మోదీకి జ్ఞాపికను అందిస్తున్న అస్సాం సీఎం సోనోవాల్. చిత్రంలో భూటాన్ ప్రధాని తోబ్గే
గువాహటి: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక ఆర్థిక సంస్కరణల కారణంగానే ప్రపంచ పెట్టుబడుల స్వర్గధామంగా భారత్ నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 60 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.8 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. అస్సాంలోని గువాహటిలో రెండ్రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ను మోదీ శనివారం ప్రారంభించారు. లకి‡్ష్యత కార్యక్రమాలన్నీ అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తిచేసేలా ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ఎన్డీయే ప్రభుత్వం మార్చిందని తెలిపారు.
దీని ద్వారా పనితీరు వేగం పుంజుకుందన్నారు. ఈశాన్య భారతం, ఇక్కడి ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరిగినపుడే దేశ ప్రగతి మరింత వేగం అందుకుంటుందని ప్రధాని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ (తూర్పుదేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల పెంపునకు ఉద్దేశించింది)కి ఈశాన్యరాష్ట్రాలే పట్టుగొమ్మని వెల్లడించారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమైన ‘అడ్వాంటేజ్ అస్సాం: ఆసియాన్‌కు భారత్ వేగవంతమైన మార్గం’ అనేది కేవలం ప్రకటనే కాదని.. భారత సమగ్ర దృష్టి అని పేర్కొన్నారు.
భారత్ వైపు ప్రపంచం చూపు!
‘కేంద్ర ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల వ్యాపారానుకూల విధానాలు సరళతరమయ్యాయి. ప్రపంచ ఆర్థిక ప్రగతికి కేంద్ర స్థానంగా దేశాలన్నీ భారత్‌వైపే చూస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ద్వారా 45–50 కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఆసుపత్రులు మరీ ముఖ్యంగా చైన్ ఆసుపత్రులు పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఉజ్వల పథకానికి కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకున్నామని.. 8 కోట్ల మంది పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని ప్రధాని తెలిపారు. వ్యాపారానుకూల నివేదికలోనూ భారత్ 100వ స్థానంలో నిలిచిందని.. ప్రపంచబ్యాంకు జాబితా, అంతర్జాతీయ పోటీ సూచీలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే భారత్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, పలువురు కేంద్రమంత్రులు, అస్సాం సీఎం శర్బానంద్ సోనోవాల్, 16 దేశాల రాయబారులు తదితరులు పాల్గొన్నారు. తొలిసారి అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్న అస్సాం.. తమ రాష్ట్రంలో విదేశీ, దేశీయ పెట్టుబడుదారులకు అవసరమైన వాతావరణం, వ్యూహాత్మక అనుకూలతలను సదస్సులో వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment