వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన దాసరి
సాక్షి, విజయవాడ: జిల్లాలో తెలుగు దేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన దాసరి బాలవర్థనరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన సోదరుడు దాసరి జై రమేష్ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో దాసరికి కేడర్ అండదండలు ఉండటంతో వైఎస్సార్‌సీపీకి ఇది అదనపు బలం కాగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గన్నవరం నియోజకవర్గంపై చెరగని ముద్ర..
దాసరి కుటుంబానికి గన్నవరం నియోజకవర్గంపై గట్టి పట్టుంది. 1999–2004, 2009–2014ల మధ్య ఆయన గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు సొంత క్యాడర్ ఉంది. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఆయన కుటుంబంపై ఏ విధమైన అవినీతి మచ్చ లేదు. పదవిలో ఉన్నా లేకున్నా దాసరి ట్రస్టు ద్వారా ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నారు.
విజయవాడ డెయిరీలోనూ..
2014లో దాసరి బాలవర్థనరావుకు విజయాడెయిరీ చైర్మన్ పదవి ఇస్తామంటూ చంద్రబాబు మభ్యపెట్టి ఎమ్మెల్యే రేస్ నుంచి తప్పించారు. ఆ తర్వాత కేవలం విజయా డెయిరీ డైరెక్టర్ పదవి మాత్రమే ఇచ్చారు. అయితే ప్రస్తుతం విజయా డెయిరీలో డైరెక్టర్లలో సగం మందికి పైగా దాసరి వెంటే ఉన్నారు. అయితే ప్రస్తుత చైర్మన్ మండవ జానకీరామయ్య ముఖ్యమంత్రికి విరాళాలు ఇవ్వడంతో ఆయన్నే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతలతో పరిచయాలు..
కృష్ణాజిల్లాలోని పలు నియోజకవర్గాల్లో దాసరి కుటుంబానికి అనుచరగణం ఉంది. మండల, గ్రామస్థాయిలోని పలువురు టీడీపీ నేతలు ఆయన వల్ల సహాయం పొందిన వారే. 20 ఏళ్లుగా పార్టీలో ఆయన పనిచేయడం వల్ల పలు నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బందరు పార్లమెంట్ నియోజకవర్గంలోనూ, గన్నవరం నియోజకవర్గం పైన ఆయన చెరగని ముద్ర వేశారు. దాసరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు.
అర్బన్ టీడీపీలోనూ అనుచరులు..
గతంలో దాసరి జై రమేష్ టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో యువకులుగా ఉన్న అనేకమందిని ఆయన పార్టీలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు వారు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నారు. దాసరి టీడీపీలో ఉండటంతో వారు అదేపార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన పార్టీ మారడంతో ఆయా నేతలు కూడా ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంపై దాసరి ప్రభావం ఎక్కువగావుంటుందని అర్బన్ టీడీపీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment