Maximum Retail Price
-
సామాన్యులకు భారీ ఊరట..తగ్గనున్న వంట నూనె ధరలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విపణికి అనుగుణంగా వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ.8–12 తగ్గించాలని స్పష్టం చేసింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సహా పరిశ్రమ ప్రతినిధులతో ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాలను ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ఇచ్చే ధర కూడా తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని వివరించింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ధర తగ్గింపు జరిగినప్పుడల్లా.. విక్రేతల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందడంతోపాటు మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి అని వెల్లడించింది. భారతీయ వినియోగదారులు తినే నూనెల కోసం తక్కువ ఖర్చు చేయాలని ఆశిస్తారు. దిగొస్తున్న వంట నూనెల ధరలు ద్రవ్యోల్బణ భయాలను తగ్గించేందుకు సాయపడతాయి అని ఆహార మంత్రిత్వ శాఖ వివరించింది. అధిక తయారీ వ్యయం, రవాణా ఖర్చుతో సహా అనేక భౌగోళిక రాజకీయ కారణాలతో 2021–22లో అంతర్జాతీయ, దేశీయంగా తినే నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. 2022 జూన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. -
ఎం.ఆర్.పి అక్రమాలకు కళ్లెం
సంగారెడ్డి క్రైం: మాగ్జిమం రిటైల్ ప్రైస్ (ఎం.ఆర్.పి.) ధరల కంటే అధిక రేట్లకు మద్యం విక్రయించడం, ఒక బ్రాండ్‌కు బదులు మరోటి ఇవ్వడం.. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై యజమానులు దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి అక్రమాలను నియంత్రించడానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పూనుకుంది. ఆన్‌లైన్‌తో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో జరిగే అవకతవకలకు కళ్లెం వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని మద్యం దుకాణాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా లిక్కర్ ప్రైస్ తెలంగాణ యాప్‌ను రూపొందించారు. దాని ద్వారా మద్యం అధిక ధరలను నియంత్రించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడాన్ని అరికట్టనుంది. గతంలో మద్యం దుకాణాల నిర్వాహకులు అధికారికంగా కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి మిగిలిన మద్యాన్ని దొడ్డిదారిన తెచ్చుకొని కల్తీ చేసి అంటగట్టి లాభాలు ఆర్జించిన సంఘటనలు కోకొల్లలు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖపై వచ్చిన విమర్శల దృష్ట్యా ఆ శాఖ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. మద్యం ధరలను ఎమ్మార్పీకే విక్రయించేలా చూడడంతోపాటు దుకాణాదారులు దొడ్డిదారిన తెచ్చుకునే సరుకును సైతం అడ్డుకునేందుకు యాప్ విడుదల చేసింది. యాప్‌ను ఉపయోగించే విధానం రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ప్రైస్ తెలంగాణ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం విక్రయించే 800 పైచిలుకు మద్యం బ్రాండ్ల ధరలను సైజులవారీగా కచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎమ్మార్పీ విషయంలో ఏదైనా దుకాణ యాజమాన్యం నిబంధనలు అతిక్రమిస్తే యాప్ నుంచే ఫిర్యాదు చేయడానికి వీలుంది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత ఫోన్ నంబర్‌తో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనంతరం సైజ్ లేక ప్రైస్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు కావాలి్సన బ్రాండ్‌ను నమోదు చేసుకోమని అడుగుతుంది. అనంతరం మీరు ఎంటర్ చేసిన బ్రాండ్ లభించే పరిమాణం, ఎమ్మార్పీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫిర్యాదులు ఇలా చేసుకోవచ్చు.. దుకాణ యజమానులు ఎంత ధరకు మద్యాన్ని అమ్మారో, దుకాణం పేరు, అడ్రస్, ఫిర్యాదుదారుడి పేరు, మొబైల్ నంబర్, సంబంధిత దుకాణం ఫొటో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన అనంతరం కొన్ని వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. దుకాణాల వద్ద అపరిశుభ్రత, పరిసరాలు తదితర విషయాలు, కల్తీ, దుకాణ సిబ్బంది దురుసు ప్రవర్తన, అర్ధరాత్రి అమ్మకాలు సాగించినా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం మద్యం దుకాణాల్లో అధిక ధరలను నియంత్రించడానికి, యాజమాన్యాలు, వినియోగదారుల మధ్య ప్రవర్తనలో మార్పులకు సీసీ కెమెరాల ఏర్పాటు దోహదం చేస్తుంది. ఇప్పటికే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఎమ్మార్పీ ధరలకన్నా అధిక రేట్లకు అమ్మకుండా చర్యలు తీసుకున్నాం. అక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు అన్ని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లపై నిఘా పెట్టాం. – ఏబీకే శాస్త్రి, ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ వాట్సప్ ద్వారా.. మద్యం ధరల్లో తేడా వస్తే వినియోగదారులు వైన్ షాపు యజమానులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుదారులు వాట్సాప్ నంబర్ 7989911122 ద్వారా కానీ టోల్ ఫ్రీ నంబర్ 1800–4252–523 ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్‌కు ఒక సంఖ్య వస్తుంది. కేటాయించిన నంబర్ ఆధారంగా చర్యలు తీసుకున్న వివరాలను ఎక్సైజ్ శాఖ తెలియజేస్తుంది. ఉమ్మడి జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉమ్మడి జిల్లా పరిధిలో 191 మద్యం దుకాణాలు, 29బార్ అండ్ రెస్టారెంట్లలో ఒక్కో దుకాణం వద్ద కనీసం రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కనీసం 440 సీసీ కెమెరాల నిఘాలోకి మద్యం దుకాణాల క్రయ, విక్రయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు వచ్చాయి. సీసీ కెమెరాల ఏర్పా టు వల్ల ఎలాంటి గొడవలు జరిగినా తెలిసిపోయే అవకాశముంది. -
ఎమ్మార్పీకి మించితే రూ.5 లక్షల జరిమానా
మద్యం సిండికేట్ల వ్యవహారమంతా గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) చుట్టూ తిరుగుతుంటుంది. మద్యం వ్యాపారులంతా కూటమి కట్టి మద్యం ధరలు పెంచి అమ్మడం సర్వసాధారణం. ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు మద్యం వ్యాపారులపై ఎమ్మార్పీ ఉల్లంఘన కేసు నమోదు చేస్తే రూ.5 లక్షల అపరాధ రుసుం (కాంపౌండింగ్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న రూ.లక్ష వరకు ఉన్న ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ఇటీవలే జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముసాయిదా బిల్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే చట్టం చేసేందుకు ఏపీ శాసనసభ ఆమోదించాలి. దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మద్యం వ్యాపారులకు విధించే అపరాధ రుసుం ఐదు రెట్లు కట్టాల్సి ఉంటుంది. -
‘చుక్క’ల్లో ధర
కాకినాడ క్రైం : మద్యం వ్యాపారుల దోపిడీ మళ్లీ మొదలైంది. నూతనంగా షాపులకు లెసైన్స్‌లు పొంది రెండు వారాలు గడవకుండానే మాక్సిమమ్ రిటైల్ ప్రైస్ (ఎమ్మార్పీ)కి మంగళం పాడారు. దీంతో మందుబాబుల జేబులు గుల్లవుతున్నాయి. క్వార్టర్ బాటిల్‌పై రూ. పది నుంచి రూ. 20 వరకూ అధిక ధర వసూలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించుకునేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ అధికారులే మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం. జిల్లాలో గతంలో 555 మద్యం షాపులుండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం డివిజన్లోని మరో ఏడు షాపులు నూతనంగా కలిశాయి. దీంతో 562 మద్యం షాపులకు నూతనంగా లెసైన్స్‌లు మంజూరు చేసేందుకు గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించారు. జూన్ 28వ తేదీకి గడువు ముగిసేనాటికి మొదటి దఫా 401 షాపులకు మాత్రమే వ్యాపారులు దరఖాస్తులు చేసుకోగా మిగిలిన వాటికి జూలై ఏడవ తేదీ గడువుగా రెండోసారి దరఖాస్తులు ఆహ్వానించారు. అయినప్పటికీ వ్యాపారుల నుంచి సరైన స్పందన లేదు. రెండోసారి కేవలం 34 షాపులకు మాత్రమే దరఖాస్తులు అందడంతో ఇంకా జిల్లాలో 127 మద్యం షాపులు మిగిలిపోయాయి. వీటికి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మందుబాబులు మిగిలిన షాపుల్లో మద్యం కొనుగోలు చేసి సేవిస్తున్నప్పటికీ వ్యాపారులు మాత్రం నష్టాలు చవిచూస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు. అయితే నెలరోజులు కూడా గడవకుండానే నష్టాలేమిటని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మద్యం షాపులు తీసుకున్న వారికే ఈ దఫా కూడా లెసైన్స్‌లు దక్కడంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పాటై అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వారంటున్నారు. యథావిధిగా బెల్టుషాపులు జిల్లాలో బెల్టుషాపులు మాత్రం యథావిధిగానే కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్టుషాపులను తొలగించేందుకు ఉత్తర్వులు జారీచేస్తారని తొలుత ప్రచారం జరిగింది. దీంతో వ్యాపారులు షాపులు దక్కించుకునేందుకు కూడా వెనుకడుగు వేశారు. మద్యం షాపులు రాత్రి పూట మూసివేసినప్పటికీ బెల్టుషాపుల్లో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటుంది. బెల్టుషాపుల్లోనే దాదాపు 60 శాతం మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. జిల్లాలో సుమారు 4,000లకు పైబడి బెల్టుషాపులున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మద్యం షాపుల యజమానులు వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఒక్కో షాపు పరిధిలో సుమారు పదికి పైగా బెల్టుషాపులను ఏర్పాటు చేసుకుని 24 గంటలూ మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రధాన షాపులో రూ. పది మాత్రమే అదనపు ధర వసూలు చేస్తుండగా బెల్టుషాపుల్లో రూ. 20కి పైబడి అధిక ధర వసూలు చేస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. లూజు విక్రయాల నేపథ్యంలో చీప్ లిక్కర్, నకిలీ మద్యం కూడా విక్రయిస్తున్నారంటున్నారు. మామూళ్ల ‘మత్తు’లో అధికార గణం అధికారులు మామూళ్ల ‘మత్తు’లో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనాభా విస్తీర్ణాన్ని బట్టి మద్యం షాపుల్లో రోజుకు రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకూ మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఒక్కొక్క షాపులో సుమారు రూ. పదివేలకు పైబడి మందుబాబుల నుంచి దోపిడీ జరుగుతోంది. ఒక్కో మద్యం షాపు నుంచి రెన్యువల్ ఫీజుగా (అనధికారికం) సంవ త్సరానికి రూ. 50 వేలు ఇవ్వాలని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో షాపు నుంచి ఎక్సైజ్, పోలీసు అధికారులు, సిబ్బందికి నెలకు సరాసరి రూ. 44 వేలుపైబడి ముడుపులు చెల్లించాలంటున్నారు. షాపు అద్దెలు, సిబ్బంది జీతభత్యాలు ఇలా చూసుకుంటే తాము నష్టపోతున్నామని, అందుకే అధిక ధరకు విక్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల క్రితం నుంచే ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తుండగా శనివారం నుంచి మిగిలిన షాపులలో కూడా అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి.