Teacher Eligibility Test (TET)
-
ఏటా రెండుసార్లు టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా రెండు సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో ఒకసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తుండగా.. ఇకపై రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈమేరకు సవరణ ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జారీ చేశారు. ఒక అభ్యర్థి టెట్ పరీక్షను ఎన్నిసార్లు అయినా రాయొచ్చని, మెరుగైన మార్కుల కోసమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడితో పాటు ఎస్సీఈఆర్టీ సంచాలకులను ఆయన ఆదేశించారు. -
తెలంగాణలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్ వెవువడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది. ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. చదవండి: గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు -
టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం (సెప్టెంబర్ 27) ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలు sakshieducation.com వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. TS TET 2023 Results - Paper 1 | Paper 2 కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కు 2.26 లక్షలు(84.12శాతం), పేపర్-2కు 1.90 లక్షల మంది (91.11 శాతం) హాజరయ్యారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే. దీని కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష అక్కడక్కడా అప శ్రుతులతో ముగిసింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా 2,26,744 మంది (84.12%) పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా 1,89,963 మంది (91.11%) హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1139 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కానీ పలు పరీక్షా కేంద్రాల్లో కనీసం హాల్ టిక్కెట్లు సైతం పరిశీలించకుండా లోనికి అనుమతి ఇచ్చారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మాల్ ప్రాక్టీస్, పరీక్ష బుక్లెట్ మారడం లాంటివి కూడా చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సంతోష్‌నగర్‌లోని కృష్ణవేణి హైస్కూల్ పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఇన్విజిలేటర్‌పై కేసు పేపర్–1 పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాస్తున్న తన సమీప బంధువుకు జవాబులు అందజేశాడు. విషయం తెలిసిన పోలీసులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థిని, అందుకు సహకరించిన ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేశారు. పంచాయతీ కార్యదర్శిని అధికారులు సస్పెండ్ చేశారు. మూడు గంటల ముందే ప్రశ్నపత్రాల సరఫరా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ సభను దృష్టిలో ఉంచుకుని గంట ముందుగా రావాల్సిన టెట్ ప్రశ్నపత్రాలను అధికారులు మూడు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేర్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు సభ ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని భావించిన అధికారులు ప్రశ్నపత్రాలను ముందే తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే అధికారులు సరఫరా చేసిన బుక్‌లెట్‌కు బదులు మరో బుక్లెట్ ప్రశ్నపత్రాలు ఇవ్వాలని హైదరాబాద్ నుంచి సమాచారం రావడంతో గందరగోళం ఏర్పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రశ్నపత్రం మార్చేందుకు కస్టోడియన్ మళ్లీ కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు చేరడం ఆలస్యమైంది. మరోవైపు సిరిసిల్లలో మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష నిర్వహణలో అధికారుల అలసత్వంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పేపర్–2కు బుక్లెట్–2 ఇస్తే.. సిరిసిల్లలో మాత్రం బుక్లెట్–1 ఇచ్చారు. అభ్యర్థులు పలువురు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా రాశారు. అయితే విషయం తెలుసుకున్న అధికారులు గంట ఆలస్యంగా బుక్లెట్–2 అందజేశారు. అయితే పత్తిపాక వీధిలోని సిద్దార్థ స్కూల్లోని పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్‌ను వైట్నర్తో దిద్దించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇలావుండగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల చిరునామాలు సరిగా లేకపోవడంతో సకాలంలో పరీక్షకు హాజరుకాలేకపోయారు. -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష (ఏపీ టెట్–2022) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన 4,07,329 మంది అభ్యర్థుల మార్కుల వివరాలు https://cse.ap.gov.in/ DSE/ వెబ్సైట్లో పొందుపరిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07 శాతం మంది టెట్‌లో అర్హత సాధించారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: (రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్) -
‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’
సాక్షి, శ్రీకాకుళం: ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్ష బాగా రాయలేకపోయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే పాతపట్నంలో మళ్లీ అలాంటి సంఘటన జరిగింది. ‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి పాతపట్నం బాలాజీ నగర్‌కు చెందిన యువతి సారా నేపాలి (27) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం కోర్టు కూడలి ఎదురుగా ఉన్న బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న సారా నేపాలి గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. కాస్త తలనొప్పిగా ఉందంటూ తల్లితో చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. గదిలోకి వెళ్లిన అమ్మాయి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లి ఆ గదికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు హతాశులైపోయారు. వెంటనే ఆమెను కిందకు దించి కారులో పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సారా నేపాలి మృతి చెందినట్లు వైద్యుడు సందీప్ ధ్రువీకరించారు. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఎస్ఐ టి.కామేశ్వరరావు, పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు. చదవండి: World Suicide Prevention Day 2022: ఆందోళన పరుస్తున్న ఆత్మహత్యలు అక్కడ సూసైడ్ నోట్‌తో పాటు సెల్ ఫోన్, డైరీని స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో డాడీ నన్ను క్షమించు..నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ రాసి ఉంది. నేపాలి ఎంఎస్సీ, బీఈడీ చదివింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షల కీ విడుదల చేసింది. సారా ఓసీ కాబట్టి 150కి 90 మార్కులు రావాలి, కానీ 87 మార్కులు రావడంతో మనస్తాపం చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో సారా నేపాలి పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసింది. సారాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉన్నాడు. అక్కలకు వివాహాలయ్యాయి. తమ్ముడు డిగ్రీ వరకు చదువుకున్నారు. తండ్రి దమ్మర్ బహదూర్ పాతపట్నం గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తుంటారు. తల్లి సరస్వతీ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
AP TET 2022: ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీటెట్)–ఆగస్టు 2022 శనివారం (నేటి) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 వరకు కంప్యూటరాధారితంగా ఇవి జరుగుతాయి. ఈ పరీక్షలకు 5.25 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 150 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. రాష్ట్రంతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ వీటిని ఏర్పాటుచేశారు. ఇక టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ చెల్లుబాటు ఇంతకుముందు ఏడేళ్లుగా ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్పుచేసి చెల్లుబాటును జీవితకాలంగా ప్రకటించింది. వెయిటేజీతో పెరిగిన అభ్యర్థులు ఇక ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంటు టీచర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు డీఎస్సీ ఎంపికల్లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనుండడంతో కొత్తగా డీఎడ్, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారితో పాటు గతంలో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు ఈసారి టెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ రిజర్వుడ్ అభ్యర్థుల అర్హత మార్కులను 45 నుంచి 40కి తగ్గించారు. దీనివల్ల కూడా అదనంగా మరో 50వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడం.. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో పలువురు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లోని సెంటర్లను కేటాయించారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు. -
TS TET 2022: టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2022) ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఫలితాల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1 న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును ఆమె సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జులై 1న టెట్ ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. చదవండి👇 టెట్ @ 90 శాతం ఇంటర్ ఫలితాలు విడుదల.. ఒకే క్లిక్‌లో రిజల్ట్స్ ఇలా చూడండి -
టెట్ ఒకసారి రాస్తే చాలు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబులిటీ టెస్టు–టెట్)ను ఇకపై అభ్యర్థులు ఒక్కసారి రాసి ఉత్తీర్ణులైతే చాలు.. స్కోరు పెంపునకు మినహా మళ్లీమళ్లీ రాయాల్సిన అవసరంలేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) కొత్త నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. దీని ప్రకారం అభ్యర్థులు ఒకసారి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఇక డీఎస్సీకి అర్హులైనట్లే. టెట్‌లో ఉత్తీర్ణత ధ్రువపత్రాల చెల్లుబాటును ఎన్సీటీఈ జీవితకాలానికి పెంచిన నేపథ్యంలో అభ్యర్థులకు ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఎన్సీటీఈ కొత్త నిబంధనల అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా టెట్‌ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 16 నుంచి టెట్–ఆగస్టు 2022కు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. జులై 16 వరకు వీటిని స్వీకరిస్తారు. గతంలోని టెట్‌లకు రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన సిలబస్‌ను అమలుచేయగా ఈసారి పూర్తిగా ఎన్సీటీఈ సిలబస్‌లోనే పరీక్షల నిర్వహణ జరగనుంది. వేర్వేరుగా టెట్ అర్హత నిబంధనలు టెట్ అర్హత నిబంధనలను రాష్ట్ర అధికారులు వెల్లడించారు. వాటి ప్రకారం.. ► ఉపాధ్యాయ అర్హత పరీక్ష నాలుగు పేపర్ల కింద (పేపర్–1ఏ, పేపర్–1బీ, పేపర్–2ఏ, పేపర్–2బీ) నిర్వహించనున్నారు. ► 1–5 తరగతులకు సంబంధించి రెగ్యులర్ టీచర్లకు పేపర్–1ఏ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పేపర్–1బీని అభ్యర్థులు రాయాలి. ► ఇక 6–8 తరగతుల రెగ్యులర్ టీచర్లకు పేపర్–2ఏ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పేపర్–2బీ పరీక్షను రాయాలి. ► 2010 తరువాత ఇంటర్మీడియెట్ రాసిన అభ్యర్థులకు 50 శాతం మార్కులు తప్పనిసరి. ► అదే 2002 నుంచి 2010లోపు ఇంటర్మీడియెట్ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వస్తే చాలు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల మినహాయింపు ఉంటుంది. ► ఇది కేవలం ఇంటర్–డీఈడీ అర్హతల వారికి మాత్రమే వర్తిస్తుంది. అదే డిగ్రీ–బీఈడీ చేసిన అభ్యర్థులకు మాత్రం డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాల్సిందే. ► పేపర్–1ఏకు 8 రకాల క్వాలిఫికేషన్ అంశాలను కూడా ఏపీటెట్లో పొందుపరిచారు. ► ఇంటర్మీడియెట్, డీఎడ్, డిగ్రీ, పీజీ బీఈడీల కాంబినేషన్లలో ఈ అర్హతలున్న వారు టెట్‌ను రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ► అలాగే.. పేపర్–1బీకి 10 రకాల కాంబినేషన్లలో అర్హతలను టెట్‌లో ప్రకటించారు. ► పేపర్–2ఏ, పేపర్–2బీలలో కూడా వేర్వేరు అర్హతా ప్రమాణాలను పొందుపరిచారు. టెట్ అర్హత మార్కులు యథాతథం టెట్ అర్హత మార్కుల్లో ఎన్సీటీఈ మార్గదర్శకాల మేరకు గతంలోని నిబంధనలనే యథాతథంగా కొనసాగిస్తారు. జనరల్ కేటగిరీలోని వారికి 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ తదితర కేటగిరీల వారికి 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. వారినే టెట్‌లో ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. వీరికిచ్చే ధ్రువపత్రాల చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండేది. ఆ తర్వాత మళ్లీ టెట్ రాసి అర్హత సాధించాల్సి వచ్చేది. అయితే, గత ఏడాదిలో ఎన్సీటీఈ ఈ నిబంధనను మార్చి టెట్ సర్టిఫికెట్ చెల్లుబాటును జీవితకాలానికి పెంచింది. దీంతో అభ్యర్థులు ఒకసారి ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఆ తదుపరి డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా దరఖాస్తు చేసేందుకు అర్హులే. అయితే, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్నందున అభ్యర్థులు టెట్‌లో పాల్గొని తమ స్కోరును పెంచుకోవచ్చు. ఆగస్టు 6 నుంచి పరీక్షలు.. సెప్టెంబర్ 14న ఫలితాలు ఇక టెట్ పరీక్షలను ఆగస్టు 6 నుంచి ప్రారంభించేలా పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆగస్టు 21 వరకు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్లలో ఉ.9.30 నుంచి 12 వరకు, మ.2.30 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 14న ప్రకటిస్తారు. -
టెట్ @ 90 శాతం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 90 శాతం మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని టెట్ కన్వీనర్ రాధారెడ్డి మీడియాకు తెలిపారు. టెట్‌కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా, 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఈడీ అర్హతతో నిర్వహించిన టెట్ పేపర్–1కు మొత్తం 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, 3,18,506 మంది(90.62 శాతం) హాజరయ్యారు. 32,976 మంది గైర్హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షకు బీఎడ్ అభ్యర్థులను కూడా అనుమతించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పేపర్–2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది హాజరయ్యారు. 26,830 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షాకేంద్రాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలను ఓపెన్ చేశామని అధికారులు వెల్లడించారు. టెట్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేస్తామని రాధారెడ్డి తెలిపారు. ♦గర్భిణీ అయిన అర్చన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ పరిధిలోని లైఫ్‌లైన్ హైస్కూల్లో పేపర్–1 పరీక్షకు హాజరైంది. పరీక్ష మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా ఆమెకు పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ♦మూడు రోజుల క్రితం ప్రసవించిన గుండెపాక కవిత ఆసుపత్రి నుంచి మహబూబాబాద్‌లోని తక్షశిల విజ్డమ్ హైస్కూల్లో ఉన్న పరీక్షాకేంద్రానికి వచ్చి పేపర్–1, పేపర్–2 పరీక్ష రాసింది. ♦వైరాకు చెందిన టి.రాణి ఏడురోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఖమ్మంలోని పరీక్షాకేంద్రంలో తన సీటు పక్కనే బిడ్డను పడుకోబెట్టి పరీక్ష రాసింది. ఒక కోడ్‌కు బదులు మరో కోడ్ ప్రశ్నపత్రం అందజేత ఆదిలాబాద్‌టౌన్: టెట్ పేపర్–1లో గందరగోళం ఏర్పడింది. ఆదివారం ఆదిలాబాద్‌లోని ఎస్‌ఆర్‌డీజీ పరీక్ష కేంద్రంలో ఒకరికి ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం మరొకరికి ఇచ్చారు. ఇన్విజిలేటర్ కొంతమంది అభ్యర్థులకు వరుసగా ఇచ్చి ఒక్క అభ్యర్థిని మర్చిపోయి వేరే అభ్యర్థికి ఇవ్వడంతో 16 మంది అభ్యర్థులకు ఒకరికి రావాల్సిన ప్రశ్నపత్రాలు మరొకరికి వచ్చాయి. ఇన్విజిలేటర్ సంతకాలు తీసుకుంటున్న సమయంలో ఓ అభ్యర్థిని బుక్‌లెట్‌లో సంతకం తీసుకుంటున్న షీట్లో ఒక కోడ్ ఉండడం, తనవద్ద మరో వేరే కోడ్ కలిగిన బుక్లెట్ ఉండడంతో విషయాన్ని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో 16 మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీతను సంప్రదించగా.. ఒకరికి ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం మరొకరికి ఇచ్చిన మాట వాస్తవమేనని, పరీక్ష కేంద్రానికి వెళ్లి పరిస్థితి చక్కదిద్దామని చెప్పారు. -
తెలంగాణ టెట్.. అభ్యర్థులూ ఈ సూచనలు మరువొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం జరగనుంది. దీని కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పేపర్–1కు 3,51,468 మంది, పేపర్–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. వాస్తవానికి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్య ర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్–2 రాసే వారు కూడా పేపర్–1 రాసి, ఎస్జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్–1కు దరఖాస్తులు భారీగా వచ్చాయి. టెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 212 పరీక్ష కేంద్రాలున్నాయి. రాజ ధానిలో మొత్తం 50,600 మంది పరీక్ష రాస్తున్నారు. ములుగులో అతి తక్కువగా 15 పరీక్ష కేంద్రాలున్నా యి. ఈ జిల్లాలో దాదాపు 2,200 మంది పరీక్ష రాస్తున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. ప్రశ్నప త్రం ఓపెన్ చేయడం మొదలు కొని, ప్యాక్ చేసే వరకూ వీడియో రికార్డింగ్ చేయాలని ఉన్నతాధికా రులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు పరీక్షను పర్య వేక్షించనున్నారు. పరీక్షాకేంద్రాల్లో ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనపై శుక్రవారం ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. పరీక్షాకేంద్రాల చిరునామాలు సక్రమంగా లేవని, అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫొటోలు, సంతకాలు ముద్రితం కాలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో తగిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను విద్యామంత్రి ఆదేశించారు. ‘టెట్’ను వాయిదా వేయండి.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), రాష్ట్రస్థాయి లో నిర్వహించే టెట్ ఒకేరోజు జరుగుతున్నందున టెట్‌ను వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేర్వేరుగా కోరారు. గుర్తుంచుకోవాల్సిన అంశాలు ♦టెట్ పరీక్ష పేపర్–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకూ ఉంటుంది. పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకూ ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. ♦ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు హాలులోకి అనుమతించరు. వాటిని ముందే పరీక్షాకేంద్రంలో సూచించిన ప్రదేశంలో భద్రప ర్చుకోవాలి. ♦ఓఎంఆర్ షీట్‌పై సర్కిల్స్ నింపేందుకు బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను ఉపయోగించాలి. ఓఎంఆర్ షీట్‌ను ముడవడం, చించడం చేయ కూడదు. దీనివల్ల కంప్యూటర్ మార్కులను తీసుకునే అవకాశం ఉండదు. ♦హాల్‌టికెట్లపై అభ్యర్థి, అధికారుల సంతకం, అభ్యర్థి ఫొటో లేకపోతే గెజిటెడ్ అధికారి సమ క్షంలో ఫొటో అంటించి, ధ్రువీకరణ తీసుకుని, డీఈవో ద్వారా అనుమతి పొందాలి. -
AP TET Notification 2022: ఏపీలో టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్–ఆగస్టు 2022)ను ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 15 నుంచి జూలై 15వ తేదీ వరకు టెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 16 నుంచి జులై 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. aptet.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులకు సహకరించేందుకు ఈనెల 13 నుంచి విద్యా శాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్కును ఏర్పాటు చేస్తున్నారు. జూలై 26వ తేదీ నుంచి ఆన్లైన్ మాక్ టెస్టులు నిర్వహిస్తారు. జూలై 25 నుంచి హాల్‌టిక్కెట్లు జారీ చేస్తారు. ఒకసారి దరఖాస్తు సమర్పించాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల అభ్యర్థులు దరఖాస్తును నింపిన తర్వాత అన్ని వివరాలు జాగ్రత్తగా సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. టెట్ సిలబస్‌ను కూడా పాఠశాల విద్యా శాఖ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో పొందుపరిచింది. పరీక్షలిలా.. పరీక్షలు పేపర్ 1ఏ, పేపర్ 1 బీ, పేపర్ 2 ఏ, పేపర్2 బీలుగా జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక కీని ఆగస్టు 31న విడుదల చేస్తారు. దానిపై సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీని సెప్టెంబర్ 12న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తారు. డీఎస్సీలో వెయిటేజి టెట్‌లో అర్హతకు నిర్ణీత మార్కులను పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఆ మార్కులు సాధిస్తేనే టెట్‌లో క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు. అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు 60 శాతం రావాలి. బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్ ధ్రువపత్రాల చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండేది. తాజా నిబంధనల ప్రకారం జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల స్కోరుకు ఉపాధ్యాయ నియామకాల్లో (డీఎస్సీలో) 20 శాతం మేర వెయిటేజీ కల్పిస్తారు. వీరు అర్హులు డీఎల్ఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు, 2020–22 బ్యాచ్‌లోని అభ్యర్థులు ఈ టెట్‌కు అర్హులు. గతంలో ఏపీ టెట్‌లో ఉత్తీర్ణులైన వారిలో మార్కుల స్కోరును పెంచుకోవాలనుకొనే వారు కూడా ఈ టెట్‌కు హాజరుకావచ్చు. 1 నుంచి 5 తరగతుల బోధనకు సంబంధించిన టీచర్లు పేపర్ 1–ఏకు హాజరుకావాలి. 6 నుంచి 8వ తరగతుల బోధనకు పేపర్–2ఏ రాయాలి. 1 నుంచి 5 తరగతులలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అభ్యర్ధులు పేపర్–1బీ రాయాలి. 6 నుంచి 8వ తరగతుల స్పెషల్ ఎడ్యుకేషన్ బోధనకు పేపర్–2బీకి హాజరుకావాలి. 1 నుంచి 8 తరగతుల బోధన అభ్యర్ధులు పేపర్–1ఏ, పేపర్–1బీ, పేపర్–2ఏ, పేపర్–2బీలను రాయాలి. అభ్యర్ధులు వారు హాజరుకాబోయే పేపర్లకు వేర్వేరుగా రూ.500 చొప్పున ఫీజు చెల్లించాలి. పరీక్షలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నగరాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిసాలలో నిర్వహిస్తారు. -
టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్! ఒక్కసారి రాస్తే చాలు..
సాక్షి, హైదరాబాద్: టెట్‌కు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది. గతం లో టెట్‌లో సాధించిన అర్హత కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు జీవితకాలానికి పొడిగించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్సీటీఈ) రెండేళ్ళ క్రితం ఈ మేరకు మార్పులు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అంటే అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ పాసైనవారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. జూన్ 12న టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటి ఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఈ నెల 25వ తేదీన ‘టీఎస్‌టెట్. సీజీజీ.జీవోవీ.ఇన్’వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. కాగా టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.00 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. (చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు) -
తెలంగాణలో టెట్ నిర్వహణపై మంత్రి సబిత క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, త్వరలో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి వెల్ల డించారు. వర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం త్వరలో చేపట్టనున్నట్టు తెలిపారు. శాసన సభలో శనివారం విద్యాశాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆమె సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠ శాలలకు రూ.2 లక్షలు విరాళమిస్తే స్కూల్ నిర్వ హణ కమిటీలో సభ్యత్వం, రూ.25 లక్షలిస్తే ప్రాథ మిక పాఠశాలలకు, రూ.50 లక్షలిస్తే ప్రాథమికోన్న త పాఠశాలలకు, కోటి ఇస్తే ఉన్నత పాఠశాలలకు దాతల పేర్లు పెట్టాలని నిర్ణయించామన్నారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామ న్నారు. స్కూళ్ల స్థలాలను విద్యా శాఖ పేరు మీదకు మార్పిడి చేయాలని నిర్ణయించి నట్లు తెలిపారు. ‘ప్రైవేటు’పై త్వరలో నివేదిక..: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధా నాలపై మంత్రివర్గం ఉప సంఘం అధ్యయనం జరి పిందని, త్వరలో సీఎంకు నివేదిక సమర్పించనుందని సబిత పేర్కొన్నారు. మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెడు తున్నామని, దీనికోసం ఈ నెల 14 నుంచి నిర్వహించనున్న శిక్షణకు ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని కోరారు. ఆంగ్ల బోధనలో అనుభ వమున్న ఉపాధ్యాయులు సైతం శిక్షణకు హాజరు కావాలని సూచించారు. ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం 7 ఐఐఎంలు, 7 ఐఐ టీలు, 2 ఐఐఎస్సీఆర్లు, 16 ట్రిపుల్ ఐటీలు, 4 ఎన్ఐటీలు, 157 వైద్య కళాశా లలు, 84 నవోదయ పాఠశాలలను మంజూరు చేస్తే.. రాష్ట్రానికి ఒక్కటి కూడా రాలేదని వెల్లడిం చారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. మన ఊరు–మన బడి నిధుల వినియోగంలో విద్య కమిటీ చైర్మన్, హెచ్ఎంకు జాయింట్ చెక్ పవర్ ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోవ డానికి టీసీ అవసరం లేదని ఆదేశించామని వివరించారు. -
Teacher Eligibility Test: టెట్ పాసైతే జీవితకాలం అర్హత
సాక్షి, అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాలం చెల్లుబాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న మేరకు ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తిచేసిన తరువాత అభ్యర్థులకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను ప్రవేశపెట్టడంతో పాటు ఈ విధానం అన్ని రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా తప్పనిసరి చేస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు రూపొందించింది. జాతీయస్థాయిలో ప్రత్యేకంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (సీటీఈటీ)ని సీబీఎస్ఈ ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును తప్పనిసరిగా నిర్వహించాలని, ఏడాదికి కనీసం రెండుసార్లు ఈ టెట్ పరీక్ష పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. టెట్ అర్హత ధ్రువపత్రాల అర్హత కాలపరిమితిని ఏడేళ్లుగా ఎన్సీటీఈ చేసింది. 2011 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లో టెట్ విధానం అమల్లోకి వచ్చింది. టెట్ ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్లు మాత్రమే ఉండడంతో ఆ గడువు ముగిసిన అభ్యర్థులు మళ్లీ టెట్‌ను రాయవలసి వచ్చేది. ఇప్పుడు ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలం చేయడంతో నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. 2011 నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నామని, ఇప్పటికే ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారికి ఇచ్చిన ధ్రువపత్రాల కాలపరిమితి ముగిసి ఉంటే వాటిని జీవితకాలానికి పునరుద్ధరించడమో, కొత్త ద్రువపత్రాలు జారీ చేయడమో చేయాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గతంలో ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారు ఆ సర్టిఫికెట్ల పరిమితి ఏడేళ్లు దాటినా నిశ్చింతగా ఉండవచ్చు. వాటి కాలపరిమితి జీవిత కాలానికి పెంచడంతో మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. అయితే డీఎస్సీలో టెట్ అర్హత మార్కులకు 20 శాతం మేర వెయిటేజి ఇస్తున్నారు. దీనివల్ల టెట్ వెయిటేజి స్కోరును పెంచుకోవడానికి అభ్యర్థులు టెట్‌ను పలుమార్లు రాస్తున్నారు. చదవండి: పరీక్షల రద్దుతో హ్యాపీనా? -
ఏపీ: మేలో టెట్ నోటిఫికేషన్!?.. సిలబస్‌పై సమగ్రంగా..
ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఉండే గౌరవం, ఆదరణ ఎనలేనిది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ కొలువంటే..ఎంతో క్రేజ్! లక్షల మంది సర్కారీ టీచర్‌గా బోధనా రంగంలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ, టీచింగ్ వృత్తిలోకి ప్రవేశించాలంటే.. తొలుత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో అర్హత సాధించడం తప్పనిసరి. కాగా, మేలో ఆంధ్రప్రదేశ్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా ఏపీ టెట్ అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్... సమాజ ప్రగతికి కీలకమైన విద్యాబోధనలో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ)...టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను ముందుకు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు‘టెట్’ను నిర్వహిస్తున్నాయి. గతంలో టెట్ అర్హతా గుర్తింపు ఏడేళ్లు కాగా, ప్రస్తుతం టెట్‌లో ఒక్కసారి అర్హత సాధిస్తే సరిపోతుంది. ఏపీ టెట్‌కు సంబంధించి.. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు(ఎస్జీటీ) పేపర్–1ఏ; ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు(స్కూల్ అసిస్టెంట్) పేపర్–2ఏ రాయాల్సి ఉంటుంది. 20 శాతం వెయిటేజీ ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే.. డీఎస్సీ రాయాలి. దాని కంటే ముందు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్సీటీఈ) నిబంధనల మేరకు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అంతేకాకుండా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించినవారికి ఉపాధ్యాయ నియామక పోస్టుల్లో 20 శాతం వెయిటేజీ లభిస్తుంది. అర్హతలు టెట్ రాసేందుకు పేపర్‌ను బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీతోపాటు డీఈడీ/బీఈడీ /లాంగ్వేజ్ పండిట్ /బీఎల్‌ఈడీ/డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్ /బీపీఈడీ తత్సమాన కోర్సులు చదివుండాలి. పరీక్ష విధానం ►ఏపీ టెట్‌ను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1–5 తరగతుల టీచర్ పోస్టులకు పోటీ పడేవారు పేపర్ 1ఏకు; 6–8 తరగతుల టీచర్ పోస్టులకు పోటీ పడేవారు పేపర్ 2ఏకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆయా పోస్టులకు పేర్కొన్న అర్హతలు కలిగిన వారు రెండు పేపర్లకూ హాజరవ్వొచ్చు. టెట్ ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. ►పేపర్ 1బీ, పేపర్ 2బీలు స్పెషల్ స్కూల్స్‌లో టీచర్ రిక్రూట్మెంట్కు ఉద్దేశించినవి. డీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. రెగ్యులర్ స్కూల్స్‌లో పోస్టులకు పోటీ పడాలనుకునే అభ్యర్థులు పేపర్ 1ఏ, పేపర్ 2ఏలకు హాజరవ్వాల్సి ఉంటుంది. తెలుగు(లాంగ్వేజ్ ఐ) కంటెంట్–24 మార్కులు, పెడగాజీ–6 మార్కులు; ఇంగ్లిష్ కంటెంట్–24 మార్కులు, పెడగాజీ–6 మార్కులు; గణితం కంటెంట్–24 మార్కులు, పెడగాజీ–6 మార్కులు; పరిసరాల విజ్ఞానం కంటెంట్–24 మార్కులు, పెడగాజీ– 6 మార్కులకు ఉంటుంది. టెట్ పేపర్ 2ఏ పరీక్ష సమయం: రెండున్నర గంటలు; మార్కులు: 150. ఏపీ టెట్ పేపర్ 2ఏలో మ్యాథమెటిక్స్, సైన్స్ ఒక విభాగం గానూ; సాంఘికశాస్త్రం మరో విభాగంగానూ ఉంటాయి. విద్యార్థులు వారి వారి సబ్జెక్టుల ఆధారంగా ఆయా విభాగాలకు హాజరవుతారు. సిలబస్ ప్రకారం–ప్రశ్నలు, మార్కులు పరి శీలిస్తే.. శిశు వికాసం శాస్త్రం(సైకాలజీ)–30మార్కులు; తెలుగు కంటెంట్–24 మార్కులు, మెథడాలజీ–6 మార్కులు; ఇంగ్లిష్ కంటెంట్–24 మార్కులు, మెథడాలజీ–6 మార్కులు; మ్యాథ మెటిక్స్ కంటెంట్ 24మార్కులు+మెథడాలజీ 6 మార్కులు; అలాగే సైన్స్ కంటెంట్ 24 మార్కులు+ మెథడాలజీ 6 మార్కులకు చొప్పున–మొత్తం 60 మార్కులకు గణితం, సైన్స్ విభాగం పరీక్ష జరుగుతుంది. అలాగే సోషల్ సైన్స్ మొత్తం 60మార్కులకు జరిగితే.. ఇందులో కంటెంట్–48మార్కులకు, మెథడాలజీ 12మార్కులకు ఉంటుంది. సైన్స్ కంటెంట్‌కు కేటాయించిన 24 మార్కుల్లో ఫిజికల్ సైన్స్‌కు 12 మార్కులు, బయలాజికల్ సైన్స్‌కు 12 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ టీచర్లకు కంటెంట్‌పై 12 మార్కులు,పెడగాజీపై 12 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. టెట్ కనీస అర్హత మార్కులు ఏపీ టెట్‌లో జనరల్ అభ్యర్థులు(ఓసీలు) కనీసం 60శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు పొందితేనే.. అర్హత సాధించినట్లుగా పేర్కొంటారు. స్కూల్ అసిస్టెంట్(6–8 తరగతులు) ►ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై దృష్టిసారించాలి. ►బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం–ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ►సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచ యుద్ధాలు–అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలపై దృష్టిసారించాలి. ►మెథడాలజీ: ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన ఉద్దేశాలు, విద్యా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బీఈడీ స్థాయి పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. ►మాక్‌టెస్ట్‌లు: కంటెంట్‌కు సంబంధించి తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే ఇతర మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. మెథడాలజీలో బోధనా లక్ష్యాలు–స్పష్టీకరణలు; బోధనా పద్ధతులపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్ ముఖ్యం. మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్లోని లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. కాబట్టి పాఠశాల విద్యాశాఖ, శిక్షణ సంస్థలు అందించే ‘ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లు’ రాయడం లాభిస్తుంది. ప్రిపరేషన్ పక్కాగా ఎస్జీటీ విద్యా దృక్పథాలు దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు–హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్టం(ఎన్సీఎఫ్–2005); విద్యాహక్కు చట్టం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం శిశు వికాసం అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు ముఖ్యమైనవి. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన–స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టిసారించాలి. ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా.. సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా.. ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి. కంటెంట్ ►తెలుగు(ఆప్షనల్), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్స్టడీస్ సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు–కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతోపాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితరాలపై పట్టు సాధించాలి. ►గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తి మార్కులు లభిస్తాయి. ►సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు–క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. ►ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించాలి. ►సోషల్‌స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ–బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం–సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ.. అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు. మెథడాలజీ ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. సొంత నోట్స్ రూపకల్పనతో మంచి ఫలితం ఉంటుంది. డీఎడ్ పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. -
ట్వెల్త్ వరకు టీచర్లకు టెట్!
సాక్షి, హైదరాబాద్: పూర్వ ప్రాథమిక స్థాయి (ప్రీ ప్రైమరీ) నుంచి 12వ తరగతి వరకు బోధించే వారందరికీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వర్తింపజేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిర్ణయించింది. భవిష్యత్తులో ఆయా తరగతులకు బోధించేందుకు టీచర్లుగా నియమితులయ్యే వారంతా ముందుగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్నమాట. నూతన విద్యా విధానంలో భాగంగా ఇది అమల్లోకి రానుంది. దీనిపై లోతుగా అధ్యయనం చేసి సమగ్ర మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్సీటీఈ సభ్య కార్యదర్శి కేసంగ్ వై. శెర్పా తెలిపారు. మార్చి 31వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. మరోవైపు ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన టెట్లు, వాటికి హాజరైన అభ్యర్థులు, అందులో అర్హత సాధించినవారు, టెట్ నిబంధనల విషయంలో తలెత్తిన సమస్యలు, రాష్ట్రాల అభ్యంతరాలు.. ఈ వివరాలన్నింటినీ తమకు పంపించాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు, పాఠశాల విద్య కమిషనర్లకు బుధవారం లేఖ రాశారు. 2010 నుంచే టెట్ టీచర్ కావాలనుకుంటే ముందుగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్న నిబంధనను ఎన్సీటీఈ 2010లోనే అమల్లోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు (ప్రాథమిక), 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు (ప్రాథమికోన్నత) బోధించే టీచర్లు టెట్‌లో అర్హత సాధించి ఉండాలని పేర్కొంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఇవ్వాలని తెలిపింది. టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2011 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుసార్లు టెట్‌ను నిర్వహించారు. అర్హత సాధించిన వారి స్కోర్‌ను బట్టి ఉపాధ్యాయ నియామకాల్లో గరిష్టంగా 20 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. అయితే రాష్ట్రంలో పాఠశాల స్థాయిని బట్టి టీచర్ల కేడర్లు లేవు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) రెండు కేడర్లే ఉన్నాయి. దీంతో ఎస్జీటీ కావాలంటే టెట్ పేపరు–1లో అర్హత సాధించి ఉండాలని, ఎస్ఏ కావాలంటే పేపరు–2లో అర్హత సాధించి ఉండాలన్న నిబంధనను విధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపడుతోంది. 9, 10 తరగతులు బోధించేందుకు ప్రత్యేక కేడర్ లేదు కనుక పదో తరగతికి బోధించే స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా టెట్‌ను అమలు చేస్తోంది. డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఎన్సీటీఈ నిర్ణయించింది. ఇందుకోసం డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సును కూడా ప్రవేశ పెట్టింది. తాము నియమించిన కమిటీ తాజాగా టెట్ సమగ్ర మార్గదర్శకాలను రూపొందిస్తుందని, అందులో పరీక్ష విధానం, పరీక్షలో పరిగణనలోకి తీసుకునే అంశాలు కూడా ఉంటాయని ఎన్సీటీఈ పేర్కొంది. ఇప్పటివరకు నిర్వహించిన టెట్ల విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన అంశాలు, లోపాలు, ఫిర్యాదులు, సమస్యలు, ప్రభుత్వాలే కాకుండా వివిధ సంస్థలు, వ్యక్తులు, ఏజెన్సీలు, ఇతర భాగస్వామ్య విభాగాలు సమర్పించిన అంశాలన్నింటినీ కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపింది. కాగా సీబీఎస్ఈ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 15వ తేదీలోగా ఈ వివరాలు తమకు పంపించాలని స్పష్టం చేసింది. -
టెట్ వ్యాలిడిటీ శాశ్వతం..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉంది. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన ఎన్సీటీఈ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్సీటీఈ భావిస్తోంది. 2010లో టెట్‌ను అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించగా, కొన్ని రాష్ట్రాలు రెండు మూడేళ్లకోసారి టెట్ నిర్వహించాయి. మొదట్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన లక్షల మందికి సంబంధించిన టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. అందుకే వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. వీరికీ వర్తిస్తుందా?: ఉమ్మడి ఏపీలో 4 సార్లు, తెలంగాణ వచ్చాక 2 సార్లు టెట్ నిర్వహించారు. మొదటిసారి టెట్‌ను 2011 జూలై 1న నిర్వహించగా, అందులో పేపర్–1లో 1,35,105 మంది, పేపర్–2లో 1,66,262 మంది అర్హత సాధించా రు. రెండో టెట్‌లో పేపర్–1లో 24,578 మంది, పేపర్–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. మూడో టెట్‌లో పేపర్–1లో 26,382 మంది, పేపర్–2లో 1,94,849 మంది అర్హత సాధించారు. అయితే అందులో టెట్ స్కోర్ పెంచుకునేందుకు రెండోసారి మూడోసారి రాసిన వారు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొదటి మూడు టెట్లలో మొత్తంగా 7 లక్షల మందికి పైగా అర్హత సాధించగా, అందులో తెలంగాణ విద్యార్థులు 3 లక్షల మందికిపైగా ఉన్నారు. ఇప్పటికే వారందరి టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. వారి విషయంలో ఎన్సీటీఈ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. -
ముగిసిన మూడో టెట్ వ్యాలిడిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థుల మూడో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీ కూడా ముగిసిపోయింది. దీంతో ఇప్పటికిప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా లేకుండా పోతుంది. నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించాల్సి ఉన్నా.. రాష్ట్రంలో రెండేళ్లుగా ఆ ఊసే లేదు. టెట్ నిర్వహించేందుకు అనుమతి కోసం విద్యా శాఖ పంపిన ఫైలు ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక 6 టెట్లు నిర్వహించగా, ఇప్పటి వరకు మూడు టెట్ల వ్యాలిడిటీ ముగిసిపోయింది. 2011 జూన్ 1 మొదటి టెట్ నిర్వహించగా, 2012 జనవరి 8న రెండో టెట్, అదే ఏడాది జూన్ 1న మూడో టెట్ నిర్వహించారు. ప్రస్తుతం వాటి వ్యాలిడిటీ ముగిసిపోవడంతో అభ్యర్థులంతా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ టీచర్లుగా పని చేయాలంటే టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహించకపోవడంతో అనేక మంది టెట్ అర్హత లేకుండా టీచర్లుగా పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2017 జూలై నుంచి లేని టెట్ రాష్ట్రంలో 2017 జూలై 23న చివరి టెట్ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివరకు టెట్ నిర్వహించలేదు. చివరగా నిర్వహించిన ఆ టెట్ పేపర్–1కు 98,848 మంది హాజరు కాగా, 56,708 మంది అర్హత సాధించారు. దాదాపు 40 వేల మంది ఫెయిల్ అయ్యారు. ఇక పేపర్–2 పరీక్ష 2,30,932 మంది హాజరు కాగా 45,045 మంది అర్హత సాధించారు. అంటే 1.90 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. అయితే వారిలో అంతకుముందు టెట్లలో అర్హత సాధించిన వారు కొంత మంది ఉన్నా దాదాపు 2 లక్షల మంది టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ఆరు టెట్లలో దాదాపు 6 లక్షల మంది అర్హత సాధించగా, అందులో ఈ రెండు లక్షల మంది టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయినట్లు నిరుద్యోగులు చెబుతున్నారు. వారితో పాటు 2017 జూలై తర్వాత రాష్ట్రంలో టెట్ నిర్వహించలేదు. ఇక అప్పటి నుంచి బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణులైన దాదాపు 60 వేల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్సీటీఈ నిబంధనల మేరకు.. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2010లోనే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోనూ ఏటా రెండుసార్లు (నవంబర్/డిసెంబర్, జూన్/జూలై) టెట్ నిర్వహించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్హత సాధించిన వారే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలుంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. టెట్ స్కోర్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందన్న నిబంధనను విధించింది. ఏడేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మళ్లీ టెట్‌లో అర్హత సాధించాలని స్పష్టం చేసింది. ఆ నిబంధన ప్రకారం రాష్ట్రంలో మొదటి ఏడాది తప్ప ఏటా రెండు సార్లు టెట్‌ను నిర్వహించట్లేదు. 2011 నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు టెట్ నిర్వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు, తెలంగాణ ఏర్పడ్డాక 2 సార్లే టెట్ నిర్వహించింది. ఇందులో 2011 జూలై 1న నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ 2018 జూలై 1తో ముగిసింది. 2012 జనవరి 8న నిర్వహించిన రెండో టెట్ వ్యాలిడిటీ ఈ జనవరి 8తో ముగిసిపోయింది. అలాగే ఈనెల 1తో 2012 జూన్ 1న నిర్వహించిన మూడో టెట్ స్కోర్ వ్యాలిడిటీ కూడా ముగిసిపోయింది. -
ఆన్లైన్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)నూ ఆన్లైన్లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే డీఈఈసెట్‌ను ఆన్లైన్లో నిర్వహిస్తున్న విద్యా శాఖ భవిష్యత్తులో టెట్‌నూ ఆన్లైన్లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా విద్యా శాఖ పంపించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేయాలి? టెట్ ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించాకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని విద్యా శాఖ అభిప్రాయానికి వచ్చింది. సాధారణంగా ఏటా 2సార్లు టెట్ నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఆచరణలో అవి అమలు కావడం లేదు. 2010లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు టెట్‌ను 6సార్లు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు, తెలంగాణ వచ్చాక 2 సార్లు టెట్‌ను నిర్వహించారు. అయితే మొదటి, రెండో టెట్‌కు ఉన్న ఏడేళ్ల వ్యాలిడిటీ ప్రస్తుతం ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఉపాధ్యాయ నోటిఫికేషన్లు జారీ అయితే కష్టం అవుతుందన్న ఉద్దేశంతో టెట్ నిర్వహించాలని నిరుద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో గతేడాదే విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది మొదట్లోనే టెట్ తేదీలతోపాటు, ఆన్లైన్లో టెట్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలను పంపింది. అయితే ఆన్లైన్లో నిర్వహణకు ఓకే చెప్పిన ప్రభుత్వం టెట్ నిర్వహణ సమయంపై మాత్రం ఉన్నత స్థాయిలో చర్చించాకే నిర్ణయం ప్రకటించాలన్న ఆలోచనకు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) పూర్తి చేసిన విద్యా ర్థులు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2018 జూలైలోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్జీటీ పోస్టులకు ఎంపికైన వారు మాత్రం ప్రాథమిక విద్యలో బోధనపై 6 నెలల ఇండక్షన్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. ఈ మేరకు సెంట్రల్ టెట్‌లో ఆ అవకాశం కల్పించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే రాష్ట్ర టెట్‌లోనూ ఆ అర్హతను చేర్చుతూ టెట్ రూల్స్‌కు సవరణలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వాటికి కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలిసింది. మరోవైపు ఫైనలియర్ చదువుతున్న వారు కాకుండా, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారు మాత్రమే టెట్ రాసేలా నిబంధనను విద్యా శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ఏ డిగ్రీ అభ్యర్థి అయినా టెట్‌కు అర్హుడే
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన టెట్–2017 నిబంధనలకు కొన్ని సవరణలో చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు (జీఓ4) జారీచేసింది. బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీ చేసిన వారు మాత్రమే టెట్‌కు అర్హులని ఇదివరకు నిబంధన పెట్టగా బీటెక్ డిగ్రీతో బీఈడీ చేసిన తమకూ అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారికీ అవకాశం కల్పించేలా ఏ డిగ్రీ చేసినా టెట్‌కు అర్హులేనని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల్లో అర్హత మార్కుల విషయంలోనూ సవరణ చేసింది. అందరికీ ఒకే మాదిరిగా 40 మార్కులు అర్హత మార్కులుగా నిర్ణయించింది. దీంతో పాటు భాషోపాధ్యాయ పోస్టులకు గతంలోని నిబంధనను సవరిస్తూ పరీక్షలో 150 ప్రశ్నల్లో ఆయా లాంగ్వేజ్‌లకు సంబంధించి 60 ప్రశ్నలుండేలా నిర్ణయం తీసుకుంది. -
పాసయింది.. పావు శాతమే
టెట్ పేపర్-2లో బాగా తగ్గిపోయిన అర్హుల శాతం సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్-2లో కేవలం పావు శాతం మందే అర్హత సాధించారు. సోషల్, మ్యాథ్స్-సైన్స్ విభాగాల్లో కలిపి ఈ పరీక్షకు 2,74,261 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,51,906 మంది హాజరయ్యారు. ఇందులో 63,079 మంది (25.04 శాతం) మాత్రమే అర్హత సాధించారు. ఇక పేపర్-1 పరీక్షకు 1,01,216 మంది దరఖాస్తు చేసుకోగా 88,661 మంది హాజరయ్యారు. అందులో 48,278 మంది (54.45 శాతం) అర్హత సాధిం చారు. రాష్ట్రవ్యాప్తంగా మే 22న నిర్వహించిన టెట్ ఫలితాలను పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్ శుక్రవారం విడుదల చేశారు. ఉపాధ్యా య పోస్టుల భర్తీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్నందున ఎక్కువ అభ్యర్థు లు పరీక్షకు హాజరయ్యారని ఆయన తెలి పారు. అభ్యర్థులకు సంబంధం లేని సబ్జెక్టులను సిలబస్‌లో పెట్టారన్న దానిపై ప్రశ్నిం చగా... జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాల ప్రకారమే ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అంశాలతో టెట్ పరీక్ష నిర్వహించాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలేమీ పెట్టలేదని కిషన్ వివరించారు. ప్రశ్నలు కఠినంగా ఇస్తున్నారన్న అంశంపై స్పంది స్తూ... అభ్యర్థులు మరింతగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉందని సూచించారు. మరో టెట్ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెట్ డెరైక్టర్ ఎస్.జగన్నాథరెడ్డి, పాఠశాల విద్యా అదనపు డెరైక్టర్లు గోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, జాయింట్ డెరైక్టర్ శ్రీహరి, టెట్ డిప్యూటీ డెరైక్టర్ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈసారి టెట్ రాసిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీ నుంచి రూ.15 చెల్లించి తమ ఓఎంఆర్ జవాబుల పత్రం కాపీని వెబ్సైట్ ్టట్ట్ఛ్ట.ఛిజజ.జౌఠి.జీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పురుషులు, మహిళలవారీగా.. టెట్ పేపర్-1కు 37,799 మంది పురుషులు హాజరుకాగా 22,553 మంది (59.67 శాతం).. బాలికలు 50,862 మంది హాజరుకాగా 25,725 మంది (50.58 శాతం) అర్హత సాధించారు. ఇక పేపర్-2లో సోషల్, మ్యాథ్స్-సైన్స్ విభాగాల్లో కలిపి 1,11,910 మంది పురుషులు హాజరుకాగా 35,2105 మంది (31.45 శాతం).. బాలికలు 1,39,996 మంది హాజరుకాగా 27,864 మంది (19.90 శాతం) మాత్రమే అర్హత సాధించారు. 3,893 మంది ఫలితాలు నిలిపివేత టెట్ పరీక్షలో చేసిన పొరపాట్ల కారణంగా 3,893 మంది అభ్యర్థులు నష్టపోయారు. ప్రశ్నపత్రం పేపర్ కోడ్‌ను వేయకపోవడంతో 3,677 మంది, ఒకటి కంటే ఎక్కువ కోడ్లు వేసిన 216 మంది ఫలితాలను నిలిపివేశారు. 21 నుంచి రూ.15 చెల్లించి అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రం కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ పొరపాట్లు, మార్కులు, ఇతర అంశాలను తెలుసుకోవచ్చు. పేపర్-2 దారుణం: 2014 మార్చిలో నిర్వహించిన నాలుగో టెట్ పేపర్-2లో అర్హత సాధించిన వారికంటే ఈసారి పేపర్-2లో అర్హుల సంఖ్య మరిం తగా తగ్గింది. ఇప్పటివరకు జరిగిన టెట్లను పరిశీలిస్తే... పేపర్-2లో అర్హుల సంఖ్య క్రమంగా పడిపోతోంది. తొలి టెట్ పేపర్-2 లో 49.68 శాతం మంది అర్హత సాధించగా... రెండో టెట్‌లో 47.02 శాతం, మూడో టెట్‌లో 46.56 శాతం, నాలుగో టెట్‌లో 28.56 శాతం, తాజాగా జరిగిన ఐదో టెట్‌లో 25.04 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. మరోవైపు పేపర్-1లో అర్హుల శాతం క్రమంగా పెరుగుతోంది. తొలి టెట్ పేపర్-1లో 44.27 శాతం అర్హత పొందగా.. తాజా టెట్‌లో 54.45 శాతం మంది అర్హత సాధించారు. ఆనందంగా ఉంది.. మాది మెదక్ జిల్లా పాపన్నపేట మండ లం ముద్దాపూర్. పేపర్-1లో 150 మార్కులకు 134 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న స్మితా సబర్వాల్ నాకు ఆదర్శం. ఐఏఎస్ సాధించాలనేది నా లక్ష్యం. - ఊరడి స్నేహలత పేపర్-1లో టాపర్ మా ఆయన సహకారంతోనే.. పేపర్-2లో 126 మార్కులు సాధించ డం ఆనందంగా ఉం ది. మాది కరీంనగర్ జిల్లా మెట్పల్లి. ఇక్క డి సూర్యోదయ హైస్కూల్లో టీచర్ చేస్తున్నా. నా భర్త శ్రీనివాస్ ప్రభుత్వ టీచర్. ఆయన సహకారం ఫలితమే ఇది. డీఎస్సీ లో కూడా మంచి మార్కులు పొంది ప్రభుత్వ టీచర్‌గా స్థిరపడతా. - దాసరి శారదావాణి పేపర్-2లో టాపర్ -
తెలంగాణ టెట్ పేపర్ 1 ప్రారంభం
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగుతుంది. అన్ని సెంటర్లో పరీక్ష మొదలైంది. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. రెండు పరీక్షలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎడ్యూకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య పేపర్ 1 కు సెట్-1 కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసి విడుదల చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ లలో, ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. -
టెట్ పేపర్ 1కు సెట్-1 ప్రశ్నాపత్రం ఎంపిక
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం నిర్వహిస్తున్నారు. పేపర్ 1, పేపర్ 2 అనే రెండు విభాగాలుంటాయి. ఉదయం 10 గంటలకు పేపర్ 1 పరీక్ష ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ఎడ్యూకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య పేపర్ 1 కు సెట్-1 కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసి విడుదల చేశారు. అభ్యర్థులను నిర్ధేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష హాలులోకి అనుమతిస్తామని... ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 3.75 లక్షల మంది విద్యార్థులు టెట్ కు హాజరవనున్నట్లు అధికారులు తెలిపారు. -
నేడే టెట్
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ - హాజరుకానున్న 3.73 లక్షలమంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతాయి. రెండు పరీక్షలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులను నిర్ధేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని... ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పేపర్-1 పరీక్షకు సంబంధించిన సెట్ కోడ్‌ను ఉదయం 6 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య విడుదల చేస్తారని... పేపర్-2 పరీక్ష సెట్ కోడ్‌ను ఉదయం 10 గంటలకు విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో డెరైక్టర్ కిషన్ విడుదల చేస్తారని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి తెలిపారు.