సంగారెడ్డి క్రైం: మాగ్జిమం రిటైల్ ప్రైస్ (ఎం.ఆర్.పి.) ధరల కంటే అధిక రేట్లకు మద్యం విక్రయించడం, ఒక బ్రాండ్‌కు బదులు మరోటి ఇవ్వడం.. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై యజమానులు దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి అక్రమాలను నియంత్రించడానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పూనుకుంది. ఆన్‌లైన్‌తో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో జరిగే అవకతవకలకు కళ్లెం వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని మద్యం దుకాణాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా లిక్కర్ ప్రైస్ తెలంగాణ యాప్‌ను రూపొందించారు.
దాని ద్వారా మద్యం అధిక ధరలను నియంత్రించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడాన్ని అరికట్టనుంది. గతంలో మద్యం దుకాణాల నిర్వాహకులు అధికారికంగా కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి మిగిలిన మద్యాన్ని దొడ్డిదారిన తెచ్చుకొని కల్తీ చేసి అంటగట్టి లాభాలు ఆర్జించిన సంఘటనలు కోకొల్లలు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖపై వచ్చిన విమర్శల దృష్ట్యా ఆ శాఖ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. మద్యం ధరలను ఎమ్మార్పీకే విక్రయించేలా చూడడంతోపాటు దుకాణాదారులు దొడ్డిదారిన తెచ్చుకునే సరుకును సైతం అడ్డుకునేందుకు యాప్ విడుదల చేసింది.
యాప్‌ను ఉపయోగించే విధానం
రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ప్రైస్ తెలంగాణ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం విక్రయించే 800 పైచిలుకు మద్యం బ్రాండ్ల ధరలను సైజులవారీగా కచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎమ్మార్పీ విషయంలో ఏదైనా దుకాణ యాజమాన్యం నిబంధనలు అతిక్రమిస్తే యాప్ నుంచే ఫిర్యాదు చేయడానికి వీలుంది.
- యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత ఫోన్ నంబర్‌తో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ అనంతరం సైజ్ లేక ప్రైస్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు కావాలి్సన బ్రాండ్‌ను నమోదు చేసుకోమని అడుగుతుంది.
- అనంతరం మీరు ఎంటర్ చేసిన బ్రాండ్ లభించే పరిమాణం, ఎమ్మార్పీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఫిర్యాదులు ఇలా చేసుకోవచ్చు..
- దుకాణ యజమానులు ఎంత ధరకు మద్యాన్ని అమ్మారో, దుకాణం పేరు, అడ్రస్, ఫిర్యాదుదారుడి పేరు, మొబైల్ నంబర్, సంబంధిత దుకాణం ఫొటో అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేయాలి.
- ఫిర్యాదు ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన అనంతరం కొన్ని వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది.
- దుకాణాల వద్ద అపరిశుభ్రత, పరిసరాలు తదితర విషయాలు, కల్తీ, దుకాణ సిబ్బంది దురుసు ప్రవర్తన, అర్ధరాత్రి అమ్మకాలు సాగించినా ఫిర్యాదు చేయవచ్చు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం
మద్యం దుకాణాల్లో అధిక ధరలను నియంత్రించడానికి, యాజమాన్యాలు, వినియోగదారుల మధ్య ప్రవర్తనలో మార్పులకు సీసీ కెమెరాల ఏర్పాటు దోహదం చేస్తుంది. ఇప్పటికే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఎమ్మార్పీ ధరలకన్నా అధిక రేట్లకు అమ్మకుండా చర్యలు తీసుకున్నాం. అక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు అన్ని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లపై నిఘా పెట్టాం.
– ఏబీకే శాస్త్రి, ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్
వాట్సప్ ద్వారా..
మద్యం ధరల్లో తేడా వస్తే వినియోగదారులు వైన్ షాపు యజమానులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుదారులు వాట్సాప్ నంబర్ 7989911122 ద్వారా కానీ టోల్ ఫ్రీ నంబర్ 1800–4252–523 ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్‌కు ఒక సంఖ్య వస్తుంది. కేటాయించిన నంబర్ ఆధారంగా చర్యలు తీసుకున్న వివరాలను ఎక్సైజ్ శాఖ తెలియజేస్తుంది.
ఉమ్మడి జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు
ఉమ్మడి జిల్లా పరిధిలో 191 మద్యం దుకాణాలు, 29బార్ అండ్ రెస్టారెంట్లలో ఒక్కో దుకాణం వద్ద కనీసం రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కనీసం 440 సీసీ కెమెరాల నిఘాలోకి మద్యం దుకాణాల క్రయ, విక్రయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు వచ్చాయి. సీసీ కెమెరాల ఏర్పా టు వల్ల ఎలాంటి గొడవలు జరిగినా తెలిసిపోయే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment