‘చుక్క’ల్లో ధర
కాకినాడ క్రైం : మద్యం వ్యాపారుల దోపిడీ మళ్లీ మొదలైంది. నూతనంగా షాపులకు లెసైన్స్‌లు పొంది రెండు వారాలు గడవకుండానే మాక్సిమమ్ రిటైల్ ప్రైస్ (ఎమ్మార్పీ)కి మంగళం పాడారు. దీంతో మందుబాబుల జేబులు గుల్లవుతున్నాయి. క్వార్టర్ బాటిల్‌పై రూ. పది నుంచి రూ. 20 వరకూ అధిక ధర వసూలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించుకునేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ అధికారులే మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం. జిల్లాలో గతంలో 555 మద్యం షాపులుండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం డివిజన్‌లోని మరో ఏడు షాపులు నూతనంగా కలిశాయి. దీంతో 562 మద్యం షాపులకు నూతనంగా లెసైన్స్‌లు మంజూరు చేసేందుకు గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించారు.
జూన్ 28వ తేదీకి గడువు ముగిసేనాటికి మొదటి దఫా 401 షాపులకు మాత్రమే వ్యాపారులు దరఖాస్తులు చేసుకోగా మిగిలిన వాటికి జూలై ఏడవ తేదీ గడువుగా రెండోసారి దరఖాస్తులు ఆహ్వానించారు. అయినప్పటికీ వ్యాపారుల నుంచి సరైన స్పందన లేదు. రెండోసారి కేవలం 34 షాపులకు మాత్రమే దరఖాస్తులు అందడంతో ఇంకా జిల్లాలో 127 మద్యం షాపులు మిగిలిపోయాయి. వీటికి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మందుబాబులు మిగిలిన షాపుల్లో మద్యం కొనుగోలు చేసి సేవిస్తున్నప్పటికీ వ్యాపారులు మాత్రం నష్టాలు చవిచూస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు. అయితే నెలరోజులు కూడా గడవకుండానే నష్టాలేమిటని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మద్యం షాపులు తీసుకున్న వారికే ఈ దఫా కూడా లెసైన్స్‌లు దక్కడంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పాటై అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వారంటున్నారు.
యథావిధిగా బెల్టుషాపులు
జిల్లాలో బెల్టుషాపులు మాత్రం యథావిధిగానే కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్టుషాపులను తొలగించేందుకు ఉత్తర్వులు జారీచేస్తారని తొలుత ప్రచారం జరిగింది. దీంతో వ్యాపారులు షాపులు దక్కించుకునేందుకు కూడా వెనుకడుగు వేశారు. మద్యం షాపులు రాత్రి పూట మూసివేసినప్పటికీ బెల్టుషాపుల్లో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటుంది. బెల్టుషాపుల్లోనే దాదాపు 60 శాతం మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. జిల్లాలో సుమారు 4,000లకు పైబడి బెల్టుషాపులున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మద్యం షాపుల యజమానులు వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఒక్కో షాపు పరిధిలో సుమారు పదికి పైగా బెల్టుషాపులను ఏర్పాటు చేసుకుని 24 గంటలూ మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రధాన షాపులో రూ. పది మాత్రమే అదనపు ధర వసూలు చేస్తుండగా బెల్టుషాపుల్లో రూ. 20కి పైబడి అధిక ధర వసూలు చేస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. లూజు విక్రయాల నేపథ్యంలో చీప్ లిక్కర్, నకిలీ మద్యం కూడా విక్రయిస్తున్నారంటున్నారు.
మామూళ్ల ‘మత్తు’లో అధికార గణం
అధికారులు మామూళ్ల ‘మత్తు’లో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనాభా విస్తీర్ణాన్ని బట్టి మద్యం షాపుల్లో రోజుకు రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకూ మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఒక్కొక్క షాపులో సుమారు రూ. పదివేలకు పైబడి మందుబాబుల నుంచి దోపిడీ జరుగుతోంది. ఒక్కో మద్యం షాపు నుంచి రెన్యువల్ ఫీజుగా (అనధికారికం) సంవ త్సరానికి రూ. 50 వేలు ఇవ్వాలని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో షాపు నుంచి ఎక్సైజ్, పోలీసు అధికారులు, సిబ్బందికి నెలకు సరాసరి రూ. 44 వేలుపైబడి ముడుపులు చెల్లించాలంటున్నారు. షాపు అద్దెలు, సిబ్బంది జీతభత్యాలు ఇలా చూసుకుంటే తాము నష్టపోతున్నామని, అందుకే అధిక ధరకు విక్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల క్రితం నుంచే ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తుండగా శనివారం నుంచి మిగిలిన షాపులలో కూడా అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి.