radha reddy
-
చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరు చెరిపేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరును లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది చాలా బాధాకరమని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్రాస్ నుంచి చిత్రపరిశ్రమ నగరానికి వచ్చేసమయంలో చిత్రపరిశ్రమలో 24 క్రాఫ్ట్‌ల్లో పనిచేస్తున్న వారికోసం ఎంతో శ్రమించి అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఏర్పాటు చేస్తే చిత్రపరిశ్రమలోని పెద్దలు ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని చెప్పరని కేవలం చిత్రపురి కాలనీ అనే సంబోధించడం బాధాకరమన్నారు. చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రి నెలకొల్పుతామని చిత్రపురి కమిటీకి 2 సంవత్సరాల క్రితం తాము నివేదిక పంపి, తాము ఆసుపత్రి ఏర్పాటు, అనుమతుల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా ఇప్పుడు చిత్రపరిశ్రమలోని ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం బాధాకరమని, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేరును పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే అనుకోవచ్చునని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు శైలజారెడ్డి, విశాలాక్షి, రాధారెడ్డి, లక్ష్మిరెడ్డిలు మాట్లాడుతూ... పేద కళాకారుల కోసం ఆసుపత్రి నిర్మించడాన్ని తాము వ్యతిరేకిండంలేదని, కాని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు సంవత్సరాల క్రితమే తాము ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చిత్రపురి కమిటీకి నివేదిక ఇచ్చామని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్యం, కమిటీ తమకు ఎంత స్థలం కేటాయించాలి అనే విషయం చర్చించడం, తాము అనుమతులు ఇతరత్రా పనుల్లో ఉండగానే తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి నిర్మిస్తాను అని ఓ సినీ ప్రముఖుడు ప్రకటించుకోవడం సరికాదన్నారు. తమకు అవకాశం ఇచ్చి స్థలం కేటాయిస్తే సంవత్సరంలోపు ఆసుపత్రి నిర్మించి పేద కళాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చిత్రపురి కాలనీలో ఉన్న పాఠశాలను ప్రైవేట్‌కు అప్పగించారని, ఇప్పుడు ఆసుపత్రి నిర్మించి దాన్ని కూడా ప్రైవేట్‌కు అప్పగించరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. (క్లిక్: సినీ కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తా: చిరంజీవి) -
టెట్ @ 90 శాతం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 90 శాతం మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని టెట్ కన్వీనర్ రాధారెడ్డి మీడియాకు తెలిపారు. టెట్‌కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా, 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఈడీ అర్హతతో నిర్వహించిన టెట్ పేపర్–1కు మొత్తం 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, 3,18,506 మంది(90.62 శాతం) హాజరయ్యారు. 32,976 మంది గైర్హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షకు బీఎడ్ అభ్యర్థులను కూడా అనుమతించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పేపర్–2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది హాజరయ్యారు. 26,830 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షాకేంద్రాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలను ఓపెన్ చేశామని అధికారులు వెల్లడించారు. టెట్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేస్తామని రాధారెడ్డి తెలిపారు. ♦గర్భిణీ అయిన అర్చన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ పరిధిలోని లైఫ్‌లైన్ హైస్కూల్లో పేపర్–1 పరీక్షకు హాజరైంది. పరీక్ష మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా ఆమెకు పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ♦మూడు రోజుల క్రితం ప్రసవించిన గుండెపాక కవిత ఆసుపత్రి నుంచి మహబూబాబాద్‌లోని తక్షశిల విజ్డమ్ హైస్కూల్లో ఉన్న పరీక్షాకేంద్రానికి వచ్చి పేపర్–1, పేపర్–2 పరీక్ష రాసింది. ♦వైరాకు చెందిన టి.రాణి ఏడురోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఖమ్మంలోని పరీక్షాకేంద్రంలో తన సీటు పక్కనే బిడ్డను పడుకోబెట్టి పరీక్ష రాసింది. ఒక కోడ్‌కు బదులు మరో కోడ్ ప్రశ్నపత్రం అందజేత ఆదిలాబాద్‌టౌన్: టెట్ పేపర్–1లో గందరగోళం ఏర్పడింది. ఆదివారం ఆదిలాబాద్‌లోని ఎస్‌ఆర్‌డీజీ పరీక్ష కేంద్రంలో ఒకరికి ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం మరొకరికి ఇచ్చారు. ఇన్విజిలేటర్ కొంతమంది అభ్యర్థులకు వరుసగా ఇచ్చి ఒక్క అభ్యర్థిని మర్చిపోయి వేరే అభ్యర్థికి ఇవ్వడంతో 16 మంది అభ్యర్థులకు ఒకరికి రావాల్సిన ప్రశ్నపత్రాలు మరొకరికి వచ్చాయి. ఇన్విజిలేటర్ సంతకాలు తీసుకుంటున్న సమయంలో ఓ అభ్యర్థిని బుక్‌లెట్‌లో సంతకం తీసుకుంటున్న షీట్లో ఒక కోడ్ ఉండడం, తనవద్ద మరో వేరే కోడ్ కలిగిన బుక్లెట్ ఉండడంతో విషయాన్ని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో 16 మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీతను సంప్రదించగా.. ఒకరికి ఇవ్వాల్సిన ప్రశ్నపత్రం మరొకరికి ఇచ్చిన మాట వాస్తవమేనని, పరీక్ష కేంద్రానికి వెళ్లి పరిస్థితి చక్కదిద్దామని చెప్పారు. -
నాట్య తపస్సు
నేను నా దైవం నాట్యం చేసేదెందుకు? నలుగురు చూసేటందుకు. నలుగురూ చూసి మురిసే నాట్యం దైవార్పితం ఎలా అవుతుంది? అది ముమ్మాటికీ ప్రదర్శనే అవుతుంది. నాట్యం... నిన్ను నువ్వు చూసుకోవడానికి... నీలోనే ఉన్న పరమాణువుల సంలీనంలో బ్రహ్మాండాన్ని దర్శించడానికి. నాట్యం... నిన్ను ఆనందింపచేస్తేనే... ప్రపంచమూ పులకితమవుతుంది. రాజారాధారెడ్డిలకు నాట్యం ఒక తపస్సు... ఒక దైవతాండవం దైవాన్ని నృత్యంతో ఆరాధిస్తారా, నృత్యంలో దైవాన్ని దర్శిస్తారా? రాజారెడ్డి: రెండూనూ! ఎందుకంటే నాట్యకారులకు నాట్యమే దైవం. మనదేశంలో ప్రాచీన కాలం నాటి రోజులను గమనించండి. ఎన్నో ధార్మిక ప్రదేశాలకు, దేవాలయాలకు, సంస్కృతికి పెట్టింది పేరైన మన దేశంలో నర్తకీమణులు దేవాలయాల వద్ద దేవున్ని స్తుతిస్తూ నర్తించేవారు. నాటి నుంచి నాట్యకారులకు అన్నీ దేవుడే అయ్యాడు. తట్టుమేల, నాట్యమేల ద్వారా భగవంతుని లీలలను ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ప్రజలకు తెలియజేసేవారు. అంటే, నృత్య సాధన చేసేవారు భగవంతుని లీలలు మొత్తం నేర్చుకోవాలి. ఆ విధంగా శివలీలలు, భాగవతం, దశావతారాలు.. ప్రదర్శనలను ప్రపంచమంతటా ప్రదర్శించాం నేనూ రాధ. దంపతులిద్దరూ డ్యాన్సర్లే కావడం యాదృచ్ఛికమా, భగవత్సంకల్పమా? రాధారెడ్డి: భగవంతుని దయ లేనిదే ఏదీ జరగదు. రాజా మా మేనత్త కొడుకు. మా పెళ్లప్పుడు రాజాకు పదకొండేళ్లు, నాకు ఐదేళ్లు. మాకు ఆ పెళ్లి గురించి ఏమీ తెలియదు. అమ్మనాన్నలు మీరు భార్యాభర్తలు అని చెప్పేవారు. నేను ఆటలో మునిగినప్పుడల్లా నానమ్మ గుర్తుచేస్తుండేది నువ్వు రాజా భార్యవి అని. ఆ మాటలో నీకు పెళ్లయ్యింది సుమా! అనే హెచ్చరిక వినిపించేది. అత్తింటికి వచ్చాక మాత్రం నా భర్త ముందుగా నాకు స్నేహితుడు అయ్యాడు. తర్వాత గురువు అయ్యాడు. మొదట్లో ఇద్దరం భాగవతం, వీధి నాటకాలు చూసేవాళ్లం. తర్వాత రోజుల్లో సాధువులు ఎలా తపస్సు చేసుకుంటారో అలా డ్యాన్స్‌ని పట్టుకున్నాం. మా ఇద్దరి కాంబినేషన్‌లాగ ఇప్పటి వరకూ ఎవ్వరూ ఇలా నృత్యంలో లేరు. రాజారెడ్డి: నాతో పాటూ రాధ కూడా కూచిపూడి కళకు రావడం భగవత్ సంకల్పమే! మాది అదిలాబాద్ జిల్లాలోని నర్సాపురం. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. కోలాటం, భజనలు చేసే వాళ్లలో కలిసి పోయేవాడిని. యక్షగానాలు, భాగవతుల వాళ్లతో కలిసి ఊరూరా తిరిగేవాడిని. ప్రదర్శనల్లో పాల్గొనేవాడిని. డ్యాన్స్ లోక్లాస్ వాళ్లు చేసేది అని ఊళ్లో వాళ్లు చిన్నచూపు చూస్తున్నారని మా నాన్న నన్ను కొట్టేవాడు. అయినా వినేవాడిని కాదు. నేను డ్యాన్స్ చేస్తుంటే రాధ చూసేది. తన స్నేహితులతో కలిసి తనూ చేసేది. ఆమెలో ఉన్న ఆసక్తి చూసి ఆ తర్వాత తనకూ నృత్యం నేర్పించాను. తను ఎప్పుడైతే నాట్యం నేర్చుకుందో.. నాతో కలిసి నాట్యం చేయడం ఆరంభించిందో అప్పుడు నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది. అయితే, అదంతా సులువుగా జరగలేదు. నా పదవ తరగతి పూర్తవుతుంది అనగా నాన్న చనిపోయాడు. ఊళ్ళో వాళ్లు నేను డ్యాన్స్ చేస్తున్నానని రెండేళ్ల పాటు మా కుటుంబాన్ని వెలేశారు. నాకంటే చిన్నవారైన తోడబుట్టిన వాళ్లున్నారు. అప్పుడు భయపడ్డాను. అమ్మ మాత్రం ‘నీకు నచ్చింది చెయ్! మాకేమవుతుందో అని భయపడకు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు’ అనేది. అప్పటికే ఏలూరు, తెనాలి ప్రాంతాలలో గురువుల వద్ద నృత్యం, కొరియోగ్రాఫ్ నేర్చుకున్నాను. ఏదో మొండిగా రాధను తీసుకొని హైదరాబాద్‌కి వచ్చేశాను. కానీ, అప్పుడు చేతిలో పైసా లేదు. ఎవరూ సాయం చేసేవారు లేరు. స్టేజీ షోలు ఇవ్వడం కొత్త. సంపాదన లేదు. పూట గడవాలంటే గగనమయ్యేది. మంచినీళ్లతో కడుపునింపుకునేవాళ్లం. అయినా సరే, రోజూ 8 నుంచి 10 గంటలు నాట్య సాధన చేసేవాళ్లం. ఇప్పుడు ఆ రోజులను తలుచుకుంటే ఎలా బతికామో అనిపిస్తుంటుంది. అలాంటి కష్టకాలంలో దేవుడు మీ చేయి పట్టుకుని నడిపించారంటారా? రాధారెడ్డి: మా ఇలవేల్పు వేంకటేశ్వరస్వామి. ఆయన్నే నమ్ముకున్నాం. స్వామి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించడమే కాదు, ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేశాడు. మేం ఢిల్లీ చేరిన మొదట్లో నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా అక్కడి తీన్‌మూర్తి భవన్లో నాట్య ప్రదర్శన ఇచ్చాం. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాం«ధీ మా ప్రదర్శన చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. షాలువా కప్పి సన్మానించారు. మా గురించి అడిగారు. ‘మేం ఊరు వెళ్లిపోతున్నాం. ఇక్కడ మాకు ఉండటానికి చోటు లేదు మేడమ్’ అని చెప్పాం. అప్పుడామె, మమ్మల్ని వెళ్లద్దు అని మినిస్టర్ కొత్త రఘురామయ్య గారికి చెప్పి భండార్ రోడ్లో మా కోసం ఇంటిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మా నాట్యానికి ఎక్కడా విఘాతం రాలేదు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మా ప్రదర్శన ఉండేది. అయినా, చాలావరకు ప్రదర్శనలు మా వరకు రావాలంటే ఎవరో ఒకరు అడ్డుపడేవారు. పైవాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తమకు ఆ అవకాశాలను ఇప్పించుకునేవారు. దాంతో చాలా బాధ కలిగేది. ఏడుస్తూ గుడి దగ్గర కూర్చున్న రోజులున్నాయి.∙ రాజారెడ్డి: ఆత్మను పరమాత్మతో ఏకం చేస్తే కష్టమేదీ అనిపించదు. నాట్యం ద్వారా మాకు అది సాధ్యమైంది. అందుకే ఆకలిని మరిచిపోయాం. నాట్యాన్నే శ్వాసించాం. నాట్యంలోనే జీవించాం. పంచేంద్రియాలను ఒకటి చేసి ఆత్మను భగవంతునితో కలిపితే దొరికే ఆ అనందం మాటల్లో చెప్పలేం. ఆ దైవం మాకు అండగా ఉండబట్టే ఈ రోజుకి ఇలా ఉన్నాం. రోజూ కాసేపు భగవంతుని పూజలో పాల్గొంటే మంచి జరుగుతుంది అనే భావన మా ఇంట్లో అందరిలోనూ ఉంది. దైవదర్శనం నృత్యంలోనేనా? ఆలయాలకు వెళుతుంటారా? రాధారెడ్డి: మా ప్రదర్శనలన్నీ దాదాపు పెద్ద పెద్ద దేవాలయాల వద్దే జరిగేవి. మేం ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో! నాట్యంతోనే అన్ని పుణ్య స్థలాలు దేవుడే తిప్పుతున్నాడు. ఆ విధంగా ఉత్తరభారతంలో మధుర, బృందావనం, ద్వారక.. ఒకటేమిటి గొప్ప గొప్ప దైవ క్షేత్రాలన్నీ దర్శించాం. రాజారెడ్డి: అంతేకాదు, ప్రతి యేటా తిరుపతి వెళ్తాం. అలాగే వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మ వారిని దర్శించుకుంటాం. మొన్నటి మార్చి నెలలో రాధ తిరుమల కొండ మెట్లు ఎక్కి, తలనీలాలు సమర్పించు కొని వచ్చింది. శ్రీశైలం అయితే ఎన్ని సార్లు వెళ్లామో! శివయ్య అంటేనే నృత్యం కదా! అమ్మవారితో కలిసి ఆయన చేసే నాట్యం మహాద్భుతంగా వర్ణిస్తుంది శివపురాణం. భగవంతునితోనే నాట్యం ఉద్భవించింది. ఈ నాట్యాన్ని ఆ భగవంతుడే మాకు దగ్గర చేశాడు. మీ ప్రదర్శనలో అంతరాయాలు రావడం, దైవాన్ని గట్టెక్కించమని వేడుకున్న సందర్భాలు? రాజారెడ్డి: కొన్నేళ్ల క్రితం జరిగింది. ఢిల్లీలో తెలుగువారి ఫంక్షన్ జరుగుతున్న సందర్భం అది. ఆ వేడుకలో మా ప్రదర్శన ఉంది. అది రామకృష్ణ మఠం అడిటోరియం. మేం మేకప్ వేసుకొని, సరంజామా అంతా సిద్ధం చేసుకొని వెళ్లేసరికి అక్కడ మైకులో జనగణమణ.. అనే గీతం వినిపించింది. చాలా మధనపడ్డాం. ఇలాగే మరోసారి మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఫ్రాన్స్‌లో మొదటిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు మాత్రం చాలా భయపడ్డాం. అది అతి పెద్ద స్టేజ్. ఆ స్టేజ్ మీద మొత్తం చీకటి. డ్యాన్స్ చేసేటప్పుడు వారి ఒక్కరి మీద మాత్రమే ఫోకస్ పడుతుంది. అలాంటి స్టేజ్ మీద దశావతారం... చీకట్లోనే పదిసార్లు స్టేజీమీదకు వెళ్లాలి. నాటి సంఘటన ఇప్పటికీ మర్చిపోలేం. నాట్య ప్రదర్శన పూర్తయ్యాక ఆ చప్పట్ల హోరు.. దాదాపు 30 నిమిషాలు. వాళ్లంతా మమ్మల్ని ప్రశంసించడం.. అంతా దేవుని దయ. అవార్డులు వరించినప్పుడు దైవం అనుకూలత లభించిందని భావించారా? రాజారెడ్డి: ఒక ఇంట్లో ఒక్కరికే పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. అలాంటిది మాకు ఒకేసారి అవార్డులు వరించాయి. ఇది దైవం ఇచ్చిన అదృష్టమే! అవార్డులు వచ్చినా కొద్దీ మా బాధ్యత కూడా పెరుగుతూ వచ్చింది. భక్తి, సాధన, అంకితభావం... కలిస్తేనే కూచిపూడి నాట్యంలో రాణించగలం. వాటికి తగిన గౌరవం లభించిందని నమ్ముతాం. అధ్యాత్మికతకు – భక్తికి మీరు చెప్పే నిర్వచనం...? రాజారెడ్డి: మా గురువుగారు ఈ రెండింటి గురించి వివరిస్తూ ఒక శ్లోకం చెప్పేవారు.పుంఖానుపుంఖ విశేషణ తత్పరూపిబ్రహ్మావలోకన ధ్యియం నజహాతి యోగి.సంగీత తాళ లయ వశంగతాపి మౌళిస్తకుంభ పరిరక్షణ దీర్ణటీవ! అని. ఈ నాట్యంలో నర్తకులు పళ్లెం మీద నిల్చుని చేసే విధం ఉంటుంది. తలమీద చెంబులో నీళ్లుంటాయి. భగవంతుని పాట పాడుతూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ నాట్యం చేస్తుంటాడు. చెంబులో నీళ్లు తొణకవు. పళ్లెం మీద నుంచి కాలు కిందకు దిగదు. అది భక్తి. యోగి తపస్సు చేస్తూ పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. అతనిది ఆధ్యాత్మికత. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అన్నమయ్య బ్రహ్మమొకటే, పరబ్రహ్మమొక్కటే అని కీర్తన పాడుతుంటాడు అదే సమయంలో దానికి తగిన తాళం చేత్తోనూ, పాదంతోనూ వేస్తుంటాడు ఇది ఆ స్వామిపై ఉన్న భక్తి. దేవుడు ప్రత్యక్షమైతే? రాధారెడ్డి, రాజారెడ్డి: మేం ఎంత పుణ్యం చేసుకున్నామో మా పిల్లలు యామినీరెడ్డి, భావనారెడ్డి కూడా ఇదే కళలో రాణిస్తున్నారు. పెద్దమ్మాయి ఎంబీఏ. చిన్నమ్మాయి కూడా మాస్టర్స్ డిగ్రీ చేసింది. కానీ, ఇద్దరూ ‘కూచిపూడి నాట్యానికే అంకితం అవుతాం’ అన్నారు. ఆ దైవం ప్రత్యక్ష్యమైతే ఒకటే కోరుకుంటాం. వాళ్లు ఈ కళలో ఎంతో గొప్పగా రాణించాలని కోరుకుంటాం. అంతేకాదు, మా స్కూల్ ‘నాట్యతరంగిణి’లో ఉన్న విద్యార్థులు కూడా మా పిల్లలే! వాళ్లకి మేమే స్వయంగా క్లాసులు తీసుకుంటాం. వారందరూ కూచిపూడి నాట్యకళలో ఉన్నతులు కావాలని, ఈ కళను ముందుతరాలకు పరిచయం చేయాలని, ఎప్పటికీ ఈ కళ ఇలాగే నిలిచిఉండాలని కోరుకుంటాం. రాజారెడ్డికి రెండవ భార్యగా మీ చెల్లెలు కౌసల్యనే ఇచ్చి చేశారు. ఇది త్యాగమా, దైవనిర్ణయమా? రాధారెడ్డి: మొదట కౌసల్య నా భర్తను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు షాక్ అయ్యాను. బాధపడ్డాను. కానీ, తన ప్రేమను గుర్తించాను. దైవనిర్ణయంగా భావించాను. అందుకే మా జీవితాల్లోకి కౌసల్యను ఆహ్వానించాం. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
మున్సిపల్ ఆఫీసులో మంత్రికి చేదు అనుభవం
శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి శుక్రవారం శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీసులో చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నటువంటి టీడీపీ కౌన్సిలర్లు మంత్రిని నిలదీశారు. రాధారెడ్డి విషయంలో మంత్రి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఊహించని పరిణామంతో నివ్వెరపోయిన మంత్రి.. సాయంత్రం కలిసి ఈ విషయంపై మాట్లాడుతానని చెప్పి మున్సిపల్ ఆఫీసు నుండి వెళ్లిపోయారు. -
నృత్య నూతనం
‘థాంక్యూ ఇందిరా! ఐ హావ్ సీన్ కంప్లీట్ ఇండియా ఇన్ రాధా అండ్ రాజారెడ్డీస్ డ్యాన్స్ ఇన్క్లూడింగ్ యూ’.. ఇది ఫిడెల్ క్యాస్ట్రో కూచిపూడి కపుల్ రాధారెడ్డి, రాజారెడ్డిల కూచిపూడి ప్రదర్శన గురించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చెప్పిన మాటలు. ఇంతకుమించిన కితాబు ఇటు కూచిపూడికి, అంతకన్నా గొప్ప పరిచయం అటు ఆ జంటకూ ఉండదేమో! తమ జీవననృత్యం గురించి సిటీప్లస్‌తో ముచ్చటించారు. ప్రణయమూర్తులనగానే పురాణాల్లోని రాధాకృష్ణులు, రతీమన్మథులు ఎలా గుర్తొస్తారో.. కూచిపూడి లాస్యంలో లయబద్ధంగా సాగిపోయే జంట అనగానే రాధా, రాజారెడ్డిలు కనిపిస్తారు. అందుకేనేమో ‘మేమిద్దరం కూచిపూడిని పెళ్లాడాం’ అంటారు రాజారెడ్డి. భార్యభర్తల అభిరుచులు ఒకటే అయి.. అవి వారికి ప్రాణమైతే ఆ కాపురం ఆదర్శ ప్రాయం అవుతుంది. కలహకలాపాలు.. నాట్యానికి గుర్తింపు లేని ప్రాంతంలో, కుటుంబాల్లో పుట్టిన ఈ ఇద్దర్ని కలిపింది మూడుముళ్ల బంధం. ఒక్కరిగా మారిన ఆ ఇద్దరి ధ్యాస నాట్యం మీదే. కూచిపూడిని ఆరాధిస్తూ సాగిన ఆ జీవితం.. ఆనంద లాస్యమైంది. ఈ కాపురంలో కలహాలు భామాకలాపంతో చల్లబడితే, గిల్లికజ్జాలు తరంగంతో సద్దుమణుగుతాయి. ‘రాధకు జెలసీ ఎక్కువ. నా కన్నా బాగా కనపడాలని, నాట్యంలో నన్ను ఓడించాలని, వేదికపై ఎవరినీ లెక్క చేయదు. అలా నాట్యంలో లీనమై పోతుంది. విలువైన సలహాలిస్తుంది’ అని తన భార్య గొప్పదనాన్ని ప్రశంసిస్తారు రాజారెడ్డి. ‘ఆయన కంపోజిషన్‌లో నాకు నచ్చనిది ఉంటే చేయను. అలాగే అతని నాట్యంలో కాని, మేకప్‌లో కాని ఫలానాది బాగా లేదు అంటే అంతే వినయంగా దాన్ని సరిదిద్దుకుంటాడు’ అని భర్తలోని వినమ్రతను మెచ్చుకుంటారు రాధారెడ్డి. నాట్య సంగమం.. నిజానికి రాధారెడ్డికి నాట్యం నేర్పిందే రాజారెడ్డి. ‘ ఈ రెబల్ స్టూడెంట్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటాడు నా మాస్టార్’ అంటూ భర్త సహకారాన్ని గుర్తు చేసుకుంటారామె. ‘మా మధ్య తగాదా ఏ వంటగదిలోనో, హాల్లోనో మొదలుకాదు..గ్రీన్‌రూమ్‌లో స్టార్ట్ అవుతుంది. స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్తో ఎండ్ అవుతుంది. మా పంతం నాట్యంతోనే నెగ్గించుకుంటాం’ అని జీవననృత్యం వెనుక ఉన్న సత్యాన్ని వివరిస్తారు రాజారెడ్డి. ఆయనకు నాట్యం, వైవాహిక బంధం రెండూ ఒకటే. ‘అందుకే మా జంట అంతగా కుదిరింది. ఇన్నేళ్లయినా మా జీవితం తాజాగా కనబడుతోంది’ అంటారు. రాధారెడ్డి మాత్రం ‘నాకు నాట్యం వేరు, మా జీవితం వేరు. ప్రదర్శనప్పుడు ఆయన నాకు పార్ట్నర్ మాత్రమే. ఇంట్లో నా భర్త. ఈ తేడాను చూస్తాను కాబట్టే రాజా నాకెప్పటికప్పుడు కొత్తగా క నిపిస్తాడు. మా సక్సెస్ సీక్రెట్ ఆ కొత్తదనమే’ అని చెప్తారు. సప్తపది.. ఇష్టపది.. ‘డ్యాన్స్ అని భార్యని పట్టుకుని ఊరు కాని ఊరు పోతున్నవ్? ఎట్ల బతుకుతర్రా? ఆ డ్యాన్సేమన్నా కూటికొచ్చేదా?’ అని రాజారెడ్డి పెద్దలు ఆయనను హెచ్చరించారు. ‘గజ్జె కట్టుకొని ఇంటింటికి పొయ్యి ఆడతాడట.. ఇసంటోడు మనకొద్దు..’ అని రాధారెడ్డికి వాళ్ల పెద్దలూ నచ్చచెప్పారు. ఆ పెద్దల మాట చెల్లలేదు. ఏడడుగులతో ఒక్కటైన ఈ జంట ఏడేడు జన్మల బంధానికి దారి ఏర్పరచుకుంది. కూచిపూడిలో తామేంటో నిరూపించు కుంది. అలీనోద్యమ సమావేశాలప్పుడు వివిధ దేశాల ప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడిని చివరన ఏర్పాటు చేస్తే.. మనసారా ఆస్వాదించొచ్చు అని అభ్యర్థించారు. వన్స్‌మోర్ వన్స్‌మోర్ అంటూ పదిసార్లు ఈ జంటకాళ్లకు గజ్జె కట్టించారు. ‘మీరసలు ఢిల్లీ వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు’ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆప్యాయతతో వాళ్లను ఆజ్ఞాపించింది. ‘రాధా.. నువ్ కాస్త పొట్టిగా ఉంటావ్, పెద్దంచు చీర కట్టకు’ అని ప్రేమతో సలహాలిచ్చే సన్నిహితురాలిని చేసింది వీళ్ల ప్రతిభే. ప్రతి ప్రదర్శన హనీమూనే.. ‘ఏ జంటకైనా హనీమూన్ ఒక్కసారే. కానీ మాకు ప్రతిప్రదర్శన హనీమూనే’ అంటారు రాజారెడ్డి. ‘డ్యాన్స్ లేకపోతే నేనెంత లేనో.. రాజా లేకపోతే కూడా అంతే శూన్యం’ అని చెప్తారు రాధారెడ్డి. - సరస్వతి రమ -
'నా భార్యపై మున్సిపల్ ఛైర్మన్ అనైతిక ప్రవర్తన'
మున్సిపల్ ఛైర్మన్ పేట రాధారెడ్డి తన భార్య పట్ల అనైతికంగా ప్రవర్తించారని శ్రీకాళహస్తిలోని శరవణభవన్ హోటల్ యజమాని మనోహరన్ ఆరోపించారు. తమ హోటల్‌ను ఆయన లాక్కోవాలని చూస్తున్నట్లు మనోహరన్ దంపతులు తెలిపారు. తమకు వాస్తవానికి 30 ఏళ్ల లీజు ఒప్పందం ఉన్నా, ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని, తమ అనుచరులతో రాధారెడ్డి పదే పదే దాడులు చేయిస్తున్నారని మనోహరన్ వాపోయారు. మహిళ అని కూడా చూడకుండా తన భార్యపట్ల రాధారెడ్డి అనైతికంగా ప్రవర్తించాడని ఆయన ఆరోపించారు.