నాట్య తపస్సు | Do you worship goddess with dance? | Sakshi
Sakshi News home page

నాట్య తపస్సు

Published Wed, Aug 16 2017 12:07 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

నాట్య తపస్సు

నాట్య తపస్సు

నేను నా దైవం

నాట్యం చేసేదెందుకు? నలుగురు చూసేటందుకు. నలుగురూ చూసి మురిసే నాట్యం దైవార్పితం ఎలా అవుతుంది? అది ముమ్మాటికీ ప్రదర్శనే అవుతుంది. నాట్యం... నిన్ను నువ్వు చూసుకోవడానికి... నీలోనే ఉన్న పరమాణువుల సంలీనంలో బ్రహ్మాండాన్ని దర్శించడానికి. నాట్యం... నిన్ను ఆనందింపచేస్తేనే... ప్రపంచమూ పులకితమవుతుంది. రాజారాధారెడ్డిలకు నాట్యం ఒక తపస్సు... ఒక దైవతాండవం

దైవాన్ని నృత్యంతో ఆరాధిస్తారా, నృత్యంలో దైవాన్ని దర్శిస్తారా?
రాజారెడ్డి: రెండూనూ! ఎందుకంటే నాట్యకారులకు నాట్యమే దైవం. మనదేశంలో ప్రాచీన కాలం నాటి రోజులను గమనించండి. ఎన్నో ధార్మిక ప్రదేశాలకు, దేవాలయాలకు, సంస్కృతికి పెట్టింది పేరైన మన దేశంలో నర్తకీమణులు దేవాలయాల వద్ద దేవున్ని స్తుతిస్తూ నర్తించేవారు. నాటి నుంచి నాట్యకారులకు అన్నీ దేవుడే అయ్యాడు. తట్టుమేల, నాట్యమేల ద్వారా భగవంతుని లీలలను ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ప్రజలకు తెలియజేసేవారు. అంటే, నృత్య సాధన చేసేవారు భగవంతుని లీలలు మొత్తం నేర్చుకోవాలి. ఆ విధంగా శివలీలలు, భాగవతం, దశావతారాలు..  ప్రదర్శనలను ప్రపంచమంతటా ప్రదర్శించాం నేనూ రాధ.
     
దంపతులిద్దరూ డ్యాన్సర్లే కావడం యాదృచ్ఛికమా, భగవత్‌సంకల్పమా?
రాధారెడ్డి: భగవంతుని దయ లేనిదే ఏదీ జరగదు. రాజా మా మేనత్త కొడుకు. మా పెళ్లప్పుడు రాజాకు పదకొండేళ్లు, నాకు ఐదేళ్లు. మాకు ఆ పెళ్లి గురించి ఏమీ తెలియదు. అమ్మనాన్నలు మీరు భార్యాభర్తలు అని చెప్పేవారు. నేను ఆటలో మునిగినప్పుడల్లా నానమ్మ గుర్తుచేస్తుండేది నువ్వు రాజా భార్యవి అని. ఆ మాటలో నీకు పెళ్లయ్యింది సుమా! అనే హెచ్చరిక వినిపించేది. అత్తింటికి వచ్చాక మాత్రం నా భర్త ముందుగా నాకు స్నేహితుడు అయ్యాడు. తర్వాత గురువు అయ్యాడు. మొదట్లో ఇద్దరం భాగవతం, వీధి నాటకాలు చూసేవాళ్లం. తర్వాత రోజుల్లో సాధువులు ఎలా తపస్సు చేసుకుంటారో అలా డ్యాన్స్‌ని పట్టుకున్నాం. మా ఇద్దరి కాంబినేషన్‌లాగ ఇప్పటి వరకూ ఎవ్వరూ ఇలా నృత్యంలో లేరు.  

రాజారెడ్డి: నాతో పాటూ రాధ కూడా కూచిపూడి కళకు రావడం భగవత్‌ సంకల్పమే! మాది అదిలాబాద్‌ జిల్లాలోని నర్సాపురం. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే పిచ్చి. కోలాటం, భజనలు చేసే వాళ్లలో కలిసి పోయేవాడిని. యక్షగానాలు, భాగవతుల వాళ్లతో కలిసి ఊరూరా తిరిగేవాడిని. ప్రదర్శనల్లో పాల్గొనేవాడిని. డ్యాన్స్‌ లోక్లాస్‌ వాళ్లు చేసేది అని ఊళ్లో వాళ్లు చిన్నచూపు చూస్తున్నారని మా నాన్న నన్ను కొట్టేవాడు. అయినా వినేవాడిని కాదు. నేను డ్యాన్స్‌ చేస్తుంటే రాధ చూసేది. తన స్నేహితులతో కలిసి తనూ చేసేది. ఆమెలో ఉన్న ఆసక్తి చూసి ఆ తర్వాత తనకూ నృత్యం నేర్పించాను. తను ఎప్పుడైతే నాట్యం నేర్చుకుందో.. నాతో కలిసి నాట్యం చేయడం ఆరంభించిందో అప్పుడు నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది. అయితే, అదంతా సులువుగా జరగలేదు. నా పదవ తరగతి పూర్తవుతుంది అనగా నాన్న చనిపోయాడు. ఊళ్ళో వాళ్లు నేను డ్యాన్స్‌ చేస్తున్నానని రెండేళ్ల పాటు మా కుటుంబాన్ని వెలేశారు. నాకంటే చిన్నవారైన తోడబుట్టిన వాళ్లున్నారు.

అప్పుడు భయపడ్డాను. అమ్మ మాత్రం ‘నీకు నచ్చింది చెయ్‌! మాకేమవుతుందో అని భయపడకు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు’ అనేది. అప్పటికే ఏలూరు, తెనాలి ప్రాంతాలలో గురువుల వద్ద నృత్యం, కొరియోగ్రాఫ్‌ నేర్చుకున్నాను. ఏదో మొండిగా రాధను తీసుకొని హైదరాబాద్‌కి వచ్చేశాను. కానీ, అప్పుడు చేతిలో పైసా లేదు. ఎవరూ సాయం చేసేవారు లేరు. స్టేజీ షోలు ఇవ్వడం కొత్త. సంపాదన లేదు. పూట గడవాలంటే గగనమయ్యేది. మంచినీళ్లతో కడుపునింపుకునేవాళ్లం. అయినా సరే, రోజూ 8 నుంచి 10 గంటలు నాట్య సాధన చేసేవాళ్లం. ఇప్పుడు ఆ రోజులను తలుచుకుంటే ఎలా బతికామో అనిపిస్తుంటుంది.

అలాంటి కష్టకాలంలో దేవుడు మీ చేయి పట్టుకుని నడిపించారంటారా?
రాధారెడ్డి: మా ఇలవేల్పు వేంకటేశ్వరస్వామి. ఆయన్నే నమ్ముకున్నాం. స్వామి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించడమే కాదు, ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేశాడు. మేం ఢిల్లీ చేరిన మొదట్లో నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా అక్కడి తీన్‌మూర్తి భవన్‌లో నాట్య ప్రదర్శన ఇచ్చాం. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాం«ధీ మా ప్రదర్శన చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యారు. షాలువా కప్పి సన్మానించారు. మా గురించి అడిగారు. ‘మేం ఊరు వెళ్లిపోతున్నాం. ఇక్కడ మాకు ఉండటానికి చోటు లేదు మేడమ్‌’ అని చెప్పాం. అప్పుడామె, మమ్మల్ని వెళ్లద్దు అని మినిస్టర్‌ కొత్త రఘురామయ్య గారికి చెప్పి భండార్‌ రోడ్‌లో మా కోసం ఇంటిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మా నాట్యానికి ఎక్కడా విఘాతం రాలేదు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మా ప్రదర్శన ఉండేది. అయినా, చాలావరకు ప్రదర్శనలు మా వరకు రావాలంటే ఎవరో ఒకరు అడ్డుపడేవారు. పైవాళ్లను ఇన్‌ఫ్లుయెన్స్‌ చేసుకొని తమకు ఆ అవకాశాలను ఇప్పించుకునేవారు. దాంతో చాలా బాధ కలిగేది. ఏడుస్తూ గుడి దగ్గర కూర్చున్న రోజులున్నాయి.∙

రాజారెడ్డి: ఆత్మను పరమాత్మతో ఏకం చేస్తే కష్టమేదీ అనిపించదు. నాట్యం ద్వారా మాకు అది సాధ్యమైంది. అందుకే ఆకలిని మరిచిపోయాం. నాట్యాన్నే శ్వాసించాం. నాట్యంలోనే జీవించాం. పంచేంద్రియాలను ఒకటి చేసి ఆత్మను భగవంతునితో కలిపితే దొరికే ఆ అనందం మాటల్లో చెప్పలేం. ఆ దైవం మాకు అండగా ఉండబట్టే ఈ రోజుకి ఇలా ఉన్నాం. రోజూ కాసేపు భగవంతుని పూజలో పాల్గొంటే మంచి జరుగుతుంది అనే భావన మా ఇంట్లో అందరిలోనూ ఉంది.

దైవదర్శనం నృత్యంలోనేనా? ఆలయాలకు వెళుతుంటారా?
రాధారెడ్డి: మా ప్రదర్శనలన్నీ దాదాపు పెద్ద పెద్ద దేవాలయాల వద్దే జరిగేవి. మేం ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో! నాట్యంతోనే అన్ని పుణ్య స్థలాలు దేవుడే తిప్పుతున్నాడు. ఆ విధంగా ఉత్తరభారతంలో మధుర, బృందావనం, ద్వారక.. ఒకటేమిటి గొప్ప గొప్ప దైవ క్షేత్రాలన్నీ దర్శించాం.

రాజారెడ్డి: అంతేకాదు, ప్రతి యేటా తిరుపతి వెళ్తాం. అలాగే వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మ వారిని దర్శించుకుంటాం. మొన్నటి మార్చి నెలలో రాధ తిరుమల కొండ మెట్లు ఎక్కి, తలనీలాలు సమర్పించు కొని వచ్చింది. శ్రీశైలం అయితే ఎన్ని సార్లు వెళ్లామో! శివయ్య అంటేనే నృత్యం కదా! అమ్మవారితో కలిసి ఆయన చేసే నాట్యం మహాద్భుతంగా వర్ణిస్తుంది శివపురాణం. భగవంతునితోనే నాట్యం ఉద్భవించింది. ఈ నాట్యాన్ని ఆ భగవంతుడే మాకు దగ్గర చేశాడు.  

మీ ప్రదర్శనలో అంతరాయాలు రావడం, దైవాన్ని గట్టెక్కించమని వేడుకున్న సందర్భాలు?
రాజారెడ్డి: కొన్నేళ్ల క్రితం జరిగింది. ఢిల్లీలో తెలుగువారి ఫంక్షన్‌ జరుగుతున్న సందర్భం అది. ఆ వేడుకలో మా ప్రదర్శన ఉంది. అది రామకృష్ణ మఠం అడిటోరియం. మేం మేకప్‌ వేసుకొని, సరంజామా అంతా సిద్ధం చేసుకొని వెళ్లేసరికి అక్కడ మైకులో జనగణమణ.. అనే గీతం వినిపించింది. చాలా మధనపడ్డాం. ఇలాగే మరోసారి మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఫ్రాన్స్‌లో మొదటిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు మాత్రం చాలా భయపడ్డాం. అది అతి పెద్ద స్టేజ్‌. ఆ స్టేజ్‌ మీద మొత్తం చీకటి. డ్యాన్స్‌ చేసేటప్పుడు వారి ఒక్కరి మీద మాత్రమే ఫోకస్‌ పడుతుంది. అలాంటి స్టేజ్‌ మీద దశావతారం... చీకట్లోనే పదిసార్లు స్టేజీమీదకు వెళ్లాలి. నాటి సంఘటన ఇప్పటికీ మర్చిపోలేం. నాట్య ప్రదర్శన పూర్తయ్యాక ఆ చప్పట్ల హోరు.. దాదాపు 30 నిమిషాలు. వాళ్లంతా మమ్మల్ని ప్రశంసించడం.. అంతా దేవుని దయ.
     
అవార్డులు వరించినప్పుడు దైవం అనుకూలత లభించిందని భావించారా?
రాజారెడ్డి: ఒక ఇంట్లో ఒక్కరికే పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. అలాంటిది మాకు ఒకేసారి అవార్డులు వరించాయి. ఇది దైవం ఇచ్చిన అదృష్టమే! అవార్డులు వచ్చినా కొద్దీ మా బాధ్యత కూడా పెరుగుతూ వచ్చింది. భక్తి, సాధన, అంకితభావం... కలిస్తేనే కూచిపూడి నాట్యంలో రాణించగలం. వాటికి తగిన గౌరవం లభించిందని నమ్ముతాం.
     
అధ్యాత్మికతకు – భక్తికి మీరు చెప్పే నిర్వచనం...?
రాజారెడ్డి: మా గురువుగారు ఈ రెండింటి గురించి వివరిస్తూ ఒక శ్లోకం చెప్పేవారు.పుంఖానుపుంఖ విశేషణ తత్పరూపిబ్రహ్మావలోకన ధ్యియం నజహాతి యోగి.సంగీత తాళ లయ వశంగతాపి మౌళిస్తకుంభ పరిరక్షణ దీర్ణటీవ! అని. ఈ నాట్యంలో నర్తకులు పళ్లెం మీద నిల్చుని చేసే విధం ఉంటుంది. తలమీద చెంబులో నీళ్లుంటాయి. భగవంతుని పాట పాడుతూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ నాట్యం చేస్తుంటాడు. చెంబులో నీళ్లు తొణకవు. పళ్లెం మీద నుంచి కాలు కిందకు దిగదు. అది భక్తి. యోగి తపస్సు చేస్తూ పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. అతనిది ఆధ్యాత్మికత. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అన్నమయ్య బ్రహ్మమొకటే, పరబ్రహ్మమొక్కటే అని కీర్తన పాడుతుంటాడు అదే సమయంలో దానికి తగిన తాళం చేత్తోనూ, పాదంతోనూ వేస్తుంటాడు ఇది ఆ స్వామిపై ఉన్న భక్తి.

దేవుడు ప్రత్యక్షమైతే?
రాధారెడ్డి, రాజారెడ్డి: మేం ఎంత పుణ్యం చేసుకున్నామో మా పిల్లలు యామినీరెడ్డి, భావనారెడ్డి కూడా ఇదే కళలో రాణిస్తున్నారు. పెద్దమ్మాయి ఎంబీఏ. చిన్నమ్మాయి కూడా మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. కానీ, ఇద్దరూ ‘కూచిపూడి నాట్యానికే అంకితం అవుతాం’ అన్నారు. ఆ దైవం ప్రత్యక్ష్యమైతే ఒకటే కోరుకుంటాం. వాళ్లు ఈ కళలో ఎంతో గొప్పగా రాణించాలని కోరుకుంటాం. అంతేకాదు, మా స్కూల్‌ ‘నాట్యతరంగిణి’లో ఉన్న విద్యార్థులు కూడా మా పిల్లలే! వాళ్లకి మేమే స్వయంగా క్లాసులు తీసుకుంటాం. వారందరూ కూచిపూడి నాట్యకళలో ఉన్నతులు కావాలని, ఈ కళను ముందుతరాలకు పరిచయం చేయాలని, ఎప్పటికీ ఈ కళ ఇలాగే నిలిచిఉండాలని కోరుకుంటాం.

రాజారెడ్డికి రెండవ భార్యగా మీ చెల్లెలు కౌసల్యనే ఇచ్చి చేశారు. ఇది త్యాగమా, దైవనిర్ణయమా?
రాధారెడ్డి: మొదట కౌసల్య నా భర్తను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు షాక్‌ అయ్యాను. బాధపడ్డాను. కానీ, తన ప్రేమను గుర్తించాను. దైవనిర్ణయంగా భావించాను. అందుకే మా జీవితాల్లోకి కౌసల్యను ఆహ్వానించాం.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement