సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్–ఆగస్టు 2022)ను ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 15 నుంచి జూలై 15వ తేదీ వరకు టెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 16 నుంచి జులై 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. aptet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అభ్యర్థులకు సహకరించేందుకు ఈనెల 13 నుంచి విద్యా శాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్కును ఏర్పాటు చేస్తున్నారు. జూలై 26వ తేదీ నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్టులు నిర్వహిస్తారు. జూలై 25 నుంచి హాల్‌టిక్కెట్లు జారీ చేస్తారు. ఒకసారి దరఖాస్తు సమర్పించాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల అభ్యర్థులు దరఖాస్తును నింపిన తర్వాత అన్ని వివరాలు జాగ్రత్తగా సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. టెట్ సిలబస్‌ను కూడా పాఠశాల విద్యా శాఖ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పొందుపరిచింది.
పరీక్షలిలా..
పరీక్షలు పేపర్ 1ఏ, పేపర్ 1 బీ, పేపర్ 2 ఏ, పేపర్2 బీలుగా జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక కీని ఆగస్టు 31న విడుదల చేస్తారు. దానిపై సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీని సెప్టెంబర్ 12న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తారు.
డీఎస్సీలో వెయిటేజి
టెట్‌లో అర్హతకు నిర్ణీత మార్కులను పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఆ మార్కులు సాధిస్తేనే టెట్‌లో క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు. అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు 60 శాతం రావాలి. బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్ ధ్రువపత్రాల చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండేది. తాజా నిబంధనల ప్రకారం జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల స్కోరుకు ఉపాధ్యాయ నియామకాల్లో (డీఎస్సీలో) 20 శాతం మేర వెయిటేజీ కల్పిస్తారు.
వీరు అర్హులు
డీఎల్‌ఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు, 2020–22 బ్యాచ్‌లోని అభ్యర్థులు ఈ టెట్‌కు అర్హులు. గతంలో ఏపీ టెట్‌లో ఉత్తీర్ణులైన వారిలో మార్కుల స్కోరును పెంచుకోవాలనుకొనే వారు కూడా ఈ టెట్‌కు హాజరుకావచ్చు. 1 నుంచి 5 తరగతుల బోధనకు సంబంధించిన టీచర్లు పేపర్ 1–ఏకు హాజరుకావాలి. 6 నుంచి 8వ తరగతుల బోధనకు పేపర్–2ఏ రాయాలి. 1 నుంచి 5 తరగతులలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అభ్యర్ధులు పేపర్–1బీ రాయాలి. 6 నుంచి 8వ తరగతుల స్పెషల్ ఎడ్యుకేషన్ బోధనకు పేపర్–2బీకి హాజరుకావాలి. 1 నుంచి 8 తరగతుల బోధన అభ్యర్ధులు పేపర్–1ఏ, పేపర్–1బీ, పేపర్–2ఏ, పేపర్–2బీలను రాయాలి. అభ్యర్ధులు వారు హాజరుకాబోయే పేపర్లకు వేర్వేరుగా రూ.500 చొప్పున ఫీజు చెల్లించాలి. పరీక్షలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నగరాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిసాలలో నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment