
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విపణికి అనుగుణంగా వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ.8–12 తగ్గించాలని స్పష్టం చేసింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సహా పరిశ్రమ ప్రతినిధులతో ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాలను ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది.
తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ఇచ్చే ధర కూడా తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని వివరించింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ధర తగ్గింపు జరిగినప్పుడల్లా.. విక్రేతల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందడంతోపాటు మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి అని వెల్లడించింది.
భారతీయ వినియోగదారులు తినే నూనెల కోసం తక్కువ ఖర్చు చేయాలని ఆశిస్తారు. దిగొస్తున్న వంట నూనెల ధరలు ద్రవ్యోల్బణ భయాలను తగ్గించేందుకు సాయపడతాయి అని ఆహార మంత్రిత్వ శాఖ వివరించింది. అధిక తయారీ వ్యయం, రవాణా ఖర్చుతో సహా అనేక భౌగోళిక రాజకీయ కారణాలతో 2021–22లో అంతర్జాతీయ, దేశీయంగా తినే నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. 2022 జూన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment