Prohibition and Excise Department
-
ఏపీ: మద్యం ప్రియులకు మరో షాక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం ప్రియులకు మరో షాక్ తగిలింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు, లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ ఎక్సైజ్ శాఖ సోమవారం కొత్త జీవో విడుదల చేసింది. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు కూడా ఇక నుంచి అనుమతి లేదు. పర్మిట్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులు అవుతారు. ఈ మేరకు జీవో నెంబర్ 310ని ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. ఇక ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చింది. ప్రజల ఆరోగ్యంతో పాటు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (మద్యం షాక్ కొట్టింది!) తెలంగాణ నుంచి కృష్ణాజిల్లాలోకి అక్రమంగా తరలించిన 70 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం (ఫైల్ ఫోటో) దశలవారీ మద్యం నియంత్రణకు కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కంకణం కట్టుకున్నముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా దశల వారీ మద్య నిషేధాన్ని సక్రమంగా అమలు చేస్తున్న తరుణంలో సరిహద్దుల్లో ఉన్న ఆరు రాష్ట్రాల్ల నుండి ఒక్కొక్కరు మూడు బాటిల్స్‌కు మించకుండా మద్యం తీసుకొని రావటాన్ని నిరోధిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1968 ఎక్సైజు చట్టంలోని 34వ నిబంధనలను అనుసరించి ఇక మీదట ఏ ఇతర రాష్ట్రంనుంచి అయినా రాష్ట్రానికి మద్యాన్ని తరలించడానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. (ఏపీలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత..) అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు స్వాధీనం (ఫైల్ ఫోటో) ఈ నిర్ణయం పట్ల మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు మద్యం నిర్మూలనకు మద్య విమోచన ప్రచార కమిటీ లఘు చిత్రాలు, పోస్టర్లతో ప్రచారం చేపట్టింది. మద్య నిషేధంపై అవగాహన కలిగించేందుకు డ్వాక్రా సంఘాలు, వలంటీర్ల సహాయం తీసుకుంటోంది. వ్యసనపరులను గుర్తించి డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి మద్యం మాన్పించేందుకు కృషి చేస్తోంది. (వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో..) -
గుడుంబా తయారు చేస్తే పీడీ యాక్టు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో మద్యం బంద్‌తో కొందరు గుడుంబా వైపు మళ్లే అవకాశం ఉందని, దీనిని అరికట్టేందుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుడుంబా తయారు చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు పెట్టాలని సూచించారు. -
ఎక్సైజ్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : విధి నిర్వహణలో ఎక్సైజ్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధంపై అనుసరించాల్సిన చర్యలపై అధికారులకు ... ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటివి మన ఉద్దేశాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. (21.. 24.. 27న స్థానిక ఎన్నికలు?) గ్రామాల్లో బెల్టు షాపులు నడవకూడదు : గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టుషాపులు నడవకూడదని, అలాగే మద్యం అక్రమ తయారీ ఉండకూడదని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలు ఉండకూడదన్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్టు షాపులు ఉండకూడదనే గ్రామాల్లో 11వేల మహిళా పోలీసులను నియమించినట్లు పేర్కొన్నారు. బెల్టుషాపులు నిరోధమే మహిళా పోలీసులు ప్రాథమిక విధిగా పేర్కొన్నారు. వారందరికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చామని, వారిని శక్తివంతంగా వాడుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకోవాలని అధికారులకు వివరించారు. వీరితో పాటు గ్రామాల్లో మహిళా మిత్రలు కూడా ఉన్నారని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. (26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు) సమన్వయంతో కలిసి పనిచేయండి : ఇక ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలంటు ముఖ్యమంత్రి జగన్ .. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనుల కోసం వినియోగించాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో కలిసి కట్టుగా పనిచేసి ఫలితాలు సాధించాలని తెలిపారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను తయారుచేసుకోవడం ద్వారా విధుల నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.(‘ఆయన చంద్రబాబు కోవర్ట్’) -
‘కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అమలవుతోంది’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఏం చేయాలన్నా ఆరు శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందేని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ (కేఎస్టీ) అమలవుతోందని వ్యాఖ్యానించారు. మద్యం ధరల పెంపు వెనుక కేఎస్టీ మాఫియా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి బేరం కుదిర్చాడని ఆయన ఆరోపించారు. మద్యం ధరల పెంపు భారీ కుంభకోణమని, కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈమేరకు రేవంత్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ లేఖ రాశారు. తెలంగాణలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ.. ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యాన్ని ప్రోత్సహించడమంటే మహిళల భద్రతలో రాజీ పడటమేని, 20 కోట్లకు పైగా జనాభా ఉన్న యూపీలో కూడా మద్యం ఆదాయం ఇంతగా లేదని అన్నారు. ‘ఆరు కేసీఆర్ లక్కీ నెంబర్. కేఎస్టీ కూడా ఆరు శాతమే. మద్యం అమ్మకాల్లో దోపిడీ కోసమే ప్రభుత్వం గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. కమీషన్లు ఇచ్చే బ్రాండ్లనే ప్రోత్సహిస్తున్నారు. ఉత్పత్తి వ్యయం కంటే వెయ్యి శాతం అధిక ధరలా..? అధిక ధరలపై వినియోగదారుల ఫోరం ఏం చేస్తోంది. లాటరీ జూదం అన్నారు. మరి అదే లాటరీ విధానంలో మద్యం షాపులెలా కేటాయిస్తారు. షాపు దక్కని దరఖాస్తుదారుడుకి డబ్బు వాపస్ ఇవ్వకపోవడం నేరం. జనవరి 30న కట్టాల్సిన రుసుములు ఈ రోజే కట్టాలని షాపులకు తాఖీదులు ఇస్తున్నారు. పెంచిన ధరలు తక్షణం నిలిపేయాలి’అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. -
ప్రభుత్వ అధీనంలో మద్యం షాపులు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కపాదం మోపింది. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల 944 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా నేటినుంచి ప్రభుత్వ అధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పెద్దిరాజు ప్రారంభించారు. నియోజకవర్గంలో గతంలో 21 మద్యం షాపులు ఉండగా వాటిని 20% కుదించి.. 17 షాపులను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఏర్పాటైన మద్యం షాపుల్లో 17మంది సూపర్ వైజర్లు,17 మంది నైట్ వాచ్మెన్లు, 41మంది సేల్స్‌మేన్లగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉద్యోగాలు లభించడంతో నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తోంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులను నిర్వహిస్తున్నామని, మద్యం షాపుల సంఖ్యను, అమ్మకాల సమయాన్ని కుదించించడం ద్వారా ఏపీలో దశలవారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నతమైన ఆశయం కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఎక్సైజ్ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. పుత్తూరు పట్టణంలో.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానాన్ని అమలు చేశారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 29 షాపులును కుదించి 23 షాపులు ప్రవేశపెట్టారు. 23 షాపులలో 77 మందిని సేల్స్ అండ్ క్యాషియర్‌గా నియమించారు. ఈ కొత్త మద్యం విధానంతో మద్యపానాన్ని అంచలంచలుగా నియంత్రిస్తామన్నారు పుత్తూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్. సీఎం వైఎస్ జగన్ హామీ ఆదేశాల మేరకు మేం కట్టుబడి పని చేస్తామని మా పరిధిలో ఎక్కడ బెల్టుషాపులు ఉన్నా తొలగిస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలిపారు. చదవండి: రాత్రి 8 వరకే మద్యం -
తనిఖీల్లో రూ.80 లక్షల నగదు స్వాధీనం
అఫ్జల్‌గంజ్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, గుడుంబా పట్టుబడింది. ఈ సంఘటన నాంపల్లిలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన్ పి. భగవాన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మల్లెపల్లిలోని నోబుల్ థియేటర్ ఎదురుగా సోమవారం రాత్రి తనిఖీలు చేస్తుండగా రాజస్థాన్‌కు చెందిన సునీల్‌శర్మ, అనిల్‌కుమార్ శర్మ ఆటో (ఏపీ 13ఎన్ 9741)లో ప్రయాణిస్తున్నారు. వారిని ఆపి తనిఖీ చేయగా రూ. 80.30 లక్షల నగదు లభించింది. ఇద్దరినీ ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో బషీర్‌బాగ్‌లోని ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు అప్పగించినట్టు ఆయన వెల్లడించారు. ఇదే తనిఖీల్లో ధూల్‌పేట్‌కు చెందిన సునీల్‌సింగ్ ద్విచక్ర వాహంపై 40 లీటర్ల గుడుంబాను తరలిస్తుండగా పట్టుకుని అతన్ని అరెస్టు చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్, ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ టి. ప్రసాద్, డిప్యూటీ కమిషన్ ఎం.ఎం.ఎ. ఫారూకీ తదితరులు పాల్గొన్నారు. -
‘చుక్క’ల్లో ధర
కాకినాడ క్రైం : మద్యం వ్యాపారుల దోపిడీ మళ్లీ మొదలైంది. నూతనంగా షాపులకు లెసైన్స్‌లు పొంది రెండు వారాలు గడవకుండానే మాక్సిమమ్ రిటైల్ ప్రైస్ (ఎమ్మార్పీ)కి మంగళం పాడారు. దీంతో మందుబాబుల జేబులు గుల్లవుతున్నాయి. క్వార్టర్ బాటిల్‌పై రూ. పది నుంచి రూ. 20 వరకూ అధిక ధర వసూలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించుకునేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ అధికారులే మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం. జిల్లాలో గతంలో 555 మద్యం షాపులుండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం డివిజన్లోని మరో ఏడు షాపులు నూతనంగా కలిశాయి. దీంతో 562 మద్యం షాపులకు నూతనంగా లెసైన్స్‌లు మంజూరు చేసేందుకు గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించారు. జూన్ 28వ తేదీకి గడువు ముగిసేనాటికి మొదటి దఫా 401 షాపులకు మాత్రమే వ్యాపారులు దరఖాస్తులు చేసుకోగా మిగిలిన వాటికి జూలై ఏడవ తేదీ గడువుగా రెండోసారి దరఖాస్తులు ఆహ్వానించారు. అయినప్పటికీ వ్యాపారుల నుంచి సరైన స్పందన లేదు. రెండోసారి కేవలం 34 షాపులకు మాత్రమే దరఖాస్తులు అందడంతో ఇంకా జిల్లాలో 127 మద్యం షాపులు మిగిలిపోయాయి. వీటికి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మందుబాబులు మిగిలిన షాపుల్లో మద్యం కొనుగోలు చేసి సేవిస్తున్నప్పటికీ వ్యాపారులు మాత్రం నష్టాలు చవిచూస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు. అయితే నెలరోజులు కూడా గడవకుండానే నష్టాలేమిటని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మద్యం షాపులు తీసుకున్న వారికే ఈ దఫా కూడా లెసైన్స్‌లు దక్కడంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పాటై అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వారంటున్నారు. యథావిధిగా బెల్టుషాపులు జిల్లాలో బెల్టుషాపులు మాత్రం యథావిధిగానే కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్టుషాపులను తొలగించేందుకు ఉత్తర్వులు జారీచేస్తారని తొలుత ప్రచారం జరిగింది. దీంతో వ్యాపారులు షాపులు దక్కించుకునేందుకు కూడా వెనుకడుగు వేశారు. మద్యం షాపులు రాత్రి పూట మూసివేసినప్పటికీ బెల్టుషాపుల్లో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటుంది. బెల్టుషాపుల్లోనే దాదాపు 60 శాతం మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. జిల్లాలో సుమారు 4,000లకు పైబడి బెల్టుషాపులున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మద్యం షాపుల యజమానులు వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఒక్కో షాపు పరిధిలో సుమారు పదికి పైగా బెల్టుషాపులను ఏర్పాటు చేసుకుని 24 గంటలూ మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రధాన షాపులో రూ. పది మాత్రమే అదనపు ధర వసూలు చేస్తుండగా బెల్టుషాపుల్లో రూ. 20కి పైబడి అధిక ధర వసూలు చేస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. లూజు విక్రయాల నేపథ్యంలో చీప్ లిక్కర్, నకిలీ మద్యం కూడా విక్రయిస్తున్నారంటున్నారు. మామూళ్ల ‘మత్తు’లో అధికార గణం అధికారులు మామూళ్ల ‘మత్తు’లో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనాభా విస్తీర్ణాన్ని బట్టి మద్యం షాపుల్లో రోజుకు రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకూ మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఒక్కొక్క షాపులో సుమారు రూ. పదివేలకు పైబడి మందుబాబుల నుంచి దోపిడీ జరుగుతోంది. ఒక్కో మద్యం షాపు నుంచి రెన్యువల్ ఫీజుగా (అనధికారికం) సంవ త్సరానికి రూ. 50 వేలు ఇవ్వాలని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో షాపు నుంచి ఎక్సైజ్, పోలీసు అధికారులు, సిబ్బందికి నెలకు సరాసరి రూ. 44 వేలుపైబడి ముడుపులు చెల్లించాలంటున్నారు. షాపు అద్దెలు, సిబ్బంది జీతభత్యాలు ఇలా చూసుకుంటే తాము నష్టపోతున్నామని, అందుకే అధిక ధరకు విక్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల క్రితం నుంచే ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తుండగా శనివారం నుంచి మిగిలిన షాపులలో కూడా అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. -
బెల్టు షాపుందా.. ఉద్యోగం గోవిందా
కొవ్వూరు : అక్రమ మద్యం, సారా అమ్మకాలను నియంత్రిం చటం, బెల్టు షాపులు లేకుండా చర్యలు తీసుకోవడం, మద్యం దుకాణాల్లో అమ్మకాలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చూడటం వంటి బాధ్యతలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిర్వర్తించాలి. విధి నిర్వహణలో అడ్డంకులు ఎదురైతే పోలీస్, రెవెన్యూ వంటి శాఖల సహకారం తీసుకోవడం సర్వసాధారణం. కలె క్టర్ సిద్ధార్థజైన్ బెల్టు షాపుల నియంత్రణకు కొత్త పంధాకు తెర లేపారు. గ్రామాల్లో బె ల్టు షాపులు ఉన్నాయా? లేదా? అనేది వీఆర్వోలు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలి. వీఆర్ఏలు అందుకు సహకారం అందించాలి. తదనుగుణంగా వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ గ్రామంలో తనిఖీ చేసిన సమయంలో నివేదికలో పొందుపరిచినట్టు కాకుండా బె ల్టు షాపులున్నట్టు తేలితే వీఆర్వోతో పాటు వీఆర్ఏను బాధ్యులను చే సి విధులను తొలగిస్తామని తహసిల్దార్లు అర్జంట్ నోటీసులు పంపారు. మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈనెల 8న 263 నంబరు జీవోను విడుదల చేసింది. జీవో అమలు బాధ్యతను కలెక్టర్లు భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాలకు కలెక్టర్ ఆదేశాలు అందాయి. ప్రస్తుతం తహసిల్దార్లు వీఆర్వోలకు రాతపూర్వకంగా నోటీసులు పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న చందంగా బెల్టుషాపుల నియంత్రణ వ్యవహారం వీఆర్వోలను బలి పశువులను చేసే విధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము అందించే గ్రామ నివేదిక లో వాస్తవ విషయాలు స్పష్టం చేసినా గుట్టుచప్పుడు కాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం వీఆర్వో, వీఆర్ ఏలను వెంటాడుతోంది. అసలు బాధ్యత ఎవరిది! ఇన్నాళ్లు ఎక్సైజ్ అధికారులు గేట్లు ఎత్తేయడంతో మద్యం బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మద్యం విక్రయాలు పెంచేందుకు ప్రభుత్వం విధిం చిన లక్ష్యాలు, మామూళ్లకు ఆశపడి బె ల్టుషాపుల నిర్వహణకు ఎక్సైజ్ అధికారులే ఊతం ఇచ్చారు. మద్యం అమ్మకాలకు సంబందించి తమకు నిర్దేశించి న లక్ష్యాలను చేరుకోవడానికి వీటి నిర్వహణను బాగా ప్రోత్సహించడంతో వీధి, వీధిన బెల్టుషాపులు ఏర్పడ్డాయి. బెల్టు షాపులను పూర్తిగా తొలగించామని ఎక్సైజ్ అధికారులు ప్రకటిస్తున్నా గ్రామాల్లో నేటికీ గుట్టుచప్పుడు కాకుం డా మద్యం విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. అది కూడా బాగా పరిచయస్తులకు మాత్రమే మద్యం అమ్ముతున్నట్టు సమాచారం. జూలై 1 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. బె ల్టు షాపులు లేకపోవడంతో దుకాణదారులు గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో మద్యం వ్యాపారం చేసుకునేందుకు సన్నహాలు చేసుకుంటున్నారు. ఇందుకు అవసరమైతే అధికార పార్టీ పలుకుబడి ఉపయోగించి ఎక్సైజ్ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిండికేటు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఎక్కడైనా బెల్టుషాపులు నిర్వహిస్తే ఆ పరిధిలో ఉండే మద్యం షాపు లెసైన్సును రద్దుచేస్తామంటున్నారు. ఇది ఎంత వరకు అమలు చేస్తారనేది వేచిచూడాలి. బెల్టుషాపుల నియంత్రణకు ఎక్సైజ్ శాఖకు ఎన్నో మార్గాలున్నాయి. పోలీస్ శాఖకు కూడా వీటి నిర్వహకులపై కేసులు నమోదు చేసే అధికారం ఉంది. వాటన్నింటిని కఠినతరం చేయడం ద్వారా బెల్టుషాపులను నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు వీఆర్వోలు, వీఆర్ఏలతో పాటు పంచాయతీ కార్యద ర్శుల సేవలను వినియోగించుకోవచ్చు. అవ రసరమైతే సమాచారం అందించిన ఉద్యోగులు, స్థానికులకు తగిన ప్రోత్సహకాలు అందించడం ద్వారా బె ల్టుషాపులను పూర్తి స్థాయిలో నిర్మూలించే అవకాశం ఏర్పడుతుంది. ఇవన్నీ మరిచి బెల్టుషాపుల విషయంలో వీఆర్వో, వీఆర్ఏలపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. -
మద్యం నోటిఫికేషన్ విడుదల
- 27తేది వరకు దరఖాస్తు గడువు - 28న లాటరీ ద్వారా లెసైన్సు కేటాయింపు కడప అర్బన్ /ప్రొద్దుటూరు క్రైం: ఏపీ ప్రభుత్వం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ద్వారా 2014-15 సంవత్సరానికి గానూ సోమవారం జీఓ నంబర్ 265 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 269 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు, 18 బార్లకు రెన్యువల్ చేసుకునేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి సోమవారం సాయంత్రం తమ ఛాంబరులో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. బార్ల నోటిఫికేషన్‌ను కడప ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డీసీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 269 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.100 కోట్లకు పైగా లెసైన్సు ఫీజు లభించనుందన్నారు. ఈనెల 27వ తేది మధ్యాహ్నం 3గంటల్లోపు తమ దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్, డీసీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన బాక్సులలో వేయాలన్నారు. 28వ తేది మధ్యాహ్నం 2గంటలకు జెడ్పీ ఆవరణలో లాటరీ పద్దతి ద్వారా కేటాయిస్తామన్నారు. జిల్లాలో 269 షాపులకుగానూ 10వేల లోపు జనాభా ఉన్న షాపులు 83 ఉన్నాయని, వీటికి ఒక్కొ షాపుకు రూ.32.50లక్షలు లెసైన్సు ఫీజుగా చెల్లించాలన్నారు. 10వేల నుంచి 50వేల లోపు జనాభా ఉన్న షాపులలో 87 ఉన్నాయని, వీటికి ఒక్కొక్క షాపుకు రూ.36లక్షలు లెసైన్సు ఫీజుగా చెల్లించాలన్నారు. 50వేల నుంచి 3లక్షల లోపు జనాభా ఉన్న షాపులు 66 ఉన్నాయన్నారు. వీటికి ఒక్కొ షాపుకు 45లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. 3లక్షల నుంచి 5లక్షల్లోపు జనాభా కలిగిన షాపులు జిల్లాలో 33 ఉన్నాయన్నారు. వీటికి ఒక్కొషాపుకు 50లక్షల రూపాయలు లెసైన్సు ఫీజుగా చెల్లించాలన్నారు. బార్ల ద్వారా 6కోట్ల 52లక్షల రూపాయలు లెసైన్సు ఫీజు రూపంలో ఆదాయం లభిస్తుందన్నారు. -
నేడో,రేపో మద్యం టెండర్లకు నోటిఫికే షన్
నూతన మద్యం విధానం ఖరారుకు నేడు సమావేశం జూలై 1 నుంచి షాపులను కేటాయించే అవకాశం సమీక్ష నిర్వహించిన ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర తెలంగాణలో14నే నోటిఫికేషన్ ప్రొద్దుటూరు: మద్యం షాపుల టెండర్ల నిర్వహణకు సంబంధించి ఉన్నతాధికారులు నేడో రేపో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఎస్ఎస్ రావత్ శనివారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు. జిల్లాకు సంబంధించి మొత్తం 269 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో 80 వాటికి టెండర్లు జరగలేదు. ఎవరూ ముందుకు రాకపోవడంతో వీటిని అలాగే వదిలేశారు. రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం టెండర్లు నిర్వహించి డిప్ విధానం ద్వారా షాపులను ఖరారు చేసింది. ఏడాదివరకే ఈ కాలపరిమితి ఉండగా ప్రభుత్వం మరో ఏడాది రెన్యూవల్ చేసి కాలాన్ని పొడిగించింది. ప్రస్తుతం రెండేళ్ల గడువు పూర్తయింది. ఈ నెలాఖరులోగా కొత్తగా టెండర్లు నిర్వహించి జూలై 1 నుంచి షాపులు కేటాయించాల్సి ఉంది. ఇందు కోసం వారం రోజుల గడువును విధించాల్సి ఉంది. ఈ ప్రకారం నేడో రేపో నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 14న అక్కడ నోటిఫికేషన్ వెలువడగా 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించారు. 23న డిప్ ద్వారా షాపులు కేటాయించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేయగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈప్రభావం కారణంగా తెలంగాణ కన్నా మన రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలులో జాప్యం జరిగింది. రెండు రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమేరకు కమిషనర్ శనివారం సమీక్ష నిర్వహించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా ప్రివిలైజ్ ట్యాక్స్‌తోపాటు మున్సిపాలిటీల పరిధిలోని రెండు కిలోమీటర్ల విధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. -
బెల్ట్ షాపులపై దృష్టి సారించండి
కడప అర్బన్, న్యూస్‌లైన్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న మద్యం షాపులతోపాటు అనుబంధంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై దృష్టి సారించాలని ఇన్‌ఛార్జి డిప్యూటీ కమిషనర్ విజయకుమారి ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 291కేసులు నమోదు చేశామన్నారు. 173 మందిని అరెస్టు చేశామన్నారు. 15 వాహనాలను సీజ్ చేశామన్నారు. బద్వేలులో మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం శ్యాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపించామన్నారు. రెండు స్టేషన్ల పరిధిలో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని, వాటిపై కూడా దృష్టి పెట్టామన్నారు. 24మందిని బైండోవర్ చేశామన్నారు. ఒకే మద్యం షాపు ఏడుసార్లు, అంతకంటే ఎక్కువసార్లు నేరాలకు పాల్పడితే వాటి లెసైన్సులను రద్దు చేస్తామన్నారు. సారా కేంద్రాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామన్నారు. 99 బెల్ట్‌షాపులపై దాడులు నిర్వహించి 110 మందిని అరెస్టు చేశామన్నారు. 1171.92 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. 68 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. జిల్లాలో ఎక్సైజ్ దాడులు జిల్లాలో సోమవారం 16కేసులు నమోదు చేశామని, ఎనిమిది మందిని అరెస్టు చేసి మూడు వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. నాటుసారాకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు. 110 లీటర్ల నాటుసారాను సీజ్ చేశామన్నారు. 3650 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. రెండు వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో కడప ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ బాబు శ్రీధర్, సీఐలు పప్పూరి రామ్మోహన్, తిరుపతయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.