ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష!  | Now Teacher Eligibility Test online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష! 

Published Fri, May 17 2019 12:45 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Now Teacher Eligibility Test online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇకపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)నూ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే డీఈఈసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న విద్యా శాఖ భవిష్యత్తులో టెట్‌నూ ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా విద్యా శాఖ పంపించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే టెట్‌ నోటిఫికేషన్‌ ఎప్పుడు జారీ చేయాలి? టెట్‌ ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించాకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని విద్యా శాఖ అభిప్రాయానికి వచ్చింది. సాధారణంగా ఏటా 2సార్లు టెట్‌ నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఆచరణలో అవి అమలు కావడం లేదు. 2010లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు టెట్‌ను 6సార్లు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు, తెలంగాణ వచ్చాక 2 సార్లు టెట్‌ను నిర్వహించారు. అయితే మొదటి, రెండో టెట్‌కు ఉన్న ఏడేళ్ల వ్యాలిడిటీ ప్రస్తుతం ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఉపాధ్యాయ నోటిఫికేషన్లు జారీ అయితే కష్టం అవుతుందన్న ఉద్దేశంతో టెట్‌ నిర్వహించాలని నిరుద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో గతేడాదే విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది మొదట్లోనే టెట్‌ తేదీలతోపాటు, ఆన్‌లైన్‌లో టెట్‌ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలను పంపింది. అయితే ఆన్‌లైన్‌లో నిర్వహణకు ఓకే చెప్పిన ప్రభుత్వం టెట్‌ నిర్వహణ సమయంపై మాత్రం ఉన్నత స్థాయిలో చర్చించాకే నిర్ణయం ప్రకటించాలన్న ఆలోచనకు వచ్చింది.  

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. 
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) పూర్తి చేసిన విద్యా ర్థులు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) 2018 జూలైలోనే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్‌జీటీ పోస్టులకు ఎంపికైన వారు మాత్రం ప్రాథమిక విద్యలో బోధనపై 6 నెలల ఇండక్షన్‌ ట్రైనింగ్‌ చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. ఈ మేరకు సెంట్రల్‌ టెట్‌లో ఆ అవకాశం కల్పించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే రాష్ట్ర టెట్‌లోనూ ఆ అర్హతను చేర్చుతూ టెట్‌ రూల్స్‌కు సవరణలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వాటికి కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలిసింది. మరోవైపు ఫైనలియర్‌ చదువుతున్న వారు కాకుండా, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారు మాత్రమే టెట్‌ రాసేలా నిబంధనను విద్యా శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement