర్వాత అయినా ఈ రాష్ట్రం విషయంలో తమ ‘ప్రోగ్రాం’ ఏమిటో వెల్లడించాలి కదా.
ఆ పని అది ఎందుకు చేయలేకపోతున్నది? పదేళ్ళ క్రితం విభజన జరిగాక, శ్రద్ధ రాష్ట్రం మీద కాకుండా తెలంగాణ రాజకీయాల్లోకి తెరవెనుక జోక్యం చేసుకుని విఫలమయింది. మళ్ళీ ఇప్పుడు గెలిచిన నెలలోనే తెలంగాణలో పార్టీ బలోపేతం అంటే, ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’లు ప్రజలు–ప్రాంతము అనే దృష్టి నుంచి దూరమై వాళ్ళు తమ రాజకీయాలు చూసుకుంటే, ఇక ఈ రాష్ట్ర ప్రయోజనాల మాటేమిటి? ‘రాజ్యం’ అంటే– ‘లెజిస్లేచర్’ ఒక్కటే కాదు కదా, కొత్త రాష్ట్రంలో ఈ పదేళ్ళలో ఇప్పుడిప్పుడే ఒక రూపు తీసుకుంటున్న వ్యవస్థల్ని మీ రాజకీయాలతో ఇలా చేష్టలుడిగేలా చేస్తే చివరికి ఓడేది ఎవరు?
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment