‘చెత్త’ కథ..తీరని వ్యథ
జిల్లాలో డంపింగ్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతోంది. ఈ పరిస్థితి గ్రామాల్లో మరీ ఎక్కువగా ఉంది. అరకొర సిబ్బందితో పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నప్పటికీ, పేరుకుపోయే చెత్తను ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. డంపింగ్ యార్డుల నిర్మాణానికి నిధుల కొరత లేనప్పటికీ అధికారుల చిత్తశుద్ధి లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సాక్షి, కాకినాడ :జిల్లాలో 985 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్స్) ఉన్నాయి. ఏ ఒక్క గ్రామంలోనూ డంపింగ్ యార్డు లేదు. దాదాపు ప్రతీ గ్రామంలోనూ నిత్యం సేకరించే టన్నుల కొద్దీ చెత్తను ఊరికి దూరంగా ప్రైవేటు స్థలాలు, పొలాల మధ్య డంప్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో పట్టణాలకు దీటుగా పల్లెలు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో డంపింగ్ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించి ప్రతీ గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన డంపింగ్ యార్డు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో సంకల్పించారు. ఉపాధి హామీ పథకంలో ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఇందుకోసం మూడు నుంచి ఐదు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆ పంచాయతీలో గుర్తించాలి. ఒక్కొక్క డంపింగ్ యార్డు నిర్మాణం కోసం రూ.1.24 లక్షల చొప్పున ఖర్చు చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో రూ.50 వేల వరకు మెటీరియల్ కాంపొనెంట్ కింద ఖర్చు చేయనుండగా, మిగిలిన మొత్తాన్ని ఉపాధి కూలీలకు మట్టి పని కల్పించేందుకు 785 పనిదినాలు కల్పించడం కోసం వెచ్చిస్తారు. నిధుల కొరత లేనప్పటికీ శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల్లో చిత్తశుద్ధి లేమి కారణంగా డంపింగ్ యార్డుల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది.
పూర్తయినవి రెండే..
తొలి విడతలో గతేడాది జిల్లాలో 453 గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణనికి అంచనాలు రూపొందించారు. వీటిలో 407 గ్రామాల్లో డంపింగ్‌యార్డుల నిర్మాణానికి పరిపాలనాపరమైన ఆమోదం కూడా లభించింది. వీటిలో కేవలం 67 గ్రామాల్లో మాత్రమే డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టారు. ఏడాది క్రితమే ఈ నిర్మాణాలు చేపట్టినా, కేవలం రెండు డంపింగ్ యార్డులు మాత్రమే పూర్తి చేయగలిగారు. జగ్గంపేట మండలం గుర్రంపాలెం, గండేపల్లి మండలం సుబ్బయమ్మపేటల్లో ఇవి పూర్తయ్యాయి. మిగిలిన 65 డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పరిపాలనామోదం పొందిన మిగిలిన 340 గ్రామాల్లోని డంపింగ్ యార్డుల పరిస్థితి అతీగతి లేకుండా ఉంది.
కార్యదర్శుల కొరత కారణమే..
జిల్లాలో 985 పంచాయతీలకు 481 పంచాయతీలకు మాత్రమే పూర్తిస్థాయి కార్యదర్శులు అందుబాటులో ఉన్నారు. సుమారు 504 పంచాయతీలకు కార్యదర్శుల్లేని పరిస్థితి. డంపింగ్ యార్డుల నిర్మాణం కార్యరూపం దాల్చలేకపోవడానికి కార్యదర్శుల కొరత కూడా ఒక కారణం. ఒక్కొక్క కార్యదర్శి రెండు లేక మూడు పంచాయతీలకు ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టడం వల్ల డంపింగ్ యార్డులపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇదే సమయంలో ఇతర శాఖలు కూడా ఈ విషయంలో సహకారం అందించకపోవడం వల్ల యార్డుల నిర్మాణం స్తంభించింది. స్థల సమస్య వల్లే ఎక్కువ గ్రామాల్లో వీటి నిర్మాణం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. డంపింగ్ సమస్య వల్లే అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. గురువారం నుంచి రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలు చేస్తున్న జన్మభూమి-మావూరు కార్యక్రమంలో స్వచ్ఛతాంధ్ర ర్యాలీలు, పారిశుధ్య కార్యక్రమాలకు పెద్ద పీట వేశారు. ఇందులోనైనా శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపానికి ఫుల్‌స్టాప్ పెట్టి, డంపింగ్ యార్డుల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.