
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఏం చేయాలన్నా ఆరు శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందేని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ (కేఎస్‌టీ) అమలవుతోందని వ్యాఖ్యానించారు. మద్యం ధరల పెంపు వెనుక కేఎస్‌టీ మాఫియా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి బేరం కుదిర్చాడని ఆయన ఆరోపించారు. మద్యం ధరల పెంపు భారీ కుంభకోణమని, కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈమేరకు రేవంత్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ లేఖ రాశారు.
తెలంగాణలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ.. ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యాన్ని ప్రోత్సహించడమంటే మహిళల భద్రతలో రాజీ పడటమేని, 20 కోట్లకు పైగా జనాభా ఉన్న యూపీలో కూడా మద్యం ఆదాయం ఇంతగా లేదని అన్నారు. ‘ఆరు కేసీఆర్ లక్కీ నెంబర్. కేఎస్‌టీ కూడా ఆరు శాతమే. మద్యం అమ్మకాల్లో దోపిడీ కోసమే ప్రభుత్వం గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. కమీషన్లు ఇచ్చే బ్రాండ్లనే ప్రోత్సహిస్తున్నారు.
ఉత్పత్తి వ్యయం కంటే వెయ్యి శాతం అధిక ధరలా..? అధిక ధరలపై వినియోగదారుల ఫోరం ఏం చేస్తోంది. లాటరీ జూదం అన్నారు. మరి అదే లాటరీ విధానంలో మద్యం షాపులెలా కేటాయిస్తారు. షాపు దక్కని దరఖాస్తుదారుడుకి డబ్బు వాపస్ ఇవ్వకపోవడం నేరం. జనవరి 30న కట్టాల్సిన రుసుములు ఈ రోజే కట్టాలని షాపులకు తాఖీదులు ఇస్తున్నారు. పెంచిన ధరలు తక్షణం నిలిపేయాలి’అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment