
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చీరాగానే కార్యనిర్వాహక ఉత్తర్వులను(ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) జారీ చేసి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆందోళనలను రేకిత్తించారు. అనుకున్న విధంగానే ప్రమాణ స్వీకారం తర్వాత వరుసగా వివిధ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి చేసే దిగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఈయూ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించేందుకు తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్ల దిగుమతులపై ప్రత్యేక దృష్టి సారించి సుంకాలు విస్తృతంగా వర్తిస్తాయని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య లోటును ప్రధాన సమస్యగా పేర్కొంటూ ఈయూ అమెరికాను వినియోగించుకుంటుందని తెలిపారు.
సుంకాలు తొలిసారి కాదు..
ట్రంప్ సుంకాలతో ఈయూను టార్గెట్ చేయడం ఇదేం తొలిసారి కాదు. తన మొదటి పదవీకాలంలో యూరప్ చేసుకున్న ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై సుంకాలు విధించారు. ప్రస్తుతం ‘అమెరికా ఫస్ట్’ అనే విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో యూరప్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఈయూతో అమెరికాకు ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యాల కంటే ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఎఫ్‌సీఐ చూపు.. రుణాల వైపు
ఆర్థిక ప్రభావాలు
ప్రతిపాదిత సుంకాలు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అధిక టారిఫ్‌ల వల్ల స్థానికంగా యూఎస్‌లో తయారీ పరిశ్రమను పరుగులు పెట్టించే అవకాశం ఉంటుంది. లేదంటే తప్పకుండా వినియోగదారులు అవే వస్తువులు వాడాలనుకుంటే మాత్రం ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇలా ఉత్పత్తులపై పెరిగే ఖర్చులు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త టారిఫ్‌లపై ‘గట్టిగా, వెంటనే’ ప్రతిస్పందిస్తామని యూరోపియన్ కమిషన్ హెచ్చరించింది. స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్ ట్రంప్ అభిప్రాయాన్ని తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment