రైల్వే మౌలిక వసతుల రంగంలో 100% ఎఫ్‌డీఐలు
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
‘కొలీజియం’ రద్దుపై భిన్నాభిప్రాయాలు!
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రక్షణ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హైస్పీడ్ రైళ్లు, సబర్బన్ కారిడార్లు, ప్రత్యేక రవాణ లైన్లు సహా రైల్వేల్లోని మౌలిక వసతుల రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో పై నిర్ణయాలు తీసుకున్నారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 49 శాతానికి పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సిఫారసులు చేసే కొలీజియం వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేముందు లోతైన చర్చ అవసరమని పలువురు సభ్యులు అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రక్షణ రంగ యంత్ర సామగ్రి తయారీలో ఉన్న జాయింట్ వెంచర్ కంపెనీల వ్యవహారాల్లో భారతీయ కంపెనీలకే నియంత్రణ ఉండాలన్న షరతుపై రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతానికి పెంచారు.ఎఫ్‌డీఐల పరిమితి పెంపు వల్ల దేశీయంగా ఉత్పత్తి పెరిగి, రక్షణ రంగ దిగుమతులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రతిపాదన వచ్చినా.. జాతీయ భద్రతకు ప్రమాదమని నాటి రక్షణమంత్రి ఆంటోనీ తిరస్కరించారు.రైల్వే రంగంలో ఎఫ్‌డీఐలకు పూర్తిస్థాయిలో అనుమతించడం వల్ల రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయడం, రైల్వేల ఆధునీకరణ వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
జువెనైల్ జస్టిస్ బోర్డ్‌కే అధికారం!
రేప్‌లాంటి అతి క్రూరమైన నేరాలకు పాల్పడిన 16 ఏళ్ల పైబడిన బాలల విచారణపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని జువెనైల్ జస్టిస్ బోర్డు(జేజేబీ)కు అప్పగించే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ బాలలను అబ్జర్వేషన్ హోంలకు పంపాలా? లేక సాధారణ న్యాయస్థానాల్లోనే విచారించాలా? అనే విషయాన్ని జేజేబీ నిర్ణయించాలని ఆ ప్రతిపాదించారు. జువెనైల్ జస్టిస్ చట్టంలో(జేజేఏ)సవరణలకు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుమతించడంతో దాన్ని బుధవారం నాటి కేబినెట్ భేటీలో చర్చకు పెట్టారు.రేప్‌లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన బాలలను జువెనైల్ జస్టిస్ చట్టం లేదా భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ).. ఏ చట్టం ప్రకారం విచారణ జరిపినప్పటికీ.. వారికి మరణశిక్ష కానీ, యావజ్జీవ శిక్ష కానీ విధించకూడదని బిల్లులో పొందుపర్చారు. పిల్ల ల దత్తత కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు.. మొదలైన ప్రతిపాదనలు ఆ బిల్లులో ఉన్నాయి.
రక్షణ రంగంలో 49% ఎఫ్‌డీఐలకు ఆమోదం
Published Thu, Aug 7 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement