తనిఖీల్లో రూ.80 లక్షల నగదు స్వాధీనం
అఫ్జల్‌గంజ్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, గుడుంబా పట్టుబడింది. ఈ సంఘటన నాంపల్లిలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషన్ పి. భగవాన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మల్లెపల్లిలోని నోబుల్ థియేటర్ ఎదురుగా సోమవారం రాత్రి తనిఖీలు చేస్తుండగా రాజస్థాన్‌కు చెందిన సునీల్‌శర్మ, అనిల్‌కుమార్ శర్మ ఆటో (ఏపీ 13ఎన్ 9741)లో ప్రయాణిస్తున్నారు. వారిని ఆపి తనిఖీ చేయగా రూ. 80.30 లక్షల నగదు లభించింది. ఇద్దరినీ ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు.
నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో బషీర్‌బాగ్‌లోని ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు అప్పగించినట్టు ఆయన వెల్లడించారు. ఇదే తనిఖీల్లో ధూల్‌పేట్‌కు చెందిన సునీల్‌సింగ్ ద్విచక్ర వాహంపై 40 లీటర్ల గుడుంబాను తరలిస్తుండగా పట్టుకుని అతన్ని అరెస్టు చేశారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్, ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ టి. ప్రసాద్, డిప్యూటీ కమిషన్ ఎం.ఎం.ఎ. ఫారూకీ తదితరులు పాల్గొన్నారు.