Sri Ramakrishna
-
డై..లాగి కొడితే...
సినిమా : శివాజి రచయిత: శ్రీ రామకృష్ణ దర్శకత్వం: శంకర్ ఆమెరికా నుంచి ఇండియాకొచ్చిన శివాజీ (రజనీకాంత్) పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆస్పత్రి కట్టాలనుకుంటాడు. కానీ, అందుకు అనుమతులు ఇచ్చేందుకు అధికారులందరూ లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శివాజి వాళ్లపై పోరాటం చేస్తుంటాడు. ఆ క్రమంలో తన పలుకుబడితో రాజకీయాలనే శాసిస్తున్న ఆదిశేషుతో (సుమన్) ఎలాగైనా ఆస్పత్రి కడతానంటూ ఛాలెంజ్ చేస్తాడు. ఆదిశేషు దగ్గర రెండు వందల కోట్ల బ్లాక్ మనీ ఉందని తెలుసుకున్న శివాజి వంద కోట్లు డిమాండ్ చేస్తాడు. వంద కోట్లు తీసుకొచ్చి శివాజికి అప్పగిస్తాడు ఆదిశేషు. ఆ డబ్బు తీసుకెళుతుండగా ఆదిశేషు అనుచరులు శివాజీని అడ్డుకుని చుట్టు ముడతారు. వారిలో ఒకడు ‘పిచ్చోడిలా ఒంటరిగా వచ్చి ఇరుక్కుపోయావురా అని’ శివాజీని అంటాడు. నాన్నా.. పందులే గుంపుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా వస్తుంది అని స్టైల్‌గా, కూల్‌గా కౌంటర్ ఇస్తాడు శివాజి. ఈ డైలాగ్ అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. -
ఉప్పుటేరులో మృతురాలి తల లభ్యం
కాకినాడ క్రైం :కాకినాడలో భర్తచేతిలో హతమైన మృతురాలి తల మూడు రోజుల అనంతరం ఎట్టకేలకు శనివారం సాయంత్రం ఉప్పుటేరులో లభ్యమైంది. ఈ నెల 6న అర్ధరాత్రి కాకినాడ వెంకటేశ్వర కాలనీకి చెందిన గుమ్మడి మరియమ్మ (38)ని ఆమె భర్త శ్రీరామకృష్ణ హతమార్చి ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి మూటలు కట్టి వివిధ ప్రాంతాల్లో పడేసినసంగతి తెలిసిందే. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను పడేసిన అన్ని శరీర భాగాలను సేకరించి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే తల, పేగులు మాత్రం దొరకలేదు. దీంతో శ్రీరామకృష్ణను ప్రశ్నించగా, ప్లాస్టిక్‌డబ్బాలో తలను, స్టీల్బాక్సులో పేగులను పెట్టి ఉప్పుటేరు పడేసినట్టు వెల్లడించాడు. పోలీసులు ఉప్పుటేరులో గాలించగా, శుక్రవారం పేగులు, శనివారం సాయంత్రం తల లభ్యమయ్యాయి. ఇదిలా ఉంటే పర్లోపేట సమీపంలోని డంపింగ్ యార్డులో పోలీసులకు మరికొన్ని శరీర భాగాలు లభ్యమయ్యాయి. శనివారం సాయంత్రం జగన్నాథపురం ఏటిమొగ వెళ్లే దారిలో ఉప్పుటేరులో తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అద్దంకి శ్రీనివాసరావు సిబ్బందితో వెళ్లి తలను పైకి తీయించారు. ఆదివారం శరీరభాగాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. నింది తుడు శ్రీరామకృష్ణను కోర్టులో ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అతనిని పోలీసులు కాకినాడ సబ్‌జైలుకు తరలించారు. మూడు రోజులు శ్రమించిన పోలీసులు మరియమ్మను బుధవారం అర్ధరాత్రే హత్య చేసినప్పటికీ గురువారం మధ్యాహ్నానికి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శ్రీరామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతను నవ్వుతూ సమాధానం చెబుతుండడంతో వారు అసహనానికి గురయ్యారు. అయినా మూడు రోజులపాటు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సైలు రమేష్, రవికుమార్, పార్థసారథి, సతీష్, కిశోర్ కుమార్ తీవ్రంగా శ్రమించారు. మరియమ్మ శరీర భాగాలను ముక్కలుగా చేసి పడేవేయడంతో వన్‌టౌన్ పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. ఘటనా స్థలంలో నోరు విప్పని నిందితుడు స్టేషన్‌కు తరలించిన తర్వాత మూటలు ఎక్కడ పడేశాడో చెప్పాడు. వాటిని సేకరించేందుకు పోలీసులు మూడు రోజులపాటు శ్రమించారు. చిన్నపాటి కత్తులతోనే ముక్కలు చేశాడు మరియమ్మ శరీర భాగాలను ముక్కలుగా కోసేందుకు చిన్నపాటి కూరగాయలు కోసే కత్తులనే ఉపయో గించానని నిందితుడు చెప్పడంతో పోలీసులు కూడా విస్మయానికి గురవుతున్నారు. రాత్రంతా తాపీగా మృతదేహాన్ని ఖండ ఖండాలుగా నరికినట్టు దర్యాప్తులో తేలిం ది. జాయింట్ల వద్ద చర్మాన్ని కోసి అక్కడ దుమ్ములను విరగొట్టి వాటిని సంచుల్లో మూట కట్టినట్టు తెలిసింది. పుట్టింటికి వెళ్లిందని నమ్మించేందుకు యత్నం శ్రీరామకృష్ణ మొదటి భార్య చనిపోవడంతో 18 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన మరియమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. తొలుత విజయవాడలోనే వీరు ఉండేవారు. చిన్న కుమారుడు సీమోనుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తరచూ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకురావాల్సి వచ్చేది. దీంతో కాకినాడకు మకాం మార్చారు. కుటుంబ పోషణ నిమిత్తం మరియమ్మ కూడా హోటల్లో పనిచేస్తుండేది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో శ్రీరామకృష్ణ మనస్థాపానికి గురై ఆమెను కిరాతకంగా హతమార్చాడు. మరియమ్మ గురువారం విజయవాడ వెళ్లేందుకు దుస్తులు సర్దుకోవడంతో మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేర్వేరు చోట్ల పడేసి భార్య పుట్టింటికి వెళ్లిందని నమ్మించేందుకు యత్నించాడు. రక్తపు మరకలను స్థానికులు గమనించడంతో గుట్టురట్టయింది. -
దర్యాప్తులో ‘తల’మునకలై..
కాకినాడ క్రైం : కాకినాడలో భర్త చేతిలో హతమైన భార్య ‘తల’ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. స్థానిక పాతబస్టాండ్ ప్రాంతం వెంకటేశ్వర కాలనీకి చెందిన గుమ్మడి మరియమ్మ (38)ను ఆమె భర్త శ్రీరామకృష్ణ అతికిరాతకంగా హతమార్చిన సంగతి విదితమే. ఆమె మృతదేహాన్ని తల, ఛాతి, పొట్ట, కాళ్లు వేర్వేరుగా రెండు మూటల్లో కట్టి డంపర్ బిన్లలో పడేయడంతో పోలీసులు వాటిని నిందితుడు రామకృష్ణ చేతే వెలికితీయించారు. అయితే తల, పేగులను స్టీల్ క్యాన్‌లో పెట్టి ఉప్పుటేరులో పడేశానని నిందితుడు రామకృష్ణ చెప్పడంతో పోలీసులు ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం ఉదయం ప్రేజరుపేటలో కొందరు యువకులు ఉప్పుటేరులో ఈత కొడుతుండగా వారికి ఆ క్యాన్ దొరికింది. దానిని వారు తెరిచేసరికి తీవ్ర దుర్గంధం వెదజల్లింది. దీంతో విషయాన్ని వారు పోలీసులకు తెలపడంతో వన్‌టౌన్ ఎస్హెచ్ఓ అద్దంకి శ్రీనివాసరరావు, ఎస్సైలు రమేష్, రవికుమార్, పార్ధసారధి, సతీష్, కిశోర్ కుమార్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్యాన్‌లో పేగులు మాత్రమే లభ్యమయ్యాయి. దానిని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. తల లభించకపోవడంతో దాని కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పడేశానని నిందితుడు చెబుతుండడంతో దాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ లభ్యం కాకపోవడంతో డంపర్ బిన్లలో చెత్తను బయటకు తీయించి క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేకపోయింది. దీంతో తలను ఉప్పుటేరులోనే పడేసి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహం ముక్కలను జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. తల దొరికిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. తప్పించుకునేందుకే... మృతదేహం ముక్కలను చేసేంత కిరాతకంగా చంపడానికి గల కారణాలపై పోలీసులు దృష్టిసారించారు. కేవలం తప్పించుకునేందుకే నిందితుడు మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని వారు భావిస్తున్నారు. హత్యకు వినియోగించిన ఆయుధం కూడా పోలీసులకు దొరకలేదు. దీంతో పోలీసులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అయితే ఆ రాత్రి ఆమెతో ఉన్న వ్యక్తిపై కూడా శ్రీరామకృష్ణ దాడి చేయడంతో అతడికి కూడా రక్తపు గాయాలై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అతడు ఎవరనే విషయంపైనా పోలీసులు ఆరాతీస్తున్నారు. మరోవైపు మరియమ్మను ఆమె భర్త శ్రీరామకృష్ణ ఒక్కడే హతమార్చాడా! లేక అతడికి ఎవరైనా సహకరించారా! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం జనసంచారంతో ఉండే ఈ ప్రాంతంలో హత్యజరగడం అటు స్థానికులు, ఇటు పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది. వారు నివసించే ఇంటిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వీఆర్వోలు వి. మల్లికార్జునరావు, జి. రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐసీపీఎస్ సంరక్షణలో కుమారులు మరియమ్మ కుటుంబసభ్యులు కృష్ణాజిల్లా విజయవాడలో ఉండడంతో వారిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే శుక్రవారం కాకినాడ చేరుకున్నారు. అంత వరకూ ఆమె కుమారులు 14 ఏళ్ల వెంకటేష్, 10 ఏళ్ల సీమోనుకు పోలీసులు ఆశ్రయం కల్పించారు. అయితే ఆ చిన్నారులను ఐసీడీఎస్ పీడీ ఎంజే నిర్మల ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ పథకం అధికారులు చేరదీసేందుకు ముందుకు వచ్చారు. శుక్రవారం ఆ చిన్నారులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం (ఐసీపీఎస్) లీగల్ ఆఫీసర్ ఎం. సుధాకర్, కౌన్సిలర్ సీహెచ్ అభిషాలోమ్ వివరాలు సేకరించారు. ఆ చిన్నారులిద్దరికీ 18 ఏళ్ల వచ్చే వరకూ తాము సంరక్షిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి శ్రీరామకృష్ణ నుంచి కూడా వారు అంగీకారం తీసుకున్నారు. పోస్టుమార్టం, ఇతర కార్యక్రమాలు పూర్తయిన అనంతరం తాము ఆ చిన్నారులను శిశుగృహకు తరలించి సంరక్షిస్తామని ఐసీపీఎస్ అధికారులు తెలిపారు. వారికి సాయం అందించాలనుకునే దాతలు కూడా ముందుకు రావచ్చని సూచించారు. -
దేవుని ప్రేమను ఎలా పొందాలంటే..?
దేవుని ప్రేమను పొందాలంటే ప్రధానంగా నీలో ఉండవలసింది ఆ స్వామిపై నిలకడైన భక్తి. అది ఉన్నప్పుడు సంసార జీవితంలో నీకెదురయ్యే చికాకులు నిన్నేమీ చెయ్యలేవు. ఇక ఆ భక్తి ఎలా కలుగుతుంది అంటే - ప్రశాంతమైన స్థలంలో ఏకాంతంగా కూర్చుని దైవాన్ని స్తుతించు. అది కొంతకాలానికి నీలో దివ్యమైన వెలుగును కలిగిస్తుంది. దానివల్ల నీలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోతుంది. దైవదర్శనమవుతుంది. ‘‘గురుదేవా లోకంలో జీవితం ఎలా గడపాలి? దేవుని ప్రేమను ఎలా పొందవలసి ఉంటుంది?’’ అని ఒక శిష్యుడు రామకృష్ణులవారిని అడిగాడు. అప్పుడు పరమహంస చిరునవ్వు నవ్వి ‘‘మంచి ప్రశ్న వేశావు. నాకు తోచినది చెప్తాను. విను’’ అని ఇలా అన్నారు. ‘‘సంసారంలో ఉన్నంత వరకు నువ్వు నిత్యమూ చెయ్యవలసిన పనులు తప్పక చేస్తూ ఉండాలి. మనసు మాత్రం దేవునిపైనే ఉంచాలి. కుటుంబంలో అందరితోనూ ఆదరంగా నడుచుకుంటూ ఉండాలి. కాని జీవ రహస్యం ఒకటి తెలుసుకో. ఇది ఏదీ నాకు సొంతం కాదు. నాకు ఎప్పుడూ కావలసింది దేవుని ప్రేమ అనే భావాన్ని దృఢంగా మనసులో ఉంచుకోవాలి. ఇందుకో ఉదాహరణ చెప్తాను. తాబేలు నీళ్లలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. దాని మనసు దేని మీద ఉంటుందో తెలుసా? గట్టు మీద ఉన్న తన గుడ్ల మీద. అలాగే నీ మనసు దేవుని మీదే ఉండాలి. మనిషికి బతుకులో కావలసింది దైవభక్తి... పనస పండులో ఉన్న తొనలు తియ్యాలంటే ముందు వేళ్ళకి నూనె రాసుకోవాలి. అలా చేసి ఆ తొనలు తీస్తే వాటికి అంటుకుని ఉన్న జిగట నీ వేళ్ళకి పట్టదు. సులువుగా తొనలు తీసుకోవచ్చు. దేవుని ప్రేమను పొందాలంటే ప్రధానంగా నీలో ఉండవలసింది ఆ స్వామిపై నిలకడైన భక్తి. అది ఉన్నప్పుడు సంసార జీవితంలో నీకెదురయ్యే చికాకులు నిన్నేమీ చెయ్యలేవు. ఇక ఆ భక్తి ఎలా కలుగుతుంది? దానిని ఎలా వృద్ధి చేసుకోవాలి అంటే - అందుకు ఏకాంతవాసం అవసరం.... పాలలోంచి వెన్న తియ్యాలంటే ఏమి చెయ్యాలి? పాలను మరగబెట్టి చల్లారిన తర్వాత తోడు పెట్టాలి. అది చిక్కగా తోడుకుని పెరుగయేదాకా వేచి ఉండాలి. ఆలోపల నువ్వు చెయ్యవలసిన ఇతర పనులు పూర్తి చేసుకోవాలి. అనంతరం ఆ పెరుగును చిలకాలి. అలా చేస్తే దానిలో ఉన్న వెన్న వస్తుంది. అలాగే దేవుని ప్రేమ పొందడానికి భక్తి అనేది ఓ ముఖ్యసాధనం. అది ఎప్పుడూ నీలో నీతో ఉంచుకోవాలి. దానికి ఏకాంతవాసం అత్యంతావశ్యకం. ఏకాంతస్థలంలో దేవుణ్ణి ధ్యానించడం వల్ల నీ మనసులో జ్ఞానం, వైరాగ్యం, భక్తి అనేవి కలుగుతాయి. స్థిరమైనది దైవమనే భావం. అదే జ్ఞానం. దేనిపైనా మమకారం లేకుండా ఉండడం వైరాగ్యం. ఈ రెండిటి వల్ల పెరుగుతుంది భక్తి. ఆ భక్తి దేవునికి దగ్గరగా నిన్ను తీసుకుపోతుంది. నీ భక్తి చెదరకుండా స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను త న వాడిగా ప్రేమిస్తాడు. బుద్ధిమంతుడైన కొడుకుని తండ్రి ప్రేమించినట్టు. మరొక్కటి జ్ఞాపకం ఉంచుకో. దేని కోసమూ కోరిక, లేక ఆశ మితిమీరి పెట్టుకోకు. హద్దుమీరిన ఆశ కష్టాలకి మూలం. కాబట్టి సంసారంలో ఉన్న వారందరూ ఈ సత్యాన్ని విస్మరించకూడదు. మనిషిని దెబ్బతీసేది అత్యాశ. ఆ ఆశను ఆమడదూరంలో ఉంచుకోవాలంటే ఏకాంత వాసం ముఖ్యమైన సూత్రం. అక్కడ కూర్చుని ఆలోచిస్తే ఆశ వల్ల వచ్చే ఇక్కట్లు కంటికి కనిపిస్తాయి. వాటిని అణచుకోడానికి బ్రహ్మాస్త్రం భక్తి. ఆ భక్తి సర్వత్రా నీకు రక్షగా ఉండాలంటే ప్రశాంతమైన స్థలంలో ఏకాంతంగా కూర్చుని దైవాన్ని స్తుతించు. అది కొంతకాలానికి నీలో దివ్యమైన వెలుగును కలిగిస్తుంది. దాని వల్ల నీలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోతుంది. దైవదర్శనమవుతుంది.’’ ( శ్రీ రామకృష్ణ కథామృతం నుంచి) సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు), పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034, మెయిల్: sakshi.features@gmail.com