ఆర్థిక సంస్కరణల్ని కొనసాగిస్తాం | PM Narendra Modi Launches Ro-Ro Ferry Service - 'Dream Project | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంస్కరణల్ని కొనసాగిస్తాం

Published Mon, Oct 23 2017 1:27 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

PM Narendra Modi Launches Ro-Ro Ferry Service - 'Dream Project  - Sakshi

వడోదర, దహేజ్‌: నోట్ల రద్దు, జీఎస్టీపై ప్రతిపక్షాల విమర్శల్ని తోసిపుచ్చుతూ కఠిన నిర్ణయాల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  ఆర్థిక సంస్కరణల దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కఠిన నిర్ణయాల అమలుతోనే దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కిందన్నారు. వర్తకులు జీఎస్టీ కింద నమోదు చేసుకుంటే వారి పాత లావాదేవీల జోలికి పోమని ఆయన హామీనిచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని మోదీ ఆదివారం సుడిగాలి పర్యటన జరిపారు.

సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లను జలమార్గంలో అనుసంధానించే ‘రోరో’ ఫెర్రీ సర్వీసులను(రోల్‌ ఆన్‌–రోల్‌ ఆఫ్‌) ప్రారంభించారు. అలాగే, భావ్‌నగర్, వడోదర జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా.. గుజరాత్‌ ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడంపై ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈసీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. ఈ నెలలో మోదీ గుజరాత్‌లో పర్యటించడం ఇది మూడోసారి.

ఉదయం గుజరాత్‌లోని సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ల్ని సముద్ర మార్గం ద్వారా అనుసంధానించే రోల్‌–ఆన్‌ రోల్‌–ఆఫ్‌ (రోరో) ఫెర్రీ సేవల్ని భరూచ్‌ జిల్లా ఘోఘా– భావ్‌నగర్‌ జిల్లా దహేజ్‌ మధ్య ప్రధాని ప్రారంభించారు. 100 మంది అంధ విద్యార్థులతో కలిసి ఘోఘా నుంచి దహేజ్‌ వరకూ ఫెర్రీలో ప్రధాని ప్రయాణించారు. మొదటి దశ ఫెర్రీ సేవల్ని కేవలం ప్రయాణికుల కోసమే ప్రారంభించారు. రెండు నెలల అనంతరం ప్రారంభమయ్యే రెండో దశలో కార్లు వంటి తేలికపాటి వాహనాల్ని కూడా తరలించవచ్చు.

ఈ ఫెర్రీ సేవలతో ఘోఘా–భరూచ్‌ల మధ్య రోడ్డు మార్గం ద్వారా ఉన్న దూరం 330 కి.మీ. కాగా, జలమార్గంలో అది కేవలం 30 కి.మీ. మాత్రమే. అనంతరం దహేజ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఆర్థిక సంస్కరణల అమలు కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. అదే సమయంలో ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండేలా చర్యలు కొనసాగిస్తాం. సంస్కరణలు, కఠిన నిర్ణయాల అనంతరం.. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. ఇప్పుడు దేశం సరైన మార్గంలో ముందుకు పోతుంది’ అని మోదీ పేర్కొన్నారు. 

దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయన్న విషయాన్ని అనేకమంది ఆర్థిక వేత్తలు ఏకగ్రీవంగా అంగీకరించారని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధి దిగజారుతుందన్న ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ.. ‘ఇటీవల లెక్కల్ని పరిశీలిస్తే.. బొగ్గు, విద్యుత్, సహజ వాయువు, ఇతర వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు రూ. 30 వేల కోట్ల డాలర్ల నుంచి 40 వేల కోట్ల డాలర్లకు పెరిగాయి’ అని ప్రధాని వెల్లడించారు.

జీఎస్టీలో నమోదు చేసుకుంటున్న వర్తకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని చెప్పారు. ‘గత కొద్ది నెలల్లో 27 లక్షల మంది అదనంగా జీఎస్టీలో నమోదు చేయించుకున్నారు. పన్ను ఎగవేయాలని ఏ వ్యాపారవేత్తా కోరుకోవడం లేదు. పన్ను నిబంధనలు, వ్యవస్థ, పన్ను అధికారులతో పాటు రాజకీయ నాయకులు వారిని ఆ విధంగా పురికొల్పుతున్నారు’ అని చెప్పారు. జీఎస్టీలో చేరితే వారి గత ఖాతాల్ని వెలికితీస్తారనే ఆందోళన అవసరం లేదని హామీనిచ్చారు.   

నన్నేమీ అనలేక.. ఈసీపై విమర్శలు
‘దీపావళి త్వరాత మోదీ గుజరాత్‌కు ఎందుకు వస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళనగా ఉన్నాయి. నన్ను ఏమీ అనలేక ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. నేను వడోదర రాకూడదా?’ అని వడోదరలో జరిగిన సభలో మోదీ అన్నారు. కాంగ్రెస్‌ తీరును తప్పుపడుతూ.. ఇటీవల గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ గెలుపును ప్రస్తావించారు. ‘అప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాల కారణంగా జరిగిన రీకౌంటింగ్‌లో గెలుపొందినవారే.. ఇప్పుడు ఈసీని విమర్శిస్తున్నారు’ అన్నారు. వడోదరలో అభివృద్ధి పనుల్ని ప్రస్తావిస్తూ.. ‘వారు ఇంతకముందెప్పుడూ ఇలాంటి అభివృద్ధి పనుల్ని చూడలేదు. ఈ అభివృద్ధిని జీర్ణించుకోవడం వారికి కష్టంగా ఉంది’ అని పేర్కొన్నారు.

ఓడరేవులు కీలకం
కేంద్ర ప్రభుత్వం పీ ఫర్‌ పీ(పోరŠస్ట్‌ ఫర్‌ ప్రాస్పరిటీ) నినాదాన్ని చేపట్టిందని చెప్పారు. దేశాభివృద్ధికి అత్యాధునిక ఓడరేవులు ఎంతో అవసరం. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో నౌకాశ్రయాలు, ఓడరేవులు నిరాదరణకు గురయ్యాయి. వాటిని ఆధునీకరించేందుకు సాగరమాల పథకాన్ని ప్రారంభించాం’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలోని జలరవాణా మార్గాల ద్వారా సరకు రవాణా చేస్తే టన్నుకు 20 పైసలే పడుతుందని, అదే రైల్వేకు రూ.1, రోడ్డు మార్గంలో రూ. 1.50లు ఖర్చవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు అంతర్గత జల రవాణాకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చేముందు దేశంలో కేవలం ఆరు జల రవాణా మార్గాలు ఉండేవని, ఇప్పుడు 100 మార్గాల్ని గుర్తించామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement