సాక్షి, విజయవాడ : తీరంలో మద్యం సిండికేట్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు పూర్తి స్థాయిలో ఫలించాయి. పర్యవసానంగా మూడు షాపులు ఉన్న ప్రాంతంలో రీ లొకేట్ పేరుతో మద్యం షాపును కేటాయించటం వివాదాస్పదమైంది. వాస్తవానికి ఎక్సైజ్ అధికారులు తొలుత షాపును సూచించిన ప్రాంతంలో కాకుండా అధికార పార్టీ అమాత్యుడి ఒత్తిడితో షాపు ప్రాంతం మార్చారు. దీనిపై బందరుకు చెందిన వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మచిలీపట్నం డివిజన్ పరిధిలోని షాపుల కేటాయింపునకు సంబంధించి జారీ అయిన గెజిట్‌ను నిలుపుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది.
జరిగిందిదీ...
మచిలీపట్నం డివిజన్ పరిధిలో జిల్లాలోనే అత్యధికంగా 173 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో శుక్రవారం సాయంత్రం గడువు ముగిసేనాటికి సుమారు 120 షాపులకు వందల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. మచిలీపట్నం డివిజన్‌లో మూడు మద్యం షాపుల్లో విక్రయాలు సరిగా జరగటం లేదని, షాపులు దక్కించుకున్న వ్యాపారులు నష్టపోయారనే కారణంతో మూడుషాపులను రీ లొకేటెడ్ పేరుతో బందరు పట్టణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో అధికారుల ఆదేశాలతో బందరు ఎక్సైజ్ సీఐ రీ లొకేటెడ్ షాపులను పట్టణంలోని 26, 27 వార్డులు, రూరల్‌లోని సత్రవపాలెంలో ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్‌కు సిఫార్సు చేశారు. దీంతో డీసీ కార్యాలయం వాటిని ఆమోదించింది. ఇదంతా ఎన్నిలకు ముందు జరిగింది. ఎన్నికలు పూర్తి కావటం.. ఆ తర్వాత అక్కడ టీడీపీ గెలవటంతో ఆ నేతల హవా పట్టణంలో మొదలైంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. పట్టణంలో మూడు బార్‌లు ఉన్న 15వ వార్డులోనే వైన్‌షాపులు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తేవటంతో ఆఘమేఘాల మీద 26వ వార్డులో ఏర్పాటు చేయాల్సిన షాపును 15లోకి మార్చారు.
దీంతో బార్ యజమానులు హైకోర్టును ఆశ్రయించి ఎక్సైజ్ తీరుపై కోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో కోర్టు మచిలీపట్నం గెజిట్‌ను నిలుపుదల చేయాలని శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు నేతలు రాజకీయ కక్ష్యతోనే తమ వ్యాపారం దెబ్బతీయటానికి 15వ వార్డులో షాపు కేటాయించారని అందుకే తాము హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తీసుకువచ్చామని ఈగల్ బార్ యజమాని ఎల్.ఆనంద్ ‘సాక్షి’కి తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఎక్సైజ్ అధికారులకు పంపామని చెప్పారు.
తీరంలో సిండికేట్ రాజకీయం
Published Sat, Jun 28 2014 2:07 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement