కాళ్లు కాలుస్తున్న కెమికల్ వ్యర్థాలు
బీచ్ రోడ్డుపై యథేచ్ఛగా డంపింగ్
అనారోగ్యాల బారిన ప్రజలు
చోద్యం చూస్తున్న అధికారులు
ఎవరో చేసిన నిర్లక్ష్య వ్యవహారానికి పన్నెండేళ్ల బాలిక నరక యాతన అనుభవిస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలను తిరుగాడే ప్రదేశాల్లో పారబోయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ బీచ్ రోడ్డులో సూర్యారావు పేట సమీపంలో ఉండే రెండు రసాయనిక పరిశ్రమలు తమ వ్యర్థాలను ఆరుబయటే పారేస్తుండడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ నెల 8వ తేదీన తన స్నేహితులతో అటుగా వెళ్లిన ఈ బాలిక రెండు కాళ్లు కాలిపోయాయి. ఏదో చిన్నదేలా అనుకునే సమయంలోనే మోకాలి వరకు బొబ్బలెక్కడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటి వరకు సంబంధిత యాజమాన్యం బాధ్యత తీసుకోలేదు. వైద్య ఖర్చుల కోసం వేల రూపాయలవుతోందని...పేద కుటుంబం ... ఎలా ముందుకు సాగేదని వాపోతోంది ఆ బాలిక తల్లిదండ్రులు.
సూర్యారావుపేట (కాకినాడ రూరల్) : పారిశ్రామిక, ఆయిల్ రిఫైనరీల వ్యర్థాలను నిర్వాహకులు బీచ్ రోడ్డులో డంపింగ్ చేయడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక పక్క పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుంటే మరో పక్క కెమికల్ వ్యర్థాలను బీచ్‌రోడ్డు, ఖాళీగా ఉన్న నివాస స్థలాల వద్ద పారవేయడంతో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు.
డంపింగ్ యార్డుగా బీచ్‌రోడ్డు..
కాకినాడ రూరల్ మండల పరిధిలోని తీరప్రాంత గ్రామం సూర్యారావుపేటలో సుమారు 5,600 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ నివసించేవారందరూ మత్స్యకారులు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీరప్రాంతానికి ఆనుకుని సూర్యారావుపేట, వాకలపూడి, పెనుమర్తి పంచాయతీల పరిధిలో తీరానికి ఆనుకుని సుమారు 18 ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలు, క్రూడ్ ఆయిల్ మరిగిస్తున్న ఫ్యాక్టరీ, చక్కెర తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో ఆయిల్ రిఫైనరీ, క్రూడాయిల్ మరిగించడానికి, ఘగర్ తయారు చేసిన తర్వాత వచ్చిన కెమికల్ వ్యర్థాలను ఫ్యాక్టరీలు నిబంధనల మేరకు నిల్వ చేయకుండా, నేరుగా కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి బీచ్‌రోడ్డులో ఆరుబయట పారబోయిస్తున్నారు. ముఖ్యంగా బీచ్‌లో ఖాళీగా ఉన్న ప్రదేశాలు పోలవరం, నేమాం, సూర్యారావుపేట, శివాలయం, సూర్యారావుపేట లైట్ హౌస్ సమీపాన రాత్రి, తెల్లవారుజామున స్థానికుల సంచారం లేని సమయాల్లో వ్యర్థాలను తీసుకువచ్చి పారబోస్తున్నారు. దీంతో బీచ్‌రోడ్డులో రాకపోకలు సాగించే సమయంలో వ్యర్థాల నుంచి వస్తున్న ధూళి, దుర్వాసనకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా వేస్తున్న వ్యర్థాలపై మోటార్‌బైక్‌లపై వెళ్తున్న ప్రజలు జారిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలు..
ఘగర్ వ్యర్థాలతో వాహనచోదకులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఘగర్ నుంచి వచ్చిన వ్యర్థ ఊటను నిర్వాహకులు ట్యాంకర్లతో తీసుకొచ్చి బీచ్‌రోడ్డు, నేమాం, పోలవరం రహదారులపై పారబోస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పోలవరం, నేమాంలకు చెందిన ప్రయాణీకులు బైక్‌పై నుంచి జారి పడిన ఘటనలో ముగ్గురు గాయాలబారిన పడ్డారు.
పి.రమేష్,పోలవరం.
కాళ్లు కాలిపోతున్నాయి.
పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాలను ప్యాక్టరీలో నిల్వ చేయకుండా, ట్యాంకర్లతో బయటకు తీసుకొచ్చి బీచ్‌రోడ్డు, ఖాళీస్థలాల్లో పారబోస్తున్నారు. కంపెనీ నిర్వాహకులు స్థానికుల కంట పడకుండా తెల్లవారుజాము సమయంలో కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్లతో తీసుకొచ్చి లైట్‌హౌస్ సమీపాన ఖాళీ స్థలంలో వేస్తున్నారు. బూడిద, మట్టి రంగులో ఉంటున్న రసాయన వ్యర్థాల్లో పొరపాటున నడిస్తే కాళ్లు కాలిపోయి, చర్మం అంతా ఎలర్జీ వస్తోంది.
ఎస్.సత్తిబాబు, తమ్మవరం.
నా కుమార్తె రెండు కాళ్లు కాలిపోయాయి
నాకుమార్తె మరియ స్నేహితులతో కలసి బయటకు వెళుతున్న సమయంలో బూడిద రంగులో ఉన్న మట్టిలో నడవడంతో రెండు కాళ్లూ తీవ్రంగా కాలిపోయాయి. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా రూ.30 వేలు వ్యయమవుతాయని వైద్యులు తెలిపారు. కెమికల్ వ్యర్థాలు ఇక్కడ వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
మర్రి శ్రీను, బాధితురాలి తండ్రి, సూర్యారావుపేట.
ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలకు గురవుతున్నాం
ఘగర్ కంపెనీ నిర్వాహకులు ఘగర్ కోసం వినియోగించిన వ్యర్థాలను తీసుకొచ్చి నేమాం–పోలవరం రోడ్డు వేసేస్తున్నారు. ఘగర్ నుంచి వచ్చిన నూనెలా ఉన్న మడ్డును తీసుకొచ్చి రోడ్డుపై పారబోయడం వల్ల తెల్లవారుజామున బైక్‌లపై వెళ్తున్నవారు జారిపోయి కిందపడడం వల్ల నలుగురు వాహనచోదకులు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయమై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
ఎం.రమణ, తమ్మవరం.
విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా
కెమికల్ వ్యర్థాలను బీచ్‌రోడ్డులో పారబోయడంపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా. పారిశ్రామిక వ్యర్థాలను ఆరు బయట వేయరాదు. ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తాం.
రవీంద్రబాబు, ఈఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రమణయ్యపేట.