మద్యం నోటిఫికేషన్ విడుదల
- 27తేది వరకు దరఖాస్తు గడువు
- 28న లాటరీ ద్వారా లెసైన్సు కేటాయింపు
కడప అర్బన్ /ప్రొద్దుటూరు క్రైం: ఏపీ ప్రభుత్వం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ద్వారా 2014-15 సంవత్సరానికి గానూ సోమవారం జీఓ నంబర్ 265 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 269 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు, 18 బార్లకు రెన్యువల్ చేసుకునేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి సోమవారం సాయంత్రం తమ ఛాంబరులో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. బార్ల నోటిఫికేషన్‌ను కడప ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం డీసీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 269 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.100 కోట్లకు పైగా లెసైన్సు ఫీజు లభించనుందన్నారు. ఈనెల 27వ తేది మధ్యాహ్నం 3గంటల్లోపు తమ దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్, డీసీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన బాక్సులలో వేయాలన్నారు. 28వ తేది మధ్యాహ్నం 2గంటలకు జెడ్పీ ఆవరణలో లాటరీ పద్దతి ద్వారా కేటాయిస్తామన్నారు.
జిల్లాలో 269 షాపులకుగానూ 10వేల లోపు జనాభా ఉన్న షాపులు 83 ఉన్నాయని, వీటికి ఒక్కొ షాపుకు రూ.32.50లక్షలు లెసైన్సు ఫీజుగా చెల్లించాలన్నారు. 10వేల నుంచి 50వేల లోపు జనాభా ఉన్న షాపులలో 87 ఉన్నాయని, వీటికి ఒక్కొక్క షాపుకు రూ.36లక్షలు లెసైన్సు ఫీజుగా చెల్లించాలన్నారు. 50వేల నుంచి 3లక్షల లోపు జనాభా ఉన్న షాపులు 66 ఉన్నాయన్నారు.
వీటికి ఒక్కొ షాపుకు 45లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. 3లక్షల నుంచి 5లక్షల్లోపు జనాభా కలిగిన షాపులు జిల్లాలో 33 ఉన్నాయన్నారు. వీటికి ఒక్కొషాపుకు 50లక్షల రూపాయలు లెసైన్సు ఫీజుగా చెల్లించాలన్నారు. బార్ల ద్వారా 6కోట్ల 52లక్షల రూపాయలు లెసైన్సు ఫీజు రూపంలో ఆదాయం లభిస్తుందన్నారు.