హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు 2023–24 ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరానికి 3.09 శాతం తగ్గి 159.6 లక్షల టన్నులు నమోదయ్యాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెరగడం, అధికం అవుతున్న ధరలతో డిమాండ్ తగ్గడం ఈ క్షీణతకు కారణమని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) తెలిపింది.
ప్రపంచంలో అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్.. 2022–23 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ ఏడాదికి 164.7 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. విదేశాల నుంచి భారత్ కొనుగోలు చేసిన ఈ నూనెల విలువ 2022–23తో పోలిస్తే రూ.1,38,424 కోట్ల నుంచి 2023–24లో రూ.1,31,967 కోట్లకు పడిపోయింది. వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ ధరలు స్థిరపడ్డాయి. ఇది దేశీయ ధరల పెరుగుదలతో ప్రతిబింబించింది. అలాగే కొంత మేరకు దిగుమతులను తగ్గించింది’ అని అసోసియేషన్ తెలిపింది.
విభాగాల వారీగా ఇలా..
ముడి పామాయిల్ దిగుమతులు 75.88 లక్షల టన్నుల నుంచి 69.70 లక్షల టన్నులకు వచ్చి చేరాయి. ఆర్‌బీడీ పామోలిన్ 21.07 లక్షల టన్నుల నుంచి 19.31 లక్షల టన్నులకు క్షీణించింది. సోయాబీన్ నూనె 35.06 లక్షల టన్నుల నుంచి 34.41 లక్షల టన్నులు నమోదైంది. పొద్దుతిరుగుడు నూనె 30.01 లక్షల టన్నుల నుంచి 35.06 లక్షల టన్నులకు ఎగసింది. శుద్ధి చేసిన నూనెల వాటా అయిదేళ్లలో 3 నుంచి ఏకంగా 12 శాతానికి దూసుకెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment