న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనా నుంచి దిగుమతయ్యే ఐదు వస్తువులపై ఐదేళ్లపాటు అమలయ్యేలా యాంటీడంపింగ్ డ్యూటీకి తెరతీసింది. వీటిలో గ్లాస్ మిర్రర్, సెల్‌ఫోన్ ట్రాన్స్‌పరెంట్ ఫిల్మ్ తదితరాలున్నాయి. తద్వారా పొరుగు దేశం నుంచి భారీగా దిగుమవుతున్న వస్తువులకు చెక్ పెట్టింది. దీంతో చౌక దిగుమతుల నుంచి దేశీ తయారీదారులకు రక్షణ లభించనుంది.
యాంటీడంపింగ్ డ్యూటీ విధించిన చైనా వస్తువుల జాబితాలో ఐసోప్రొపిల్ ఆల్కహాల్, సల్ఫర్ బ్లాక్, సెల్‌ఫోల్ ట్రాన్స్‌పరెంట్ ఫిల్మ్, థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్, అన్‌ఫ్రేమ్‌డ్ గ్లాస్ మిర్రర్ చేరాయి. సాధారణ ధరలకంటే తక్కువ ధరల్లో ఈ వస్తువులు చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. రెవెన్యూ శాఖ, పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ విడిగా జారీ చేసిన ఐదు నోటిఫికేషన్ల ద్వారా డ్యూటీలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
మెడికల్, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఐసోప్రొపిల్ ఆల్కహాల్‌పై టన్నుకి 82 డాలర్ల నుంచి 217 డాలర్ల మధ్య వివిధ కంపెనీలపై సుంకాన్ని విధించింది. చర్మంపై యాంటీసెప్టిక్, హ్యాండ్ శానిటైజర్‌గానూ ఈ ప్రొడక్ట్ వినియోగమవుతోంది. టెక్స్‌టైల్ డయింగ్, పేపర్, లెదర్ తయారీలో వినియోగించే సల్ఫర్‌బ్లాక్‌పై టన్నుకి 389 డాలర్ల సుంకాన్ని ప్రకటించింది.
ఇదీ చదవండి: డాలర్లు దండిగా.. కొరతలోనూ చింత లేని బంగ్లాదేశ్!
ఈ బాటలో ఆటోమోటివ్, మెడికల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో వినియోగించే థెర్మోప్లాస్టిక్ పాలీయురెథేన్‌పై కేజీకి 0.93 డాలర్ల నుంచి 1.58 డాలర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్‌గా వినియోగించే సెల్‌ఫోన్ ట్రాన్స్‌పరెంట్ ఫిల్మ్‌పై కేజీకి 1.34 డాలర్లు చొప్పున డ్యూటీ విధించింది. అన్‌ఫ్రేమ్‌డ్ గ్లాస్ మిర్రర్‌లపై టన్నుకి 234 డాలర్ల యాంటీడంపింగ్ సుంకాన్ని ప్రకటించింది. వాణిజ్య శాఖ పరిశోధన విభాగం డీజీటీఆర్ సూచనలమేరకు ప్రభుత్వం తాజా చర్యలను చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment