ప్రతీకాత్మక చిత్రం
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకాలనీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.. పిల్లలతో కలసి ఇంట్లో అంతా సిద్ధం చేసుకుని, ముస్తాబై తన భర్త కోసం ఎదురుచూస్తోంది. తీరా తన భర్త పూటూగా మద్యం సేవించి.. కనీసం నిలబడలేని స్థితిలో ఇంటికి రావడాన్ని చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. క్షణికావేశంలో తనతో పాటు పిల్లలకు ఎలుకల మందు తినిపించి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితికి వెళ్లిన తల్లి, పిల్లలను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి కొంత మెరుగు పడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా, ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆశ అడియాస..
కొత్తపేట పోతిన అప్పలస్వామి వీధికి చెందిన డెక్కటి దుర్గ(38)కు ఇరవై ఏళ్ల కిందట నరసింహ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. నరసింహ గోనె సంచులు కుట్టే పనులు చేస్తుండగా.. దుర్గ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. పెద్ద కుమార్తె శకుంతల లయోలా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇక చిన్న కుమార్తె గజలక్ష్మి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో 31వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నరసింహ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. కుటుంబం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుండగా, నరసింహ మద్యం సేవించి ఇంటికి రావడంతో మనస్తాపానికి గురయ్యారు. భార్య, భర్తల్దిదరికి చిన్న పాటి వివాదం జరిగింది. అనంతరం నరసింహ నిద్రకు ఉపక్రమించాడు.
పక్కింటి వ్యక్తి సమాచారంతో..
నరసింహ ఇంటి పక్కనే నివాసం ఉండే రెడ్డి అనే వ్యక్తి ఆ ఇంట్లో అప్పటి వరకూ గొడవ జరగడాన్ని గమనించాడు. కొంతసేపటి తర్వాత ఇంటి తలుపులు బార్లా తెరచి ఉండటాన్ని చూసి.. ఇంట్లోకి వెళ్లాడు. దుర్గ, ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి.. భవానీపురంలో ఉండే దుర్గ అన్నయ్య నాగరాజుకు ఫోన్ చేశాడు. మీ చెల్లెలు, ఇద్దరు మేనకోడళ్లు అపస్మారకంగా పడి ఉన్నారని చెప్పాడు. దీంతో వెంటనే చెల్లెలు వద్దకు వచ్చిన నాగరాజు వెంటనే ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు.
అరటి పండులో ఎలుకల మందు..
ఆస్పత్రికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని దుర్గ తన అన్నయ్యకు చెప్పింది. ఇంట్లో ఉన్న ఎలుకల మందును తాను, ఇద్దరు పిల్లలు కలిసి అరటి పండులో పెట్టుకుని తిన్నామని వివరించింది. అనంతరం చికిత్స పొందుతూ దుర్గ శనివారం రాత్రి మృతి చెందింది. ఘటనపై ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు దుర్గ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: మృతదేహాన్ని చూసి జీర్ణించుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే..
Comments
Please login to add a commentAdd a comment