ఖమ్మంలోని ఓ పరీక్షాకేంద్రంలో పసిపాపను పక్కన పడుకోబెట్టి టెట్ రాస్తున్న టి.రాణి
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 90 శాతం మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని టెట్ కన్వీనర్ రాధారెడ్డి మీడియాకు తెలిపారు. టెట్‌కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా, 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఈడీ అర్హతతో నిర్వహించిన టెట్ పేపర్–1కు మొత్తం 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, 3,18,506 మంది(90.62 శాతం) హాజరయ్యారు.
32,976 మంది గైర్హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షకు బీఎడ్ అభ్యర్థులను కూడా అనుమతించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పేపర్–2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది హాజరయ్యారు. 26,830 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షాకేంద్రాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలను ఓపెన్ చేశామని అధికారులు వెల్లడించారు. టెట్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేస్తామని రాధారెడ్డి తెలిపారు.
♦గర్భిణీ అయిన అర్చన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడ పరిధిలోని లైఫ్‌లైన్ హైస్కూల్‌లో పేపర్–1 పరీక్షకు హాజరైంది. పరీక్ష మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా ఆమెకు పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
♦మూడు రోజుల క్రితం ప్రసవించిన గుండెపాక కవిత ఆసుపత్రి నుంచి మహబూబాబాద్‌లోని తక్షశిల విజ్‌డమ్ హైస్కూల్‌లో ఉన్న పరీక్షాకేంద్రానికి వచ్చి పేపర్–1, పేపర్–2 పరీక్ష రాసింది.
♦వైరాకు చెందిన టి.రాణి ఏడురోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఖమ్మంలోని పరీక్షాకేంద్రంలో తన సీటు పక్కనే బిడ్డను పడుకోబెట్టి పరీక్ష రాసింది.
ఒక కోడ్‌కు బదులు మరో కోడ్ ప్రశ్నపత్రం అందజేత
ఆదిలాబాద్‌టౌన్: టెట్ పేపర్–1లో గందరగోళం ఏర్పడింది. ఆదివారం ఆదిలాబాద్‌లోని ఎస్‌ఆర్‌డీజీ పరీక్ష కేంద్రంలో ఒకరికి ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం మరొకరికి ఇచ్చారు. ఇన్విజిలేటర్ కొంతమంది అభ్యర్థులకు వరుసగా ఇచ్చి ఒక్క అభ్యర్థిని మర్చిపోయి వేరే అభ్యర్థికి ఇవ్వడంతో 16 మంది అభ్యర్థులకు ఒకరికి రావాల్సిన ప్రశ్నపత్రాలు మరొకరికి వచ్చాయి.
ఇన్విజిలేటర్ సంతకాలు తీసుకుంటున్న సమయంలో ఓ అభ్యర్థిని బుక్‌లెట్‌లో సంతకం తీసుకుంటున్న షీట్‌లో ఒక కోడ్ ఉండడం, తనవద్ద మరో వేరే కోడ్ కలిగిన బుక్‌లెట్ ఉండడంతో విషయాన్ని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో 16 మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీతను సంప్రదించగా.. ఒకరికి ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం మరొకరికి ఇచ్చిన మాట వాస్తవమేనని, పరీక్ష కేంద్రానికి వెళ్లి పరిస్థితి చక్కదిద్దామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment