రక్షణ దిగుమతులకు స్వస్తి చెబుదాం
ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రధాని మోదీ
భారత్ అతిపెద్ద దిగుమతిదారు అనే పేరు పోవాలి
ఇక్కడ ఉత్పత్తిచేసేందుకు విదేశీ కంపెనీలు ముందుకురావాలి
బెంగళూరు: రక్షణ రంగంలో దిగుమతులకు స్వస్తి పలికాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ రంగంలో తమ ప్రభుత్వం స్వయంవృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతం సైనిక పరికరాలను దేశంలోనే తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. విదేశీ కంపెనీలు కేవలం పరికరాలు అమ్మేందుకే పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వాములుగా మారాలని, భారత్‌లో తయారీకి ముందుకు రావాలని సూచించారు. బుధవారం బెంగళూరులో 10వ ఏరో ఇండియా ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘రక్షణ పరికరాల దిగుమతుల్లో భారత్ నంబర్ వన్ అన్న పేరు చెరిగిపోవాలి. అందుకు వచ్చే ఐదేళ్లలో 70 శాతం పరికరాలు దేశీయంగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతున్నాం. ఇది సాకారమైతే 1.20 లక్షల నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టించవచ్చు. రక్షణ రం గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాం. అవసరమైతే దీన్ని ఇంకా పెంచుతాం’’ అని చెప్పారు.
పరిశోధన, అభివృద్ధి విభాగాలకు పెద్దపీట
క్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీటవేస్తోందని మోదీ తెలిపారు. రక్షణ వస్తువుల అభివృద్ధికి సంబంధించి ‘ప్రోటోటైప్’ తయారీకి అవసరమైన నిధుల్లో 80 శాతం వరకు ప్రభుత్వమే అందించేలా నూతన పథకాన్ని త్వరలో అమలు చేయనున్నామన్నారు. కొత్తగా ‘సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ విధానంతో విదేశీ కంపెనీలు మన దేశంలో వస్తు ఉత్పత్తికి ఆసక్తి కనబరుస్తున్నాయని మోదీ తెలిపారు.
ఆకట్టుకున్న ప్రదర్శన: ‘ఏరో ఇండియా-2015’లో దేశ, విదేశాలకు చెందిన దాదాపు 650 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ నెల 22 వరకు సాగే ప్రదర్శనలో కోట్లాది రూపాయల విలువ చేసే వ్యాపార ఒప్పందాలు ఉంటాయని కేంద్రం భావిస్తోంది. వివిధ దేశాల అత్యాధునిక విమానాల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ధ్రువ్, రుద్ర హెలికాప్టర్ల పనితీరును అడిగి తెలుసుకునేందుకు విదేశీ ప్రతినిధులు ఆసక్తి చూపారు.