నిజాలు దాచి.. ‘బెల్ట్‌’ ఫుటేజీ మాయం! | Laxmipuram belt shop Footage disappeared After Vemuri Kavery Travels bus accident | Sakshi
Sakshi News home page

నిజాలు దాచి.. ‘బెల్ట్‌’ ఫుటేజీ మాయం!

Oct 27 2025 5:13 AM | Updated on Oct 27 2025 8:26 AM

Laxmipuram belt shop Footage disappeared After Vemuri Kavery Travels bus accident

లక్ష్మీపురంలో బెల్ట్‌ షాపు ఇదే..

వేమూరి కావేరి బస్సు దుర్ఘటన అనంతరం లక్ష్మీపురంలో ‘దుకాణం’ మూత

మా గ్రామంలో 24 గంటలూ మందు అమ్ముతున్నారు

పేపర్‌లో ఫొటో రావడంతో 2 రోజులుగా మూసివేశారంటున్న గ్రామస్తులు

అక్కడ బెల్ట్‌ షాపుల్లేవ్‌.. ఆ బైకర్లు లైసెన్స్‌డ్‌ మద్యమే సేవించారంటూ సర్కారు ప్రకటనపై సర్వత్రా విస్మయం

ప్రాణాలు కబళిస్తున్న మద్యం మహమ్మారిని కట్టడి చేయాల్సింది పోయి బెల్ట్‌ షాపులు లేవంటూ ప్రభుత్వ ప్రకటనపై ఆగ్రహం

రోజూ ఉండే షాపు.. ఈ రోజులేదు 
లక్ష్మీపురం హైవేకు దగ్గరలో రోజూ ఉండే బెల్ట్‌ షాపు ఈ రోజు లేదు. పేపర్‌లో ఆ షాపు ఫొటో రావడంతో మూసేసి వెళ్లిపోయారు. బెల్ట్‌ షాపు తొలగించాలని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం బెల్ట్‌ షాపులను నిషేధించాలి. 
– రాకేష్‌, లక్ష్మీపురం

సాక్షి ప్రతినిధి కర్నూలు:  లక్ష్మీపురంతోపాటు ఎన్‌హెచ్‌ 44 సమీపంలోని దాబాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాం.. ఎక్కడా బెల్ట్‌షాపులు లేవ్‌..! తాజాగా ప్రభుత్వ ప్రకటన ఇదీ!!  మా గ్రామంలో 24 గంటలు మందు అమ్ముతున్నారు.. వైన్‌ షాపు లేకున్నా, నాలుగు బెల్ట్‌ షాపులు మాత్రం అందుబాటులో ఉన్నాయి!!  బెల్ట్‌ షాపుల ఎదుట నిలుచుని లక్ష్మీపురం వాసులు చెబుతున్న నిఖార్సైన నిజాలివీ!! 

కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం దుర్ఘటన కనివీని ఎరుగని పెను విషాదం. చిన్నారులు సైతం బుగ్గి కావడంపై దేశమంతా కన్నీరు పెట్టింది. మద్యం భూతమే ఈ విషాదానికి కారణ భూతమైంది. విచ్చలవిడిగా, వేళాపాళా లేకుండా దొరుకుతున్న మద్యమే 20 ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి ప్రధాన కారణం. అధికారులు సైతం దీన్ని ధ్రువీకరించారు. దీన్ని కప్పిపుచ్చుతూ... అది బెల్ట్‌ షాపు మద్యం కాదని, ప్రమాదానికి కారణమైన బైకర్లు లైసెన్స్‌డ్‌ మద్యమే సేవించారంటూ, అక్కడే కొనుగోలు చేశారంటూ ప్రభుత్వం నిస్సిగ్గుగా సమ­ర్థించుకోవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. 

పెద్దటేకూరు సమీపంలోని రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో రాత్రి 7 గంటలకు, 8.20 గంటలకు రెండు దఫాలు మద్యం కొనుగోలు చేశారని, ఆ ప్రాంతంలో బెల్ట్‌షాపులే లేవని ఎక్సైజ్‌ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే తమ ఊరిలో బెల్ట్‌ షాపులు ఉన్నాయని, గత రెండు రోజులుగా మాత్రమే మూసివేశారని లక్ష్మీపురం గ్రామస్తులే చెబుతున్నారు. దుర్ఘటన జరిగాక హడావుడిగా బెల్ట్‌ షాపులను మూసివేయడం, ఆ దుకాణాల ఎదుట సీసీ టీవీ ఫుటేజీని తొక్కిపెడుతుండటం పట్ల సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి.  
 
రెండు రోజులుగా బెల్ట్‌షాపు మూత.. మాయమైన సీసీ టీవీ ఫుటేజీ..! 
బైకర్లు శివశంకర్, ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు అర్ధరాత్రి వరకూ ఇద్దరూ మద్యం సేవిస్తూనే  ఉన్నారు. మూడోసారి పెద్దటేకూరు వైన్‌షాప్‌ వద్దకు వెళ్లే ఓపిక లేక లక్ష్మీపురంలోని బెల్ట్‌షాపులో  మద్యం కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం.. మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బైకర్లు బయలుదేరారని మీడియాలో రావడంతో అక్కడి బెల్ట్‌ షాపును శనివారం మూసేశారు. 

ఆదివారం కూడా దుకాణం తెరవలేదు! ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలో కొందరు అధికారులు లక్ష్మీపురం బెల్ట్‌షాపు వద్ద ఉన్న సీసీ ఫుటేజ్‌ని ఆగమేఘాలపై స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజులుగా బెల్ట్‌షాపు మూతపడటం,  సీసీటీవీ ఫుటేజీలను అధికారులు తీసుకెళ్లడంతో లక్ష్మీపురం బెల్ట్‌షాపులోనే వారు మద్యం కొనుగోలు చేశా­రనే అనుమానాలు బలపడుతున్నాయి. లక్ష్మీపురంలో తన తల్లిని చూసేందుకు ఎర్రిస్వామి వెళుతుంటాడు. మూడో దఫా లక్ష్మీపురం బెల్ట్‌షాపులో మద్యం సేవించారా? లేదా? అనేది విచారణలో పోలీసులు తేల్చాల్సి ఉంది. లక్ష్మీపురంలో బెల్ట్‌షాపు ఉందా? లేదా? అని పరిశీలించేందుకు వెళ్లిన ‘సాక్షి’తో పలువురు మాట్లాడారు.
పెట్రోల్‌ బంక్‌లో శివశంకర్‌ ఉన్న సీసీ ఫుటేజీ విడుదల చేసిన అధికారులు... లక్ష్మీపురంలో అతను మద్యం కొన్నాడని స్థానికులు చెబుతున్నా... అక్కడి సీసీ ఫుటేజీని బయటపెట్టలేరా?    

గుడి, బడి పక్కన బెల్ట్‌ షాపులు 
లక్ష్మీపురంలో హైవే, గుడి, బడి పక్కన బెల్ట్‌ షాపులున్నాయి. ఒకవైపు సీఎం బెల్ట్‌ షాపు పెడితే బెల్ట్‌ తీస్తానని చెబుతున్నారు. వాస్తవంగా అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. మద్యం తాగి బైక్‌ నడపడంతోనే రోడ్డు ప్రమాదం జరిగి 20 మంది 
చనిపోయారు.  
    – నారాయణరెడ్డి, లక్ష్మీపురం  

24 గంటలు మందు అమ్ముతున్నారు  
మా గ్రామంలో 24 గంటలూ మందు అమ్ముతున్నారు. వైన్‌ షాపు లేకున్నా నాలుగు బెల్ట్‌ షాపులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారు. రోడ్ల పక్కనే తాగుతుండడంతో రాకపోకల సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. చంద్రబాబునాయుడు ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చారు.  
    – రాజమోహన్‌రెడ్డి, లక్ష్మీపురం 

మా ఊరి బెల్ట్‌ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది  
మా గ్రామంలో ఉన్న బెల్ట్‌ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది. అర్ధరాత్రైనా, మధ్యరాత్రైనా, తెల్లవారుజామునైనా మందుకు కరువు ఉండదు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు.       
 – పేరిపోగు ప్రతాప్, లక్ష్మీపురం

ఎక్కడా తనిఖీలు చేయడం లేదు
మా ఊరు పరిధిలో నాలుగు బెల్ట్‌ షాపులు ఉన్నాయి. గతంలో ఎక్సైజ్‌ వాళ్లు కంట్రోల్‌ చేసేవాళ్లు. ఇప్పుడు అవేమి జరగడంలేదు. నేరుగా వైన్‌ షాపు వారే మద్యాన్ని తెచ్చి బెల్ట్‌ షాపులకు ఇచ్చిపోతున్నారు. ఎక్కడ తనిఖీలు చేయడంలేదు. అందుబాటులో  ఉండడంతో విచ్చల విడిగా మందు తాగుతున్నారు. బ్రిడ్జిలు, స్కూళ్లు, పార్కుల్లో తాగుతున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదు. 
– సత్యంరెడ్డి, గ్రామస్తుడు, లక్ష్మీపురం 



చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు 
లక్ష్మీపురంలో మద్యం అమ్మకాలు పబ్లిక్‌గా జరుగుతున్నాయి. ఏకంగా వైన్‌ షాపు వారే వచ్చి ఇళ్లలో అమ్మే వారికి బాటిళ్లు ఇచ్చిపోతున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదు. చిన్న పిల్లలు కూడా మద్యం తాగి పెడదారి పడుతున్నారు. 
–  నేసే శేఖర్, లక్ష్మీపురం  

ఈ రోజు తెరవలేదు...  
లక్ష్మీపురంలో నీళ్లకు ఇబ్బంది ఉంది కానీ మందుకు ఇబ్బంది లేదు. వైన్‌ షాపు లేకున్నా ఎప్పుడు చూసినా బెల్ట్‌ షాపులు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తం నాలుగు బెల్ట్‌ షాపులు ఉన్నాయి. ఈ రోజు ఒక్క షాపు కూడా తెరవలేదు.  
– తెలుగు సుంకన్న, లక్ష్మీపురం  

బెల్ట్‌ షాపులను నిర్మూలించాలి
మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బెల్ట్‌ షాపులను నిర్మూలించాలి. ప్రభుత్వం తరచూ తనిఖీ చేస్తే కట్టడి చేయవచ్చు. ఆ పని చేయడంలేదు. తాగిన మైకంలో ఎవరు ఏం  చేస్తున్నారో అర్థం కావడంలేదు. మందు తాగి బండి నడపడం వల్లే ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెల్ట్‌ షాపులపై పునరాలోచన చేయాలి. 
– దూడల తిరుపాలు, లక్ష్మీపురం 

అనర్థాలపై అవగాహన కల్పించాలి 
మద్యాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా కలిగే అనర్థాలపై అవగాహన కలి్పంచాలి. అదే సమయంలో బెల్ట్‌ షాపులను తొలగించాలి. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మందు తాగుతుంటే కాలం ఎటు పోతుందో అర్థం కావడంలేదు. 
 – మాసుంసాహెబ్, లక్ష్మీపురం 

మద్యం ఖాళీ సీసాలతో హంద్రీ కలుషితం
పబ్లిక్‌ ప్లేసుల్లో మందు తాగడాన్ని అరికట్టాలి. హైవే పక్కన, స్కూళ్ల సమీపంలో మందు తాగడంపై నిఘా వేసి ఉంచాలి. ఇళ్ల మధ్య కూడా రాత్రిళ్లు తాగుతు­న్నారు. హంద్రీనది మద్యం ఖాళీ సీసాలతో కలుషితం అవుతోంది.  
– చంద్రశేఖర్, లక్ష్మీపురం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement