సంస్కరణలు వేగం పుంజుకుంటాయి: జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల వేగం రానున్న సంవత్సరాల్లో మరింత వేగం పుంజుకుంటుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఇది వృద్ధి వేగం పెరగడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా దోహదపడుతుందన్నారు. ప్రత్యేకించి మౌలిక రంగంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకురావడం కేంద్రం లక్ష్యమని వివరించారు.
దేశం ఇప్పుడు ఒక ప్రత్యేక సానుకూల దశలో ఉందని అన్నారు. యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ శాశ్వత కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించిన ఆర్థికమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం ప్రపంచంలో మనం రక్షణాత్మక విధానాల గురించి వింటున్నాం. అయితే ఇందుకు భిన్నంగా భారత్ వ్యవహరిస్తోంది. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా మన ఆర్థిక వ్యవస్థ తలుపులను విదేశీ పెట్టుబడులకు తెరచి ఉంచాం’’ అని అన్నారు.