న్యూఢిల్లీ: ఇటీవల దిగుమతి సుంకాలు పెంచినప్పటికీ రిటైల్ ధరలను (ఎంఆర్‌పీ) పెంచొద్దంటూ వంటనూనెల కంపెనీలకు కేంద్ర ఆహార శాఖ సూచించింది. తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న ఆయిల్స్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఇలా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు 30 లక్షల టన్నుల మేర ఉంటాయని, అవి 45–50 రోజులకు సరిపోతాయని వివరించింది.
సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ (ఎస్‌ఈఏ), ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) తదితర సంస్థల ప్రతినిధులతో ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా భేటీ అనంతరం ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో ఈ విషయాలు పేర్కొంది.
దేశీయంగా నూనెగింజల ధరలకు మద్దతు కల్పించే దిశగా కేంద్రం గత వారం వివిధ రకాల వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచింది. సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చిన ఆదేశాల ప్రకారం ముడి సోయాబీన్ ఆయిల్, ముడి పామాయిల్ మొదలైన వాటిపై డ్యూటీ సున్నా స్థాయి నుంచి 20 శాతానికి పెరిగింది. ఇతరత్రా అంశాలన్నీ కూడా కలిస్తే ముడి నూనెలపై ఇది 27.5 శాతంగా ఉంటుంది.
మరోవైపు, రిఫైన్డ్ పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మొదలైన వాటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి, నికరంగా 37.5 శాతానికి పెరిగింది. భారత్ పామాయిల్‌ను మలేషియా, ఇండొనేషియా నుంచి, సోయాబీన్ ఆయిల్‌ను బ్రెజిల్, అర్జెంటీనా నుంచి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment