కాకినాడ, న్యూస్‌లైన్ : రెండో మద్రాస్‌గా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన నగరంగా, పెన్షనర్ల పేరడైజ్‌గా పేరున్న కాకినాడ ‘పేరు గొప్ప.. ఊరు గబ్బు’ చందంగా మారింది. జిల్లా యంత్రాంగాన్ని కనుసన్నలతో నడిపించగల కలెక్టర్ నీతూప్రసాద్ ప్రత్యేకాధికారిగా ఉన్న నగరంలో ఏ రోడ్డులో చూసినా చెత్తే కనిపిస్తోంది. డంపింగ్ యార్డు సమస్య కారణంగా సేకరించిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది కాస్త లోతట్టు ప్రాంతంగానీ, ఖాళీ స్థలం గానీ కనిపిస్తే చాలు అక్కడే వేసేస్తున్నారు. దశాబ్ది నుంచి ఉన్న ఈ సమస్యపై అధికారులకు ముందు చూపు లేక, సరైన ప్రణాళిక కొరవడ్డ దుష్ఫలితాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. అందుబాటులో ఉన్న సామాజిక స్థలాలు, లోతట్టు ప్రాంతాల్లో చెత్తను తరలించేందుకు పారిశుద్ధ్య విభాగం చేస్తున్నప్రయత్నాలకు స్థానికుల నుంచి ప్రతిఘటన వస్తుండడంతో నగరంలో చాలా ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయి నగరమంతా మురికి కూపాన్ని తలపిస్తోంది. దుర్గంధం వ్యాపిస్తోంది.
రోజుకు 300 టన్నుల చెత్త సేకరణ
నిత్యం నగరపాలక సంస్థకు చెందిన 25 ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్ల ద్వారా 14 శానిటరీ సర్కిళ్ల పరిధిలో 300 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. గతంలో ఈ చెత్తను శారదాదేవి ఆలయ ప్రాంతంలోని డంపింగ్‌యార్డుకు తరలించేవారు. జనావాసాల మధ్యకు చెత్తను తరలించడం వల్ల భూగర్భజలాలు కలుషితం కావడం, పరిసర ప్రాంతవాసులు అనారోగ్యాలపాలవుతున్నామంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అక్కడ చెత్త వేయవద్దని హైకోర్టు ఆరు నెలల క్రితం ఆదేశించింది. అప్పటి నుంచి వీలున్నచోటల్లా చెత్తను వేస్తూ రోజులు గడిపేస్తున్న నగరపాలక సంస్థ డంపింగ్‌యార్డు కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని అందుబాటులోకి తేవడంలో విఫలమవుతోంది. నగరంలో ఎక్కడా చెత్త వేయలేని పరిస్థితుల్లో చాలా చోట్ల చెత్తను తొలగించని దుస్థితి నెలకొంది.
కొద్దిచోట్ల చెత్తను సేకరించి పోర్టు ప్రాంతంలో సామర్లకోట కెనాల్ వద్ద వేసేందుకు ప్రయత్నించగా, ఇరిగేషన్, రేవు అధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం చేతులెత్తేసింది. దీంతో నగరంలోని చాలా డివిజన్లలో డంపర్‌బిన్స్‌లో, రోడ్డుపక్కన ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోతోంది. గత్యంతరం లేక కొన్నిచోట్ల చెత్తను తగలబెడుతున్నారు.
పదేళ్లుగా పట్టి పీడిస్తోంది..
కాకినాడను చెత్త డంపింగ్ సమస్య దాదాపు పదేళ్లుగా పీడిస్తోంది. అప్పట్లో పండూరు వద్ద తొమ్మిది ఎకరాల స్థలాన్ని గుర్తించి, రూ.10 లక్షల ఖర్చుతో ప్రహరీకూడా నిర్మించి అంతా సిద్ధం చేశాక స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. ఆ తరువాత కాకినాడ శివారు గోళీలపేట వద్ద 20 ఎకరాల రెవెన్యూ స్థలాన్ని గుర్తించగా కాలుష్యనియంత్రణామండలి అడ్డుచెప్పడంతో అది కూడా పక్కకు పోయింది. ఏడాది క్రితం చొల్లంగిలో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు ప్రతిపాదించగా స్థానికుల నుంచి వ్యతిరేకత రావడం, పొల్యూషన్‌బోర్డు అభ్యంతరాలతో అధికారులు వెనక్కి తగ్గారు.
తాజాగా గొల్లప్రోలు మండలం చెందుర్తి వద్ద సుమారు 20 ఎకరాల స్థలాన్ని గుర్తించి అక్కడకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ స్థలంలో కూడా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఆ ఇబ్బందులను అధిగమించి ఎలాగైనా చెందుర్తి వద్ద డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలన్న అధికారుల ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో, నగరాన్ని పీడిస్తున్న చెత్త సమస్య ఎప్పటికి విరగడ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.
పేరు గొప్ప.. ఊరు గబ్బు
Published Fri, Dec 13 2013 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement