సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమ్మకం కాని, లెసైన్సు రెన్యూవల్ చేసుకోని మద్యం షాపుల కేటాయింపునకు ఎక్సైజ్ అధికారులు మరోమారు నోటిఫికేషన్ జారీ చేశా రు. గత యేడాది జూలై నుంచి ఇప్పటివరకు ఐదు పర్యాయాలు నోటిఫికేషన్ జారీ చేసినా 19 మద్యం దుకాణాలు నిర్వహించేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. మరోవైపు ఈ యేడాది ఏడుగురు వ్యాపారులు లెసైన్సు రెన్యూవల్ చేసుకోలేదు. దీంతో మొత్తం 26 మద్యం షాపులకు లెసైన్సు కేటాయించేందుకు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 19 మద్యం దుకాణాలతో పాటు లెసైన్సు రెన్యూవల్‌కు ముందుకురాని సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, ఎన్సాన్‌పల్లి, మంబోజిపల్లి, సిద్దిపేటలోని రెండు దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు.
ఈ నెల నాలుగో తేదీ దరఖాస్తు గడువు కాగా, ఐదో తేదీ ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిలో అర్హులను నిర్ణయిస్తారు. ఎంపిక చేసిన లెసైన్సుదారులకు దుకాణాలు నిర్వహించేందుకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వచ్చే యేడాది జూన్ 30 వరకు కాల పరిమితి విధించారు. అయితే కాల పరిమితిని దృష్టిలో పెట్టుకుని శ్లాబ్ రేట్లను కూడా తగ్గించారు. 10 వేల జనాభా కంటే తక్కువ ఉన్న చోట రూ.24.37 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా వుంటే రూ.25.50 లక్షలు, 50 వేల నుంచి మూడు లక్షల జనాభా ఉంటే రూ.31.50 లక్షలు శ్లాబ్‌గా నిర్ణయించారు.
జిల్లాలో మొత్తం 65 మద్యం షాపులకు గాను, 26 షాపుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆదాయం తగ్గుతుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పండుగల సీజన్ ఉన్నందున దరఖాస్తుదారులు షాపుల నిర్వహణకు ముందుకు వస్తారని ఎక్సైజ్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆరోసారైనా..!
Published Wed, Oct 2 2013 6:44 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement