డిస్కౌంట్‌ కావాలా..జీఎస్టీ తగ్గించాలా? | Medicines sold at old prices | Sakshi
Sakshi News home page

డిస్కౌంట్‌ కావాలా..జీఎస్టీ తగ్గించాలా?

Nov 2 2025 5:49 AM | Updated on Nov 2 2025 5:49 AM

Medicines sold at old prices

ఏది కావాలో తేల్చుకోమంటున్న మెడికల్‌ దుకాణాల వ్యాపారులు  

పాత ధరలకే మందుల అమ్మకాలు  

తగ్గించి విక్రయించని వైనం 

తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్న సామాన్య ప్రజలు  

తనిఖీలు చేయని అధికారులు

ఇలాంటి సంఘటనలు ఇటీవల నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత నెల 22వ తేదీ నుంచి పలు వస్తువులపై జీఎస్‌టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ ముమ్మరంగా అన్ని శాఖల అధికారులు ప్రచారం చేస్తూనేఉన్నారు. కానీ కొన్ని రకాల వస్తువుల ధరలు మాత్రం తగ్గడం లేదు. తమ వద్ద పాత స్టాక్‌ ఉందని, జీఎస్‌టీ తగ్గించి ఇచ్చి మేం నష్టపోవాలా అని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): ఉమ్మడి కర్నూలు జిల్లా­లో 3వేలకు పైగా రిటైల్, హోల్‌సేల్‌ మెడికల్‌షాపులు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజూ రూ.కోట్ల దాకా వ్యాపారం సాగుతోంది. అ­యి­తే ఈ దుకాణాల్లో అధిక శాతం ప్రజలకు జీఎస్‌టీ 2.0 సంస్కరణల ఫలాలు అందడం లేదు. గతంలో ఔషధాలు, శస్త్రచికిత్సల పరికరాలపై 12 శాతం, కొన్నింటిపై మాత్రమే 5శాతం జీఎస్‌టీ ఉండేది. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ సంస్కరణల్లో భాగంగా గత నెల 22వ తేది నుంచి మందులపై ఉన్న 12శాతం జీఎస్‌టీని 5 శాతానికి, క్యాన్సర్‌ సహా అరుదైన వ్యాధులకు వాడే 33 రకాల మందులపై జీఎస్‌టీని పూర్తిగా తొలగించింది. 

ఈ నూత­న ధరల ప్రయోజనాలను సెపె్టంబర్‌ 22వ తేదీ నుంచే ప్రజలకు అందించాలని జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ పేర్కొంది. కా­నీ మెజారిటీ దుకాణాల్లో ఈ తగ్గింపు ధరలు లభించడం లేదు. జీఎస్‌టీపై అధిక శాతం ప్రజలకు అవగాహన ఉన్న కర్నూలు నగరంలోనే నూతన సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఇక నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, ఎమ్మిగనూరు, కోడుమూరు వంటి ప్రాంతాల్లో అడిగినా జీఎస్‌టీ తగ్గించే నాథుడే కరువయ్యారు.  

అధికారులకు తగ్గించామని చెబుతూనే ! 
ఒకవైపు జీఎస్‌టీ 12 శాతం నుంచి 7 శాతంకు తగ్గించి మందులు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం అందించిన ఫలాలు ప్రజలకు చేరువ కావాలని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మేళాలు, ప్రచార జాతాలు, ర్యాలీలు నిర్వహించి అధికారులు అవగాహన కల్పించారు. కానీ వారి ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ఏ దుకాణంలోనూ జీఎస్‌టీ తగ్గించి ఇవ్వడం లేదు. ఎక్కడా పాత, కొత్త ధరల బోర్డులు ఏర్పాటు చేయలేదు. అడిగితే మా వద్ద పాత స్టాక్‌ ఉందని, కొత్త స్టాక్‌ ధరలు తగ్గించి వస్తే ఇస్తామని దుకాణదారులు చెబుతున్నారు. 

ఇప్పుడు మీకు(వినియోగదారులకు) 7శాతం తగ్గించి ఇస్తే తాము నష్టపోతామని వారు పేర్కొంటున్నారు. పాత నిల్వలైనా ప్రస్తుత తగ్గిన ధరల ప్రకారమే అమ్మాలని స్పష్టమైన ఆదేశాలు అధికారులు ఇచ్చినా అమలు కావడం లేదు. జీఎస్‌టీ అధికారులతో పాటు డ్రగ్‌ నియంత్రణ అధికారులు నిఘా పెంచి తరచూ తనిఖీలు చేస్తేనే జీఎస్‌టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందే వీలుంది.  

» కర్నూలు నగరానికి చెందిన విజయ్‌కుమార్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ మెడికల్‌షాపునకు వెళ్లి మందులు కొన్నాడు. ఇందుకు అతనికి రూ.1,200 బిల్లు అయ్యింది. డిస్కౌంట్‌ పోను రూ.1,080 ఇవ్వాలని షాపు అతను సూచించాడు. ‘ఇప్పుడు మందులపై కూడా 7 శాతం జీఎస్‌టీ తగ్గింది కదా తగ్గించరా’ అని దుకాణదారున్ని విజయ్‌కుమార్‌ ప్రశ్నించాడు. ‘మీకు ఇప్పటికే 10 శాతం డిస్కౌంట్‌ ఇచ్చాం కదా...జీఎస్‌టీ కావాలంటే ఆ డిస్కౌంట్‌ ఉండదు’అని చెప్పాడు. దీంతో డిస్కౌంట్‌తోనే సరిపెట్టుకుని విజయకుమార్‌ వెళ్లిపోయాడు.

» కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనికి చెందిన మాధవరెడ్డి స్థానికంగా ఉన్న ఓ మెడికల్‌షాపులో మందులు కొన్నాడు. ఈ మేరకు రూ.3,600 బిల్లు అయ్యింది. డిస్కౌంట్‌ పోను రూ.3,140 చెల్లించాలని షాపు అతను సూచించాడు. బిల్లు కావాలని అడిగితే బిల్లు కావాల్సి వస్తే నీకు జీఎస్‌టీ 7 శాతం మాత్రమే తగ్గింపు ఉంటుందని చెప్పాడు. 3 శాతం నష్ట పోవాల్సి వస్తుందని భావించి మాధవరెడ్డి బిల్లు లేకుండానే మందులు తీసుకెళ్లిపోయాడు.  

జీఎస్‌టీ తగ్గింపు కావాలంటే డిస్కౌంట్‌ అడగొద్దు
చాలా దుకాణాల్లో నూతన జీఎస్‌టీ సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఎవ్వరైనా అవగాహన ఉండి జీఎస్‌టీ తగ్గింది కదా ధరలు తగ్గాలి కదా అని అడిగితే నీకు జీఎస్‌టీ తగ్గించాలంటే డిస్కౌంట్‌ అడగొద్దు అని చెబుతున్నారు. జీఎస్‌టీ 12 శాతం నుంచి 5శాతానికి తగ్గింది. అంటే ఎంఆర్‌పీపై 7 శాతం మాత్రం తగ్గుతుంది. అదే డిస్కౌంట్‌ అయితే ఎంఆర్‌పీపై 10 శాతం డిస్కౌంట్‌ వస్తుంది. మనం జీఎస్‌టీ తగ్గించాలని అడిగితే డిస్కౌంట్‌ కోల్పోతాం. 

ఫలితంగా 3 శాతం మనకే నష్టమని భావించి అధిక శాతం వినియోగదారులు దుకాణదారులు ఇచ్చిన బిల్లుకు మందులు తీసుకుంటున్నారు. బిల్లు కావాలని అడిగిన వారికీ ఇదే పరిస్థితి నెలకొంది. బిల్లు కావాలంటే డిస్కౌంట్‌ అడగొద్దని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. బిల్లు ఇస్తే ఎంఆర్‌పీపై 7 శాతం జీఎస్‌టీ తగ్గించి ఇవ్వాలి. అదే బిల్లు లేకుండా అయితే 10 శాతం డిస్కౌంట్‌తో ఇవ్వొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలతో వ్యాపారులు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు.  

పాత స్టాక్‌ ఉన్నా జీఎస్‌టీ తగ్గించి అమ్మాలి 
చాలా మంది జీఎస్‌టీ సంస్కరణల మేరకు ఔషధాలు విక్రయించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే అందరికీ నూతన జీఎస్‌టీ ప్రకారం మందులు విక్రయించాలని ఆదేశాలు ఇచ్చాం. ఈ మేరకు వాట్సాప్‌లలో మెసేజ్‌లు పంపించాం. కరపత్రాలు మెడికల్‌షాపుల వద్ద అతికించాం. ఇటీవల కర్నూలులో నిర్వహించిన మేళాలో మూడు స్టాళ్ల ద్వారా అవగాహన కల్పించాం. 

కానీ చాలా మంది పాత స్టాక్‌ ఉందని చెబుతూ ధరలు తగ్గించకుండా మందులు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇకపై  ముమ్మరంగా దాడులు చేస్తాం. మోసపోయిన వారు  ఫిర్యాదు చేస్తే ధరలు తగ్గించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తప్పకుండా బిల్లులు తీసుకోవాలి.  – పి.హనుమన్న, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్, కర్నూలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement