అధిక ధరలకు మద్యం అమ్మకాలు
కాకినాడ క్రైం :మద్యం షాపుల లెసైన్సులకు గడువు ముగుస్తుండడంతో జిల్లాలో మద్యం సిండికేట్ బరి తెగిస్తోంది. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు.
నూతన మద్యం పాలసీ
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం టెండరు విధానానికి స్వస్తి పలుకుతూ జనాభా ప్రకారం ధర నిర్ణయించి నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. గతేడాది జిల్లాలో 555 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా వంద దుకాణాల నిర్వహణకు వ్యాపారులెవ్వరూ ముందుకు రాలేదు. ఏడాది క్రితం రెన్యూవల్ నిమిత్తం కూడా సుమారు 50 మంది యజమానులు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో జిల్లాలో ప్రస్తుతం 400 షాపుల మాత్రమే లెసైన్సు పొంది ఉన్నాయి. తిరిగి చెల్లించని ఒప్పందంతో దరఖాస్తు రుసుం రూ.25 వేలు నిర్ణయించడంతో దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ. 1.12 కోట్లు సమకూరింది. మిగిలిన దుకాణాలను ఎక్సైజ్ శాఖ నేతృత్వంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్) డిపో ద్వారా ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) నిర్వహించాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే జిల్లాలో కాకినాడ, రాజమండ్రి తప్ప ఇంకెక్కడా అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేయలేకపోయారు.
పాత విధానాలే అమలు
కోటాకు మించి మద్యం తీసుకోవాలంటే అదనపు మద్యం అమ్మకాలపై ప్రివిలేజ్ ఫీజుగా 14 శాతం సుంకం చెల్లించాలి. దీంతో తమకు ఏమీ మిగలదని వ్యాపారులు అధిక మద్యం తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈసారి సైతం పాత మద్యం విధానాన్నే ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రివిలేజ్ ఫీజును 13.6 శాతానికి తగ్గించింది. దీంతో కొత్త పాలసీ వస్తుందని ఎదురుచూసిన మద్యం వ్యాపారులకు నిరాశే మిగిలింది. ఈ నెలాఖరులోగా కొత్తగా దరఖాస్తులు స్వీకరించి జూలై 1 నుంచి షాపులు కేటాయించాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కాగా ఎక్సైజ్ కమిషనర్ ఎస్‌ఎస్ రావత్ శనివారం 13 జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌లతో సమీక్షించి విధివిధానాలు ఖరారు చేశారు.
జిల్లాలో సుమారు 1,100 గ్రామాలుండగా 4,500 పైగా బెల్టుషాపులు ఉన్నట్లు అంచనా. మద్యం దుకాణాల్లో ఉదయం 10.30 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో మాత్రం 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నారు. వీటి ద్వారానే 60 శాతం అమ్మకాలు సాగుతున్నాయని సమాచారం. మందుబాబుల అలవాటును మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ (ఎమ్మార్పీ) కంటే అధిక ధరలకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. అర్ధరాత్రి మద్యం కొనుగోలు చేయాలంటే సుమారు రూ. 20 పైబడి అధికంగా ధర చెల్లించాల్సిందేనని మందుబాబులు చెబుతున్నారు. చాలా బడ్డీ కొట్లు, కిళ్లీషాపుల వద్ద బెల్టుషాపులు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో ఒక్కో షాపులో రోజూ దాదాపు 200 వరకు బీర్లు అమ్ముడవుతాయి. విస్కీ, రమ్ము, జిన్ను, బ్రాందీ, వైన్ కూడా సుమారు 400 బాటిళ్లు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో బీర్లు అధికంగా అమ్ముడుపోతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
మద్యం ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై అధికారులను అప్రమత్తం చేసి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందుతున్నాయన్న మద్యం వ్యాపారుల ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
-సీహెచ్ వివేకానంద రెడ్డి,
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్