ఉప్పుటేరులో మృతురాలి తల లభ్యం | woman head received in Upputeru | Sakshi
Sakshi News home page

ఉప్పుటేరులో మృతురాలి తల లభ్యం

Published Sun, Aug 10 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

ఉప్పుటేరులో మృతురాలి తల లభ్యం

ఉప్పుటేరులో మృతురాలి తల లభ్యం

కాకినాడ క్రైం :కాకినాడలో భర్తచేతిలో హతమైన  మృతురాలి తల  మూడు రోజుల అనంతరం ఎట్టకేలకు శనివారం సాయంత్రం ఉప్పుటేరులో లభ్యమైంది. ఈ నెల 6న అర్ధరాత్రి కాకినాడ వెంకటేశ్వర కాలనీకి చెందిన గుమ్మడి మరియమ్మ (38)ని ఆమె భర్త  శ్రీరామకృష్ణ హతమార్చి  ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి మూటలు కట్టి వివిధ ప్రాంతాల్లో పడేసినసంగతి తెలిసిందే. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను పడేసిన అన్ని శరీర భాగాలను సేకరించి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే తల, పేగులు మాత్రం దొరకలేదు. దీంతో శ్రీరామకృష్ణను ప్రశ్నించగా, ప్లాస్టిక్‌డబ్బాలో తలను, స్టీల్‌బాక్సులో పేగులను పెట్టి ఉప్పుటేరు పడేసినట్టు వెల్లడించాడు.  
 
 పోలీసులు ఉప్పుటేరులో గాలించగా, శుక్రవారం పేగులు, శనివారం సాయంత్రం తల లభ్యమయ్యాయి. ఇదిలా ఉంటే పర్లోపేట సమీపంలోని డంపింగ్ యార్డులో పోలీసులకు మరికొన్ని శరీర భాగాలు లభ్యమయ్యాయి. శనివారం సాయంత్రం జగన్నాథపురం ఏటిమొగ వెళ్లే దారిలో ఉప్పుటేరులో తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అద్దంకి శ్రీనివాసరావు సిబ్బందితో వెళ్లి తలను పైకి తీయించారు. ఆదివారం శరీరభాగాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. నింది తుడు శ్రీరామకృష్ణను కోర్టులో ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అతనిని పోలీసులు కాకినాడ సబ్‌జైలుకు తరలించారు.
 
 మూడు రోజులు శ్రమించిన పోలీసులు
 మరియమ్మను  బుధవారం అర్ధరాత్రే హత్య చేసినప్పటికీ గురువారం మధ్యాహ్నానికి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శ్రీరామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతను నవ్వుతూ సమాధానం చెబుతుండడంతో వారు అసహనానికి గురయ్యారు. అయినా మూడు రోజులపాటు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సైలు రమేష్, రవికుమార్, పార్థసారథి, సతీష్, కిశోర్ కుమార్ తీవ్రంగా శ్రమించారు. మరియమ్మ శరీర భాగాలను ముక్కలుగా చేసి  పడేవేయడంతో వన్‌టౌన్ పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. ఘటనా స్థలంలో నోరు విప్పని నిందితుడు  స్టేషన్‌కు తరలించిన తర్వాత మూటలు ఎక్కడ పడేశాడో చెప్పాడు. వాటిని సేకరించేందుకు పోలీసులు మూడు రోజులపాటు శ్రమించారు.
 
 చిన్నపాటి కత్తులతోనే ముక్కలు చేశాడు
 మరియమ్మ శరీర భాగాలను ముక్కలుగా కోసేందుకు  చిన్నపాటి కూరగాయలు కోసే కత్తులనే ఉపయో గించానని నిందితుడు చెప్పడంతో పోలీసులు కూడా విస్మయానికి గురవుతున్నారు. రాత్రంతా తాపీగా మృతదేహాన్ని ఖండ ఖండాలుగా నరికినట్టు దర్యాప్తులో తేలిం ది. జాయింట్ల వద్ద చర్మాన్ని కోసి అక్కడ దుమ్ములను విరగొట్టి వాటిని సంచుల్లో మూట కట్టినట్టు తెలిసింది.
 
 పుట్టింటికి వెళ్లిందని నమ్మించేందుకు యత్నం
 శ్రీరామకృష్ణ మొదటి భార్య చనిపోవడంతో 18 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన మరియమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. తొలుత విజయవాడలోనే వీరు ఉండేవారు. చిన్న కుమారుడు సీమోనుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తరచూ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకురావాల్సి వచ్చేది. దీంతో కాకినాడకు మకాం మార్చారు. కుటుంబ పోషణ నిమిత్తం మరియమ్మ కూడా హోటల్లో పనిచేస్తుండేది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో శ్రీరామకృష్ణ మనస్థాపానికి గురై ఆమెను కిరాతకంగా హతమార్చాడు.  మరియమ్మ గురువారం విజయవాడ వెళ్లేందుకు దుస్తులు సర్దుకోవడంతో  మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు చోట్ల పడేసి భార్య పుట్టింటికి వెళ్లిందని నమ్మించేందుకు యత్నించాడు. రక్తపు మరకలను స్థానికులు గమనించడంతో గుట్టురట్టయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement