License Renewal
-
పోలీసు వెబ్సైట్ ద్వారానే లైసెన్సుల రెన్యువల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తూ వ్యాపార సంస్థల లైసెన్సుల రెన్యువల్‌కు పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారానే అవకాశం కల్పించనున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో బార్లు, రెస్టారెంట్లు, పబ్బులతో పాటు డ్రైవ్–ఇన్ రెస్టారెంట్ల యాజమాన్యాలతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలోనే త్వరలో ఆన్లైన్ రెన్యువల్ విధానం అమలులోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో కొకైన్ దొరకడం, కొన్ని పబ్బు ద్వారా తీవ్ర ధ్వనికాలుష్యం వెలువడుతోందని, వీటి పార్కింగ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, మందుబాబుల ఆగడాలు పెరిగాయని వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కొత్వాల్ ఈ సమావేశం నిర్వహించారు. తమ లాభాల కోసం కొన్నింటి యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ సిటీకి అపఖ్యాతి తీసుకువస్తున్నారని ఆనంద్ అన్నారు. ఈ సమావేశానికి హాజరైన దాదాపు 100 మందికి సిటీ పోలీస్ యాక్ట్, అందులోని నిబంధనలు ఇతర అంశాలను వివరించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే తక్కువ వయస్సు ఉన్న వారిని పబ్బుల్లోకి, బార్లలోకి అనుమతించవద్దని, ధ్వని స్థాయిలను పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం 30 రోజుల బ్యాకప్‌తో ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రాంగణంలో సౌండ్ ప్రూఫింగ్, వ్యాలెట్ డ్రైవర్లు, సిబ్బంది, కస్టమర్లను గమనిస్తూ ఉండటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మద్యం సరఫరాకు సంబంధించి రాత్రి 11 గంటల తరువాత వచ్చిన ఆర్డర్లను అంగీకరించరాదని కచ్చితంగా 12 గంటల లోపు మూసివేయాలని ఆదేశించారు. (క్లిక్: దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్) శుక్ర, శనివారాల్లో లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని అర గంట అదనపు సమయంతో సహా గంట మినహాయింపు ఇస్తున్నామన్నారు. పాశ్చాత్య దేశాలలో పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందు నిర్వాహకులు తమ లైట్లను డిమ్ చేస్తూ కస్టమర్లు అది మూసే సమయమైందని తెలిసేలా చేస్తారని, ఇక్కడా ఈ విధానం అమలు చేయాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికులు లేదా ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని స్టార్ రేటింగ్ ఉన్న హోటళ్లలో 24 గంటలూ మద్యం విక్రయించేందుకు అనుమతి ఉంటుందని, ఇది సాధారణ ప్రజల కోసం కాదని ఆనంద్ స్పష్టం చేశారు. ఇలాంటి బార్లు, రెస్టారెంట్లు, పబ్బులకు ఇకపై అనుమతులు ఉండవని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీలు ఎం.రమేష్, పి.విశ్వప్రసాద్‌లతో పాటు జోనల్ డీసీపీలు పాల్గొన్నారు. (క్లిక్: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు) -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్‌ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్‌యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్‌లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
దుకాణాలు మాకొద్దు!
సాక్షి, నెల్లూరు: ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీగా మద్య నిషేధం వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం పలు నిబంధనలు అమలులోకి తీసుసుకువచ్చింది. అధికారులు అందుకు తగినట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. తొలిదశలో బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారు. కొత్త పాలసీ తెచ్చేందుకు మరికొంత సమయం పడుతున్న నేపథ్యంలో పాత దుకాణాల లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బెల్టుషాపులు లేకుండా చేసేందుకు చర్యలు తీవ్రతరం చేయడంతో రెన్యూవల్ చేసుకునేందుకు అనేకమంది దుకాణదారులు ఆసక్తి చూపలేదు. దశలవారీ మద్య నిషేధ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మద్యం షాపుల లైసెన్సీ కాలపరిమితిని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. నెల్లూరు రెవెన్యూ జిల్లాలో 348 మద్యం షాపులకు గానూ 260 షాపుల నిర్వాహకులు మూడునెలల ఫీజు చెల్లించి లైసెన్సును రెన్యూవల్ చేసుకోగా మిగిలిన వారు వెనుకంజ వేశారు. దీంతో ఆయా షాపులు మూతపడ్డాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టుషాపులపై దాడులు ముమ్మరం చేశారు. మద్య నిషేధంలో భాగంగా ఏటా మద్యం దుకాణాలను తగ్గిస్తామని, అక్టోబర్ ఒకటి నుంచి ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రిటైల్ మద్యం షాపులు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో నూతన మద్యం పాలసీ రూపకల్పనకు మరికొంత సమయం పట్టనుండటంతో గత నెల 25వ తేదీన మద్యం దుకాణాల లైసెన్సును మరో మూడునెలలు పొడిగిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 260 మాత్రమే.. నెల్లూరు ఎక్సైజ్ జిల్లాలో 199, గూడూరు ఎక్సైజ్ జిల్లాలో 149 మద్యం దుకాణాలున్నాయి. వీటి లైసెన్సీ కాలపరిమితి గతనెల 30వ తేదీన ముగిసింది. అయితే అప్పటికే ప్రభుత్వం మరో మూడునెలలు లైసెన్సీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వ్యాపారులు లైసెన్సీ ఫీజు, పర్మిట్ రూమ్ ఫీజులో నాలుగో వంతు చెల్లించి లైసెన్సీని రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశించింది. దీంతో నెల్లూరు ఎక్సైజ్ జిల్లా పరిదిలో 199 దుకాణాలకు గానూ 154, గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 149 దుకాణాలకు గానూ 106 దుకాణదారులు రెన్యూవల్ చేసుకున్నారు. 348 దుకాణాలకు గానూ లైసెన్సీ ఫీజు, పర్మిట్‌రూమ్ ఫీజుల కింద మూడునెలలకు ప్రభుత్వానికి రూ.16.47 కోట్లు రావాల్సి ఉండగా 88 మంది రెన్యూవల్‌కు ముందుకు రాకపోవడంతో రూ 12.37 కోట్లు వచ్చింది. దీంతో రూ.4.1 కోట్ల రాబడి తగ్గింది. వెనుకంజ.. దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలుత బెల్టుషాపుల నియంత్రణపై దృష్టి సారించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు విస్తృత దాడులు చేస్తూ బెల్టును నియంత్రించారు. మరోవైపు ఎంఆర్పీ ఉల్లంఘించినా, నిర్ణీత వేళలు పాటించని దుకాణదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా నిబంధనలు అతిక్రమించి ధనార్జనకు అలవాటుపడిన మద్యం షాపు నిర్వాహకులకు ప్రభుత్వ చర్యలు మింగుడుపడడం లేదు. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాల లైసెన్సీ కాలపరిమితి మూడునెలలకు పొడిగించినా రెన్యూవల్ చేయించుకునేందుకు వెనకడుగు వేశారు. నెల్లూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 45, గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 43 మద్యం వ్యాపారులు తమ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోలేదు. -
మద్యం వ్యాపారుల తర్జన భర్జన!
సాక్షి, కడప : టీడీపీ ప్రభుత్వం పాలసీలతో ఏర్పాటు కాబడిన మద్యంషాపుల గడువు ఈనెలాఖరుతో ముగియనున్నది. కొత్త మద్యం పాలసీ అమలుకావడానికి ఆలస్యం కానుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మద్యంషాపును సెప్టెంబరు 30 వరకు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే మళ్లీ షాపులను కొనసాగించడానికి లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే విషయంలో వ్యాపారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయంలో ముందుకు వెళ్లడమా? వ్యాపారం విరమించుకోవడమా అనే అంశంపై మద్యం వ్యాపారులు తలమునకలవుతున్నారు. షాపులు తగ్గుముఖం దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ఏటా 20శా తం మద్యం దుకాణాలు తగ్గిస్తామని సీఏం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మ ద్యంషాపులు తగ్గుముఖం పట్టనున్నాయి. మద్యం షాపుల తగ్గింపుపై సీఎం వైఎస్ జగన్ ప్రకటనను ప్రజా, మహిళాసంఘాలు అభినందిస్తున్నాయి. దశలవారీ మద్యనిషేధం దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నది. ఈమేరకు కసరత్తు చేస్తోంది. దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ఏటా మద్యంషాపులు తగ్గించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అక్టోబరు1 నుంచి ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రిటైల్ మద్యంషాపులు నిర్వహిస్తామని ఆశాఖ ప్రత్యేక కార్యదర్శి సాంబశివరావు మంగళవారం వెల్లడించారు. లైసెన్స్ రెన్యూవల్ అదనంగా మూడునెలలు మద్యం విక్రయాలు నిర్వహించడానికి మద్యం దుకాణాల యజమానులు లైసెన్స్ ఫీజుతోపాటు, పర్మిట్రూం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మూడు శ్లాబుల్లో మద్యం దుకాణాల నుంచి లైసెన్స్, పర్మిట్ రూమ్ ఫీజులు వసూలు చేయనున్నది. రెన్యూవల్‌కు వెనుకడుగు.. జిల్లాలో 210కిపైగా మద్యంషాపులు, 20బార్లు ఉన్నాయి. మద్యం సరఫరా చేసే డిపోలు రెండు ఉన్నాయి. నెలకు రూ.10 నుంచి రూ.15కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ అమ్మకాల వల్ల ప్రభుత్వానికి 50శాతం ఆదాయం వస్తోంది. షాపుల కొనసాగింపు చేపట్టిన క్రమంలో మద్యంషాపుల నిర్వాహకులు ఎమ్మార్పీ ఉల్లంఘించినా, నిర్ణీతవేళకు మించి మద్యం విక్రయించినా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోనున్నది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా నిబంధనలు అతిక్రమించి ధనార్జనకు అలవాటుపడిన మద్యంషాపుల నిర్వహకులపై ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడునెలల రెన్యూవల్‌కు అవకాశం కల్పించినా నిర్వాహకులు ముందుకు రావడానికి జంకుతున్నారు. ససేమిరా ప్రభుత్వం బెల్టుషాపుల నిర్వహణకు ససేమిరా అంటుండడంతో అనధికార ఆదాయానికి అలవాటుపడిన వారు లైసెన్స్ రెన్యూవల్స్ చేయిం చుకుంటే తమ ఆటలు సాగవనే అభిప్రాయంలో ఉన్నారు. కాగా దశలవారీ మద్యనిషేధంలో భాగంగా బెల్టుషాపుల సమూల నిర్మూలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బెల్టుషాపులకు మద్యం రవాణా చేసే షాపుల లైసెన్స్‌లను సైతం రద్దు చేసి కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో ఎక్సైజ్‌శాఖ బెల్టుషాపుల నిర్మూలనకు నడుంబిగించింది. అక్టోబరునెలకంతా బెల్టుషాపుల వాసన ఉండకూడదని కలెక్టర్లు, ఎస్పీలకు సైతం సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఇచ్చుకో.. పుచ్చుకో..
మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ అధికారుల ఒప్పందం ఒక్కో బాటిల్‌కు రూ.5 పెంచేందుకు ఓకే లెసైన్స్ రెన్యూవల్‌కు రూ.55వేలు సగం ముట్టజెప్పిన వ్యాపారులు! మంత్రాంగం నడిపిన సిండికేట్ నాయకుడు జిల్లా వ్యాప్తంగా అమలు మచిలీపట్నం : ఎక్సైజ్ అధికారులకు, మద్యం వ్యాపారులకు మధ్య ఒప్పందం కుదిరింది. అధికారులు అడిగినంత లంచం ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించారు. వ్యాపారులు ఒక్కో బాటిల్‌పై అదనంగా ఐదు రూపాయలు వసూలు చేసుకునేందుకు అధికారులు సమ్మతించారు. మచిలీపట్నం ప్రధాన కూడలిలో ఒక పేరుతో వైన్ షాపు దక్కించుకుని... పాత పేరుతోనే షాపు నడుపుతున్న టీడీపీ ద్వితీయశ్రేణి నాయకుడు ఒకరు అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు, ఇటు మద్యం దుకాణాల యజమానులకు మధ్యవర్తిగా వ్యవహరించి మామూళ్ల కథను ఓ కొలిక్కి తెచ్చినట్లు సమాచారం. ఎక్సైజ్ కార్యాలయమే వేదిక..! మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం రిటైల్ షాపు యజమానులతో సమావేశం జరిగింది. ఎక్సైజ్ సర్కిల్ స్థాయి అధికారి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పర్మినెంట్ లెసైన్స్ కావాలంటే ఒక్కో బార్ అండ్ రెస్టారెంట్, మద్యం దుకాణ యజమానులు రూ.55 వేలు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. దుకాణదారులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు మధ్య జరిగిన చర్చల్లో ఏయే అధికారికి ఎంత మేర మామూళ్లు అందజేయాలనే అంశంపైనా స్పస్టత వచ్చినట్లు తెలుస్తోంది. సిండికేట్ నాయకుడు చొరవ తీసుకుని కొంతమంది వ్యాపారులతో మామూళ్ల అడ్వాన్సుగా రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు బుధవారమే ఇప్పించినట్లు సమాచారం. వాటాలు ఇలా... మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో ఆరు రిటైల్షాపులు ఉన్నాయి. మచిలీపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో ఎంఆర్పీ కన్నా ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదే పద్ధతిని మచిలీపట్నం ఈఎస్ కార్యాలయ పరిధిలోనూ అమలు చేయవచ్చని, ఇందుకు ఎక్సైజ్ శాఖలో అందరూ సానుకూలంగా ఉన్నారని, సమావేశం ఏర్పాటు చేసిన అధికారి చెప్పినట్లు తెలిసింది. ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల చొప్పున ధర పెంచినా తాము పట్టించుకోమని, ఇది తన మాట కాదని, పై అధికారులు చెప్పారని ప్రకటించినట్లు సమాచారం. రిటైల్ షాపులు, మద్యం దుకాణాలకు పర్మినెంట్ లెసైన్స్‌లు ఇస్తున్నామని, ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఒక్కో షాపునకు రూ.55వేలు లంచం ఇవ్వాలని సిండికేట్ నాయకుడు, సర్కిల్ స్థాయి అధికారి చేసిన సిఫార్సులకు రిటైల్‌షాపుల యజమానులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒక్కో షాపు ద్వారా ఇచ్చే రూ.55 వేలలో ఎక్సైజ్ శాఖ డెప్యూటీ కమిషనర్‌కు రూ.10 వేలు, ఈఎస్కి, 10 వేలు, సీఐకి రూ.10వేలు, ఎక్సైజ్‌స్టేషన్‌కు రూ.25వేల చొప్పున అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బందరు సీఐ కార్యాలయ పరిధిలోని రిటైల్ దుకాణాల యజమానులతో బుధవారం సమావేశం ముగియగా, గురువారం మద్యం దుకాణ యజమానులతోనూ సమావేశం కానున్నారు. పక్కా వ్యూహంతోనే వసూళ్లు మచిలీపట్నం ఈఎస్ కార్యాలయానికి సోమవారం ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వచ్చారు. అధికారులంతా సమావేశమై మద్యం ధరలు పెంచడం, మామూళ్లు వసూలు చేయడంపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షాపులకు లెసైన్స్‌లు మంజూరు చేసే సమయంలోనే నగదు వసూలు చేయాలని, ఇందుకోసం సిండికేట్ నాయకుల సాయం తీసుకోవాలని ఆ అధికారి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తంతోపాటు ఒక్కో మద్యం దుకాణం నుంచి ప్రతి నెలా రూ.15వేలు మామూళ్లు వసూలు చేసే విషయంపై సిండికేట్ నాయకులు, ఎక్సైజ్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. -
ఆరోసారైనా..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమ్మకం కాని, లెసైన్సు రెన్యూవల్ చేసుకోని మద్యం షాపుల కేటాయింపునకు ఎక్సైజ్ అధికారులు మరోమారు నోటిఫికేషన్ జారీ చేశా రు. గత యేడాది జూలై నుంచి ఇప్పటివరకు ఐదు పర్యాయాలు నోటిఫికేషన్ జారీ చేసినా 19 మద్యం దుకాణాలు నిర్వహించేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. మరోవైపు ఈ యేడాది ఏడుగురు వ్యాపారులు లెసైన్సు రెన్యూవల్ చేసుకోలేదు. దీంతో మొత్తం 26 మద్యం షాపులకు లెసైన్సు కేటాయించేందుకు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 19 మద్యం దుకాణాలతో పాటు లెసైన్సు రెన్యూవల్‌కు ముందుకురాని సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, ఎన్సాన్పల్లి, మంబోజిపల్లి, సిద్దిపేటలోని రెండు దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల నాలుగో తేదీ దరఖాస్తు గడువు కాగా, ఐదో తేదీ ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిలో అర్హులను నిర్ణయిస్తారు. ఎంపిక చేసిన లెసైన్సుదారులకు దుకాణాలు నిర్వహించేందుకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వచ్చే యేడాది జూన్ 30 వరకు కాల పరిమితి విధించారు. అయితే కాల పరిమితిని దృష్టిలో పెట్టుకుని శ్లాబ్ రేట్లను కూడా తగ్గించారు. 10 వేల జనాభా కంటే తక్కువ ఉన్న చోట రూ.24.37 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా వుంటే రూ.25.50 లక్షలు, 50 వేల నుంచి మూడు లక్షల జనాభా ఉంటే రూ.31.50 లక్షలు శ్లాబ్‌గా నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 65 మద్యం షాపులకు గాను, 26 షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆదాయం తగ్గుతుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పండుగల సీజన్ ఉన్నందున దరఖాస్తుదారులు షాపుల నిర్వహణకు ముందుకు వస్తారని ఎక్సైజ్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.