
న్యూఢిల్లీ: చైనా సహా పలు ఆసియా దేశాల నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమలను కాపాడేందుకు కేంద్రం కఠిన చర్య తీసుకుంది. వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ లు, అల్యూమినియం ఫాయిల్ సహా ఐదు ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. సాఫ్ట్ ఫెరైట్ కోర్స్, ట్రైక్లోరో ఇసోసైనారిక్ యాసిడ్, పాలీ వినిల్ క్లోరైడ్ పేస్ట్ రెజిన్‌పై యాంటీ డంపింగ్ సుంకాలు మోపింది.
చైనా సహా పలు దేశాలు సాధారణ ధరలకంటే చౌకగా ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి కుమ్మరిస్తున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక నోటఫికేషన్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీఐటీ) అండ్ కస్టమ్స్ (రెవెన్యూ విభాగం) జారీ చేసింది. సాఫ్ట్ ఫెరైట్ కోర్స్, వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ , ట్రిక్లోరో ఇసోసైనారిక్ యాసిడ్‌పై ఐదేళ్లపాటు యాంటీ డంపింగ్ సుంకాలు అమలవుతాయని పేర్కొంది.
ఐదేళ్ల పాటు అమల్లో..: ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జర్లు, టెలికం పరికరాల్లో సాఫ్ట్ ఫెరైట్ కోర్స్‌ను వినియోగిస్తుంటారు. వీటిపై 35 శాతం అదనపు సుంకాన్ని సీబీఐటీ కస్టమ్స్ విధించింది. వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ లపై టన్నుకు 1,732 డాలర్ల యాంటీ డంపింగ్ సుంకం అమలు కానుంది. పాలీ వినిల్ క్లోరైడ్ పేస్ట్ రెజిన్‌పై టన్నుకు 89 డాలర్ల నుంచి 707 డాలర్ల మధ్య చైనా, దక్షిణ కొరియా, మలేషియా, నార్వే, తైవాన్, థాయిలాండ్ నుంచి వచ్చే దిగుమతులకు ఐదేళ్లపాటు వర్తిస్తుంది.