దర్యాప్తులో ‘తల’మునకలై..
కాకినాడ క్రైం : కాకినాడలో భర్త చేతిలో హతమైన భార్య ‘తల’ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. స్థానిక పాతబస్టాండ్ ప్రాంతం వెంకటేశ్వర కాలనీకి చెందిన గుమ్మడి మరియమ్మ (38)ను ఆమె భర్త శ్రీరామకృష్ణ అతికిరాతకంగా హతమార్చిన సంగతి విదితమే. ఆమె మృతదేహాన్ని తల, ఛాతి, పొట్ట, కాళ్లు వేర్వేరుగా రెండు మూటల్లో కట్టి డంపర్ బిన్‌లలో పడేయడంతో పోలీసులు వాటిని నిందితుడు రామకృష్ణ చేతే వెలికితీయించారు.
అయితే తల, పేగులను స్టీల్ క్యాన్‌లో పెట్టి ఉప్పుటేరులో పడేశానని నిందితుడు రామకృష్ణ చెప్పడంతో పోలీసులు ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం ఉదయం ప్రేజరుపేటలో కొందరు యువకులు ఉప్పుటేరులో ఈత కొడుతుండగా వారికి ఆ క్యాన్ దొరికింది. దానిని వారు తెరిచేసరికి తీవ్ర దుర్గంధం వెదజల్లింది. దీంతో విషయాన్ని వారు పోలీసులకు తెలపడంతో వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ అద్దంకి శ్రీనివాసరరావు, ఎస్సైలు రమేష్, రవికుమార్, పార్ధసారధి, సతీష్, కిశోర్ కుమార్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్యాన్‌లో పేగులు మాత్రమే లభ్యమయ్యాయి.
దానిని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. తల లభించకపోవడంతో దాని కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పడేశానని నిందితుడు చెబుతుండడంతో దాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ లభ్యం కాకపోవడంతో డంపర్ బిన్లలో చెత్తను బయటకు తీయించి క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేకపోయింది. దీంతో తలను ఉప్పుటేరులోనే పడేసి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహం ముక్కలను జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. తల దొరికిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
తప్పించుకునేందుకే...
మృతదేహం ముక్కలను చేసేంత కిరాతకంగా చంపడానికి గల కారణాలపై పోలీసులు దృష్టిసారించారు. కేవలం తప్పించుకునేందుకే నిందితుడు మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని వారు భావిస్తున్నారు. హత్యకు వినియోగించిన ఆయుధం కూడా పోలీసులకు దొరకలేదు. దీంతో పోలీసులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అయితే ఆ రాత్రి ఆమెతో ఉన్న వ్యక్తిపై కూడా శ్రీరామకృష్ణ దాడి చేయడంతో అతడికి కూడా రక్తపు గాయాలై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అతడు ఎవరనే విషయంపైనా పోలీసులు ఆరాతీస్తున్నారు.
మరోవైపు మరియమ్మను ఆమె భర్త శ్రీరామకృష్ణ ఒక్కడే హతమార్చాడా! లేక అతడికి ఎవరైనా సహకరించారా! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం జనసంచారంతో ఉండే ఈ ప్రాంతంలో హత్యజరగడం అటు స్థానికులు, ఇటు పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది. వారు నివసించే ఇంటిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వీఆర్వోలు వి. మల్లికార్జునరావు, జి. రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఐసీపీఎస్ సంరక్షణలో కుమారులు
మరియమ్మ కుటుంబసభ్యులు కృష్ణాజిల్లా విజయవాడలో ఉండడంతో వారిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే శుక్రవారం కాకినాడ చేరుకున్నారు. అంత వరకూ ఆమె కుమారులు 14 ఏళ్ల వెంకటేష్, 10 ఏళ్ల సీమోనుకు పోలీసులు ఆశ్రయం కల్పించారు. అయితే ఆ చిన్నారులను ఐసీడీఎస్ పీడీ ఎంజే నిర్మల ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ పథకం అధికారులు చేరదీసేందుకు ముందుకు వచ్చారు.
శుక్రవారం ఆ చిన్నారులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం (ఐసీపీఎస్) లీగల్ ఆఫీసర్ ఎం. సుధాకర్, కౌన్సిలర్ సీహెచ్ అభిషాలోమ్ వివరాలు సేకరించారు. ఆ చిన్నారులిద్దరికీ 18 ఏళ్ల వచ్చే వరకూ తాము సంరక్షిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి శ్రీరామకృష్ణ నుంచి కూడా వారు అంగీకారం తీసుకున్నారు. పోస్టుమార్టం, ఇతర కార్యక్రమాలు పూర్తయిన అనంతరం తాము ఆ చిన్నారులను శిశుగృహకు తరలించి సంరక్షిస్తామని ఐసీపీఎస్ అధికారులు తెలిపారు. వారికి సాయం అందించాలనుకునే దాతలు కూడా ముందుకు రావచ్చని సూచించారు.