కొత్తకొత్తగా..!
‘తూర్పు’న నూతన సంవత్సరం పొద్దు పొడిచిన తరువాత.. జిల్లాలో పాలన కొత్తకొత్తగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్ల అధికార యంత్రాంగంలో కీలకమైన నలుగురు అధికారులు కొత్త సంవత్సరంలో బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడమే ఇందుకు కారణం. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులుగా ప్రస్తుతం పనిచేస్తున్న నలుగురు అధికారులూ త్వరలో బదిలీ అవడం ఖాయమని అధికారవర్గాలు చెప్పుకొంటున్నాయి. వీరి స్థానంలో కొత్తవారు వస్తే.. పాలన కూడా కాస్త కొత్తగా సాగవచ్చని భావిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కొత్త సంవత్సరంలో కొత్తగా వచ్చే అధికారులకోసం జిల్లా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాష్ర్ట విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసుల అధికారుల కేటాయింపులో భాగంగా జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలంగాణకు బదిలీ కావడం అనివార్యమైంది. అధికారుల సహాయ సహకారాలతో విజయవంతంగా పని చేయగలిగానని కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో అధికారులను కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. తెలంగాణకు వెళ్లిపోతున్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. రెండున్నరేళ్లు పైగా ఇక్కడ పని చేసిన ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ బుధ, గురువారాల్లో గెజిట్ వెలువడే అవకాశం ఉంది. ఆ వెంటనే ఆమె నీతూప్రసాద్ రిలీవ్ అవుతారని అధికార వర్గాల సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. ఆమె తరువాత కలెక్టర్‌గా ఎవరు వస్తారనేది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
ముమ్మరంగా ఆశావహుల యత్నాలు
పెద్ద జిల్లా కావడం, భౌగోళికంగా మెట్ట, మైదానం, డెల్టా, ఏజెన్సీ.. ఇలా అన్ని ప్రాంతాలూ కలిసి ఉండటంతో ఐఏఎస్ అధికారులు తమ పదవీ కాలంలో ఒక్కసారైనా ఇక్కడ కలెక్టర్‌గా పని చేయడానికి ఆసక్తి చూపిస్తారు. నీతూప్రసాద్ బదిలీ అవుతారన్న వార్తలు వస్తున్న క్రమంలోనే ఇక్కడకు వచ్చేందుకు ఆశావహులు ప్రయత్నాలను వేగవంతం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ బదిలీలప్పుడు నీతూ ప్రసాద్ స్థానంలో టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు వస్తారనే ప్రచారం జరిగింది. ఆయనది చిత్తూరు జిల్లా కావడంతో అదే జిల్లాకు చెందిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులు ఆయనకు ఉంటాయని బలమైన ప్రచారం నడిచింది. ఇప్పుడు కూడా కలెక్టర్ రేసులో ఆయన ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మరో ఏడు నెలల్లో రానున్న గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో వివాదరహితుడనే పేరున్న శ్రీనివాసరాజువైపే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.అయితే శ్రీనివాసరాజుతో పాటు మరో ముగ్గురి పేర్లు కూడా తాజాగా తెరపైకి వచ్చాయి. వారిలో సెర్ప్ సీఈఓ అరుణ్‌కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఆయన కాకినాడ ఆర్డీఓ, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, రాజమండ్రి కమిషనర్‌గా పని చేశారు. ఈ పూర్వ అనుభవం పుష్కరాలకు ఉపయోగపడుతుందనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆయన విజయనగరంలో పని చేసిన సమయంలో అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ కోన శశిధర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అరుణ్‌కుమార్ రావాల్సి ఉంది. అయితే ఆయనది, అప్పటి కలెక్టర్ రవిచంద్రది శ్రీకాకుళం జిల్లాయే కావడంతో అరుణ్‌కుమార్ రాకకు బ్రేకులు పడ్డాయి. రిటైర్డ్ డీజీపీ హెచ్‌జే దొరకు బంధువు కావడంతో ఈసారి అరుణ్‌కుమార్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
వీరితోపాటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన రోనాల్డ్ రాజ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఆయన గతంలో ఇక్కడ ఐటీడీఏ పీఓగా పని చేశారు. సామాజిక సమతూకాల్లో ఎంతవరకూ ఆయనకు కలిసిస్తుందనేది వేచి చూడాల్సిందే. మరో ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆయనది జిల్లాలోని దుగ్గుదూరు కావడంతో ఆ అవకాశం లేదని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద కలెక్టర్‌గా ఎవరు వస్తారనేది అస్పష్టంగానే ఉన్నా, ఒకింత మొగ్గు శ్రీనివాసరాజువైపే కనిపిస్తోంది.
జేసీ బదిలీపైనా ప్రచారం..
మరోపక్క జాయింట్ కలెక్టర్ రేవు ముత్యాలరాజు కూడా బదిలీ కానున్నారన్న ప్రచారం జోరందుకుంది. ముత్యాలరాజు 2013 జూలైలో జేసీగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆయన.. బదిలీ అంటూ జరిగితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైపు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఆయన స్థానంలో కన్ఫర్డ్ ఐఏఎస్ జె.సత్యనారాయణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సత్యనారాయణయ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దాపురం ఆర్డీఓ, జెడ్పీ సీఈఓ.. ఇలా పలు హోదాల్లో ఇక్కడ పని చేశారు. ఈ క్రమంలో జిల్లాలో అధికార పార్టీ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ల తరువాత జిల్లా రెవెన్యూ అధికారి యాదగిరి కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా డీఆర్‌ఓ ఉంటారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈయనే ఏఆర్‌ఓగా పని చేశారు. దీంతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలనాటికి యాదగిరి బదిలీ అనివార్యమంటున్నారు. బదిలీ అవుతారని ప్రచారం ఉన్న మరో అధికారి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు. ఆయన రాజధాని భూ సేకరణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కమిటీలో భూ సేకరణ అధికారిగా వెళతారనే ప్రచారం ఉంది. ఇప్పటికే ఆయన రాజధాని భూ సేకరణపై హైదరాబాద్‌లో జరుగుతున్న శిక్షణలో ఉన్నారు. శిక్షణ అనంతరం భూ సేకరణ విభాగానికి బదిలీ చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ విధంగా జిల్లా పాలనలో కీలకమైన నలుగురు అధికారుల బదిలీ, ఆ పోస్టింగ్‌లలో కొత్తవారి రాకపై జిల్లాలో ఆసక్తి రేగుతోంది.