సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థుల మూడో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీ కూడా ముగిసిపోయింది. దీంతో ఇప్పటికిప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా లేకుండా పోతుంది. నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించాల్సి ఉన్నా.. రాష్ట్రంలో రెండేళ్లుగా ఆ ఊసే లేదు. టెట్ నిర్వహించేందుకు అనుమతి కోసం విద్యా శాఖ పంపిన ఫైలు ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక 6 టెట్‌లు నిర్వహించగా, ఇప్పటి వరకు మూడు టెట్‌ల వ్యాలిడిటీ ముగిసిపోయింది. 2011 జూన్ 1 మొదటి టెట్ నిర్వహించగా, 2012 జనవరి 8న రెండో టెట్, అదే ఏడాది జూన్ 1న మూడో టెట్ నిర్వహించారు. ప్రస్తుతం వాటి వ్యాలిడిటీ ముగిసిపోవడంతో అభ్యర్థులంతా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ టీచర్లుగా పని చేయాలంటే టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహించకపోవడంతో అనేక మంది టెట్ అర్హత లేకుండా టీచర్లుగా పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
2017 జూలై నుంచి లేని టెట్
రాష్ట్రంలో 2017 జూలై 23న చివరి టెట్ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివరకు టెట్ నిర్వహించలేదు. చివరగా నిర్వహించిన ఆ టెట్ పేపర్–1కు 98,848 మంది హాజరు కాగా, 56,708 మంది అర్హత సాధించారు. దాదాపు 40 వేల మంది ఫెయిల్ అయ్యారు. ఇక పేపర్–2 పరీక్ష 2,30,932 మంది హాజరు కాగా 45,045 మంది అర్హత సాధించారు. అంటే 1.90 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. అయితే వారిలో అంతకుముందు టెట్‌లలో అర్హత సాధించిన వారు కొంత మంది ఉన్నా దాదాపు 2 లక్షల మంది టెట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు నిర్వహించిన ఆరు టెట్‌లలో దాదాపు 6 లక్షల మంది అర్హత సాధించగా, అందులో ఈ రెండు లక్షల మంది టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయినట్లు నిరుద్యోగులు చెబుతున్నారు. వారితో పాటు 2017 జూలై తర్వాత రాష్ట్రంలో టెట్ నిర్వహించలేదు. ఇక అప్పటి నుంచి బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణులైన దాదాపు 60 వేల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు..
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) 2010లోనే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోనూ ఏటా రెండుసార్లు (నవంబర్/డిసెంబర్, జూన్/జూలై) టెట్ నిర్వహించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్హత సాధించిన వారే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలుంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. టెట్ స్కోర్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందన్న నిబంధనను విధించింది.
ఏడేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మళ్లీ టెట్‌లో అర్హత సాధించాలని స్పష్టం చేసింది. ఆ నిబంధన ప్రకారం రాష్ట్రంలో మొదటి ఏడాది తప్ప ఏటా రెండు సార్లు టెట్‌ను నిర్వహించట్లేదు. 2011 నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు టెట్ నిర్వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు, తెలంగాణ ఏర్పడ్డాక 2 సార్లే టెట్ నిర్వహించింది. ఇందులో 2011 జూలై 1న నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ 2018 జూలై 1తో ముగిసింది. 2012 జనవరి 8న నిర్వహించిన రెండో టెట్ వ్యాలిడిటీ ఈ జనవరి 8తో ముగిసిపోయింది. అలాగే ఈనెల 1తో 2012 జూన్ 1న నిర్వహించిన మూడో టెట్ స్కోర్ వ్యాలిడిటీ కూడా ముగిసిపోయింది.
ముగిసిన మూడో టెట్ వ్యాలిడిటీ
Published Thu, Jun 6 2019 2:06 AM | Last Updated on Thu, Jun 6 2019 2:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment