ఇచ్చుకో.. పుచ్చుకో.. | Alcohol excise officers deal with traders | Sakshi
Sakshi News home page

ఇచ్చుకో.. పుచ్చుకో..

Published Thu, Sep 4 2014 1:48 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

ఇచ్చుకో.. పుచ్చుకో.. - Sakshi

ఇచ్చుకో.. పుచ్చుకో..

  • మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ అధికారుల ఒప్పందం
  •  ఒక్కో బాటిల్‌కు రూ.5 పెంచేందుకు ఓకే    
  •  లెసైన్స్ రెన్యూవల్‌కు రూ.55వేలు
  •  సగం ముట్టజెప్పిన వ్యాపారులు!    
  •  మంత్రాంగం నడిపిన సిండికేట్ నాయకుడు
  •  జిల్లా వ్యాప్తంగా అమలు
  • మచిలీపట్నం : ఎక్సైజ్ అధికారులకు, మద్యం వ్యాపారులకు మధ్య ఒప్పందం కుదిరింది. అధికారులు అడిగినంత లంచం ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించారు. వ్యాపారులు ఒక్కో బాటిల్‌పై అదనంగా ఐదు రూపాయలు వసూలు చేసుకునేందుకు అధికారులు సమ్మతించారు. మచిలీపట్నం ప్రధాన కూడలిలో ఒక పేరుతో వైన్ షాపు దక్కించుకుని... పాత పేరుతోనే షాపు నడుపుతున్న టీడీపీ ద్వితీయశ్రేణి నాయకుడు ఒకరు అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు, ఇటు మద్యం దుకాణాల యజమానులకు మధ్యవర్తిగా వ్యవహరించి మామూళ్ల కథను ఓ కొలిక్కి తెచ్చినట్లు సమాచారం.

    ఎక్సైజ్ కార్యాలయమే వేదిక..!

    మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం రిటైల్ షాపు యజమానులతో సమావేశం జరిగింది. ఎక్సైజ్ సర్కిల్ స్థాయి అధికారి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పర్మినెంట్ లెసైన్స్ కావాలంటే ఒక్కో బార్ అండ్ రెస్టారెంట్, మద్యం దుకాణ యజమానులు రూ.55 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. దుకాణదారులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు మధ్య జరిగిన చర్చల్లో ఏయే అధికారికి ఎంత మేర మామూళ్లు అందజేయాలనే అంశంపైనా స్పస్టత వచ్చినట్లు తెలుస్తోంది. సిండికేట్ నాయకుడు చొరవ తీసుకుని కొంతమంది వ్యాపారులతో మామూళ్ల అడ్వాన్సుగా రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు బుధవారమే ఇప్పించినట్లు సమాచారం.
     
    వాటాలు ఇలా...
     
    మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో ఆరు రిటైల్‌షాపులు ఉన్నాయి. మచిలీపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో ఎంఆర్‌పీ కన్నా ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదే పద్ధతిని మచిలీపట్నం ఈఎస్ కార్యాలయ పరిధిలోనూ అమలు చేయవచ్చని, ఇందుకు ఎక్సైజ్ శాఖలో అందరూ సానుకూలంగా ఉన్నారని, సమావేశం ఏర్పాటు చేసిన అధికారి చెప్పినట్లు తెలిసింది.

    ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల చొప్పున ధర పెంచినా తాము పట్టించుకోమని, ఇది తన మాట కాదని, పై అధికారులు చెప్పారని ప్రకటించినట్లు సమాచారం. రిటైల్ షాపులు, మద్యం దుకాణాలకు పర్మినెంట్ లెసైన్స్‌లు ఇస్తున్నామని, ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఒక్కో షాపునకు రూ.55వేలు లంచం ఇవ్వాలని సిండికేట్ నాయకుడు, సర్కిల్ స్థాయి అధికారి చేసిన సిఫార్సులకు రిటైల్‌షాపుల యజమానులు అంగీకరించినట్లు తెలుస్తోంది.

    ఒక్కో షాపు ద్వారా ఇచ్చే రూ.55 వేలలో ఎక్సైజ్ శాఖ డెప్యూటీ కమిషనర్‌కు రూ.10 వేలు, ఈఎస్‌కి, 10 వేలు, సీఐకి రూ.10వేలు, ఎక్సైజ్‌స్టేషన్‌కు రూ.25వేల చొప్పున అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బందరు సీఐ కార్యాలయ పరిధిలోని రిటైల్ దుకాణాల యజమానులతో బుధవారం సమావేశం ముగియగా, గురువారం మద్యం దుకాణ యజమానులతోనూ సమావేశం కానున్నారు.
     
    పక్కా వ్యూహంతోనే వసూళ్లు

    మచిలీపట్నం ఈఎస్ కార్యాలయానికి సోమవారం ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వచ్చారు. అధికారులంతా సమావేశమై  మద్యం ధరలు పెంచడం, మామూళ్లు వసూలు చేయడంపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  షాపులకు లెసైన్స్‌లు మంజూరు చేసే సమయంలోనే నగదు వసూలు చేయాలని, ఇందుకోసం సిండికేట్ నాయకుల సాయం తీసుకోవాలని ఆ అధికారి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తంతోపాటు ఒక్కో మద్యం దుకాణం నుంచి ప్రతి నెలా రూ.15వేలు మామూళ్లు వసూలు చేసే విషయంపై సిండికేట్ నాయకులు, ఎక్సైజ్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement