
ప్రతిష్టాత్మక వరల్డ్ జాజ్ ఫెస్టివల్‌కు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. వరల్డ్ జాజ్ ఫెస్టివల్ ఆధ్వర్యంలోని 5వ ఎడిషన్ ఢిల్లీతో ప్రారంభమవుతుంది. ఈ ఫెస్టివల్లో భాగంగా ఢిల్లీ అనంతరం పుణె, బెంగళూరు, ముంబైలలో కొనసాగి హైదరాబాద్‌లో ముగింపు పలుకనుంది. నగరంలోని శిల్పకళా వేదికగా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ ఈ జాజ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్లో నెదర్లాండ్స్, సెర్బియా, టర్కీ, బెల్‌గ్రేడ్, బ్రెజిల్ తదితర దేశాల నుంచి ప్రముఖ సంగీత కళాకారులు పాల్గొంటారు. 2020లో ప్రారంభించిన ఈ ఉత్సవం ప్రపంచం నలుమూలల నుంచి జాజ్ సంగీతానికి విశ్వవ్యాప్త వేదికను ఏర్పాటు చేసింది. దీనికి ముంబై, పుణె, బెంగళూరులో అద్భుత ప్రశంసలు లభించాయి.
ఉత్సవానికి వివిధ దేశాలకు చెందిన కాన్సులేట్ అధికారులు, అగ్రశ్రేణి కార్పొరేట్ ప్రముఖులు, ప్రసిద్ధ మీడియా ప్రముఖులు పాల్గోనున్నారు. ఈ ఉత్సవం ప్రపంచంలోని అతిపెద్ద జాజ్ సంగీత ఉత్సవాల్లో ఒకటైన నెదర్లాండ్స్‌కు చెందిన అమెర్స్‌ఫోర్ట్ జాజ్ ఫెస్టివల్‌తో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్లో రౌండ్ మిడ్‌నైట్ ఆర్కెస్ట్రా గ్రాజియెల్లా హన్సెల్ రివెరో, లూకాస్ సాంటానా (బ్రెజిలియన్), దక్షిణాఫ్రికా జాజ్ సంచలనం డారెన్ ఇంగ్లిష్, ఫెమ్కే మూరెన్ గ్రూప్ కరోలినా బ్రస్సే, ఆస్ట్రేలియన్ సాక్స్ మెజీషియన్ ఆడమ్ సిమ్మన్స్, పాంగ్ సాక్స్‌ప్యాక్‌గర్ల్ తదితర పాన్ వరల్డ్ ఆర్టిస్టులు జాజ్ మ్యూజిక్‌తో సందడి చేయనున్నారు.
18న నగరంలో వైట్‌థాన్–2025
కంటి క్యాన్సర్‌పై అవగాహన, నిధుల సేకరణ నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో మే 18న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ‘వైట్‌థాన్–2025’ జరుగానుంది. ఇందులో భాగంగా బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, ఐ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ హెడ్ డాక్టర్ స్వాతి కలికి మాట్లాడుతూ కంటి క్యాన్సర్‌పై అవగాహన, నిధుల సేకరణే ఈ రన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రాథమిక దశలోనే దీనిని గుర్తించవచ్చన్నారు.
కంటి క్యాన్సర్‌తో పోరాడుతున్న పేద పిల్లలకు ఉచితంగా చికిత్స అందించనున్నామని తెలిపారు. ఈ ఏడాది అధికారిక మస్కట్ ‘పియర్లీ’ అన్నారు. ఇది కంటిలో ‘వైట్ రిఫ్లెక్స్’ (లూయకోకోరియా)ను ప్రదర్శిస్తుందన్నారు. ఇది రెటినోబ్లాస్టోమా క్యాన్సర్ లక్షణాల్లో ఒకటన్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు వైద్య సహాయం పొందాలన్న సందేశాన్ని ప్రచారం చేయడంలో సహాయపడుతుందన్నారు.

21 కేఎం, 10 కేఎం, 5కేఎం, 3కేఎం రన్స్ ఉన్నాయన్నారు. ఈ ఏడాది కొత్తగా పరిచయం చేసిన 21 కేఎం హాఫ్ మారథాన్ ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ఈ రన్ ద్వారా సమీకరించిన నిధులతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఉచితంగా మూడు వేలకు పైగా చికిత్సలు చేసిందన్నారు. ఇలాంటి కేసుల్లో 90 శాతం పిల్లల ప్రాణాలు కాపాడగలిగామన్నారు. అయితే చికిత్సకు ఆలస్యంగా రావడం వల్ల కేవలం 45 శాతం కేసుల్లో మాత్రమే చూపు తేగలిగామన్నారు. ప్రాథమిక దశలో రెటినోబ్లాస్టోమాను గుర్తించగలిగితే సులభంగా చికిత్స చేయవచ్చని తెలిపారు. వైట్‌థాన్ కోసం మే 18 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 99591 54371, 99639 80259 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

సాలార్‌జంగ్ మ్యూజియంలో ఫొటో ఎగ్జిబిషన్
సాలార్‌జంగ్ మ్యూజియంలోని సెంట్రల్ బ్యాంక్ సాలార్‌జంగ్ మ్యూజియం ఆధ్వర్యంలో భగవాన్ మహావీర్‌పై ఏర్పాటు చేసిన 62వ స్పెషల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను సాలార్‌జంగ్ మ్యూజియం డైరెక్టర్ ఆశీష్ గోయల్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాలార్‌జంగ్ మ్యూజియం క్యూరేటర్లు ఘన్‌శ్యామ్ కుసుం, ఆర్‌బి.నాయక్, అసిస్టెంట్ కమాండెంట్ మురళీధరణ్, సిబ్బంది పాల్గొన్నారు.