- బెడిసికొట్టిన మంత్రి మంత్రాంగం
- సోమవారం లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు
- బందరు 15వ వార్డులోని షాపు మినహా...
సాక్షి, విజయవాడ : కొత్తగా ఏర్పాటయిన మద్యం సిండికేట్ రాజకీయాలు పెట్రేగిపోతున్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ నూతన సిండికేట్‌కు పూర్తిగా సహకరించడం తీవ్ర వివాదాస్పదమవుతుంది. తనకు అనుకూలంగా ఉండే సిండికేట్‌కు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతో మంత్రి పాత మద్యం వ్యాపారుల ఆదాయానికి గండికొట్టేందుకు చేసిన ప్రయత్నం కాస్తా... కోర్టు జోక్యంతో కొంతమేర బెడిసికొట్టింది. జిల్లాలో 335 వైన్‌షాపులున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలో 162 షాపులు, మచిలీపట్నం డివిజన్‌లో 173 షాపులున్నాయి. వీటి కేటాయింపు కోసం గతంలో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం శనివారం లాటరీ ప్రకియ నిర్వహించాల్సి ఉంది.
అయితే మచిలీపట్నం డివిజన్‌లోని మచిలీపట్నం పట్టణం ఎక్సైజ్ గెజిట్‌లోని 15వ నంబరు వార్డులో షాపును ఏర్పాటు చేయాలని అధికారులు నూతనంగాగెజిట్‌లో పొందుపరచడం తీవ్ర గందరగోళానికి తెరలేపింది. ఈ సిఫారసును నిరసిస్తూ పాత సిండికేట్ వ్యాపారులు మచిలీపట్నం డివిజన్ లాటరీ ప్రకియపై హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. దీంతో శనివారం మచిలీపట్నం డివిజన్ లాటరీ ప్రకియ నిలిచిపోయింది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమాత్యుని ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు స్టేపై మళ్లీ ఉత్తర్వులు తీసుకొచ్చారు. దీంతో సోమవారం లాటరీ ప్రకియ నిర్వహించనున్నారు.అయితే 15 వార్డులోని షాపులకు లాటరీ నిలిపివేసి మిగిలినవి నిర్వహించాలని అదివారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించడంతో అమాత్యుని అనుచరుల ఆశలు నిరాశలయ్యాయి.
దూమారం రేపిన వివాదం ...
మచిలీపట్నంలోని కాలేఖాన్ పేట, గిలకలదిండి, సత్రంపాలెంలో మూడు వైన్ షాపులను ఏర్పాటు చేయాలని రెండు నెలల కిత్రం గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ అధికారులు సిఫారసు చేశారు. దానికి ప్రభుత్వ ఆమోదముద్ర పడింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా.. మచిలీపట్నం నుంచి గెలుపొందిన కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలో 15 వార్డు పరిధిలోని కోనేరు సెంటర్‌లో షాపు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. దీంతో మూడు షాపుల్లో ఒకదానికి బదులు కోనేరు సెంటర్‌లో ఏర్పాటు చేయాలని సూచనలతో గెజిట్‌లో పేర్కొని దరఖాస్తులను స్వీకరించారు. కోనేరు సెంటర్లో ఇప్పటికే మూడు బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. అవి పాత సిండికేట్‌వి.
అలాగే మూడు షాపుల వ్యక్తులు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు. దీంతో వారి ఆదాయ వనరులు దెబ్బతీయాలనే లక్ష్యంతో మూడు షాపులు ఉన్నప్రాంతంలోనే వైన్‌షాపు ఏర్పాటు చేస్తే బార్ల ఆదాయం గణనీయంగా పడిపోతుందని అమాత్యులు భావించారు. అయితే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో బార్, వైన్ షాపులు ఏర్పాటు చేయకూడదు. కానీ అమాత్యుని అదేశాలతో వీటన్నింటినీ పక్కన పెట్టి ఏకపక్షంగా వ్యవహరించారు.
దీంతో బార్ యజమానులు కోర్టును ఆశ్రయించటంతో షాపుల కేటాయింపు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. 15వ నంబరు వార్డులో షాపు ఏర్పాటు చేయకూడదని, గెజిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని మచిలీపట్నం డివిజన్ గెజిట్‌ను నిలిపివేసింది. దీంతో ప్రభుత్వం గెజిట్ నిలుపుదలపై మళ్లీ ఉత్తర్వులు తెచ్చింది. దీంతో బందరు 15 వార్డులోని షాపులకు లాటరీ నిలిపివేసి మిగిలిన వాటికి సోమవారం లాటరీ నిర్వహించటానికి అధికారులు సిద్ధమయ్యారు.