దేవుని ప్రేమను ఎలా పొందాలంటే..?
దేవుని ప్రేమను పొందాలంటే ప్రధానంగా నీలో ఉండవలసింది ఆ స్వామిపై నిలకడైన భక్తి. అది ఉన్నప్పుడు సంసార జీవితంలో నీకెదురయ్యే చికాకులు నిన్నేమీ చెయ్యలేవు. ఇక ఆ భక్తి ఎలా కలుగుతుంది అంటే - ప్రశాంతమైన స్థలంలో ఏకాంతంగా కూర్చుని దైవాన్ని స్తుతించు. అది కొంతకాలానికి నీలో దివ్యమైన వెలుగును కలిగిస్తుంది. దానివల్ల నీలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోతుంది. దైవదర్శనమవుతుంది.
‘‘గురుదేవా లోకంలో జీవితం ఎలా గడపాలి? దేవుని ప్రేమను ఎలా పొందవలసి ఉంటుంది?’’ అని ఒక శిష్యుడు రామకృష్ణులవారిని అడిగాడు.
అప్పుడు పరమహంస చిరునవ్వు నవ్వి ‘‘మంచి ప్రశ్న వేశావు. నాకు తోచినది చెప్తాను. విను’’ అని ఇలా అన్నారు.
‘‘సంసారంలో ఉన్నంత వరకు నువ్వు నిత్యమూ చెయ్యవలసిన పనులు తప్పక చేస్తూ ఉండాలి. మనసు మాత్రం దేవునిపైనే ఉంచాలి. కుటుంబంలో అందరితోనూ ఆదరంగా నడుచుకుంటూ ఉండాలి. కాని జీవ రహస్యం ఒకటి తెలుసుకో. ఇది ఏదీ నాకు సొంతం కాదు. నాకు ఎప్పుడూ కావలసింది దేవుని ప్రేమ అనే భావాన్ని దృఢంగా మనసులో ఉంచుకోవాలి. ఇందుకో ఉదాహరణ చెప్తాను.
తాబేలు నీళ్లలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. దాని మనసు దేని మీద ఉంటుందో తెలుసా? గట్టు మీద ఉన్న తన గుడ్ల మీద. అలాగే నీ మనసు దేవుని మీదే ఉండాలి. మనిషికి బతుకులో కావలసింది దైవభక్తి... పనస పండులో ఉన్న తొనలు తియ్యాలంటే ముందు వేళ్ళకి నూనె రాసుకోవాలి. అలా చేసి ఆ తొనలు తీస్తే వాటికి అంటుకుని ఉన్న జిగట నీ వేళ్ళకి పట్టదు. సులువుగా తొనలు తీసుకోవచ్చు. దేవుని ప్రేమను పొందాలంటే ప్రధానంగా నీలో ఉండవలసింది ఆ స్వామిపై నిలకడైన భక్తి. అది ఉన్నప్పుడు సంసార జీవితంలో నీకెదురయ్యే చికాకులు నిన్నేమీ చెయ్యలేవు. ఇక ఆ భక్తి ఎలా కలుగుతుంది? దానిని ఎలా వృద్ధి చేసుకోవాలి అంటే - అందుకు
ఏకాంతవాసం అవసరం....
పాలలోంచి వెన్న తియ్యాలంటే ఏమి చెయ్యాలి? పాలను మరగబెట్టి చల్లారిన తర్వాత తోడు పెట్టాలి. అది చిక్కగా తోడుకుని పెరుగయేదాకా వేచి ఉండాలి. ఆలోపల నువ్వు చెయ్యవలసిన ఇతర పనులు పూర్తి చేసుకోవాలి. అనంతరం ఆ పెరుగును చిలకాలి. అలా చేస్తే దానిలో ఉన్న వెన్న వస్తుంది. అలాగే దేవుని ప్రేమ పొందడానికి భక్తి అనేది ఓ ముఖ్యసాధనం. అది ఎప్పుడూ నీలో నీతో ఉంచుకోవాలి. దానికి ఏకాంతవాసం అత్యంతావశ్యకం. ఏకాంతస్థలంలో దేవుణ్ణి ధ్యానించడం వల్ల నీ మనసులో జ్ఞానం, వైరాగ్యం, భక్తి అనేవి కలుగుతాయి. స్థిరమైనది దైవమనే భావం. అదే జ్ఞానం. దేనిపైనా మమకారం లేకుండా ఉండడం వైరాగ్యం.
ఈ రెండిటి వల్ల పెరుగుతుంది భక్తి. ఆ భక్తి దేవునికి దగ్గరగా నిన్ను తీసుకుపోతుంది. నీ భక్తి చెదరకుండా స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను త న వాడిగా ప్రేమిస్తాడు. బుద్ధిమంతుడైన కొడుకుని తండ్రి ప్రేమించినట్టు. మరొక్కటి జ్ఞాపకం ఉంచుకో. దేని కోసమూ కోరిక, లేక ఆశ మితిమీరి పెట్టుకోకు. హద్దుమీరిన ఆశ కష్టాలకి మూలం. కాబట్టి సంసారంలో ఉన్న వారందరూ ఈ సత్యాన్ని విస్మరించకూడదు. మనిషిని దెబ్బతీసేది అత్యాశ. ఆ ఆశను ఆమడదూరంలో ఉంచుకోవాలంటే ఏకాంత వాసం ముఖ్యమైన సూత్రం.
అక్కడ కూర్చుని ఆలోచిస్తే ఆశ వల్ల వచ్చే ఇక్కట్లు కంటికి కనిపిస్తాయి. వాటిని అణచుకోడానికి బ్రహ్మాస్త్రం భక్తి. ఆ భక్తి సర్వత్రా నీకు రక్షగా ఉండాలంటే ప్రశాంతమైన స్థలంలో ఏకాంతంగా కూర్చుని దైవాన్ని స్తుతించు. అది కొంతకాలానికి నీలో దివ్యమైన వెలుగును కలిగిస్తుంది. దాని వల్ల నీలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోతుంది. దైవదర్శనమవుతుంది.’’
( శ్రీ రామకృష్ణ కథామృతం నుంచి)
సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి.
ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు), పోస్ట్:
సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034, మెయిల్: sakshi.features@gmail.com