పబ్‌ల యజమానులు, అధికారులతో సమావేశమైన సీపీ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తూ వ్యాపార సంస్థల లైసెన్సుల రెన్యువల్‌కు పోలీసు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే అవకాశం కల్పించనున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో బార్లు, రెస్టారెంట్లు, పబ్బులతో పాటు డ్రైవ్–ఇన్ రెస్టారెంట్ల యాజమాన్యాలతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలోనే త్వరలో ఆన్‌లైన్ రెన్యువల్ విధానం అమలులోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో కొకైన్ దొరకడం, కొన్ని పబ్బు ద్వారా తీవ్ర ధ్వనికాలుష్యం వెలువడుతోందని, వీటి పార్కింగ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, మందుబాబుల ఆగడాలు పెరిగాయని వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కొత్వాల్ ఈ సమావేశం నిర్వహించారు. తమ లాభాల కోసం కొన్నింటి యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ సిటీకి అపఖ్యాతి తీసుకువస్తున్నారని ఆనంద్ అన్నారు. ఈ సమావేశానికి హాజరైన దాదాపు 100 మందికి సిటీ పోలీస్ యాక్ట్, అందులోని నిబంధనలు ఇతర అంశాలను వివరించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే తక్కువ వయస్సు ఉన్న వారిని పబ్బుల్లోకి, బార్లలోకి అనుమతించవద్దని, ధ్వని స్థాయిలను పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం 30 రోజుల బ్యాకప్‌తో ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రాంగణంలో సౌండ్ ప్రూఫింగ్, వ్యాలెట్ డ్రైవర్లు, సిబ్బంది, కస్టమర్లను గమనిస్తూ ఉండటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మద్యం సరఫరాకు సంబంధించి రాత్రి 11 గంటల తరువాత వచ్చిన ఆర్డర్‌లను అంగీకరించరాదని కచ్చితంగా 12 గంటల లోపు మూసివేయాలని ఆదేశించారు. (క్లిక్: దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్)
శుక్ర, శనివారాల్లో లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని అర గంట అదనపు సమయంతో సహా గంట మినహాయింపు ఇస్తున్నామన్నారు. పాశ్చాత్య దేశాలలో పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందు నిర్వాహకులు తమ లైట్లను డిమ్ చేస్తూ కస్టమర్లు అది మూసే సమయమైందని తెలిసేలా చేస్తారని, ఇక్కడా ఈ విధానం అమలు చేయాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికులు లేదా ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని స్టార్ రేటింగ్ ఉన్న హోటళ్లలో 24 గంటలూ మద్యం విక్రయించేందుకు అనుమతి ఉంటుందని, ఇది సాధారణ ప్రజల కోసం కాదని ఆనంద్ స్పష్టం చేశారు. ఇలాంటి బార్లు, రెస్టారెంట్లు, పబ్బులకు ఇకపై అనుమతులు ఉండవని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీలు ఎం.రమేష్, పి.విశ్వప్రసాద్‌లతో పాటు జోనల్ డీసీపీలు పాల్గొన్నారు. (క్లిక్: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు)
Comments
Please login to add a commentAdd a comment