కోహెడరూరల్(హుస్నాబాద్): సిండికేట్ల కనుసన్నల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హుస్నాబాద్ నిమోజకవర్గంలో మద్యం వ్యాపారులు మద్యం వినియోగదారుల జేబులు ఖాళీ చేసేందుకు కుమ్మక్కయ్యారు. మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల పరస్పర అవగాహనతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైన్స్‌లో కొన్ని బ్రాండ్‌లను మాత్రమే విక్రయిస్తున్నారు. మద్యం వ్యాపారుల తీరుతో మందుబాబులు విసిగిపోతున్నారు. కొద్ది రోజులుగా మద్యం అమ్మకాల్లో జరుగుతున్న నాటకీయ పరిణామాలు వారి మత్తు దిగేలా చేస్తున్నాయి. కోరింది కాకుండా స్కీం ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటలు అన్ని రకల బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు సందేహాలకు తావిస్తోంది. (చదవండి: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే! )
వ్యాపారుల ఇష్టారాజ్యం
మద్యం కొనుగోలుదారులు అడిగిన బ్రాండ్ కాకుండా తమకు లబ్ధిచేకూర్చే కంపెనీల బ్రాండ్‌ల మద్యాన్ని మాత్రమే అమ్ముతున్నారు. లాభం ఎక్కువ ఇచ్చే(స్కీం)కంపెనీల మద్యాన్ని మాత్రమే విక్రయించేందుకు వ్యాపారులు సిండికేట్ అయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారు. స్కీంలు భారీగా ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే విక్రయించాలని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్థానికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రధాన బాండ్‌ల విక్రయాలను నిలిపివేశారు. ఇతర ప్రాంతాల్లో వాటిని అమ్ముతున్నప్పటికీ స్థానిక వ్యాపారులు సిండికేటుగా మారడంతో కొన్ని బ్రాండ్‌ల మద్యం లభించడం లేదు. దీంతో మద్యం ప్రియులు వారు అంటగడుతున్న వాటినే తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
స్కీం లేకుంటే అంతే..
యువత ఎక్కువగా బీరు తాగుతుంటారు. అత్యధికంగా కింగ్ ఫిషర్ లైట్ లేదా స్ట్రాంగ్ పైనే మక్కువ చూపుతుంటారు. బీర్ల విక్రయాల్లో ఎక్కువగా అమ్మడు పోయిదే ఈ బ్రాండ్ మాత్రమే. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న బ్రాండ్ కావడంతో కొద్దిరోజులుగా ఆ కంపెనీ స్కీం రూపంలో వైన్‌షాప్‌లకు ఇచ్చే ప్రోత్సహకాలకు నిలిపి వేసినట్లు తెలిసింది. దీంతో ప్రోత్సాహకాలు(స్కీం)ఇవ్వని బ్రాండ్‌లు అమ్మకూడదని వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు వినికిడి. వినియోగదారులు కోరినా స్టాక్ లేదంటూ ఇతర కంపెనీల బీర్లను అంటగడుతున్నారు. (చదవండి: అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో.. )
ఎక్సైజ్ అధికారుల అండతో..
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల అండదండలతో మద్యం వ్యాపారుల సిండికేట్ నడుస్తోంది. సిండికేట్ నడుస్తోందని తెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు
హుస్నాబాద్ పరిధిలో మద్యం వ్యాపారులు అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. అధిక ధరలకు అమ్ముతున్నట్టు మాకు సమాచారం లేదు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉన్నట్టు మా దృష్టికి రాలేదు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఉండకూడదు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. అధిక ధరలకు మద్యం విక్రయించకూడదు
– విజయలక్ష్మి, ఎక్సైజ్ సీఐ, హుస్నాబాద్
సరికొత్త రేట్లతో విక్రయాలు
మద్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఫుల్ బాటిల్‌పై రూ.20 నుంచి 30, హాఫ్ బాటిల్‌పై రూ.10 నుంచి 20 వరకు, క్వాటర్ సీసాపై రూ.10 నుంచి 15 వరకు విక్రయిస్తున్నారు. బీరుపై రూ.10 నుంచి 20 అధికంగా వసూలు చేస్తున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేకంగా మద్యం సీసాలపై స్టిక్కర్లు వేసి బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment