The defense sector
-
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
భారత్, తజకిస్తాన్ ప్రతిన రక్షణ రంగంలో మరింత సహకారం.. పలు రంగాల్లో ఒప్పందాలు ఉగ్రవాద మూలాలున్న ప్రాంతానికి మన రెండు దేశాలు దగ్గర్లో ఉన్నాయన్న మోదీ దుషాంబె: ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్, తజకిస్తాన్ నిర్ణయించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమెమలి రెహ్మాన్ సోమవారం తజక్ రాజధాని దుషాంబెలో రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు సహా విస్తృత అంశాలపై చర్చలు జరిపారు. ప్రతిపాదిత ‘పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, తజకిస్తాన్ త్రైపాక్షిక వాణిజ్య, రవాణా ఒప్పందం’లో భారత్‌ను కూడా చేర్చే విషయంపైనా సంప్రదింపులు జరిపారు. అంతకుముందు వారిద్దరూ కలసి రవీంద్రనాథ్ టాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అన్యాపదేశంగా పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లను ఉద్దేశిస్తూ.. ఉగ్రవాద మూలాలు బలంగా ఉన్న ప్రాంతానికి భారత్, తజకిస్తాన్‌లు అత్యంత సమీపంలో ఉన్నాయని మోదీ వ్యాఖ్యానించారు. అఫ్ఘాన్‌తో తజకిస్తాన్ కూడా సరిహద్దును పంచుకుంటోంది. అఫ్ఘాన్‌లో శాంతియుత, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్న అక్కడి ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు భారత్, తజక్‌లు సహకరిస్తాయని మోదీ అన్నారు. వాణిజ్యాభివృద్ధికి రెండు దేశాల మధ్య మెరుగైన అనుసంధానత ఆవశ్యకమన్నారు. తజక్లో జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణంలో సహకరించాలని తజక్ అధ్యక్షుడు మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు సంస్కృతి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తజకిస్తాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా - తజక్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్‌ను మోదీ సందర్శించారు. అందులో భారతీయ వైద్యులు తజక్ సైనికులకు, పౌరులకు వైద్యసేవలందిస్తున్నారు. మోదీ, రెహ్మాన్‌ల చర్చల అనంతరం ఇరుదేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. అందులోని ముఖ్యాంశాలు.. ►{పపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రబలుతూ.. భారత్, తజకిస్తాన్లకు ముప్పుగా పరిణమించాయి. ►ఉగ్రవాదంపై పోరులో భాగంగా జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ప్రారంభించి, త్వరగా అధికారస్థాయి చర్చలు మొదలుపెట్టాలి. ►రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. ►తజకిస్తాన్‌లో భారత్ ద్వారా టెలీ మెడిసిన్ ప్రాజెక్టు రూపకల్పన, అమలు. పరస్పర వ్యవ‘సాయం’: వ్యవసాయంలో పరస్పర సహకారానికి సంబంధించి ఏర్పాటు చేసిన సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. సాగు అనుభవాల్ని, శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రజ్ఞులను, సమర్థ జల వినియోగ పద్ధతులను.. పంచుకోవడం ద్వారా ఈ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలన్నారు. 17వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి అబ్దుల్ ఖాదిర్ బెదిల్ సమాధి ‘బాఘ్ ఇ బెదిల్’ సూక్ష్మ చిత్రాన్ని మోదీ తజక్ అధ్యక్షుడికి బహూకరించారు. 1644లో భారత్‌లోని పాట్నాలో జన్మించిన బెదిల్ను తజకిస్తాన్‌లో గొప్ప పర్షియన్ కవిగా పరిగణిస్తారు. ఆరు దేశాల్లో 8 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని మోదీ సోమవారం రాత్రి స్వదేశానికి బయల్దేరారు. -
రక్షణ దిగుమతులకు స్వస్తి చెబుదాం
ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రధాని మోదీ భారత్ అతిపెద్ద దిగుమతిదారు అనే పేరు పోవాలి ఇక్కడ ఉత్పత్తిచేసేందుకు విదేశీ కంపెనీలు ముందుకురావాలి బెంగళూరు: రక్షణ రంగంలో దిగుమతులకు స్వస్తి పలికాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ రంగంలో తమ ప్రభుత్వం స్వయంవృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతం సైనిక పరికరాలను దేశంలోనే తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. విదేశీ కంపెనీలు కేవలం పరికరాలు అమ్మేందుకే పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వాములుగా మారాలని, భారత్‌లో తయారీకి ముందుకు రావాలని సూచించారు. బుధవారం బెంగళూరులో 10వ ఏరో ఇండియా ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘రక్షణ పరికరాల దిగుమతుల్లో భారత్ నంబర్ వన్ అన్న పేరు చెరిగిపోవాలి. అందుకు వచ్చే ఐదేళ్లలో 70 శాతం పరికరాలు దేశీయంగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతున్నాం. ఇది సాకారమైతే 1.20 లక్షల నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించవచ్చు. రక్షణ రం గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాం. అవసరమైతే దీన్ని ఇంకా పెంచుతాం’’ అని చెప్పారు. పరిశోధన, అభివృద్ధి విభాగాలకు పెద్దపీట క్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీటవేస్తోందని మోదీ తెలిపారు. రక్షణ వస్తువుల అభివృద్ధికి సంబంధించి ‘ప్రోటోటైప్’ తయారీకి అవసరమైన నిధుల్లో 80 శాతం వరకు ప్రభుత్వమే అందించేలా నూతన పథకాన్ని త్వరలో అమలు చేయనున్నామన్నారు. కొత్తగా ‘సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ విధానంతో విదేశీ కంపెనీలు మన దేశంలో వస్తు ఉత్పత్తికి ఆసక్తి కనబరుస్తున్నాయని మోదీ తెలిపారు. ఆకట్టుకున్న ప్రదర్శన: ‘ఏరో ఇండియా-2015’లో దేశ, విదేశాలకు చెందిన దాదాపు 650 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ నెల 22 వరకు సాగే ప్రదర్శనలో కోట్లాది రూపాయల విలువ చేసే వ్యాపార ఒప్పందాలు ఉంటాయని కేంద్రం భావిస్తోంది. వివిధ దేశాల అత్యాధునిక విమానాల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ధ్రువ్, రుద్ర హెలికాప్టర్ల పనితీరును అడిగి తెలుసుకునేందుకు విదేశీ ప్రతినిధులు ఆసక్తి చూపారు. -
సమూహ ఏరోస్పేస్‌కు ప్రైవేట్ ఈక్విటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష పరిశోధన, పరికరాల తయారీలో దేశ, విదేశీ అవకాశాలను అందుకోవడానికి సమూహ ఏరోస్పేస్ పార్క్ సిద్ధమవుతోంది. పార్కులో ప్లాంట్ల నిర్మాణానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఆరు కంపెనీలు కలసి ఆదిభట్ల వద్ద 200 ఎకరాల్లో సమూహను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పార్క్‌లో 25 కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నాయి. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 26 నుంచి 49 శాతానికి చేర్చడం, మేక్ ఇన్ ఇండియా విధానం, పెండింగు ప్రాజెక్టులకు అనుమతుల వంటి ప్రభుత్వ నిర్ణయాలతో పరిశ్రమ ఉన్నత శిఖరాలకు చేరుతుందని సమూహ డెరైక్టర్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ తెలిపారు. ఏరోస్పేస్‌కు ప్రత్యేక పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకు రానుండడం హైదరాబాద్ కంపెనీలకు బూస్ట్‌నిస్తుందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయనింకా ఏమన్నారంటే.. పెట్టుబడికి పీఈ కంపెనీలు.. తయారీ కంపెనీలకు రక్షణ, అంతరిక్ష రంగంలో వెల్లువలా వ్యాపార అవకాశాలున్నాయి. ప్రైవేటు ఈక్విటీ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడికి ముందుకొస్తున్నాయి. జనవరిలోగా సమూహ పార్కులో కంపెనీలు ప్లాంట్ల ఏర్పాటు పనులను ప్రారంభించనున్నాయి. 2016కల్లా ఈ కంపెనీలకు రూ.350 కోట్ల దాకా పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా. ఈ అంశమై పీఈ కంపెనీలతో సమూహ చర్చలు జరుపుతోంది. తొలి దశలో రూ.25 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. ఆర్డర్లు పెరిగేకొద్దీ ఈ మొత్తం పెరుగుతుంది. రూ.100 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. స్టార్టప్‌లకు ఈ సెంటర్ వెన్నుదన్నుగా నిలుస్తుంది. అలాగే నిపుణులను తయారు చేసేందుకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో.. దేశంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలతో పోటీపడే కంపెనీలు 500 వరకు ఉంటాయి. వీటిలో 15 దాకా హైదరాబాద్‌లో ఉన్నాయి. ఎఫ్‌డీఐలతో విదేశీ పరిజ్ఞానం బదిలీ అయి ఇక్కడి కంపెనీల ప్రమాణాలు మెరుగవుతాయి. వేలాది ఉద్యోగాలను సృష్టించొచ్చు. పన్ను ప్రయోజనాలు ఉంటే ఇతర రాష్ట్రాలతో పోటీపడొచ్చు. ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు కనీసం ఏడాదైనా ప్రాక్టికల్స్ అవసరం. ఎస్ఈసీకి మరిన్ని ఆర్డర్లు.. ఇండైజినైజేషన్ (దేశవాళీ) కార్యక్రమం ఎస్ఈసీకి కలిసి వచ్చింది. ప్రతిష్టాత్మక స్కార్పీన్ సబ్‌మెరైన్స్ (జలాంతర్గాములు) తయారీ కాంట్రాక్టును గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ మజ్‌గావ్‌ఢాక్ నుంచి ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్ కంపెనీ అనే దక్కించుకుంది. డీసీఎన్‌ఎస్‌కు 20 రకాల ప్రధాన విడిభాగాలు భారత్‌లో ఎస్ఈసీ మాత్రమే అందిస్తోంది. 2015కల్లా రూ.350 కోట్ల విలువైన డీసీఎన్ఎస్ నుంచి అందిన తొలి ఆర్డరును పూర్తి చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వజూపుతున్న రూ.50 వేల కోట్ల విలువైన ఆరు జలాంతర్గాముల ఆర్డరును తిరిగి మజ్‌గావ్‌ఢాక్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇదేగనక జరిగితే ఎస్ఈసీకి కలిసి వస్తుంది. -
జవాన్ల కుమార్తెలకు రెండు శాతం సీట్లు
ముంబై: రక్షణ రంగంలో పనిచేస్తున్న జవాన్ల కుమార్తెల కోసం తమ విద్యాసంస్థల్లో రెండు శాతం సీట్లు కేటాయించినట్లు రాష్ట్రంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ప్రవరా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ ట్రస్ట్ చైర్మన్ అశోక్ విఖే పాటిల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మన దేశ రక్షణకు అహర్నిశలు కృషిచేస్తున్న జవాన్లకు కృతజ్ఞతాభావంగా తమ విద్యాసంస్థల్లో రెండు శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. తన తండ్రి, పార్లమెంట్ డిఫెన్స్ కమిటీకి ఐదేళ్లపాటు చైర్మన్‌గా పనిచేసిన మాజీ కేంద్ర మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల స్థాయినుంచి ప్రొఫషనల్ కోర్సుల వరకు సుమారు 125 సంస్థలు నడుస్తున్నాయని, వాటిలో సుమారు 40 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అశోక్ తెలిపారు. కాగా, మాజీ ఎయిర్‌చీఫ్ పీవీ నాయక్ ఆధ్వర్యంలో ఆర్మీకి సంబంధించి అడ్మిషన్లు చేపడతామని తెలిపారు. తమ విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందిన బాలికలకు విద్యాభ్యాసానికి, హాస్టల్‌కు సంబంధించి ఎటువంటి రుసుం తీసుకోబోమని, అన్ని సౌకర్యాలు ఉచితంగా అందజేస్తామని స్పష్టం చేశారు. -
రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 49%కి పెంపు
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది. మిలిటరీ హార్డ్‌వేర్ అవసరాల్లో 70 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశీయ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం ఈ చర్య ఉద్దేశం. భారతీయుల యాజమాన్యం, అజమాయిషీలోని భారతీయ కంపెనీలు మాత్రమే 49 శాతంలోపు ఎఫ్‌డీఐకి అనుమతి కోరాలని కేంద్రం నిబంధన విధించింది. అంతకుమించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు రక్షణపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ అనుమతి పొందాల్సి ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు అందుబాటులోకి తెచ్చే ఇలాంటి ప్రతిపాదనలను కేసుల వారీగా కమిటీ పరిశీలిస్తుందని పారిశ్రామిక విధానం, అభివృద్ధి విభాగం (డీఐపీపీ) ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా పెంచిన ఎఫ్‌డీఐ పరిమితిలో ఎఫ్ఐఐలు, ఎఫ్‌పీఐలు, ఎన్నారైలు, ఫారిన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులన్నీ కలిసే ఉంటాయి. -
హడావుడి నిర్ణయం ఎందుకు?
రక్షణ, రైల్వేల్లో ఎఫ్డీఐపై నిలదీసిన విపక్షాలు రాజ్యసభలో చేతులు కలిపిన తృణమూల్, లెఫ్ట్ న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), వామపక్షాలు చేతులు కలిపాయి. ఇందుకు రాజ్యసభ వేదికైంది. రైల్వేల్లో వంద శాతం, రక్షణ రంగంలో 49 శాతం మేరకు ఎఫ్‌డీఐని అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ఉభయ పక్షాలు గురువారం రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీనిని హడావుడి నిర్ణయంగా ఆరోపించాయి. దేశప్రయోజనాలకు ఈ నిర్ణయం విఘాతం కలిగిస్తుందని హెచ్చరించాయి. సభ గురువారం సమావేశమవగానే టీఎంసీకి చెందిన డెరెక్ ఓబ్రెయిన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి దీనిపై తక్షణం చర్చించాలని పట్టుపట్టారు. అయితే ఈ అంశాన్ని తరువాత చేపడదామని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పారు. ఇదే సమయంలో సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి తమ వైరిపక్షమైన టీఎంసీ సభ్యునికి బాసటగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఓబ్రెయిన్ మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన అంశమని, సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ జరపనున్న అమెరికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. ఎఫ్‌డీఐ విషయంలో యూపీఏ సర్కారు 4వ గేరులో వెళితే.. ప్రస్తుత ప్రభుత్వం ఐదవ గేరులో దూసుకుపోతోందని విమర్శించారు. అన్ని సమస్యలకు ఎఫ్‌డీఐ ఒక్కటే పరిష్కారం కాదన్నారు. బీమా, రక్షణ, రైల్వేస్‌లోకి ఎఫ్‌డీఐని అనుమతించవద్దు... దేశాన్ని విక్రయించవద్దని కోరారు. రైల్వేలకు చెందిన ఆపరేషన్స్ విభాగంలోకి ఎఫ్‌డీఐని అనుమతించేది లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, రైల్వే మంత్రి పి.సదానందగౌడ గురువారం పార్లమెంటు వెలుపల మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. కేవలం మౌలిక సదుపాయాలు, ఇతరత్రా విభాగాల్లోకి మాత్రమే ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నట్టు విశదీకరించారు. -
రక్షణ రంగంలో 49% ఎఫ్‌డీఐలకు ఆమోదం
రైల్వే మౌలిక వసతుల రంగంలో 100% ఎఫ్‌డీఐలు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ‘కొలీజియం’ రద్దుపై భిన్నాభిప్రాయాలు! న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రక్షణ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హైస్పీడ్ రైళ్లు, సబర్బన్ కారిడార్లు, ప్రత్యేక రవాణ లైన్లు సహా రైల్వేల్లోని మౌలిక వసతుల రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో పై నిర్ణయాలు తీసుకున్నారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 49 శాతానికి పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సిఫారసులు చేసే కొలీజియం వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేముందు లోతైన చర్చ అవసరమని పలువురు సభ్యులు అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రక్షణ రంగ యంత్ర సామగ్రి తయారీలో ఉన్న జాయింట్ వెంచర్ కంపెనీల వ్యవహారాల్లో భారతీయ కంపెనీలకే నియంత్రణ ఉండాలన్న షరతుపై రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతానికి పెంచారు.ఎఫ్‌డీఐల పరిమితి పెంపు వల్ల దేశీయంగా ఉత్పత్తి పెరిగి, రక్షణ రంగ దిగుమతులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రతిపాదన వచ్చినా.. జాతీయ భద్రతకు ప్రమాదమని నాటి రక్షణమంత్రి ఆంటోనీ తిరస్కరించారు.రైల్వే రంగంలో ఎఫ్‌డీఐలకు పూర్తిస్థాయిలో అనుమతించడం వల్ల రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయడం, రైల్వేల ఆధునీకరణ వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జువెనైల్ జస్టిస్ బోర్డ్‌కే అధికారం! రేప్‌లాంటి అతి క్రూరమైన నేరాలకు పాల్పడిన 16 ఏళ్ల పైబడిన బాలల విచారణపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని జువెనైల్ జస్టిస్ బోర్డు(జేజేబీ)కు అప్పగించే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ బాలలను అబ్జర్వేషన్ హోంలకు పంపాలా? లేక సాధారణ న్యాయస్థానాల్లోనే విచారించాలా? అనే విషయాన్ని జేజేబీ నిర్ణయించాలని ఆ ప్రతిపాదించారు. జువెనైల్ జస్టిస్ చట్టంలో(జేజేఏ)సవరణలకు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుమతించడంతో దాన్ని బుధవారం నాటి కేబినెట్ భేటీలో చర్చకు పెట్టారు.రేప్‌లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన బాలలను జువెనైల్ జస్టిస్ చట్టం లేదా భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ).. ఏ చట్టం ప్రకారం విచారణ జరిపినప్పటికీ.. వారికి మరణశిక్ష కానీ, యావజ్జీవ శిక్ష కానీ విధించకూడదని బిల్లులో పొందుపర్చారు. పిల్ల ల దత్తత కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు.. మొదలైన ప్రతిపాదనలు ఆ బిల్లులో ఉన్నాయి.